Muktadhatri — Volume I — Swecchaa Kavitvamu

ముక్తధాత్రి — స్వేచ్ఛా కవిత్వము — మొదటి సంపుటం

1972 · Telugu (te) · 22 pages · Human-proofread

నిశ్శబ్దానికి పెద్ద శత్రువు హృదయ స్పందనమే అంతటా వెలుగు ఎక్కడ? ఏ నీడను మాపగలం. బ్రతికున్నట్లు ఋజువు కేదో శబ్దించ నక్కర లేదు ఎదుగూ బొదుగూ లేని రాతి బొమ్మ కాదు మనిషి వ్యక్తుల సంస్కారంతో సమాజం అస్తిత్వాన్ని పొందుతుంది సమాజశక్తులతో వ్యక్తి మూల రూపమేర్పడుతుంది కర్పూరం వంటి కాలం పరిమళించడానికి వెలుగు లిప్త చాలు జీవితం ఫోటోగ్రాఫ్ కాదు ఫేమ్లో బంధించడానికీ ఉదయంలో ఎర్రదనంతో పాటు వివిధ వర్ణమయం సమాజం సూర్యుణ్ణి అదే పనిగా చూస్తే మిత్రమా! గ్రుడ్డిదనం వస్తుంది. హ్లాదైక తేజాన్ని ఆత్మలో ఆవాహన చేసుకోవాలి! మనో భూమికలో ఈ రోజు ప్రయాణం అనుకోకుండా రైలు మాని మధ్యలో విమానమెక్కినట్లుంది - గుడ్ బై. స్వేచ్ఛా నవం 3. ముక్తధాత్రి కావ్యం (1972) మాదిరాజు రంగారావు అంకితం రాజనీతి వాహినిలో చెదరని బింబం మానవీయ సాహితిలో సహృదయ స్పటికం పూర్వ ప్రధానమంత్రి మాన్య శ్రీ పి.వి. నరసింహారావుగారికి ముక్త ధాత్రి బంగ్లాదేశ్ విమోచనోద్యమ కృతి, ముక్తధాత్రి. స్వేచ్ఛా కవిత్వంలో వెలువడిన ఉద్యమ కావ్యం. 1971లో ఈస్్ట పాకిస్తాన్లో ప్రజలపై వెస్్ట పాకిస్తాన్ సేనల బలప్రయోగ ప్రవర్తనకూ నిరంకుశ ధోరణికీ వ్యతిరేకంగా ప్రజల్లో ఉదయించిన స్వాతంత్య్ర కాంక్షనూ ఉద్యమశక్తినీ దాని పర్యవసానాన్ని చిత్రిస్తూంది. “ముక్తివాహిని” ప్రజల స్వేచ్ఛా స్వాతంత్య్ర రూపానికి ప్రాతినిధ్యం వహించింది. ఇది క్రియాత్మకమైన పాత్రను నిర్వహించింది. బంగ్లాదేశ్ భారతదేశ సహకారంతో కొత్త రాజ్యంగా ప్రపంచపటంపై అవతరించిందది. ఈ కావ్యం స్వాతంత్ర్యం కోసం నినదించే ప్రజల "అమర్ బంగ్లా! సోనార్ బంగ్లా" స్వరలహరితో ఆరంభమయింది. “స్వేచ్ఛావాయువుల్ని గదిలో ఎవరు బంధించగలరు?”

“స్వాతంత్ర్యకాంక్షల్ని చీకట్లో ఎవరు దాచగలరు?" ఒక్క నిరంకుశులు తప్ప! రాజకీయ కుటిల నీతి కారణంగా ప్రజలు పీడనకు గురి అయ్యారు! ప్రాణాలరచేత పట్టుకొనీ “ఆకులవలె” కదలిపోయారు. పాక్ సేనల దుశ్చర్యలకు గురి అయిన ప్రజల దుస్థితి కరుణ రసాత్మకంగా తీర్చబడింది. యుద్ధ వాతావరణం నెలకొంది. రాత్రి హిమశీలవలె బిగిసింది. ప్రజలు కత్తులవలె నిలిచారు. జనం మధ్య నుండి విప్లవ సంకేతంగా “నెత్తురు మడుగులో విరిసిన అగ్ని పుష్పం వలె” ముజీబ్ ప్రజల స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు చిహ్నంగా నాయకత్వం వహించాడు. అతని "పేరు విప్లవం"గా, అతని “ఊరు స్వాతంత్య్రం"గా నిలిచింది. అతడో ఉద్యమమూర్తిగా తోచాడు. ఈ సమయంలో అతని ముందు నిలిచిన ప్రజల కళ్ళ నుండి “నీటిచుక్కలు రాలే”దశ దాటింది, ఇపుడు “నిప్పురవ్వలు రాలు”

తున్నాయి.

అంతలో స్థితి కరుణం నుండి వీరానికి పరివర్తితమైంది. ఈ కావ్యంలో జ్వాలా తరంగాలు, జ్వాలా చలనం, మంటల మాటలు శీర్షికలతో ప్రజల స్వాతంత్ర్యోద్యమం ప్రతీకాత్మకంగా నిర్వహింపబడింది. ఈ ఉద్యమం స్వేచ్ఛా సమాజ లక్ష్యం కలిగింది. "తూర్పు మేల్కొంది గుహ నుండి సింహం వలె బోర్ల పడిన చీకటి తలయెత్తజూస్తూంది". మేల్కొన్న తూర్పు, రాజకీయ చేతనతో అవతరించబోయే బంగ్లాదేశ్న, బోర్ల పడిన చీకటి అపజయం పొందనున్న నిరంకుశ రూపాన్నీ సూచిస్తాయి. చీకటి తన అపజయాన్ని అంత త్వరగా అంగీకరించదు. ఈ లోగా ఎంతో మారణకాండ జరగడం తథ్యం. ఇది ఎటువంటి సంక్షోభానికి దారితీసిందీ కవితాత్మకంగా చిత్రితమైంది. “మెషిన్ గన్ ధ్వనుల్లో సంగీతం వినిపించేరా? సైనిక పద ఘట్టనలో మృదంగం మ్రోగించేరా? బాంబుల వర్షంతో శాంతిని పండించేరా? అహం బలం ఘర్షణతో మనిషిని రక్షించేరా?”- ప్రజల్ని కాపాడే నెపంతో రంగంలోకి దిగిన సైనిక బృందం సృష్టించిన భీభత్స దృశ్యం శాంత జీవనానికి భిన్నంగా పరిణమించింది. ఇది నియంతృత్వ చర్యకూ ప్రజాస్వామ్య లక్ష్యానికీ మధ్య అనివార్యమైన సంఘర్షణకు దారితీసింది. ఈ సందర్భంలో ప్రజాస్వామ్య భావనకు స్ఫూర్తినిచ్చే చరిత్రగతి విధం దృష్టికి వస్తుంది. నియంతృత్వ చర్యల్లో హృదయవిదారకమైన సంఘటనలెన్నో ఉన్నాయి. కొడుకు కళ్ళముందు తండ్రిని లాగి కాల్చిన సన్నివేశం

మొదలుగా

ఎన్నో భయంకర దృశ్యాల మధ్య “ముక్తివాహిని” జాతీయ భావనతో పురోగమించిందది. త్యాగశీలంతో విప్లవతేజంతో విషాదకథను అంతం చేసేందుకుద్యమించింది. "తరలింది ముక్తివాహిని నటదగ్ని తరంగధుని” నిరంకుశ పాలననుండి దేశానికి ముక్తిని కోరే దేశభక్తి సేనా సమూహం, “అగ్ని కీలా సదృశం”గా వర్తించింది. ఇది చివరకు దేశ స్వాతంత్ర్యంతో ప్రజల జీవితక్షేత్రంలో విషాదం బదులు పచ్చదనాన్ని తెస్తుందనే ఆశ. భవిష్యత్తుకు

ప్రజాస్వామ్య పథాన్ని చూపిస్తుందనే ప్రజల విశ్వాసం. ఇది భారతదేశ రాజనీతిలో

భాగంగానూ

పరిణమించింది. ఉద్యమ తీవ్ర చలనంతో నిశ్శబ్దం బ్రద్దలైంది. రణ చక్రభ్రమణం శిఖర స్థాయినందుకుంది. చివరకు చీకటిలో “ఢాకా”, “తుఫానులో కొమ్మ చివర వ్రేలాడే పక్షివలె” అయింది. ఉదయమయ్యేసరికి కథ ఎదురు తిరిగింది. చరిత్ర కొత్త మలుపు తిరిగింది. ఢాకా నగరం నుదుటిపై "నెత్తురుబికి బొప్పి” కట్టింది. “ఎండిన చెట్ల కొమ్మల్లా” చేతులెత్తిన పాక్ సైనికుల దృశ్యం ఎదురైంది. ఈ పరిణామం చరిత్రలో ప్రజా విజయంగా నిలిచింది. జనస్వామ్యం గెలిచింది. శాంతికేతనం ఎగిరింది. సోనార్ బంగ్లాదేశ్ అవతరణంతో వంగపిత ముజీబ్ స్వప్నం వాస్తవమైంది. ఈ కావ్యం ఆరంభం నుండి చివరి వరకూ వస్తువు ఉద్యమ చరణంతో విజయ లక్ష్యం కలిగింది. ఇది వివిధ వాస్తవ స్థితిగతులాధారణంగా, ఈ శతాబ్దిలో విమోచన ప్రధానమైన చారిత్రకాంశం కేంద్రంగా నిర్మితమైంది. ఇది అక్కడక్కడా భావరూపాల (Images) ప్రతీకల (Symbols) సంవిధానంతో నిర్వహింపబడింది. స్వేచ్ఛా కవిత్వంలో దీర్ఘమైన రచనల్ని నిర్వహించే శిల్పం వేరు. మొదటినుండి చివరి వరకు ఉత్సుకతను ఉద్వేగాన్ని స్థాయిని నిలపవలసి ఉంటుంది. రచనలో గాఢత తీవ్రత వేగం చెదరకుండా చూడవలసి ఉంది. ఈ కావ్యంలో స్వాతంత్ర్యోద్యమంలో చర్యల్ని ప్రతిచర్యల్నిబట్టి ఏర్పడే సామాజిక స్థితుగతులతో భావసూత్రం రూపొందింది. ప్రజా లక్షితమైంది. అంతర్జాతీయ కోణంలో ఉద్యమస్ఫూర్తి కలిగిన సామాజిక స్పందనంతో ఆవిష్కృతమైందీ కృతి. Detroit, MI - U.S.A. 25-6-2001 - హరిత III. ముక్తధాత్రి అనలతోరణం ఈ గాలిలో అణువణువులో అమర్ ఈ భూమిలో కణ కణంలో సోనార్

I. 1. సాగివచ్చే నీడలు బంగ్లా స్వరారకం బంగ్లా శక్తి నాదం దేహంలో ప్రవహించే రక్త ధునీ తతుల వలె మహానదులు ఉపనదులూ అయినా ప్రజ దరిద్ర శప్తం స్వేచ్ఛావాయువును గదిలో బంధింప గోరే

స్వాతంత్రా కాంక్షను చీకటిలో దాచగోరే ఎవరు వారు? విష కాలా కాలాహులు సమర భావ రూషితులూ! ఏక దేశ సోదరులా? కాలాహి విహారంలో కుటిల నీతి కరాళ గతికి ప్రాణాలరచేతుల్లో బంధించి భయంతో పరుగెత్తే వీరెవరీ పరిశుష్కిత రూపులు మరెవరీ శోకతపులు? అన్నార్తులు! కాదు! కాదు! పంగ్వంధులు కాదు! కాదు! అంతకంటె భిక్షువులూ ధన మానం కొల్లబోయి మిగిలి ఒకే ఒక ప్రాణం పక్షుల వలె ఎగిరి ఎగిరి పరదేశ మతిక్రమించేరు సీమ దాటి ఆకులవలె దొరలి దొరలి పోయేరు వేల వేల సూర్యులు వెలిగి వెలిగి ఆరినట్లు కోటి కోటి చంద్రులు వెలిగి వెలిగి మాసినట్లు మానవ మహాశోకం ముద్ద కట్టినట్టి విధం యుగాల నుండి వచ్చే సంస్కారం భగ్నమై నియంతృత్వ పవనంతో జ్వలించే శ్మశానమై భుగ్నభావ లసిత క్షణం, స్వాతంత్య్రశయ చరణం. పోరాడే వెలుగుతో పాలువోక తారాడే నీ సమయం ఈ శ్మశాన వాటికలో చూచేమా పచ్చదనం? అవునీ మంటలే ఇస్తాయి మహోత్సాహం దురూహ ననుసరించి సాగే దుష్క్రియా పర్యవసానం ఏ భుజ పీఠం వహిస్తుంది? ఏ ఋజు లోకం సహిస్తుంది.- సాంధ్యవేళ నీడలపై ఉదయం కోరే వెలుగులు ఎదురెదురై క్రమ్ముకొనీ పందిరి వలె నిల్చాయి. గుట్ట కొకరు పుట్టకొకరు చెదిరిన సామాన్యులు చీకటి గుహలో బంధితులై జన గణ ప్రతినిధులూ

I. 2. ఆశాస్నేహంతో కిటికీ నుండి చూచి వెలుగు ప్రక్కకు పోతూంది నాలుక దాకా వచ్చిన ఊహలు మాయమై అంతలో ఎదలో వేదనతో జ్వాలలై ఎగసేను ప్రతిక్రియ చూపేను జరిగే విషాద ఘటనల్ని గాలి గొంతెత్తి వినిపిస్తూంది ప్రతి నది ఘోషిస్తోంది వింతగా. అంతా చరిత్రలో భాగమే.

ఎవరికీ అర్థం కావడం లేదు, అంతా భద్రమే నన్నట్లుంది విలపించే ఈ ఖండం విరుచుక పడిన సముద్రం ఇదీ నాటిది కాదు! సమాప్తి కర్మ సాక్షికే తెలుసు! నక్కలూ సింహాలూ పులులూ జనపదాల్లోకి చేరాయి అనుమానం కాదు! ప్రజల్ని అడవుల్లోకి తరుముతున్నాయి చెట్లూ కొండలు సైతం, కోప కుటిల భ్రుకుటులయ్యాయి. ఇది మానవులేలే రాజ్యం వలె లేదు. ఇక్కడ చిర సమార్జిత సంస్కారం సమాధి పొందింది ప్రతి నిమిషం ఇక్కడ చీకటిలో తిరిగే అగ్నిగోళం వలె ఉంది ధ్వనీ నిశ్శబ్దాల మధ్య సూటిగా లేచిన పొగ నిరంకుశ చర్యకు చిత్ర రూపమిస్తోంది. బ్రతుకుపై ఎంతెంతో ఆశా స్నేహంతో ప్రాణం ఆరడానికి మనిషి ఏ వత్తీ కాదు రాత్రి హిమశిలల వలె బిగిసింది. ఊహలు కత్తులవలె నిలిచాయి ఈ తీరు చూస్తే బ్రతుకు పరమార్థమంతా యుద్ధమే నన్నట్లుంది.

I. 3. అనల పద్మం స్వేచ్ఛా మానవ మూర్తి వెనక జన సందోహం చూపులు దిగుతున్నాయి దిశల్లోకి బాకులవలె నిశ్శబ్దం బరువుగా వాలింది నిశ్చలంగా నిలిచింది బూట్ల చప్పుడుకూ, బులెట్ల ధ్వనులకూ, నిశ్శబ్దం ఎక్కడికక్కడే సెసులుగా తెగిపోతూంది. పక్షులరుస్తున్నాయి, ఏదో పసిగట్టినట్లుగా కదలిక లేనట్లుంది, ప్రాణం మాత్రం ఉంది ఊహ ఆడుతూన్నట్లు లేదు, మతి ధృతి నిలిచే ఉంది. ఇది మూర్ఛాసమంగా ఉంది అందరూ రాళ్ళేనా? కాకపోతే యంత్రాలా? శరీరం రాయైందా? ఊహ కూడా రాయేనా? సైనికుల కొక్క ఇనుప చక్ర సంచలనం తప్ప ఏ మృదులమైన అనుభూతీ ఉన్నట్లు లేదు. అంతటా మెరపులే! పిడుగులే మొగిళ్ళు ఎక్కడ? మొగిలు లేదు! ఉంది మృగతృష్ణ అంతటా చెట్లపై నిలకడ ఎరగని పక్షులరుస్తూనే ఉన్నాయి

ఆ మూర్తిలో ఉలుకు లేదు! పలుకు లేదు! ప్రక్కకు తిరిగాడు కన్నీటి చుక్కలు రాలాయి! అగ్నికి రాళ్ళు స్పందించాయి భూమి లావా అయింది! రోదసి ఆరుణిమవహించింది. ఎవరతడు? విప్లవ సంకేతం స్వేచ్ఛకు చిహ్నం. నెత్తురు మడుగులో విరిసిన అనల పద్మం!

I. 4. పేరు విప్లవం, ఊరు స్వాతంత్య్రం నర రూప విశేషాలు మనుషుల్ని వెంటాడేను. రక్షోభావ కృత్యాలు మనసుల్ని భయపెట్టేను ఎప్పుడో కావలసిందిపుడు మొదలైనట్లుంది. ఒక మహా మతం పేరిట పీడ కల నర్తిస్తూంది. రాత్రి సరసిలో చుక్కలవలె నిదురపోతున్నారు ప్రశాంత పద్మపత్రాలపై మెషిన్ గన్ ప్రేలింది- బరువుగా కదిలే క్షణం ఒక్కమారు వేగం అందుకుంది ముజీబ్ ! బయటికి వచ్చాడు మృత్యుంజయుని వలె. సైనికుల చేతుల్లో రైఫిళ్ళ మెషిన్ గన్లూ కళ్ళముందు మృత్యువై ఊయల వలె ఊగాయి దీపం వలె మౌనంగా ముందుకు నడిచాడు తుపాను ముందు ఘడియవలె వాతావరణం స్తంభించింది ఎత్తిన కత్తిలా నిలిచిన నిశీధి ముఖం నుండి నెత్తురు చుక్కల వలె క్షణాలు జారుతున్నాయి. అతని కళ్ళ ముందు కపోతాలు శ్రేణులుగా సాగి సైనికుల శిరస్త్రాణాలపై ఆయుధాల మొనలపై క్షణం నిలిచి నిలిచి ఆగి ఆగి పై పైపైకి ఎగసి పోయేను. "ఎర్రని కళ్ళతో అతడు ఆకుపచ్చని పిట్టగా" మారాడు. చీకటిలో దీపశిఖ ఎడారిలో సరస్సు దైన్యంలో వసంతం! అతడే బంగ్లా నేత. ఏ నీడ కూడా తొంగి చూడలేని గడిలో మసిపూసిన అద్దాల గదిలో బంధించారు. ఈ సమయం పిచ్చెక్కినట్లు వీచే తుపానులో ఒడ్డును కోస్తూ పొరలే నదిలో పయనించే నావ నుండి నాయకుడు జారిపోయినట్లుంది. వత్తులు వణుకుతున్నాయి గాలికి విపరీతంగా

ఒక్కొక్క క్షణం మునివ్రేళ్ళపై నిలిచి కదలిపోతూంది సెలయేళ్ళు రక్తంతో నిశ్శబ్దంగా ప్రవహిస్తున్నాయి. గజిబిజిగా అల్లుకున్న అబద్ధాల కుతంత్రాల్లో స్వేచ్ఛా భావన అణగేనా? స్వాతంత్రానలం ఆరేనా? తుపాను శమిస్తుందనీ నాయకుడు తిరిగి వస్తాడనీ ప్రాణాలుగ్గబట్టుకొనీ ప్రయాణికులు సాగుతున్నారు ఏ స్థితిలో అయినా! దేనికైనా ఉద్ధృతి ఎంతసేపు? బలాత్కార శమనంపై ప్రజల విజయంపై ఆశ సహజం! దిక్కులు మంచుతో ఏడుస్తున్నట్లుంది. ప్రజలు అతనికై ఎదురుచూస్తునన్నారు. అతని స్వరం వినబడుతూనే ఉంది లోలోన మ్రోగే ప్రబోధ తరంగంతో ఇంతటి భీభత్సంలోను భవిష్యత్తు ఆశా శిల్పమై పశ్చిమ వలయంలో స్వేచ్ఛాబింబం మెరుస్తూనే ఉంది. అతని నందుకునేందుకు ఎగసేను వాచాపారావతాలు అతని చుట్టుకునేందుకు తరలేను ఊహా జలధరాలు. జనంలో నిలిచింది అతని పేరు - విప్లవం. అవనిపై వెలసింది! అతని ఊరు స్వాతంత్య్రం. -

II. 1. జ్వాలా తరంగాలు తూర్పు మేల్కొంది గుహనుండి సింహం వలె బోర్ల పడిన చీకటి తల యెత్త జూస్తూంది రాత్రి గన్న పీడకలలు ఆశ్చర్యంగా కళ్ళ ముందు తారాడేను పూల వనమంతా జ్వాలలు చిమ్ముతున్నాయి జలధిపై పక్షుల వలె ఊహలు కదలుతున్నాయి ఒంటరి ప్రజ చుట్టూ చీకటి క్రమ్మింది బ్రతుకులో సుఖ సంతోషాల్ని ఎప్పుడో మరచారు జ్ఞాపకముంది ఒక్కటే ఈ రోజెట్లా గడుస్తుందన్నదే ఒక రోజు కోసం మరో రోజు ఆగదు. పక్షులు వగతో కొమ్మల్లో ఆకుల్లో ముఖాలు దాచుకున్నాయి నింగిలో మొగిలు కోసం చాతకం వేచి ఉన్నట్లుందీ స్థితి ఎడారి ఎదలతో తిరుగుతున్నారు ప్రజలు

గోడల మధ్య నీడల వలె భయకంపితులై వసించేరు. ఏడ్చి ఏడ్చి దేహం మొద్దుబారి శిలా సదృశమైంది కళ్ళు అనల శైల శృంగాల వలె ఉన్నాయి ఇప్పుడు కన్నీటి చుక్కలు జారవు కాని నిప్పురవ్వల్ని చెరగి పోయొచ్చు.-

II. 2. జ్వాలా చలనం ఉదయం లేచి చూస్తే మంచు వెనక అగ్నిశిఖలు మంచు కరుగుతూంది, ఆపై పచ్చదనం దగ్ధమవుతూంది ఒక్కొక్కచోట కొండలే కొండలు! నదులే నదులు! పైన పిట్ట ఆడదు, క్రింద మనిషి పొడ కన్పించదు మతం రాజ్యానికి పరమ మంటూ గతం జీవితానికి భాగ్యమంటూ గడచాయి ఇరవైనాలుగు వత్సరాలు కరువూ కాటకం కన్నా హీనంగా ఈ ఖండం చరిత్ర పుటలు త్రిప్పితే ఏముంది? అంతా బ్లాంక్! అక్కడక్కడా పొసగని మాటలూ! అంతా హాలో! అవీ కొట్టేసిన ఎరుపు గీతలూ! ఈ వలయం పాలించే నియంతకెంత తృప్తి? అంతటా శాంతి! సమాధిలో ఉండే రీతి కళ్ళు మూసుకుంటే ఆగిపోదు జ్వాలా చలనం. పిచ్చి చూపుల్లో అందాలు వర్ణించేవారుంటే వ్యర్థమైన వ్యవహారంలో రాజనీతి లెక్కించే వారుంటే ఆడకేం? సాగకేం? ఈ సైనిక నియంతృత్వం ఆట! వాస్తవికతకు అట్టడుగున ఆదర్శాలకు దూరంగా సమాధుల్లో సంచరించే ఆత్మలు గల పాలకులూ నవ్వులోను కోపంలోనూ ఒకే భావ మహంకారం తాండవించే చర్యలతో, కొమ్ములతో గిట్టలతో నేల చిమ్మి నింగి పొంగి బరి తెగిన అహంయువులు! నిరాయుధులపై నిస్సహాయులపై విరుచుకపడే కాళరాత్రి వలె సైనిక బృందం! వీరిలో ఓ క్షణమైనా వెలుగు మొలక కన్పించేనా? వీరికై మోకాళ్ళపై ఆ దేవుని ప్రార్థించే క్షమాగుణ క్షణాలు తప్పక ఆగమిస్తాయి!

అహం నుండి ఎగసీ కొండవలె నిలిచిందీ, ఎంత కదలని మొద్దెనా అంతంలేంది కాదీ సమయం కొండపై పూల తీవెలు వచ్చేనా? చుక్కలంటే ఆశలు మెరసేనా? ఏ గుట్టల వెనకో, ఏ రాళ్ళ చాటునో దాగిపోతాయి పిట్టలు ఏ గాలి తరంగాల్లోనో ఒదిగిపోతుంది స్వరం! కలల దారుల్లో అంతలో విరిగిన రంగుల బొమ్మలతో మనసు వీథుల్లో వరసగా ఆరిన వివేక శిఖలతో నియంతృత్వ వ్యూహంలో భగ్నమైంది జీవిత శిల్పం నదీ తరంగాల్లో ధ్వనిస్తూంది సుళ్ళుగా విషాదం. అందరికీ తెలుసు ఈ స్వప్నం అబద్ధమనీ అయినా చూపు అటే! ఇదీ! బ్రతుకులో భాగమేగా ఒక్క సాయం సమయంతో గ్రంథం అధ్యాయం ముగియదు ఒక్క ఉదయ రేఖలతో జీవితం ఆకృతి దిద్దుకోదు పరివర్తనకై సమరం తప్పని దేశ చరిత్రలో రక్షస్స్వభావం స్ఫులింగమై శాంతి ముఖం జేవురించింది. విప్లవ శక్తి తలెత్తింది ఇపుడు అగ్ని కిరీటం ధరించింది.

II. 3. మంటల మాటలు అలజడి హఠాత్తుగా! పిడుగులు దొర్లినటెంది శూన్య గృహ ప్రాంగణంలో కళ్ళ కెదురుగా వెనుక్కు విరిచి కట్టిన రెక్కలతో భర్త నిల్వునా నీరై నిలుచున్న కొడుకూ, పిల్లలూ బంధువుల విషాద స్మృతులు తడుతూన్నవి ఎద తలుపులు అంతలో వికృత శబ్దం! అనుసరించి విలాప ధ్వని! వికృతశబ్దం! వీటి మధ్య నిశ్శబ్దం సెలయేరు వలె సరిస్తూంది నిశ్శబ్దాన్ని రగిలిస్తూ మండిస్తూ జ్వాలా సంగీతం అందుకుంది! ఇంట్లో గబ్బిలం మూల నుండి మూలకెగిరింది భార్య కళ్ళలో పట్టపగలు చీకటి విరబూసింది క్షణం చకితమై, కళ్ళు మూత పడినాయి కాలం ఆగింది! హృదయం మంచు శిల అయింది. ఇక్కడి బరువుల్నీ బాధల్నీ ఏ బండీ మోయలేదు ఇప్పటి అన్యాయాల్ని అవమానాల్నీ ఏ క్షితిజం భరించలేదు-

ఇక్కడి తోటలో గాలి సుళ్ళు తిరిగి విలపిస్తూంది పూల పాటలు కాదు! ఇవి చావు పాటలూ! మాటలూ! తమశ్చక్రాలపై కదలే విషమ క్షణాల సంపుటితో చరిత్ర మనిషి భవిష్యత్తును పరీక్షకు నిలుపుతూంది శతాబ్దాల సంస్కృతి రగిలి భగ్గుమంటూంది మంటలు పాడే సంగీతం మనసును చీలుస్తూంది. నిదుర పాలించే జగత్తులో, నిశ్శబ్దం శాసించే వేళలో అభద్రంగా వినిపించే జ్వాలావిల తరంగాలకు ధగధగలాడుతూంది శరీరం, విలవిలలాడుతూంది ప్రాణం గాలులు వీస్తున్నాయి మెలికలుగా మలకలుగా సూటిగా భయంకర వార్తలు మోస్తున్నాయి మంటగా కసిగా పక్షి నడిగితే తపతప రెక్కలారుస్తూ పోతుంది నదినడిగితే బిలబిల అలలు విదిలిస్తూ పోతుంది మ్రోడై శిలయై దుస్థితిలో నిలిచిన వాణ్ణి! మరచీ మనిషిని అడక్కు మతిపోతుంది. మంచి చుట్టుకొని చెడూ, చెడు నంటుకొనీ మంచీ పొరలుగా వలయాలుగా, విడదీయరాని బ్రతుకులతో పొర లొలుచుకుంటూ వలయాలు దాటుతూ గమించేరు ప్రజలు మేఘం మంచిదే, పిడుగు చెడ్డదా? వర్షం మంచిదే వరద చెడ్డదా? స్వాతంత్ర్యం కోసం ఉద్యమం అవసరమౌతుంది ఉద్యమంతో బాధలు మహాగ్ని సదృశమౌతాయి! కూర్చొన్న ఆలోచనతో ఆదర్శం విజయం పొందదు ఆచరణ గమనంతోనే తెలుస్తుంది పర్యవసానం. చంపేరు, చనిపోయేరు మంటలై ఎవరి కొరకు? రాసులుగా పుర్రెలు, వాకలుగా కన్నీరూ నెత్తురూ! పేకముక్కల్ని కలిపేసి వెదజల్లినట్లుంది ఢాకా ఎవరీ రాజ్య నియంత? ఎవరీ జన వ్యవహర్త? పాన్ షాప్ వ్యాపారి నుండి పాఠాలు చెప్పే గురువుదాకా అంతా ద్రోహులే! శిశువు నుండి వృద్ధుల వరకూ. మెషిన్ గన్ ధ్వనుల్లో సంగీతం వినిపించేరా? సైనిక పద ఘట్టనలో మృదంగం మ్రోగించేరా? బాంబుల వర్షంతో శాంతిని పండించేరా? అహం బలం ఘర్షణతో మనిషిని రక్షించేరా? ఎవరి ప్రపంచం వారికి ప్రియాతిప్రియం అయినా

ఎవరి ఊహ వారికి సత్యం పరమ సత్యం అయినా సమరస భావంతో మనవలసిన యుగంలో పైశాచిక కృత్యాలు, మారణ పథ వ్యూహాలూ! నియంతృత్వ గతికీ ప్రజాస్వామ్య రీతికీ

ఈ

సమయం

పోరాటం

కిర్మీరం - మనోఫూమికలో

అనివార్యమౌతూంది

లౌకిక శక్తులతో అనురాగ బంధంతో ఈ నేలపై సమ సమాజం పల్లవితం కావాలి.

II. 4. అమానుషం తండ్రికి బయటికి లాగి సైనికులు కాల్చేయడం యువకుడు కళ్ళప్పగించి చూస్తూ నిల్చున్నాడు ముఖం జేవురించింది, కళ్ళ నుండి నిప్పులు రాలాయి ఒక రెప్పపాటు కళ్ళు మూతలు పడ్డాయి, చీకట్లో ఊహ మెరిసింది ఒక ఊపున పరుగు తీసాడు అడవిలోకో కొండలోకో తెలీదు జయ గభీర నినాదంతో సోనార్ కంటబడేనా? జనస్వామ్య వాహినీ తరంగమై పితౄణం తీర్చేనా? హంతకుని ముఖం అద్దంలో ప్రతిబింబిస్తూంది రాయి విసరితే అద్దం ముక్కలౌతుంది, శత్రుముఖం అందని స్థితిలో ఉంది. తాడు విసరి మెడకు ఉరివేయాలిసిందే. నఖ శిఖ పర్యంతం శక్తిలోనూ లిప్త లిప్త శాంతి కోరినా స్వేచ్ఛా స్వాతంత్ర్యంకై ఉద్యమ చరిత్రలో వీరం తప్పదు. భీభత్స పథంలో హృదయం శాంతి కోరినా గాలి ఎక్కడి దక్కడే స్తంభించినట్లుంది చావూ, యుద్ధం తప్పవు ప్రజల బ్రతుకులో.- పిచ్చి వాన కురిసేనా? జల ప్రళయం వచ్చేనా? గ్రీష్మం వాలకం చూస్తే చూడాలిసిందెంతో ఉందనిపిస్తుంది భవిష్యత్తు అగమ్యగోచరం వర్తమానం చెప్పరాని కల్లోలం నదీ జల సమార్ధమైన ఈ భూమి వేడి గాలిలో మండుతోంది ఎక్కడ చూచేనా ప్రశ్నలే! ఎవరది? ఎందుకీ మారణ వ్యూహం! కిటికీ తలుపు తెరిస్తే భయం! ఎపుడు బులెట్ దూసుకపోతుందో బయటి కడుగేస్తే అనుమానం! ఎవడు కళ్ళు కప్పి తరలించేనో నిలువునా కాలుతున్నాయి నివాసాలు దేవుడేమైందీ తెలీదు

నేలకొరిగిపోతున్నాయి శరీరాలు, రాత్రి కాదు పట్టపగలే. శవాలు! రాబందులు! సైనికుల ‘మార్్చ' ఘన శబ్దం నరులు కాదు దానవులు, సైనికులు కాదు వానరులు నాల్క ఉందీ మాట్లాడేందుకు, వాక్కు ఉందీ ఊహ చెప్పడానికీ జనం నాల్క కదలడం లేదు, వాక్కు పెకలడం లేదు. జాతిని సంరక్షించే పేరిట జరిగే ఘోర కృత్యాల్లో మిగిలింది జనం పైబడి విరుచుక తినడమొక్కటే అపుడపుడూ చూస్తూ ఉంటాం! పురాణేతిహాసాల్లో విన్నాం ఇవి చెట్లపై ఉండేవనీ అడవుల్లో తిరిగేవనీ వెక్కిరింపు చేష్టలతో కక్కసింపు మాటలతో ఎండిన ఆకులతో ఇది! అకాలంలో గ్రీష్మం అహో! ఈ వానర నృత్యానికీ కాలం వసంతమైంది. గడ్డకట్టిన సమయ శిఖరంపై వానర గణాలు కూర్చున్నాయి మాటకూ పాటకూ కరిగిపోయే విధం కాదు అదలింపుకూ బెదరింపుకో కదలిపోయే రకం కాదు మెడ పట్టుక వ్రేలాడతాయి ఎద పగిల్చి మూచూస్తాయి నెత్తురు మంటలపై అలలై గంతులు వేస్తాయి. తమశ్చక్ర వలయం వలె క్రమ్మింది చమూ సమూహం నిప్పులు చిమ్మే ధ్వనులతో రక్తం ఒలికే రూపాలతో అహంక్రియా రేఖలతో వానర గణ సంచారంతో చూస్తే గాని నమ్మలేని చిత్ర పటం వలె ఉందీ స్థితి. అగ్నిలో వేగి వేగి ఎద ఒక శీతల వాక్కుకై చీకటిలో తడబడుతూ చేయి చాచి ఊతకై ఎవరో ఆపునికై వేచి కళ్ళు కాయలు కాచి పలికే శబ్దానికి సమాధానం ప్రతిధ్వని వింటూ గడిపేరు విషలిప్తలు! ప్రజ లిక్కడ శపులు. గుట్టల చాటుగా చెట్ల మాటుగా స్త్రీలు పురుషులు పిల్లలు మోయలేని భారంతో వంగి క్రుంగి మూకలుగా అరచేతుల్లో ప్రాణాలతో బయటపడితే చాలునన్న భయ భ్రాంతి భ్రమణంతో! ఎటు చూచినా దిగంతం వీరి కథ ఎవరు వినేరు? చెట్టూ గుట్టా? తప్ప శూన్యమైన ముఖాల్లో నిగురు కప్పిన నిప్పుంది అందరి పెదవులపై నిశ్శబ్దం! అయినా ఎదలో ఆశ ఎవరో త్వరలో వచ్చేరనీ, బ్రతుకుల్ని ఉద్ధరించేరనీ

సూర్య కిరణ పంక్తికి చంద్రుడు ప్రకాశించినట్లు వస్తుందీ ఖండానికి భవిష్యత్తూ శుక్లపక్ష భాసురంగా కోట్లాది శోకార్తుల ఊహకు కల్పనగా. ఆశకు ప్రతిబింబంగా, తరలింది ముక్తవాహిని విప్ల నవ తేజంతో నటదగ్ని తరంగధుని. భారత రాజనీతిలో భాగమైన బంగ్లా ముక్తి వాహిని పాక్ సేనపై విలయోద్దతి విరుచుకపడింది

III. విలయ చక్రం

నెత్తురుతో మంచు సోనలు సనసన్నగా సరిస్తున్నాయి నేలపై గంగా పద్మా బ్రహ్మపుత్ర జలాల్లోకీ గ్రీష్మం నుండి మొదలై శిశిరం వరకూ సాగిన అగ్నిశిఖా విలసనానికి రాత్రీ పగలూ భేదం లేకుండా కమరిన ప్రాణాలు కొన ఊపిరితో స్పందిస్తూన్నాయి. యుద్ధచ్ఛాయ క్రమ్మిన వాతావరణం పీడకల వలలో చిక్కిన ఒంటరి మనస్సుతో ఉంది.- గ్రీష్మంలో వీచే చెంపపెట్టు వడ గాడ్పుల వలె నియంతల సిగ్గుమాలిన చేతలు మనసుని వాయిస్తున్నాయి ఏ దిక్కులు వినేను ఏడ్పులు? ఏ నక్షత్రాలు కనేను చూపులు! జలధారకు మొగం వాచి భూమి దప్పిక గొని ఉంది మొగాన నిప్పులు విదిలిస్తూ కాలం రక్తధార చిలుకుతూంది భగవంతుడు చాచిన ఛాయా హస్తాలు అక్కడక్కడా మానవతా సంకేతాలు మిగిలాయి వీటిని దగ్ధం చేసే ఈహలతో నియంత జ్వాలా హస్తాలు చాచేను, ధూమశిఖలు విసిరేను. చండంగా తాండవించేను! పాపం తెలీదు రానున్న పరివర్తనం. రాత్రి తరవాత రాత్రి ఏకాంతంలోకి పోతూంది బ్రతుకు వెంట బ్రతుకు ధూళి కణాల్లో కలుస్తూంది జన హత్యా పైశాచికం అందరికీ తెలిసిన రహస్యం శాంతి భద్రత పేరిట దాచేందుకు సకల వికల యత్నం. ఆటవిక రంగంపై కిరాతకం నృత్యం చేస్తూంది అలసిన హృదయం నిశ్శబ్దంగా వాలిపోతూంది.

పిడికిట దాగిన రహస్యంతో కళ్ళలో వెలిగే వత్తులతో ప్రజలు నక్కి నక్కి కదలేరు! ఏమైనా ఆగనిదీ సంరంభం ఎంతటి గ్రీష్మంలోనూ వటవృక్షం చావదు ఎంతటి ఇసుకలోనూ జీవనది ఇంకదు. బాంబులు అరుస్తున్నాయి రైఫిళ్ళు మాట్లాడుతున్నాయి టాంకులు ఉదోషిస్తున్నాయి విమానాలు ఆలాపిస్తున్నాయి నీడల వలె శరీరాలు ఎక్కడబడితే అక్కడ భయంకరంగా మృత్యు రహస్యాన్ని బట్టబయలు చేస్తున్నాయి శవాల్ని శ్మశానానికి చేర్చే ప్రసక్తి పట్టనట్లుంది. ఇక జీవితాల్ని గురించి ఆలోచన ఎక్కడిది? ఆకులు కప్పిన ముఖాలతో మట్టిలో మాసిపోవలసిందే! చెట్టుకీ ఇంటికీ మనిషికీ మధ్య! కదలే మంటల పొగల తెరలు హిమశిలవలె గడ్డ కట్టింది సమయం! ఇది కరిగితే తప్ప జీవన గమనం లేదు! కళ్ళలో ప్రాణాలతో బంధువులూ మిత్రులూ పొలిమేరలు దాటి పోయేవారు పోగా శవాలుగా మారీ కాల్చబడీ భగభగమండే నిప్పు! సైనికుల కళ్ళను ధగధగలాడిస్తూంది యుద్ధం కల్లోల సముద్రమై పొంగుతూంది జాతి జీవిత నౌక ఎగసే అలలపై భ్రమిస్తూంది ప్రతి వ్యక్తీ కర్ణధారి! భవిష్య ఫలానికి సంకేతం క్షణాలు చరిత్రకు మలుపు తెచ్చే వేగంలో ఉన్నాయి స్వేచ్ఛా తరంగాలపై విహరించే నవోహలతో ఇనుప పంజరం నుండి స్వర్ణ హంసలు ముక్తికై యోచిస్తున్నాయి. ఆత్మలు మేల్కొనే ఉన్నాయి, శరీరాలున్నా లేనట్లే! అనలం వలె కదలే కావ్య మహారూపం అందుకుంది స్వేచ్ఛా కవితా చైతన్యం. III .

III. 2. నిశ్శబ్దం బ్రద్దలౌతుంది రాకెట్ల ధ్వనికి నిశ్శబ్దం బ్రద్దలై ముక్కలై పడిపోతూంది వెలుగు పోరాడుతూంది ముసురు పట్టిన చీకటితో

తలుపుల్లేని జైల్లో పిచ్చివాండ్ల వలె హంతకుల వలె దేశభక్తులు పాలకుల కఠోర దృష్టిలో ఈదరాని కల్లోల సముద్రాలు. ఒకదానినొకటి హత్తుకొని వరసగా క్షితిజంలో మంటల పొగల ఆర్చీలు లేచాయి సైనికుల సంచలనంతో నగరం సాంద్రమైన భయ లయలో ఊగుతోంది యుద్ధ దాహక చరణ ప్రమాదం హఠాత్తుగా నాటకంలో ప్రతి నాయకునిపై విరుచుకపడింది, చీకటిలో ఏదో పసిగట్టీ నీడలు గప్చుప్ గా పడి ఉన్నాయి విపత్తులో కలత చెంది వాతావరణం కలవరిస్తోంది చివరి దశలో వత్తి వలె ప్రభుత్వం భగ్గున మండుతూంది.- సమీపిస్తున్న రాత్రికి ముందు వాలే చెట్ల నీడలతో చెరువు నీటి అద్దం వలె ఉందీ దేశం రేడియో వినిపిస్తోంది, పౌరులకు హెచ్చరిక “సైరన్ మ్రోతతో స్వయంరక్షణకు సిద్ధం కండి, పిల్లల్నీ వృద్ధుల్నీ అస్వస్థుల్నీ వదిలేయండి”. శత్రువులు రాకెట్లు విసరేరు, రాత్రులు బాంబులు వేసేరు సాతంకంగా బయటికి వచ్చేసి నేలపై బోర్లగిల వాలిపోయి చెవులో దూది పెట్టుకొనీ చేతులతో ముఖం కప్పుకొనీ ఆలెయర్ సైరన్ మ్రోగే వరకూ లేచే పనిలేదు. వెచ్చని స్త్రీ కౌగిలిలో ఒదిగీ టెన్సెస్లో ఉన్న సైనికులకీ ప్రళయ వార్త వినిపించిందో? లేదో? రాత్రి పార్టీలో ఎంత తిని తాగిందీ అంచనాల్లో హోస్్ట లుబ్ధత్వం స్మరిస్తూ నవ్వుతూ చిద్రుపలు చిద్రుపలుగా క్లబ్బుల్లో కబుర్లాడే ఆఫీసర్లకీ వార్త అందిందో లేదో? మండే గ్రీష్మంలోనూ ఎక్కడో? ఉదయమో సాయమో? పూలు పూయకపోవు ఇంతటి నిరాశా చక్రంలోనూ ఒకటి రెండు తేజో లతికలుండకపోవు ఇపుడుంది నిదురకాదు, నిదుర వంటి స్థితి కలకాదు కల వంటి నీడల భ్రమావరణం కళ్ళ చివర విషసర్పాలు బుసకొట్టే సైనికులకు ఎదురుగా ఉందొకటే చకిత వ్యూహంలో శత్రువు నుండి మృత్యువు! చీకటిలో ఢాకా!

సగం నిద్రలో హఠాత్తుగా మేల్కొన్న పర్వతంవలె ఉంది పెను తుపానులో ఊగే కొమ్మ చివర వ్రేలాడే పక్షివలె ఉంది లైట్లు ఆరిన భీ నీడల గదిలో రాత్రి ముసుగులో ఏడ్చి ఏడ్చి స్రుక్కి నేలపై వాలిపోయిన స్త్రీవలె ఉంది. మెలకువ పూర్తిగా కలిగేనా? ఊపిరి నిండుగా తీసేనా? గండం నుండి బయట పడి శాంతి పొందేనా? ప్రతి రాజకీయ మతిలో ఈ స్థితిలో విచికిత్స సహజం ఇనుప కమ్ముల వంటి క్షణాల్లో నిలిచి ఉందీ ప్రజ తాళం వేయబడింది. ఎవరూ బయట పడేట్టు లేదు. తాళం చెవి ఎక్కడో దూర దేశంలో ఉంది తాళం పగులగొట్టే సాహసమే ఈ ఉద్యమం. రాత్రి గడచీ దుఃఖం అంతరించీ తొలి ప్రొద్దు చూడాలిసి ఉంది మంచు తొలగీ అద్దాలు బ్రద్దలై బంధన నుండి బయటపడాలిసి ఉంది నరకంలోనూ లేకపోలేదెక్కడో కించిత్ అనుకూలం ఆనందం అయినా నరకం నరకమే! అదే ఈ బంధనం! త్యాగం శ్రమ సాధన ఫలితం బంగ్లాదేశ్ రానున్న స్వాతంత్ర్యానికి ప్రతిబింబం, స్వేచ్ఛారూపం. భయంతో తలుపులు బిగించుకున్నవారు వణకుతున్నారు. బ్లాంకెట్ కప్పుకున్నవారు ముడుచుక పడుకున్నారు కుంపటి ముందున్న వారు చలి గురించి ఆలోచిస్తున్నారు. భయంకరంగా తలెత్తిన అనల శిఖరాలపై నుండి జలధి వాహినీ తరంగాలు ఏకమై పదమెత్తాయి శక్తి ధురా త్యాగమతులు క్రాంతి పథ సూచికలు ప్రజాస్వామ్య పతాక క్రింద ఒకటై రూపొందేరు మానవ దుర్దశ తలచుకొని కళ్ళలో నీరు తిరిగేను బిందు బిందువులో విద్యుత్తు మనస్సుకు చైతన్యం ఇచ్చేను ఈ రోజు వచ్చిందెప్పటివలెనే, చలి వెనక్కు అడుగేసింది యుద్ధ చిత్ర పరంపర మధ్య సూర్యుడు వెలుగుతున్నాడు. కళ్ళు తెరిస్తే చూపుల్లో మంటలు, పెదవి విప్పితే పలుకుల్లో మంటలు నెత్తురు అలల వెంట తలలెత్తి, చెంగుచెంగున దూకేను మంటలు ఎక్కడ చూచినా ఎరుపే పగలూ రాత్రీ కళ్ళల్లో సంజల వలె మంటలు! మంటలు ఎరుపులు! ఇప్పటి ప్రతి ఉదయం రక్త భావ సంకలితం ఇక్కడి ప్రతి హృదయం అగ్నిగోళ వర్తనం

దిక్కుల్లో ఎరుపు విరిగి, ఆశల్లో తెలుపు వచ్చి మనస్సు ప్రన్నని శాంతి పొందాలిసి ఉంది- రాక్షసి బొగ్గు గుండెలతో గుట్టల వలె సైనికులు నిప్పు రవ్వ పడితే ప్రళయోద్దతి అవుతుంది నీటి జల్లు కురిస్తే శరణాగతి అవుతుంది సముద్రం వేరు చేస్తుంది ఖండ ఖండాల్ని భూమి వేరు చేస్తుంది జల నిలయాల్ని రాజ్యంలో పాలనా సంస్కార హీన వర్తనం వాడి కత్తియై ప్రజల్ని ముక్కలు చేస్తుంది మొగిళ్ళు క్రమ్మిన ఆకాశం కుంభవృష్టికి సిద్ధంగా ఉంది కుంభవృష్టి ప్రళయానికీ నేల తట్టుకొని నిలిచేనా?

III. 3. కథ ఎదురు తిరిగింది మైదానంలో ఆటబంతి వలె పరుగెత్తి పరుగెత్తి కాలం ఆగినటెంది. మౌనశిఖరం వలె మారుతూంది. కథ ఎదురు తిరిగింది, ఘోరంగా బెడిసి కొట్టింది ఊహింపరాని మార్పుతో చరిత్ర మలుపు తిరగబోతూంది. ఈ క్షణం పాద రస కణమై వేళ్ళకు చిక్కేట్లు లేదు దీన్ని చేతిలో వహించడానికి నేర్పు కావాలి. పట్టీ పట్టని మనస్తత్వం పోయింది దిక్కుల్లో మత్తు వదిలింది ప్రజల్లో సత్తువ వచ్చింది, చీకటి స్థితి తొలగింది ఢాకా సిటీ నుదుటిపై నెత్తు రుబికి బొప్పి కట్టింది సముద్రతీరం పగిలి ముక్కులైన అద్దం వలె ఉంది జలధి అంచుల దాకా అనల జ్వాల లలముకొని అదృష్టం దిగ్బంధితమైంది, ప్రాణం కంఠ గతమైంది ముఖం బిగిస్తే సరిపోదు తల వేడెక్కితే చాలదు విలయచక్రం శక్తిని మించిన విపత్తును తెచ్చింది నౌకల్లో విమానాల్లో హుటాహుటి వచ్చిన మృత్యు మూర్తులు పాపం! చేతులు కడుక్కోని ఏమీ ఎరగనట్లు నిల్చేరు. ఇపుడీ వీరులంతా శరణ్యులు శిఖరమూడిన పర్వాతాభులు బ్రతికి ఉన్న శవాలు : పాక్ పంపిన రణగ్రస్తులు, జనశపులు నిన్న ప్రజల్ని వేటాడిన మృత్యువు నీడలు. శరీరాలు చీల్చి ఎముకలు మిగిల్చిన సేనలు

ఇపుడో బారులుగా నిల్చిన శిలా శ్రేణులు ఒక నేరం కప్పేయడానికెన్ని పన్నాగాలో! కొమ్మలెండిన చెట్ల వలె చేతులెత్తి నిల్చేరు శరణు పొందిన సన్నివేశం! రణచరిత్రకు శశికిరీటం నిన్నటి అగ్గి కొండలకు బదులు నేడు మంచు కొండలు! సైనికుల అడుగు జాడలు బంగ్లా నేలపై ఇసుకలో గ్రుచ్చిన కత్తుల మొనలవలె ఉన్నాయి గత చరిత్రను విశేష లిపిలో జ్ఞాపకం చేస్తున్నాయి ఈ జాతి జీవితంలో డిసెంబర్ పదహారో తేదీ అభినవ తేజంతో పొందిన పునర్జన్మకు సంకేతం. ఎంతలో గడచిపోయాయి విషమ ఘడియలు సమాజ చైతన్యంతో జనస్వామ్యం వికసించింది హృదయం మరచిన అనుభవాన్ని తిరిగి పొందింది బ్రతుకులో మాసిన పచ్చదనం మళ్లీ మెరసింది క్షితిజంలో నిశ్శబ్దం ఝణఝణ మ్రోగుతోంది అవనిపై నైశ్చల్యం గలగల కదలుతోంది ఊహలో మొలకెత్తిన కోరిక చివురించేను చూపులో మృదు తేజం స్వాగతం పలికేను వ్రేళ్ళపై నిలవలేకుండా గాలి పైపైకి త్రోసుకవస్తోంది అంతటా మానవతా ధుని! హత్తిన స్నేహ లహరి పర్వతంపై నుండి సముద్రంలో పడి మునిగీ సుడిగుండంలో చిక్కీ బయట పడినట్లుంది ప్రజ, ఉజ్వల స్వరంతో కాలం స్వేచ్ఛగా పాడుతోంది శరీర కణకణంలో స్వాతంత్య్ర దినం నర్తిస్తూంది.-

IV. 1. విజయ వర్షం రాత్రి వర్షం కురిసిందా? ధాత్రి హర్షం విరిసిందా? ఎన్నాళ్ళ కెంత హ్లాదం! బంగ్లా సేనల చలనంలో! దిక్చక్రం ఆశ్చర్యం పొందింది ఆనందం విషాదాన్ని మ్రింగింది. ఎంత బరువూ మనస్సుకు శ్రమ అనిపించడం లేదు. అమరుల కపాలాలు సంగీతం వినిపిస్తున్నాయి బ్రతికిన ఎదలో ఆశా జలదం ఊగుతోంది విముక్తగణ విభాతంలో దేశం మునిగి తేలుతూంది.

ఇనుప కవాటాలు బ్రద్దలై మహా రాక్షసం ఆట కట్టింది రక్త చిత్రాలకు బదులు పూల గుత్తులు వ్రేలాడుతున్నాయి కిటికీలు తెరచుకున్నాయి తలుపులు తెరచి ప్రజలు స్వేచ్ఛా సమీరాన్ని ఎద నిండుగా అనుభవిస్తున్నారు. మాతృభూమి మృత్సా గంధం ఘ్రాణ తర్పణంగా పీల్చేరు ద్వావా పృథివి ఆనంద వదనంతో మైదానం పరచుకొంది సంధ్యా ధరాలపై కోటి ఇంద్ర ధనుశ్చిత్రాలు నిండాయి. వర్షపు చినుకుల ఆనందబాష్పాలు! పూల జల్లుల జయోత్సాహం! ఉదయశిఖరంపై రవి సాక్షిగా బంగ్లాదేశ్ పతాక దేశభక్తుల త్యాగంతో గగన హృది రెపరెపలాడేను పాక్ సేనల లొంగుబాటుతో స్వప్నం నిజమైంది. స్వాతంత్ర్య మహానుభూతి జనశక్తిలో ఒకటైంది. మంచు సోనలు ముఖంలో తరలుతున్నాయి త్యాగచిత్రం కళ్లలో కదులుతూంది. ప్రభాత సరస్సులో శుభోదర్క పద్మం సరికొత్తగా అవతరించిన బంగ్లాదేశం ఎటు చూసినా అమృతవేళ! జలధి వాహినీ తరంగ హేల! బంధం ఉన్నంతవరకూ వీడదు ఈ మైత్రీ స్తబకం హంసలు ఎగురుతూన్నాయి కళ్ళలో వెలుగు టీరికలతో కాలం కదులుతూంది గగనాన చంద్రరేఖ వలె ఊహలు వెలుగుల్ని వర్తిస్తున్నాయి ఈహలు చీకట్లను వదలుతున్నాయి.

IV. 2. మరోచరిత్ర ఎరుపు తెచ్చుకున్న రెక్కలతో ఎంత దూరమెగరగలదు? సమభావం లేక పక్షి నేలపై కుప్పగా కూలింది ఒక చరిత్ర సమాప్తితో మరో చరిత్ర సమారంభం! ఒక దేశ వికార శకమంతరించింది. మరో దేశ రమణీయ రూప మందుకుంటూంది! ఈ గడ్డపై సమాజంలో శతశతాబ్దాలుంటుంది పరాభూత భగ్న ధగ్ధ జన వేదనా చిహ్నం శరీరం నగ్నమై ఎముకలు చూర్ణమై మిగిలిన ఆత్మ ఇపుడు శక్తి సంభరితమైంది ఇనుప చువ్వల రాతి పంజరంలో నుండి

సోనార్ గాలిలో చిలకలెగురుతూన్నాయి కట్టు కథల కట్లు విచ్చుకుని, ప్రియంగా బ్రతికేను భూమి ఆకాశం ఆలోచన అనుభవం అంతా కొత్తగా ఉంది. ఇంకా అక్కడక్కడా పాములు పొదల్లో దాగి ఉన్నాయి విషానలంతో బయటికొస్తే వాటికి వ్రాసిపెట్టే ఉంది. ఇపుడు ఏ దిశలో మంటలు లేవు! హాహాకారాలు లేవు ప్రతిచోటా వెలుగు! వెలుగు! వెలుగు! జయజయధ్వానం! శక్తి ఉంది రక్తి ఉంది. రక్షణకూ శిక్షణకూ రాక్షసరీతుల్ని సమూలంగా ఛేదిస్తూ మానవ సంస్కృతికి మనోహరాదర్శంగా, మతాతీత సమభావం స్పందించే జనస్వామ్యం! శత్రు గర్వమణగింది. ఎవరిపై కోపం లేదు. ఈ గడ్డ ఇపుడు శాంతి నికేతనమైంది మృత్యు హేతి ఎవరి మెడపై లేదు.

IV. 3. ప్రజాస్వామ్య చరణం వాస్తవమెరిగీ ఎరగనట్లు కళ్ళుమూసి పాలు త్రాగే పిల్లులూ మీ క్ళపుడు మంటలకు బదులు కన్నీళ్ళతో నిండుతాయి? రావణు డంతమైనాడా? హిట్లర్ చనిపోయాడా?- హెలో! ఎప్పుడు? ఎక్కడో? చెప్పు! భౌతికంగానా? రావణుడూ హిట్లరూ ఉండనే ఉన్నారు! పురాభావంతో మన నీడ వెనకే దాగి దాగి ఉంటారు సమయం కోసం పొంచి పొంచి చూచేరు మెషిన్గాన్ ధ్వనితో మారణాస్త్ర ప్రభతో అహం బలం మౌర్జ్యం ముప్పిరిగొన్న తత్త్వంతో అందరికన్నా ముందుగా చరిత్రలో అడుగేయాలనే ప్రజలెందుకు బ్రతికున్నట్లు ఎవరి నడగాలిసిన ప్రశ్న? దిక్కులనా? దేవుణ్ణా? కాదు కాదు ప్రజలనే నీలి పండు నోట్లో వేసుకుంటే చేదు! విషం! ప్రాణభయం! ముందు గరళ కంఠులవాలి! ఆ తరువాయి చంద్రకిరీటత్వం! నిన్న శూన్య దృష్టులతో తొంగి తొంగి చూచినవారు నేడు వాసంత పూర్ణ చంద్రకాంతి నేత్రాలతో తిరిగేరు ఇన్నాళ్ళు దాగిన రహస్యం పటాపంచలై సత్యం మెరిసింది

ఎటు చూచినా కంటికి తృప్తిగా ఒకే ఒక కాంతి రూపం! అనల ధూమచ్ఛటలకు బదులు వెండి మంచుతో ఉదయం మారణాయుధ ధ్వనికి బదులు విజయేందిరా హర్షగీతం గతంలో లేచిన ధూళి కరుణాసేచనతో అణగింది మతం పేరిట మంటలు, సహన వర్షంతో ఆగాయి చల్లబడిన శ్మశాన తలంపై రాగ సృష్టి మొలకెత్తేను మానవతా సుందరమై సమతా కిర్మీరమై, ఎక్కడ చూచినా అద్దంలో వలె మానవ మహారూపమే సంస్కృతిలో దేశం దళమై కళయై, ప్రజాస్వామ్య రూపమై.

IV. 4. బంగ్లా నసీబ్ 4.won దేవుడున్నాడో లేడో గాని మానవుడు మాత్రం ఇక్కడ నలగీ కలగీ విశ్వ సంస్కృతీ వారసుడుగా దక్కాడు. చీకటి పుటలు చింపేసి వెలుగు నృత్యం చేస్తోంది ఇపుడు తెరచుకొంది స్వర్ణ బంగ్లా దేశ ద్వారం చరిత్రలో బింబించే త్యాగశక్తి రూపంతో సమాజ గమనం ఇపుడు క్రాంతి పథాన నడిచేను, తూర్పు దిశ ఎరుపుతో వెలుగు! వెలుగు! ఆకాశంలో, ఎరుపు నుండి తెలుపు పసుపు నేలపై అంతటా ఆకుపచ్చ రంగు! ఈ రాత్రి వ్యధలేని మహోదయమై మేల్కొంది కలకూ కోరికకూ, అంతం లేదు, కాని కల నిజమైంది! కోరిక పండింది. ఆనాడు భయంతో ఎగిరి దాగిన పక్షి! ఇదిగో! ఈనాడు స్వేచ్ఛగా వచ్చి భుజంపై వాలుతూంది, ముంజేయిని ముద్దు పెట్టుకుంటూంది. ముఖంలో తొంగి చూచి హృదయంలో దూకుతూంది మానవ బాధారుణ గాధామయ చరిత్రలో వికసించిన ప్రజా పద్మం! అమర్ సోనార్ వంగ దేశం! ఇది విప్లవ సంకల్పం ప్రజ పొందిన అమూల్య వజ్రం వంగ పిత షేక్ ముజీబ్ ముక్త ధాత్రి బంగ్లా నసీబ్ ఏవీ! ఆ మాటలు ఎదలో మ్రోగుతూన్నాయి

సింహాల వలె దూకేవీ! హంసల వలె ఎగిరేవీ! “దీన అమి, రిక్త అమి, దెవర్ కిచునై ఆచె సిధు, భల బష దిలమ్, సుదుతై” అనుబంధం ఈనాటి ముజీబ్ హత్య రక్తంతో దూకిన స్వప్నం ఆనాటి ముజీబ్ విజయం రక్తంలో విరిసిన పద్మం ఇది కరాళ సమయం! ఉదయం భగ్నమైంది భవిష్యత్తు పారిపోయి అడవిలో తలదాచుకుంది. త్యాగం రాగంతో దేశభక్తి మేళవించి నిలిచిన ఆశా కిరణం! ఈ నేల నుండి తొలగింది! చరిత్రలో అడుగునబడి పొరల్లో అణగి మణగిన ఆటవిక యుగక్రీడ! ప్రదర్శన జరిగిన సమయం స్వేచ్ఛా సమాజ ముఖంపై దీర్ఘరాత్రి వాలింది. హత్యా చిత్రం- అంచుల్లో వ్రేలాడే కలల పీలికలతో కాలం బూటు కాలు ముద్రతో ఉన్మత్తాకృతి పొందింది. ఇది నీరవ సమయం! ఎత్తిన తల ఒరిగింది! వర్తమానం ఆగిపోయి పెనుబండమై నిలిచింది. రాళ్ళను తొలిచి తొలిచి తీర్చిన రమణీయ శిల్పం ఊహలు మలచి మలచి దిద్దిన కమనీయ సంస్కృతి రస సమూహం గడ్డకట్టి సంస్కారం స్తంభించింది బంగ్లాదేశ్ చరిత్ర ఫాలంపై గాయం లోయగా ఏర్పడింది. ఆటవిక మనస్తత్వం, చిందే మృత్యు సంగీతంతో వరద రహస్యంగా వచ్చింది రాత్రి అంచులు ముంచుతూ శవాల్ని ప్రక్కకు నెట్టి ఉదయానికల్లా వెళ్ళిపోయింది. కవి ఐనా నాయకుడైనా ఎవరైనా ఈ సమాజంలో మానవ వికాస చరిత్రకు వారిచ్చే కానుక ఏమనే! గాలిలో ప్రాణం, అగ్నిలో మట్టిలో శరీరం, శూన్యంలో మనస్సు కలిసిపోయి మిగిలేదేమిటి? ఇచ్చేదేమిటి? మానవతా గంధం. చీకటిలో తేలే బింబం శశియై రవియై, వివేకం. వెలుగుతో ఊగే బింబం, మానవ హృదయం. తరం నుండి తరానికి మిగులుతుంది విలువగల వ్యక్తిత్వం. స్వేచ్ఛా గుణంతో స్వాతంత్య్ర పథంలో సాధించిన సోనార్ ఖండం ముజీబ్ నాయకత్వంలో ప్రగతి శక్తుల విజయ తేజం.