Maanaveeyam — Volume I — Swecchaa Kavitvamu

మానవీయం — స్వేచ్ఛా కవిత్వము — మొదటి సంపుటం

1971 · Telugu (te) · 40 pages · Human-proofread

I. స్వే్ఛ నవం

మానవీయం

సహృదయ దర్శణం కవి ఆలోచనా స్పందనలతో సంవదించే వ్యక్తి సహృదయుడు. ఇటువంటి వ్యక్తులతో కూడింది సహృదయంలోకం. వారితోనే కవితా పరంపర నిలిచేదీ, ప్రకాశించేదీ. కవి కొంత కాలం జీవిస్తాడు. ఆ తర్వాత ప్రత్యక్షంగా ఉండేది అతని రచనే. సహృదయలోకం మాత్రం పరంపరా భాగంగా ప్రత్యక్షంగా ఎప్పటికీ ఉంటుంది. రచనా ప్రభావాన్ని ప్రసారమానం చేస్తుంది. ఆనందాన్ని పంచుతుంది. ఆలోచనకు దీప్తినిస్తుంది. ఇది కవి హృదయధ్వనికి అనురణాత్మకం అనొచ్చు. కవి హృదయంలో ఈ విధమైన సంవాదంవల్ల ఆస్వాద పరిపూర్ణత చేకూరుతుంది. ఆలోచనా సమగ్రతకు దారితీస్తుంది. స్వేచ్ఛా కవిత్వంలో నిర్మాణ రూపం దీనికి పూర్వం ఉన్న పద్య గేయ కవిత్వాల్లో కన్నా భిన్నమైంది. స్వతంత్రమైందీ ఇది అనేక విధాలైన స్వేచ్ఛచే ఏర్పడుతుంది. ఇది పూర్వ సమామ్నాతం కాదు. కాబట్టి దీనికి కొత్తగా సాహిత్యంలో మానసిక సంస్కృతి ఏర్పడవలసి ఉంది. ఏర్పడింది బలపడవలసి ఉంది. ఇందులో భావనవాస్తవతలంపై లౌకిక స్థాయి నుండి మానసతలంపై లౌకికేతరందాకా పర్యాప్తమై ఉంటుంది. మానవ ప్రగతి సమాజవికాసం వ్యక్తి పురోగతి వివిధ గతుల్లో పరస్పర సహయోగంతో వర్తించే విధమూ స్వేచ్ఛాకవిత్వంలో దృష్టికి వస్తుంది. ప్రజాస్వామ్యానికనుగుణంగా బహువిధాలుగా వర్తించడం ఈ ప్రక్రియలో బహువేగంగా సాధ్యమయింది. పద్యం పరిణతి చెందింది. స్థిరపడింది. దీనికి క్షతి లేదు. స్వేచ్ఛాకవిత్వం వికాసోన్ముఖంగా ఉంది. ఇందులో అంశాలు వస్తు స్వరూపం ఆధారంగానూ, స్థితి సంఘటనల యోజితగానూ, భావనా విశేషంగానూ ఆలోచనా సమర్పకంగానూ ఆకర్షిస్తాయి. అన్నింటిలో సామాన్యమైన విశేషాంశం ఒకటే అదే కవిత్వస్పర్శ. సరస్సులో ఉండేజలమూ, ప్రవాహంలో ఉండే జలమూ, బావిలో ఉండే జలమూ ఒకటే. అయితే వాటి విస్తృతి, అగాధత్వమూ, నిడివీ, వేగమూ, ఆకృతి వేరు. దీన్ని బట్టి ఆలోచనా ప్రసారం అనుభవ సాంద్రత వేరు కావడం సహజం. అయినప్పటికీ సహృదయుల్ని ఆకర్షించడం మనోజగత్తును మహనీయకంగానూ రామణీయకంగానూ ప్రకాశమానం చేయడం ముఖ్యం. ఇది జీవసారంతో జీవతేజంతో సమాహితం కావడం విశేషం. ఇది సాధారణానుభవాన్ని

దాటింది. బహిర్వాక్కున కందందీ అవుతుంది. ఇక విశేషానికి వస్తే ఈ కవిత్వానికి

మూలాధార

స్తంభాలనదగినవి

నాలుగు

అంశాలున్నాయి. మానవజీవితంలో 1) తప్పనిసరియైంది ప్రకృతి రూపం 2) తప్పించుకోలేని సామాజికరూపం స్థితిగతులూ 3) తోటివారితో వివిధస్థాయిల్లో సంబంధాలు పరిణామ వికాసాలు 4) వ్యక్తిపరమైన మానసిక రీతులూ, అనేవి రచనలో వీటి సమాకలనం నిశ్లేషణకందుతుంది. ఎన్ని అభిప్రాయభేదాలున్నా వివాదాలతో నిమిత్తం లేకుండా ఎక్కడో ఒకచోట కవితాప్రియుల్ని కలిపే ప్రీతికరమైన శక్తి ఎప్పటికీ ఆకర్షిస్తుంది. దీన్ని గుర్తించడం దీని చుట్టూ ఉన్న అల్లికను సహేతుకంగా వివేచించడంలోనే సహృదయ సమాలోచనం ఉంది. ఇది అందరి మనస్సుకు తెలిసిందే అయినా ఒకమారు మననం చేసుకోవడం అవసరం. ఈ స్వేచ్ఛా కవిత్వం సంకలనంలో 1953 నుండి 2002 వరకు యాభై సంవత్సరాల కవిత్వ జీవిత స్పందనం పర్యాప్తమైంది. మొట్టమొదటి కవిత తెలుగు స్వతంత్రంలో 1953లో ప్రకటితమైంది. చాలా భాగం భారతి స్వతంత్ర స్రవంతి ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి మొదలుగు వివిధ పత్రికల్లో ప్రచురితమయినాయి. ఈ సంకలనం ఒక పద్ధతిలో I) స్వేచ్ఛానవం II) ఆవాహనం III) ముక్తకాలు IV) సమయదర్పణం V) కిర్మీరం VI) వర్తమానం స్క్రీన్పై VII) అగ్నినుండి ఆనందానికి VIII) ఈ శతాబ్ది రెక్కలపై IX) అగ్నిపీఠం X) కిరణపథం, పదిభాగాలుగా వర్గీకృతమయింది. మొత్తం మీద ఓపిగ్గా వివేచన చేసి కవిత్వాభిరుచితో అస్పష్టతల్నీ పునరుక్తుల్నీ తొలగించి ఎడిట్ చేసిన పరిష్కర్త చి॥ హరితకు ఆశీస్సులు. ఈ పరిష్కరణం అభినందనీయమేకాదు ప్రశంసనీయంగానూ ఉంది. ఆరంభంనుండీ ఈనాటి వరకూ సృజన సమాలోచనా రచనల్లో ప్రజాస్వామ్యనిబద్ధత అనుస్యూతంగా ఆవిచ్ఛిన్నంగా ప్రసారగతిని పొందింది. స్వేచ్ఛాయుగంగా పేర్కోబడి స్వేచ్ఛాకవిత్వంగా భావితమైన ఈ కృతుల్ని సహృదయుల సమాలోచనకు వదలుతూ రాబోయే కాలంలో సాహిత్య చర్చకు కలిగే అవకాశాన్నీ భావిస్తున్నాను. ది. 26-03-2003 - మాదిరాజు రంగారావు స్వేచ్ఛా నవం కావ్యాలు 1. మానవీయం (1971) 2. పడగెత్తిన ఉదయం (1973) 3. ముక్తధాత్రి (1972)

అంకితం

ఈ జీవన పథంలో గమ్యమెరిగిన ప్రయాణికులు ఈ విచిత్ర జగత్తులో నీడ క్రమ్మని దీపకళికలు శ్రీమతి లక్ష్మీదేవి (నరసమ్మ) శ్రీ నారాయణరావు మాతా పితరులకు హృదయ తర్పణంగా V. SESANKA, M.A. Lecturer in Telugu Nanakram Bhagawandas Science College Pattargatti Hyderabad - 2 Residence : 53 B, Sanjeeva Reddy Nagar Hyderabad-38 సహృదయ దర్పణం సోదరులు రంగారావుగారికి నమస్కారం. మీరు దయతో పంపిన “మానవీయం” అందింది. బాహ్యాంతర సౌందర్యాలు రెండూ పుణికిపుచ్చుకున్న ఆ కావ్యం నా మనసు చూరగొన్నది. ఆ వస్తువును అంత Poetic గా చెయ్యడంలో గల కష్టం కవులకే తెలుస్తుంది. అందునా మీరు బ్రతుకు వంతెనపై నిలబడి కాల దర్పణంలో బింబించిన ప్రకృతి శక్తిని మీ మనోనేత్రంతో దర్శించిన తీరు అత్యంత రమణీయంగా ఉంది. విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నవి. గా మీ ఊహల ఉన్మేషంతో రూపొందిన సృష్టి ఈ మానవీయం అక్షరాక్షరం లోనూ ప్రతిబింబించిన సంగతి నేను గమనించాను. సృష్ట్యాద్యంతాలు కొలిచిన కవి దృష్టిలోని నైశిత్యాన్ని పరిశీలించాను. ఈ మానవీయంలో మీ కవిత్వం పండి పరిపక్వమవడం గుర్తించాను. సమకాలీన కవులలో మీ కవిత్వం ఒక ప్రత్యేకతను ఆపాదించగలదని విశ్వసిస్తున్నాను. ఇటీవలి కావ్యాలలో ఇంతగా “హ్యూమనిజమ్” చిత్రించిన కావ్యాలు లేవు. ఇందులో ఒక తరం నుండి వేరొక తరానికి అవిచ్ఛిన్నంగా మానవ సంతతి నాగరికత

తీర్చిదిద్దిన ఆత్మదీప్తి ప్రతిభాసిస్తున్నది. అదే ఈ కావ్యానికి జీవగర్ర. ఇంతటి మహత్కావ్యాన్ని రచించి ఇదివరకెన్నోసార్లు నాతో వెలిబుచ్చిన అభిప్రాయాలకు రూపకల్పన గావించిన మిమ్ము మనసారా అభినందిస్తున్నాను. మీరీసారి హైద్రాబాద్ వచ్చే ముందు నాకు వ్రాయాలి. మీరు నా ఇంటికి ఒకసారి రావాలి. 10-7-1971 భవదీయుడు శశాం

మానవీయం (1971)

Haritha, Madiraju Devulapalli, M.A. (Lit.) స్వేచ్ఛా కవిత్వంలో వెలువడిన కావ్యం "మానవీయం". మానవుని వికాసదశల కవితారూప సర్వేక్షణం. మనిషి ప్రాచీనదశనుండి ఆధునిక దశ వరకూ పొందిన స్థితిగతులు, చివరకు విశాల భావనతో విశ్వసంస్కృతిని పొందే వ్యక్తిత్వమూ స్థూలంగా

ఆవిష్కృతమైంది.

స్వేచ్ఛా కవిత్వంలో దీర్ఘమైన సామాజిక కావ్య నిర్వహణలో మానవీయం ఒక

ప్రయోగరూపం.

ప్రకృతి భూమికపై మనిషి జీవన స్థితిగతులకు సంబంధించిన పరిణామ రూపం చిత్రితమైన కృతి. మానవ జీవితంలో ఉదయ దర్శనంతో కావ్యం మొదలవుతుంది. ఉదయకిరణ స్పర్శతో జగత్తు ప్రకాశమానం కావడం, మనిషి ఉత్సాహశక్తిని పొందడం, కొత్త ఆలోచనతో ఉపక్రమించడం జరుగుతుంది. "ఉదయం వచ్చింది ఉదార చరితునివలె”, ఉదయం రాగానే “ఆరోహణ”తో, మనిషి పయనం సాగుతుంది. జీవితం ఉత్తేజాన్ని పొందుతుంది. ఉదయం తరువాత అస్తమయం, మళ్లీ ఉదయాస్తమయాలు, ఆశతో సక్రియ, ఆ తరువాత నిశ, విరామంతో కూడిన అనుభవ పరంపర కలిగింది. మనిషిలో అభౌతిక జగత్తు

అవతరించే

సూచనతో, దివ్యమైన అనుభూతిని పొందే ఆలోచనతో మానసిక జగత్తు రూపొందింది. దేవతల కల్పన జరిగింది, అతీతంపై దృష్టి ప్రసరించింది. జీవిక మొదలు మనిషి తన మనుగడకై, ఉనికికై, ప్రగతికై సంతోషం దుఃఖం సంపద దారిద్య్ర్యం విజయం అపజయం ద్వంద్వాలతో అధిగమించిన అనేక స్థితుల చిత్రణం కన్పిస్తుంది. తనకు కావలసిన ఆహారం ఆచ్ఛాదనం నివాసంకై ప్రకృతితోను, సమాజంతోనూ, వ్యతిరేక శక్తులతో పోరాటం

తప్పనిసరి

అయింది. ఈ ప్రయత్నంలో విజయంతో, భోగం విలాసం ఉల్లాసం వికాసంతో జీవితం పొందిన వివిధ దశలు సామాజిక స్పందనతో రూపొందాయి. బ్రతుకు వంతెనపై ప్రయాణ

సందర్భంలో అనుభవస్థితులూ, ఆలోచనా రూపాలూ కన్పిస్తాయి. ప్రకృతీ సమాజం చెరొక వైపు నుండి మనిషి జీవితాన్ని ఎట్లా ప్రభావితం చేసేదీ, అనుభవంలో వీటి ప్రమేయమూ వర్ణితమైంది. ఈ భాగంలో భౌతికం-మానసికం రెండూ ఒకదానితో మరొకటి విడదీయరాని బంధంతో ఏర్పడిన స్వరూపాన్నీ చూడవచ్చు. ఏ జీవితంలోనూ కేవలం భౌతికం కేవలం మానసికం ఉండదు. ఈ రెండిటి సమ్యాక్మేళనం కన్పిస్తుంది. జీవితంలో ప్రకృతీ సమాజంతో జీవితంపై ప్రకృతి ప్రభావం, సమాజం ప్రభావం వ్యక్తిపై భౌతిక మానసిక ప్రభావాలూ వాటి పర్యవసానమూ కవితాత్మకంగా దర్శనమిస్తాయి. రెండో భాగంలో, జీవితంలో అశాంతి ఒక వలయం తరువాత మరో వలయంగా ఎట్లా ఆవహించేదీ ప్రసక్తమైంది. ఈ అశాంతి ఎన్ని విధాలుగానో ఉంటుంది. దీన్ని అంతరింపజేసే ప్రయత్నాలనేకం జరిగాయి. ఇందులో వైయక్తికాలు సామాజికాలు

కన్పిస్తాయి.

మనిషిలో పోటీతత్త్యం, విజయకాంక్ష, దీనికోసం ఎత్తులు, వ్యూహాలు కొత్త మార్గాలు, అడ్డదారులు ఎన్నో! ఎవరి విజయలక్ష్యం వారిదే. సంఘర్షణ

అనివార్యమవుతుంది.

వైయక్తిక ప్రయోజనంతో ఒక విధం సామాజిక దృష్టితో మరో విధం రెండూ పాయలుగా మనిషిలో సరిస్తూంటాయి. ఈ ప్రయాణం ఏ రోజు కారోజు కొత్త అధ్యాయంతో మొదలవుతుంది. ఈ ఉదయాలనంతాలు, ఈ ప్రయాణంలో ఎదురయ్యే మజిలీలెన్నో అజ్ఞానారణ్యాల నుండి విజ్ఞాన శిఖరాల దాకా, అన్నీ దాటుతూ పోవలసిందే, ఎప్పటికపుడు కొత్త శక్తితో కొత్త సృజన దర్శనంతో సాగుతుంది. మానవీయం, సామాజిక కావ్యం మానవుని వైయక్తిక సామాజిక జీవన దిశల్ని బింబిస్తూ మానవీయ భావ ప్రధానమైంది. మనిషి లేకపోతే ప్రపంచమంతా ఏముంది? మనిషితోనే అన్నీ అన్వర్థమవుతున్నాయి. ప్రాణికోటిలో అత్యుత్తమమైన మనిషి తన బుద్ధిబలంచేత ఉన్నతమైన విలువల జీవితాన్నీ,

వికాసవంతమైన

నాగరక సమాజాన్నీ నిర్మించుకోవడం జరుగుతుంది. వ్యక్తి కోరే వెలుగు సమాజానిదే. ఏ ఒకరూ దీన్ని స్వంతం చేసుకోలేరు. మనిషి శక్తికీ యుక్తికీ నిదర్శనం. అయితే, ఈ యుక్తీ సృజన శక్తితో స్వర్గాన్ని నిర్మిస్తాయి. మారణాస్త్రాలతో విధ్వంసాన్ని కలిగిస్తాయి. మానవత ఉన్నంత వరకే అన్నీ అదుపులో ఉంటాయి, సత్ఫలితాల్ని ఇస్తాయి. మనిషీ, మానవత-మానవ చేతన, సమాజ వికాసం-మనోరూపం, పురోగమనం - అన్న అంశాలు కీలకస్థానాలు కలిగిందీ, మానవీయం. రచనలో ఆరంభంలో ఉదయరూపం సృజనాత్మకమైన మానవశక్తికి ప్రతీకగా ఉంది. మానవశక్తిలోని చెడు పార్శ్వం చీకటిగా కన్పిస్తుంది. మేల్కొన్న మనస్సుతో మనిషి చలనమే ప్రయాణం. ఈ ప్రయాణంలో అంధకారం, అహంకారం అశాంతి ఆవహించినపుడు, మనిషిలో వెలుగు దివ్యభావనగా మారి ఎట్లా వెలుగు దారిచూసేదీ, ప్రసక్తమైంది.

దేవతలుగా

మలచబడిన దివ్య భావన, మానవ ప్రస్థానంలో నిర్వహించిన పాత్ర ఏ దేశంలోనైనా విస్మరించరానిది. ఒంటరితనం నుండి జంటగా, ఆ పైన గుంపు సమాజం ఏర్పాటూ, క్రమంగా బుద్ధి వికసించీ, విజ్ఞానం పెరిగి హృదయం స్పందించే కళారూపాలవతరించీ, మానవ జీవితం సంస్కారాన్ని పొందింది. నాగరక దశకు చేరుకుంది. అయినా సమాజంలో పేదరికం అజ్ఞానం అశాంతి మిగిలే ఉంది. ఇందులో మనిషి స్వార్థమూ లేకపోలేదు. “మానవ ప్రగతిపథంలో వెలుగుపూడ్చలేని లోయలు" మిగిలే ఉన్నాయి. ఇవి చీకటితో నిండి ఉండడం విశేషం. ఇవి వైయక్తికాలు, సామాజికాలుగా దృష్టికి అందుతాయి. మరో ఉదయంపై ఆశతో మనిషి పురోగమనం సాగుతూనే ఉంటుంది. ఇదో నాటితో అంతమయ్యేది కాదు. ఒక తరం తరువాత మరో తరం వస్తుంది. ఒక యుగం పోయి మరో యుగం అడుగు పెడుతుంది. మనుషులు సమాజంలో వర్తిస్తూ పోతూంటారు. విలువలు మాత్రం అవే, లక్ష్యం అదే! వ్యక్తి వికాసమూక సామాజిక శ్రేయస్సూ! సంబంధాలు, సాధనాలు మారవచ్చు, మారతాయి కూడా. “మానవ రూపాన్ని తీర్చిదిద్దే మనోరూపం ఒకటే”నన్న భావ సూత్రం ఆవిష్కృతమయింది. సమాజంలో తిండికీ బట్టకూ కరువులేని స్వేచ్ఛతో కూడిన వ్యవస్థకై, భౌతిక పరివర్తనంతోపాటు మానసిక వికాసమూ భావితమైంది. దీనికి వివిధ మానవ శక్తుల

సంచరణం

వాటి సరియైన వినియోగం అవసరమవుతుంది. సంపూర్ణ ప్రగతికి వైజ్ఞానిక భూమికతోపాటు మానవతా స్పందనమూ అవసరమన్న సూచన ఉంది. చరిత్రలో జరిగిపోయినదానికి చింతించడంపై దృష్టి కన్నా సమాలోచనం జరిపి మంచి భవిష్యత్తుకై వివేకవంతమైన

నిర్ణయాలు

తీసుకోవడం అవసరం. "జీవితం మొదలు చివర బిందువుల్ని లోకంతో కలిపే మహాశక్తి మానవీయం”. మనిషి పుట్టింది మొదలు మరణం దాకా మానవీయం అస్తిత్వాన్ని ప్రసాదిస్తుంది. చరిత్రలో నాగరకత సంస్కృతి రూపాలతో మానవీయం అమృతత్వాన్ని కలిగిస్తుంది. ఇది ఒక దశతో ఒక యుగంతో ఆగదు; అవిచ్ఛిన్నమైంది. తరం నుండి తరానికి చేరుతుంది. మనిషి నుండి మనిషికి సంక్రమిస్తుంది. స్థానికమైన వ్యవహార దశల నుండి, విశ్వ సంస్కృతి దాకా పరివ్యాప్తమైన వ్యక్తిత్వంతో మనిషి ఎప్పటికప్పుడు సరికొత్త ప్రయాణం చేపట్టేను. ఈ పురోగమనంలో మనిషి వ్యక్తిత్వం, “పదపదంలో కొత్త శక్తినీ, ఎదఎదలో కొత్త సృష్టినీ” ఆవిష్కరిస్తుంది. మానవీయంలో వస్తువు, మానవ వికాసరూపం. జీవితంలో సామాజిక, రాజకీయ, వైజ్ఞానిక, మానసిక, తాత్విక అనుభవాలతో ఆకృతి పొందింది. ఒకే మనిషి రూపం

జీవితంలో

భిన్న భిన్న పాత్రల్లో ప్రత్యక్షమవుతుంది. మనుగడలో దేని ప్రయోజనం దానిదే, దేని లక్ష్యం దానిదే. మానవతా సూత్రమొకటే వీటిని ఒకచోట బంధిస్తుంది. భౌతిక, మానసిక తీరాల్ని

స్పృశిస్తూ సాగే సమాజం, నిరంతరమైంది, అవిచ్ఛిన్నమైందీ. మనిషిచేత మనిషికై మనిషితో రూపొందిందీ. దీనికి మూలతలం మానవీయం, అన్న తాత్విక భావన ఈ కావ్యానికి కేంద్రబిందువు. ఈ దృష్టితో దీన్ని సమాలోచనం చేయవలసి ఉంది. స్వేచ్ఛా కవిత్వంలో కదులుతూన్న సాధారణ ప్రవాహం నుండి భిన్నమైంది, స్వతంత్రమైందీ “మానవీయం”. మానవ జీవన పథంలో స్థూలంగా భౌతిక, మానసిక, సామాజిక, రాజకీయ, తాత్విక,

వైజ్ఞానిక

స్థితుల్ని ప్రతిబింబించేది. స్వేచ్ఛా కవిత్వంలో తొలి సామాజిక మానవ వికాస కావ్యం. Detroit, Michigan, U.S.A. 20-6-2001 హరిత

I. మానవీయం

I. 1. ఉదయధుని ఉదయ తరణి కెదురుగా నిలిచిన నాలో కొండ కొమ్ము మీది నుండి రసధుని పరుగెత్తినట్లు ఇసుక తలంపై ప్రవాహం తళతళ లాడినట్లు వెలుగు పొంగు ఎపుడు వచ్చి ముంచెత్తిందో? వెలుగులతో రోదసి మనోజ్ఞ రూపం దాల్చి జడమయమైన ఆశలకు ప్రాణం వచ్చింది బహు వర్ణ సుమ పరాగం విరజిమ్మిన రీతి అనిదం పూర్వ విభూతితో క్షితిజం జీవితరూపమైంది ఇంద్ర చాపం వలె పరచుకొంది మనస్సు తెరచుకొన్న ప్రాగ్దిశా స్వర్ణ కవాట కల ధ్వనికి విప్పారింది మానసం మంటి నుండి మింటి కెగసి నిల్చిన సప్త వర్ణ నిశ్రేణిక వలె తోచింది జీవితం ఉదయం వచ్చింది ఉదార చరితుని వలె అమృత లిప్త వెలిగింది ఆత్మప్రకాశం వలె దినమణి దీప కాంతితో హర్ష ధారా వీక్షణాలతో ఆకాశం భూమీ కౌగిలించుకున్న క్షణం సన్నని వెలుగు దారాలతో దిశ నుండి దిశకు అల్లిన సాలీడు పటం వలె ఉంది ప్రపంచం మబ్బులో మెరుపు వలె ఊహల కదలికతో

మనస్సులో పూర్వపు చీకటి స్మృతులు రాగ కర స్పర్శతో నిద్ర నుండి మేల్కొల్పి భూమికీ ఆకాశానికీ బంధం కూర్చేను సూర్యుడు ప్రత్యణువునూ పులకింపజేసే వెలుగు వాకలు గుంపులు గుంపులుగా విసరిన పూల దండలు- పైన గగన పదం వీడి బ్రతుకలేని మబ్బులు క్రింద పాదాలు పట్టుకొనీ వదలని క్రీనీడలు దూరంలో ఆకాశం మృత్యు ముఖం వలె ఉంది. దగ్గరలో క్షితిజం రాగంతో ఆకర్షిస్తూంది బారులుగా విచ్చిన వెలుగులు ప్రసార ఝరులు చాచిన దేవతా హస్తాల వలె ఉన్నాయి నిర్మలాంతఃకరణంలో సాగే ఊహల వలె స్వర కల్పనలో సరించే మాధు ఝరి వలె కళా వర్ణ సౌందర్యం చిమ్మే చిత్రం వలె కదిలి పోయేను మోహాపాదక కాంతులు మనస్ సముద్రోర్మికలపై తేలిపోయే ఆనంద కళకలు రివ్వున దూసికొనీ వస్తూ నడవలేని చెట్ల బుజాల పై చేయేసి కదలిస్తూ కదలిపోయేను వాయువులు దివ్యానుభూతినిస్తూ చూపు మేర ఆకాశం క్షణ క్షణం పొందుతూంది వివిధ వర్ణ సామరస్యం తీవ్రమైన ఆకర్షణకు లొంగి భూమి సంతోష చకితమైంది మేల్కొనీ మేల్కొనని దశలో సృష్టి కలల వరస వలె ఉంది కాంతి వర్షంలో తడిసి శరీరం స్వర్ణమయమైంది మధునదంతో నిండి హృదయం సమార్ధమైంది వెలుగులు వెల్లి విరిసి ముఖం పూల బంతి అయింది ఆనందంతో చిందులు త్రొక్కే శిశువుల వలె ఆకాశంలో యధేచ్ఛగా విహరించే మబ్బుల వలె రసానుభూతి పరవశింపజేసేను ఆలోచనలు చూస్తూ చూస్తూ ఉండగనే క్షణాలపై కాల శ్మశానంతో దగ్ధమైపోతున్నాయి లిప్తలు గగన మార్గాన ప్రయాణం చేసి అలసిన సూర్యుడు పశ్చిమ దిగ్వేదికపై విశ్రమించాడో లేదో అనంతమైన వెలుగులు సాంతమైపోయాయి ప్రపంచమొక పరిధిలో బంధితమైంది

రెప్పల అంచులపై నిదుర బరువుగా వాలిపోతూంది విశ్వంలో ప్రణవం వలె నిశీధి చంద్రికవలె నిదురలో స్వప్నం వలె పురుషు నంటుకొని అగాధమైన మనస్సు లోపొరల్లో నుండి ఊహల ఔల్బణ్యం అధికాధికమైంది గభీరమైన తమస్సు లో పొరల్లో నుండి వెలుగుల ఆగమనం అత్యావశ్యకమైంది నిదుర పట్టడంతో కాటికి కాళ్లు చాచి రెక్క విరిగి కుప్పగా కూలిన రాత్రి చిట్టచివరి ఊపిరి కాస్తా వదలింది నిదుర వదలడంతో ప్రత్యక్షం మరో ఉదయం అరె! ఎంతలో వచ్చింది ఆహ్లాదకరమైన ఉదయం మానవ లోకానికి శుభోదర్కమైన సమయం సనాతన కాంతి చిమ్మే నా కళ్లముందు స్వర్ణ వలయ సమాక్రాంత తేజశ్చక్రం

I. 2. ఉదయం తరువాత తూరుపుటద్దంలో సూర్యుని ముఖం కన్పించేసరికి భయంతో నివాస స్థలాలు విడిచి చీకట్లు దూరాకాశ తీరభూములు చేరాయి. రువ్విన రాళ్లవలె రివ్వున ఎప్పటికపుడు మనస్సు నాక్రమించేందుకు తిరిగే మృత భావనా మూర్తులు వెలుగులారి కొడిగట్టిన వత్తులు చీకట్ల సమావేశంలో ఏకగ్రీవంగా ప్రకటించిన నిరసన పత్రం తుహిన యవనికా రూపంలో ప్రత్యక్షం చదవడానికి యత్నిస్తున్నాయి చెట్లు చెరిపేందుకు ఉత్సహిస్తున్నాయి వెలుగులు రవి దీపం వెనక నీడలంటి తిరిగేరు రాత్రించరులు దీపం వెలుగులో తామై వెలిగేరు దివౌకులు- ఒకమారు చీకటిలా మందంగా, ఒకమారు వెలుగులా చురుగ్గా కదలీ కదలని మేఘంలా జారిపోయేను కాలం విడిచే ఊర్పుల్లో సాగిపోయేను జీవితం

ఆకాశం డొక్కలో పర్వతం వలె నిద్రించే చీకటిని మాపేందుకు సూర్యచంద్రుల ప్రభా ప్రసారం వీరి పాలనలో ఒదిగిపోతుందీ మహాజగత్తు

I. I. 3. అభౌతిక రేఖలతో జన్మించిన వేళ నుండి ముఖంలో బింబిస్తూ ప్రతిక్షణం సమయంకై వేచి ఉంటుంది భవిష్యత్తు వదలిన ఊరుపుతో మేల్కొన్న మనస్సుతో వర్తమానం అంతమొంది అవుతుంది గతం ఆకాశం మేల్కోగానే ఎటుచూచినా ప్రాణి చలనం నిదురకూ జడానికీ అనుబంధం మెలకువకూ చలనానికీ స్నేహం అందం విరిసి గంధం చిమ్మే విచ్చిన సుమదళ పంక్తులు ప్రాణం పల్లవించి రాగం రవళించే జీవన దశలు ఝంకృతి తిరిగే తుమ్మెదలతో శోభారుణ పద్మం వలె మనుషుల కదలికతో నిండారింది ప్రపంచం. సూర్యుని ఆశీః ప్రసారంతో కిర్మీరీకృత భూమిపై ఒక వలయం అతిక్రమించి పోయే లోపల వేరొక వలయంచే పరీవృతమౌతాయి పాదాలు. దుఃఖత్రయంతో ఎపుడో బంధింపబడింది జీవితం. రెండు చెక్కలుగా వ్రయ్యలైన కాలం రూపాలు ఒకదాని ముఖం చూచి మరొకటి ప్రక్కకు తప్పుకొని పోయేను దివానిశలై, సుఖదుఃఖాలకు ప్రతీకలై. నిదుర జారిపోయి మెలకువ కలిగే లోపల కళ్ళుమూసి తెరచే లోపల మాట పెకలి వచ్చే లోపల ఊహలు నిర్గమించి వాక్చిత్రం పొందే లోపల ఉషస్సు తూరుపు దేహళి దాటి అడుగు వేసే లోపల పాదరసం గుళికల వలె జారిపోయేను లిప్తాంశలు అడుగు వేయడంతో లిప్త వరించకముందే ఆశా శబలితమై జీవితం ఆకర్షిస్తుంది. అడుగు తీయడంలో లిప్త గతించగనే నిరాశామయమై మృత్యువు కమ్మేస్తుంది. శోక మోహ భయ కోపాలకు లొంగిపోయే అశాంతి రూపాల్ని హరించే ఉదయాలు ప్రాణి కోటి కాహ్లాదమయాలు

శిశువు వలె ప్రత్యక్షమై వృద్ధువలె నిష్క్రమించేను సూర్యుడు ప్రతి ఉదయం అవతరించే నిత్య నవ్య మనోజ్ఞ మూర్తి మొదలూ తుదీ నాశనమెరగని మహాకాంతి పుంజం నుండి అవతరించిన భాగంవలె ప్రపంచం. అందులో అగ్నిశిఖలవలె చరించేరు మానవులు. ఉదయ దిశా స్వర్ణ కాంతి దేహళిపై దృష్టి నిలిపి రాగ నిభృత వర్ణమహిత మనస్సుతో సుందరరూపంలో శుభగుణకామనలో సమయ సమయం పరికల్పిత రూపాలే దేవతలు. ఎన్ని ఏండ్ల గ్రహణం నుండో విడిపించి నభోమణిని మరుద్గణంతో దుస్థితి పారద్రోలి సుస్థితి కల్పించే వజ్ర శతక్రతువు శచీపతి ఇంద్రుడు. హిరణ్యవర్ణుడు నిత్య పవిత్ర మూర్తి దేవతలకూ మానవులకూ దగ్గరి బంధువు ప్రతి ఉదయం అవతరించే కవిక్రతువు, అగ్ని మూర్తి సవితృ బింబ నేత్రంతో సకల సృష్టి పర్యాలోకన చేస్తూ హస్త విధృత పాశాలతో సువర్ణ పక్షాలతో క్షమామూర్తి ధృతవ్రతుడు వరుణుడు సర్గ స్థితి లయలకు హేతువులై నిల్చిన త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు శివులు, దివ్య మనో రూపాలు అహంకారం అంధకారం అశాంతి అలముకొన్న హృదయావరణంలో దివ్యమైన అనుభూతి బిందువులై, దేవతలు ప్రేమతో కరుణతో వెలిగే జ్యోతిః ప్రతీకలు.-

I. 4. జీవిక మొదలు రోజూ వస్తాడు సూర్యుడు శ్యేనం వలె ఎగురుతూ కాంతి కేతన చాలనంతో ఆశలు కళ్ళు తెరుస్తాయి. పూవు రాలుతుంది మొగ్గ పొటమరిస్తుంది ఒకదానిలో విషాదం మరో దానిలో ఆనందం. పూలతో పరిమళిస్తుంది సమయం పండ్లతో పరిణమిస్తుంది కాలం రోజురోజు వికాసమందే జీవితంతో ఘటనల్లో పొందే చరిత్ర రాత్రీ పగలూ నిరంతరం ప్రయాణించేను మనిషి. బ్రతుకొక అగ్నిగోళమై ఎవరి దారిన వారు

శాంతికై కాలు సాగే మార్గాన పయనించేరు, ఒంటరితనం సహించలేక జంటలుగా కదలి గుదులుగా తరలి వివిధ స్థలాల్లో బహువిధ జీవితాలతో హృదయం స్పందించే అనుభవంతో బ్రతికేరు బుద్ధి వికసించే విజ్ఞానంతో సంచరించేరు సన్నివేశాన్నిబట్టి నటనతో కాలవేగ చలనంలో సుడిగాలివలె పరిభ్రమించి అదృష్ట సీమలు అతిక్రమించి అపాయచిహ్నాలు గుర్తించి, అసాధ్య సముద్రాలు ఉత్తరించి మర్మమెరుగని దిశవలె నున్న బ్రతుకులో పరివర్తనం! గాఢమైన అనుభవ పారంపరిచే హృదయం విశాలతరమై తీక్షణమైన భావనాబలంతో బుద్ధినైశిత్యం పెరిగి అథమ స్థితి నుండీ పరమస్థితివరకూ బహు వృత్తులతో ప్రవృత్తులతో జన సందోహం! ఒకప్పుడు మృగం వలెనో పక్షివలెనో మరొకపుడు పామువలెనో పురుగువలెనో బహుగుణ రూపాల్లో దాగిన మనోరూపాలతో పెరిగి తరిగి ఒదిగి మరిగి నశిస్తూ పోయేరు మనిషిని హతమార్చి క్రోధాగ్ని తనుపుకోనీ మనిషిని భక్షించి క్షుధాగ్ని చల్లార్చుకోనీ మనిషిని రక్షించి మానవత్వం నిలుపుకోనీ మనిషిని క్షమించి దైవత్వం పొందేను మనిషి. ఒక భయ ధ్వని కనుకోకుండా ఎగిరి అవిజ్ఞేయంగా ఎక్కడో వాలిపోయే పక్షులవలె ఎక్కడో దూర దూరం విసరబడీ కుప్పకూలి చివర కసువులు కోల్పోయేరు చరిత్రలో స్థానంలేని మనుషులూ ఉన్నారు పయనంలో లక్ష్యం ఎరగని ప్రయాణికులూ ఉన్నారు. ఎంతమందిని అణచి చావు పాలు చేసీ ఎంతవరకు జయం సాధించిందీ ప్రధానమైంది. ఎంతమందికి ప్రాణం పోసి రక్షించి ఏ దుస్థితి నుండి సుస్థితికి తెచ్చిందీ గౌణమైంది. ఈనాడు నిశ్చితంగా ఉన్నవీ విజ్ఞాతంగా ఉన్నవీ రేపటి కనిశ్చితంగా మారేను ఆశ్చర్యంగా జరిగేను ఈ విషమ ఘటనల్లో చిక్కుకొనీ అనుకోకుండా

అసువులు కోల్పోయే త్యాగమూర్తులూ! సముద్రంపై పయనించే నావపై గాలికి రెపరెపలాడే తెరచాపవలె జీవితంలో అలజడి కలిగించే ఆశతో మెరుపు కత్తి వంటి బుద్దికి భాసించే నిశా గుహా ప్రాంగణాన మృత్యువు సామీప్యంలో ధూమావృత శిఖల వలె స్వస్థితి తెలీని మానవులూ. అమాయక శైశవం నుండి పరిహరించరాని మృత్యువు వరకూ పొరపాటు అలవాటై మరచిపో శక్యం కాని మానసిక బానిసత్వం దర్పంగా భావిస్తూ చావుకు సైతం వెనుదీయని సమూహంతో జీవితమొక వ్యాపార సరణి గడిపే గణమూ ఉంది.- అధికార పిపాస పెరిగి కీర్తి కాంక్ష ప్రబలి అంతరించి ఒక రాజవంశం మరొకటి ఆవిష్కృతమౌతుంది. అణచబడిన జాతి మతం స్థానంలో మరొక జాతి మతం అభ్యుదితమౌతుంది. అవనీతలం ఆక్రమించి ఆకాశం హద్దుపై దృష్టితో ఆచంద్రార్కం యశో బింబాలుగా నిల్చే యత్నాలెన్నో ప్రక్కనే పతితమైన శీర్ణ కేతన పరాభవం. అపుడే ఉదితమైన విజయ కేతన ప్రచాలనం. రాజనీతి ప్రతారణతో జీవితాన్ని ఎత్తి చూపే వెలుగు మెట్లు కొన్ని, చీకటి మెట్లు కొన్ని చరిత్రలో మనోంతరాళంలో అణగిన జంతు తత్త్వం భిన్న రూపాల్లో ప్రకటితమౌతుంది జీవితంలో. ఇదమిత్థంగా నిర్ణయించే వీల్లేని విపరీత మతి రాక్షస జీవితంలో మృత్యువు సామీప్యంలో హృదంతరంలో మూర్తి కడుతుంది దేవతా భావం ఇదమిత్థంగా నిర్ణయించే శక్తిలేని మనస్సులో దేవతా భావం మోసులెత్తకుండా ఎప్పటికప్పుడు అణగద్రొక్కుతుంది రాక్షసత్వం. మనిషికి మొట్టమొదట కావలసింది ఉనికీ, కొన్ని అడుగుల మేర నేల ఆహారం అధికారం సంపద ననుసరించి వీటి సంపాదనకై రక్షణకై ఉపాయాలు

వీటికై తలెత్తే ఆలోచనా పద్ధతిలో తాల్చిన ఆకారాలు, ఈ కోటలు సామ్రాజ్యాలు ! దాహం క్షుధ విషయ వాంఛతో పాటు అలౌకికానందం అవసరమూ ఏర్పడింది. పుణ్య పాప భావనతో స్వర్గ నరక నికేతనాలూ

I. I. 5. అస్తిత్వంకై ఆవరించిన భయచ్ఛాయలు అజ్ఞాన నిలయాలుగా తోచాయి ఆచ్ఛాదన జ్ఞానం కళాన్వితమైంది బంధుభావం వీడని సూత్ర బంధమైంది భౌతిక మానస శక్తుల భేదం గుర్తింపబడింది అమృత కళకు ప్రతినిధిగా సౌందర్యశక్తికి ప్రతీకగా ఉషస్సులో దివ్యమైన స్త్రీరూపం దర్శితమైంది. జీవితాన ఆనందం అన్వేషణ మొదలై సంగీతం సాహిత్యం చిత్రం శిల్పం కళలన్నీ సంస్కృతీ శిఖరాల్ని సృజించే ప్రతిభారూపాలయ్యాయి అధికార మర్యాదలతో సవ్యాజ మనోరీతులతో లౌకిక గతి వ్యూహాల్లో పావులుగా మారాయి. మానసికంగా తీరని దాహం క్షుధ ప్రబలింది. ఎన్ని మజిలీలు దాటినా సమాజ జీవితం ఏ విజ్ఞాన సంస్కార శిఖరం పైనా స్థిరపడలేదు ఎప్పటికప్పుడు చ్యుతమై కీర్ణమై నిరంతరం వినష్టమై పునః పునః యాతనలో మ్రగ్గేను. విమోచనకో, విజయానికో జరిగే సంఘర్షణలో కొత్త శక్తి సమీకరించి సిద్ధం అయ్యేను మనిషి ఆత్మ నిత్యత్వం భావించిన నాటి నుండి మనిషికి ప్రపంచానికీ గల సంబంధంపై గగనం నుండి జారిన బంగరు గొలుసులవలె ఎడతెగని ప్రశ్నలు! ఆలోచనా తరంగాలు ఏదో మత నియమం లేని మనిషి లేడు ఏదో బిందువు నుండి మొదలుకాని రేఖ లేదు. ఏ వలయాకృతిలోనూ మేర లేని ఊహ లేదు మనిషి పొందే పరిణతిలో వైవిధ్యం వైశిష్ట్యం ఎంతైనా ఉంది.

ఒకవైపు పరంపరగా తరలి వస్తుంది శైశవ యౌవన కాంతి దశలతో తరం మరో వైపు వరసగా నిరంతరం మట్టిలో కలుస్తుంది తరం వెంట తరం. చిగుళ్ళ ఆకులూ పూలు పండ్ల కలలు బీజంలో నిహితమైనట్లు జీవితం సుఖ దుఃఖాలతో భోగ త్యాగాలతో ఆత్మగత వాసనామయమై విస్తరిస్తుంది. గ్రీష్మ తాపానికీ వర్షా సేచనకూ చలి కోతకూ నిలబడిన జీవితం అనుభవ ప్రభావంతో చేవ దేరుతుంది కదలే చక్ర నేమి క్రమాన్ని తలపిస్తుంది.

I. 6. అస్తిత్వ రేఖలు వర్తమానంలో అనుభవంతో, భవిష్యత్తుపై ఆలోచనతో విషయ వాంఛా లతలతో అల్లుకున్న మేధతో కలతపెట్టే ఊహల సంచారాన్నీ భౌతిక మనో బంధనల్ని పద్ధతిలో తీర్చే నీతిపై విశ్వాసం అలవడింది. వెరగొందిన మృదు భావుక మనస్సులో మేఘం నుండి మెరుపుతో పిడుగులా తోచి చెరగే నిప్పులతో బ్రతుకంతా ఆక్రమించి హృదయ విదారకమై జ్వలించింది నరకం. తనువొక వరణీయ దేవతా ప్రసాదమైంది దివ్వెనుండి దివ్వెతో ప్రజ అయింది దైవంపై భారంతో గడచే బ్రతుకులు ప్రేయస్స్వరంతో దివ్య రూప మూహించేను. క్రౌర్యంతో వర్తించే బ్రతుకులు కఠోర రావంతో ఘోర రూప మూహించేను తల్లి పిలుపులో తండ్రి పలుకులో శిశువు నవ్వులో ప్రియుల చెలువులో భక్తి భావనలో శాంత హృదయంలో స్పందించింది స్వాదు తర సంగీతం

I. 7. కాలదర్పణంలో కొండ ప్రవాహంలో రోదసిలో ఊరుపులో ఊహలో ప్రకృతిలో నిరంతరం సాగే నాదలహరి వలె గుత్తులు గుత్తులుగా తరలి కిల కిల నవ్వులు విసరి విసరి ఒడ్డున ఒరిగి చప్పట్లు కొట్టి తరలే అంతరాఘార్ణమాన జలధి తరంగాల వలె మనఃకుహరంలో లయాత్మక భావనలు. ఎప్పటికప్పుడు అడ్డుగోడలతిక్రమించి మునుముందుకు సాగిపోయే మానవుడు ప్రగాఢ సాహస మతి నిలిచి పోడు ఒకేచోట ఎంతదూరం వెళ్ళినా ఎంత కాలం గడచినా పైకి ఆ పైకి వెళ్ళాలనే మానవుని కోరిక ఆదర్శ లోకాలతో పరిచయం ఆవాసం కోసం ఆరాటం ఆందోళన! తీరని అజ్ఞాత తృష్ణ తీవ్ర వేగ మృదు ప్రచార దీపులతో మనిషి జాతి సమాజం బ్రతుకంతా నిప్పులు చెరగి మండించింది కాలం పచ్చని పైరూ పండించింది కాలం. ఎన్ని సహస్ర సమలు గతించినా మృత్యువెరుగని ఉదయ దీప్తి వలె మమత చావని హృదయ రుచితో పతనం నుండీ పునరభ్యుదయంతో దివ్య దశను చేరుకునే యత్నంపై ప్రయత్నం! ఏనాడూ విరమించదు మానవ జాతి ! దుఃఖత్రయరేఖలతో మొదలై యుగాలుగా సాగే సంస్కృతి ప్రతినిధి మనిషి సుఖ దుఃఖాత్మక జీవిత సర్వస్వం బింబించే దర్పణం కాలం.- జీవితం మొదలు చివర శక్తి రేఖల్ని లోకంతో కలిపే దివ్య రేఖ దైవం ఆశ్చర్యానందంతో వెలుగు లోతులు స్పృశిస్తూ అలౌకికంగా సాగే జిజ్ఞాసా ఫలితం వేదాంతం జీవితం మొదలు చివర రక్తి బిందువుల్ని లోకంతో కలిపే మహాశక్తి మానవీయం.

I. 8. బ్రతుకు వంతెన పై నుండి మనో నేత్రం దర్శించే మహాప్రపంచాన్ని బింబించే కాల దర్పణం ముందు నేను దివా కాంతి చేలంతో నిశా నీల నిచోళనంతో చాంద్రీ మృదూత్తరీయంతో ప్రకృతి, ఎటు ప్రసరించినా దృష్టినాకర్షించే మతి భ్రమించే శక్తి రూపం. క్రింద మృత్తిక చుట్టూ వస్తు సమితి దివా నిశలు పరిభ్రమించే గ్రహ కూటమి - పైన దయా విహీనమన్నట్లు వన్నె మాసిన రాత్రి ఒకవైపు, దయా ప్రసారమన్నట్లు వెన్నె కెక్కిన ఉదయం, మరో వైపు జీవితమొక చివర తెలీని చీకటి వంతెన సంఖ్య తెలీని అనుభవాల వెలుగు మెట్లపై అడుగడుగున పునర్జన్మ ఎత్తినట్లుంటుంది. అడుగడుగున స్వర్గ శకల మందినట్లుంటుంది. చలనంలో చీకటి ముద్దలు కొందరు గమనంలో దీప శిఖలు మరికొందరు. వంతెనపై నడిచే మనిషిని వెనక్కు ఈడ్చే ఎవరెవరివో యత్నాలు సముద్రంలో అలలపై నౌక వలె ముందుకు సాగేందు కెవరివో హస్త వితతి ! వంతెనపై నుండి క్రిందికి చూచీ కళా భావనతో స్పందించే సరసులు అంధులవలె కళ్ళు మూసుకునే విభీతులు మైమరచి ప్రాణాలర్పించే విముగ్ధులూ దారిలో ఎందరో తటస్థపడతారు పరిచయాలతో ఒకరిలో ఒకరౌతారు. వంతెన కివతల మరి అవతల ఏముందో ఇదమిత్థమని ఎవరికీ తెలీదు. యుగాల నుండి పరంపరగా వచ్చే ఊహా ప్రావారాలూ, అనుమాన ప్రాకారాలూ తప్ప ! ముందుకు వేసిన అడుగు వెనక్కు తీయడ మసాధ్యం అడుగు ముందుకు పడకుండా అక్కడే నిల్వడ మసంభవం

ఎప్పటికపుడు భయంతో విచలితమై మనస్సు భవిష్య క్షణాల్ని కౌగిటపూనే ప్రయత్నం చేస్తూంది. ఈ వంతెనపై అంకితమైన పాదముద్రలు చరిత్రలో మిగిలే స్మృతులు, కాలాని కాభరణాలూ ప్రయాణ చిహ్నాలు, సమాజ సంపదలో భాగాలూ. వంతెన కిరుప్రక్కల అసంఖ్యాక యశః పతకాలు జాతి మత రాజకీయ విద్యా కళా రూపాలు నక్షత్రాలవలె అక్కడక్కడా నీతివ్రతులు త్యాగశీలురూ ఇహ పర లోకాల సంగ్రహ రూపాలూ వెలుతురు పిల్లల దూకుడుకు మేల్కొంటుంది ఊహకు తప్ప మూర్తి కట్టని వృద్ధ రోదసి. చుట్టూ యువశక్తితో కదలే వెలుగులు వేలాడే కాల సూత్రానికి గుచ్చిన పుష్పాలు.- దూర ధరణీ కాంతార సీమల నుండి

I. 9. ఆరాటం - అన్వేషణ ఏదో తీరని పెద్ద పనిలో మునిగి ఉన్నట్లు పరుగెత్తేను నదులు, మహాభుజగాల వలె చుట్టూ పూల గుత్తులతో నీల గగన మహా వృక్షం. నీల వలాహకం ప్రతిఫలించే కన్నులతో చెలగే పయః పారావార రసాకృతులు. ముగ్ద సరోవరంపై నతాకాశం వంపులు తొలి మలి సంజల్లో గాలుల చల్లని పలరింతలు మదిలో సుళ్ళు తిరిగే అమృతోహల పులకరింతల్లో తూగే పూల సవ్వడులు ! హిమాంశువులు హత్తుకోని ఎదపై కాలం ఒడిలో రెక్కవిప్పిన గులాబీలు వాటి చుట్టూ కొస దేరిన కంటకాలు జీవితం నుండి విడదీయలేని సమస్యల వలె. ఆకాశంలో నక్షత్ర హాసాన్నీ, శ్మశానంలో నిప్పు రవ్వల్నీ సమంగా ప్రకాశింపజేసే ఈ రాత్రి కొంగుచాటున కన్పించని దిగ్వలయంతో చీకటి కుచ్చెళ్ళలో దాగిన పృథ్వితో

ఒక నీల మహా శక్తిని తలపిస్తోంది. జగత్తు నావహింప గోరే ఆశల మొలకల వలె దిక్కుల అంచుల్లో సన్నని వెలుగు నర్తిస్తూంది ఆశా పతాక శిశువు చెక్కిళ్ళపై కన్నీటి చారల్ని ముద్దులతో తుడిచేసే మాతృమూర్తివలె తమ్మిరేకులపై మంచు సోనల్ని తుడిచేస్తూంది ఉదయం. గోధుమ వన్నె త్రాచు వలె దిక్కుల్లోకి ప్రాకీ ప్రచండాంశుస్ఫార మూర్తియై అంతలో మింటి నుండి మంటికి వ్యాపించే గ్రీష్మం కణకణలాడే నిప్పుకల హసంతీ హల్లీసకం ! అనల శరాసారం వలె ఎడమేమాత్రం లేకుండా హత్తుకొన్న సహస్ర కరోజ్వల దీపులు ! కుప్పలు కుప్పలుగా బూది చెరిగిపోసిన నిప్పులు సుడులు సుడులుగా తిరిగే పదునైన వడగాడ్పులూ ఒక చోటి నుండి మరో చోటికి ప్రయాణంలో జల బిందువు కోసం మానవుని తహతహ ! పెద్ద ఇసుక దిబ్బవలె పగలు మెరుస్తుంది నల్లని రాతిగుట్టవలె రాత్రి పడి ఉంటుంది. గాలిలో తేలే దూది పింజల వలె వెన్నెల దూరం నుండి ఘన కాసారం వలె ఆకాశం ! వర్తమానంపై క్రమ్ముకొన్న దట్టమైన అతృప్తి వెంట భవిష్యత్తు కొమ్మపై గూళ్ళు కట్టుకున్న కోర్కెల పక్షులు ! జలద శకలం విరిసి కన్పిస్తే చాలు జీవన మర్యాదతో ముఖ పంక్తులు కళా విలసితమౌతాయి శరీరం స్పృశిస్తూ శీతల వాయురేఖ కదిలితే ఒకడొకడూ పొందే ఆనందం ! బ్రహ్మ పదవి చేరిక, దాహాగ్ని కర్పితమైన వర్షధారతో నిల్చిన పృథ్విపై అక్కడక్కడా బుడగల వలె కన్పించేరు మనుషులు. ఎక్కడికక్కడే దూర దూరం వాలిపోయి చూపు మేరలో మాయమౌతుంది ఆకాశం అవిరామంగా అశాంతి గీతం వినిపిస్తూ ఎప్పటికపుడు దూర దూరం పరుగిడుతాయి గాలులు. నిల్చేందుకు సూది మొనంత చోటు సంపాదించి ఆపై విస్మృతికై పరితపించే బ్రతుకుల వలె

ప్రతి అంగుళం అంగుళం మేర నేలను మ్రింగేందుకు మాటి మాటికీ విజృంభిస్తుంది సముద్రం తరంగ వేగ సమాలోల మౌతుంది మనస్సు.- ఇసుక ఎడారి నాలుక చాచి దూరంలో సరస్సువలె కన్పించే చంద్రుని వైపు పరుగు తీస్తుంది. ఎంతకూ అందుకో జాలని భూమి. పర్వత శిలా పాదాల ముందు తిరుగుతూ పూల వరుస వలె కన్నీటి చుక్కలు చిమ్ముతూ పర్వత హృదయ కార్కశ్యానికి రోసీ రుసరుస లాడుతూ పరుగుడితాయి నదులు ! ఉన్మత్త ప్రలాపాలతో తిరిగే పవన గతికి తలలూపే వృక్షాలూ అవతరించే అనల రూపాలూ అశాంతిలో మై మరచి నగ్న సత్యం చేసే యుద్ధ మూర్తి దాహకమతి భీభత్స కథా రూపం. మానవ ప్రగతి పథంలో ప్రకృతి ననువదిస్తూ వెలుగు పూడ్చలేని లోయలూ ! లోయల్లో గుంపులుగా ప్రబ్బికొన్న నీలి మబ్బుల వలె అగ్ని గతికి భస్మమవని చీకట్లూ ఉన్నాయి ! స్పర్శగుణం ఎరగనీ చలన శక్తి లేనీ నీడలూ ఉన్నాయి. మనిషిలో అశాంతి కివి అంటు మొక్కలు! అనతి దూరంలో ఒడ్డున శిలపై నుండీ ఈ వికృత సమాజంలో వీధి వీధినా అశాంతి దుఃఖ నిరాసనా కాంక్షుల 'శాంతి' వాక్ అమృత ధారా సేచనం.

I. 10. మనో దర్పణంలో అడుగు తీస్తే నుయ్యో గొయ్యో తెలీదు కదలితే ప్రక్కన జంతువులో మృగాలో తెలీదు మనుషులో రాక్షసులో దెయ్యాలో తెలీదు సహస్ర జిహ్వలతో జ్వలదగ్నుల వలె ఆలోచనలు కర్ణ వీథి కెగబ్రాకే భిన్న ధ్వనుల వర్ణ రీతులు. బాల్యం నుండి యౌవనం యౌవనం నుండి వృద్ధాప్యం

ఆరోహణ అవరోహణ దశలు దశలుగా సాగుతుంది ప్రయాణం అవిరామంగా మౌఢ్య బలం వినిపించే దరీ వాయు ఘోషలతో యుగాలుగా వేరొక దశ ఎరగని కొండలపై మెరపులతో కన్నీరు కారుస్తాయి పయోద పంక్తులు ఎండకు తపించీ, చివర కొక నీటి చుక్కెనా నిలవ ఎరగని కొండ రాళ్ళు! అసంఖ్యాకాలు ! సమాజంలో పీడిత జన సమూహాలూ. తల్లి ఒడిలో కళ్ళు మూసి చేతులు చాచి తడుముతూ వెలుగు మాసిన వసి ముఖంతో వణికే చిరు పెదవులతో ఎండిన గొంతుకలతో ఆక్రందించే శిశువులవలె విసరే గాలికి నేలపై నిల్వ లేని గడ్డిపోచలు బండలపై బోదెలపై విరిసి కురిసి వర్షం సహనం కోల్పోతూంది తక్షణం ఉన్మనీ చరమ దశ నందుకునే ఝంఝా సంగీతంతో వాయూచ్చల దుగ్ర రావ ప్రకృతిలో పటుతర భీభత్స రచన. నదీ మహావర్తంలో చిక్కుకొని పల్లటిల్లేను నావలు తలకు మించిన వ్యూహంలో అసువులు కోల్పోయేను. గాలి రొద ప్రసారం చేసే వృక్ష వితతి దిగ్భిత్తికలకు వ్రేలాడే మబ్బు గబ్బిలాలు అక్కడక్కడా సన సన్నని నీడ బొమ్మలూ ప్రకృతి సమాజస్థితికి సంకేతంలా ఉంది. నటనా చాతురీ నిగూఢ హాసం పెదవుల పొందికపై సదా ఒత్తిగిలే దుష్టోద్యోగి మనఃప్రకృతి వలె ఎప్పుడు పగిలిపోతుందో తెలీని అగ్ని పర్వతాలు మనోంతరాన సుళ్ళు తిరిగే ఊహల స్వేచ్ఛా సంచారం కార్యదశలో భయ సన్నివేశం వలె కల్లోల వాతావరణం నవ్వు తెరలు కప్పి మానసిక హత్యలు జరిపి పదు నెక్కిన ఊహలతో ప్రక్కన నడిచే మనుషుల వలె రివ్వున దూసుకపోయే మెరపు బాకులతో పిడుగుల జడితో చిందులు త్రొక్కే కారు మొగిళ్ళు అక్కడక్కడ వేసవి కృశించి నీరసించిన మొక్కలు దూర దూరంగా తప్పుకొన దాగి దాగి మలగే జీవులు బాటసారుల కళ్ళలో దుమ్ముకొట్టి ఆపైన అమాయకంగా కన్పించే ఇసుక దిబ్బలూ.

అక్కడక్కడా గొంతులు సవరించుకునే పిట్టలూ దగ్గర దగ్గరగా తూలి తూలి కదలే ప్రాణి సమూహం గ్రీష్మమందుకుంటే చాలు ఎండిన మ్రోడులతో తగలబడిపోవడానికి ఎదురుచూస్తున్నట్లుంది అరణ్యం. సుత్తెల మ్రోత ఎరగని కొండరాళ్ళు వర్షపు చినుకుల చవి చూడని మట్టి దిబ్బలు ఋతు పరివర్తన శక్తికి తాళలేని ప్రాణులూ చిగుర్పూ పెరుగుదల ఎరగని బ్రతుకులూ. అనియమిత మానవ ప్రగతి చరిత్రలో పూర్వాపర స్థితుల మధ్య ఏర్పడే లోయలు కళేబరాలతో పూడ్చబడీ మట్టి దిబ్బలయ్యేను ఈ దిబ్బలపై రప్పల వలె వసించేరు జనం.

I. 11. లయలో కోరికతో వెనక్కి తిరిగి చూడకనే ముందుకు సాగే ప్రవాహం వలె అణగిన కోర్కెలతో ఒకచోట నిల్చిన పడియ వలె ఋతు మనోజ్ఞ సౌందర్యం తెలీని కాల చిత్రం వలె నదీ సమార్ధ కర స్పర్శ ఎరగని శైల జాలం వలె బహువిధ జీవితాల్ని తలపించే ప్రకృతి రూపాలు ! పరిపాలింపబడి అనిదం పూర్వ స్థితులచే విపరీతపు గాలిచే బహు దూరం విసరబడి శక్తి పరిధిలో మలచబడి విచిత్ర రీతి గల్ల చపేటం వలె మ్రోగే వాయు ధ్వని వలె క్షితిజంలో సాగే మృదు కఠోర స్వరాల వలె చరించేరు మానవ రాక్షస తత్యానేక మతులు ! వర్ణోదక సమార్ధ భూసారంతో ఉద్గమించి పుష్ప ఫల భారంతో సుందరంగా వంగీ శిశిర తీవ్రతకు ముడుచుకొనీ ఆకులు రాలీ నగ్నమయ్యే లతా తరువుల వలె జీవితాలు ! జీవన సంతోష రేఖలూ పతన విషాదచ్ఛాయలూ బింబించే రూపాలతో ఆయుఃపరిమితి వెళ్ళబుచ్చే చైతన్యం కన్పించీ కన్పించని లౌకిక మూర్తులు ! వాయు ఝంఝ రాక్షస కృత్యం ఒక దిశ స్వభావంలో ఒదిగి

వినిపించే జన సముద్ర మహాఘోష ! అనుకోని స్వప్న ఘటన ! ఒక కోరికతో ఒక లయలో సాగుతుంది కలతతో అలజడిలో నిదురలో మృత్యువులో నియత రేఖ ననుసరించి అనువర్తన జీవితం అవిజ్ఞేయంగా అనిశ్చితంగా కన్పిస్తుంది సంక్లిష్ట రూపం.

I. 12. పృ్వ గీతం రెండు కళ్ళు విప్పి ఎంత చూచినా తృప్తి చెందక ముఖాని కెదురుగా సూర్య చంద్రులు గుర్తుగా వంగిన ఆకాశం లేచి విశాలమై భూభాగం ఇచ్చిన అవకాశ స్థలి నిశ్శబ్దంగా కదులుతూ వినబడే సంగీతం వింటూ కనబడే దృశ్యం చూస్తూ పొలాలు ఎడారులు కొండలు అరణ్యాలు నదులు జనపదాలు అనుభవిస్తూ ఎంత దూరం వచ్చాను? ఎంతకాలం గడిచింది? వికసించిన పద్మం వలె నిశ్చల క్షితిజ రేఖలు హత్తుకొనేంతగా ప్రయాణ పదం ! సాగేను.- నిండుగా వృక్షాలు నావైపే చూస్తుంటాయి ప్రేమతో నదులు నా ముందే కదలుతుంటాయి చేతులు చాచీ గాలులెదురౌతాయి గత స్మృతుల వలె మంచు రాలిపడుతుంది. ఆకాశాన కదలే కారు మొగిళ్ళ గుంపులు భూమిపై సరసర పరుగెత్తే త్రాచు పాము ప్రవాహాలు కొంత దూరాన దూర దూరంలో కపాల రంధ్ర నిర్గత వాయు స్వరాలు వినీ హర్షంతో ఎగిరే పిట్టలూ భయంతో ముడుచుకొనే మనుషులూ దూరం సుదూరం సాగిపోయే ఊహలో ఒక ప్రక్క కొరిగి తిరిగే భూగోళం ! ఊహ గతంగా పెంచుకొని వేదన మానవుల కోసం ఎంతగా తపించి పోతున్నాను? అడుగడుగునా కంటి నాకర్షించేవి ! రంగులు వేసిన మట్టి బొమ్మలేనా ? నలువైపుల పరికిస్తూ గమనం సాగిస్తూన్న నేను నేనుగా గుర్తు పట్టడానికే ఎంత కాలం పట్టింది.

ఎక్కడ ఎవరిని చూచినా వారిలో నా రూపమే ఎక్కడ ఎవరు పలికినా అందులో నా స్వరమే కనబడే వినబడే జగత్తును పరిపాలిస్తుంది మానవ మేధ కనబడని వినబడని లోకాని కావర్జితమౌతుంది హృదయం. గడచిన స్మృతులు వెలుగు కంబాలై నిలుస్తాయి మరచిన స్మృతులు నిదురలో స్వప్నాలై తేలుతాయి. గుంపులు గుంపులుగా ఊహలు అగ్నులై ముబ్బులై మనస్సునాక్రమిస్తాయి, క్షణాల్ని నిలిపేస్తాయి. అంతలో మహాధ్వని ! అంతలో నిశ్శబ్దం ! నాల్కలు తెగిన గంటల వలె ! నా చుట్టూ గాలి పిలుపుకు పలుకలేని ఆకురాలిన చెట్లూ! గాలి స్పర్శకు పులకించలేని ఎండిన సరస్సులూ ! కళ్ళ ఎదుట మౌన రోదసీ కుహరం, స్తబ్ధ సమాజం వలె ! ఎదలో మ్రోగే ఆవేదనా సంగీతం మార్పుకు సంకేతం వలె ! నా శిరస్సు ఆకాశం వలె అందని ఎత్తులో ఉంది నా పాదాలు నదీ తరంగాల వలె ఒకచోట నిల్వలేకున్నాయి నా మనస్సు గాలి వలె వెలుగు వలె అంతటా ఆడుతూంది నా చూపు పక్షి వలె దిక్కుల్లో దూసుకుపోతూంది. అన్ని ఋతువుల్లోను కలిసిపోతూ కాలగమనంలో ఒకటై ఎంత దూరమైనా సాగిపోయి వెనక్కు మరలి రా స్ఫురించదు ఆకాశం గొంతులో గొంతు కలిపి పృథ్వీ గీతం పాడుతూ ఎన్ని రోజులు గడిస్తే అన్ని రెక్కలు మొలిచినట్లు ! కాల మహాపద్మం జీవితం. ఎన్ని రేకులతోనో వికసిస్తుంది, ఆకర్షిస్తుంది.

II. మానవీయం వాయు సంగీతానికి సమార్ధమై లయించి నదించే గ్రీష్మవేళ హిమశైలం వలె సూర్యకిరణ తీవ్రతకు వాడిపోక

II . 1. అశాంతిసీమలు చాంద్రీ మృదూహలకు మెత్తబడే నీల గగనం వలె

తాకితే కాల్చని అమృత కాంతి స్పర్శలో ఆనందాన్నిచ్చే అంతా రూప సౌందర్య శిఖ వలె నిశ్చల సమ రేఖా స్థితిలో నున్న నా మనశ్శిఖరంపై ఎక్కడిదీ అశాంతి ? జీవితమే కళాకృతిగా మారడానికి నాంది ? దీర్ఘ భుజగం వలె బుసకొడుతూ నటత్తరంగిణి వలె చెంగలిస్తూ మలకలుగా మెలికలుగా తిరిగిపోయేను కాలం ! మండే అహంకారంలో మసలే చీకటి గుంపులో విసరే చురుకు గాలిలో అశాంతి ! ఆకారం మలచుకొంటుంది జలధిలో ఎగసే అలలవలె మనస్సులో తీవ్రమైన ఊహలు ఆనంద లోకాధిపతులపై హత్యావినాశన యత్నం! కాలచక్రంలో ఆకుల వలె ఋతు పరివర్తనతో రూపురేఖలు మారే ప్రకృతి గతిలో రాత్రి కళ్ళలో గగన మస్తిష్కంలో మనో రోదసిలో అలజడీ అశాంతి. హోరున విరుచుక పడే వార్షిక ఝంఝ వలె మనస్సులో స్త్రీ స్ఫులింగమై అశాంతిని మేల్కొల్పేను. సంధ్యా సమస్యలు ఎదురై చుక్కల ముఖాలే ప్రశ్నలై మనసుకు వెలుగు కరువై సంప్రదాయ రేఖ చెదురుతుంది చీకట్లను చీల్చే కాంతి విప్లవం రెక్క విప్పుతుంది సమభావనకై అలజడి ఘర్షణలో అశాంతి ! మానవతా కేంద్రం నుండి సాగే ప్రగతి శక్తుల చలనంతో విభేదాల గోడలు కూలేప్పుడు హద్దులు చెరగేప్పుడు దైనందిన సమస్యలకు స్వస్తి చెప్పి ఎంతకూ తీరని సందేహాలతో ఆకాశం అవతలి లోకంపై ప్రశ్న లెరగని సమాధానాలతో విశ్రాంతి కలవడిన గుండెల్లో అశాంతి ! హాహాకార హసంతులు ! అశాంతిలో వీర కృత్య చిహ్నాలు చరిత్రలో ప్రగతి సోపానాలు ! పూర్వం వెలసిన అశాంతి స్థితులు రాజుల కీర్తి గౌరవాలకు కొలతలు ! తెరలు తెరలుగా జారిన భిన్న భిన్న వర్ణోహలు పొరలు పొరలుగా ఒదిగిన వివిధ వర్గ శ్రేణులు. మానసిక వ్యాపారంలో క్రియా కలాపం వదలి మనిషి నిజంగా జీవితంలో శాంతిని కోరేనా? సమాజంలో శాంతికై అశాంతి ; అశాంతి నుండి శాంతి అశాంతి ఎరగని స్థలం ఉందా ? కాలం ఉందా ?

హృదిలో సూక్ష్మసూక్ష్మంగా తీవ్ర తీవ్రంగా చెలరేగే మాయని అశాంతి చిహ్నాలు ! మనోజీవి ప్రతిభా రూపాలు రాతి యుగం నుండి అణు యుగం వరకూ నియంతృత్వం నుండి ప్రజాస్వామ్యం సామ్యవాదం వరకూ చరిత్ర గతులన్నీ అశాంతిలో రూపొందినవే !

II . 2. ఆగని భ్రమణంలో ఊహల ఉన్మేషంతో రూపొందేను ప్రపంచం కదలికతో గమనం, అభిరుచితో జీవితం ధూళి క్రమ్మి రంగులతో భాసించే స్థితుల వంటి మనిషిలో సాధనతో గమ్యం చేరే సంకల్పం ద్వావా పృథివి మేల్కొన్న సమయం నుండి సమాజంలో ఏ ఒక్కరి నిష్క్రమణంతో ఆగదు పరివర్తనం అనుభవాలు స్మృతిదీపాలై నిలుస్తాయి దారిలో చలన శక్తుల గమనంతో జీవిత నిర్వచనం మారుతుంది.- మృత్యువు కివతల నున్న సజీవ లోకంలో అడుగు తీసివేసే లోపల ఒకదాని నొకటి మించీ, మించని వేగంతో సాగేను భిన్న భిన్న మూలాలతో అసంఖ్యాక ముఖాలు ఆడబడుతూన్న చదరంగాలూ, వైకుంఠపాళీలూ. ప్రొద్దు పొడవగానే అశాంతి ముఖాలతో రాత్రి కురిసిన చీకట్లకు తడిసీ చివికీ బిగిసిన సమస్యల సంకెళ్ళతో కదలే సంకెళ్ళ గలగలతో సంక్షుభిత విభుగ్న పరికుంచిత రేఖలతో వేదనా విదీర్ణ పరిపాండుర ముఖాలతో కోర్కెల కుబుసం ధరించి కదలేరు మనుషులు. గుప్పిళ్ళు గుప్పిళ్ళుగా విసరిన చీకట్ల వెనుక నుండి నింగి బూది కుప్ప నుండి జలజల రాలే తూర్పార పట్టిన నిప్పుకణాల వలె మనుషులు జేవురించి మసిబట్టి పాలిపోయి మాడిపోయి నిరంతరం భ్రమించే అశాంతి సమాజ గోళాలు. ఎదురెదురుగా జంటగా మూకలో ప్రతి చోటా ఎప్పుడు చూచినా ఒంటరిగా సామాజికంగా నిన్నటి గురించి నిరాశ నేటి గురించి అతృప్తి

రేపటి గురించి మాత్రం అందమైన కలల బొమ్మలు. మనిషిలో కన్పించకుండా తిరిగే అసంఖ్యాక రూపాలు ఒక నీలి తెర తొలగిపోయి అవతరించే ఉదయం వలె ఒక ఘటన ముగిసిపోయి బయట పడేను నిజ రూపం పెదవులపై చిరునవ్వులు ! నవ్వుల వెనుక తిట్లు ఏడ్పులు ఆక్రోశాలు అరపులు మంచు చలి ఎండ వేడి గాలి తెరలపై తెలుపు నలుపు ఎరుపు రంగు విరుపులు! ప్రకృతి పరిణామంతో అవధి ఎరుగని కాలంతో ! ఆనందమో విషాదమో సంయోగమో వియోగమో ! మానవీయం.

II. 3. జాతకంలో మార్పుతో రాత్రి పన్నెండు గంటలు ! రోజు జాతకంలో మార్పు ఈ రోజు నిన్న అయి, 'రేపు' ఈ రోజు అవుతుంది ఋతువు లెన్ని వచ్చి పోయినా జీవధార ఉంటేనే జీవితం. రోజు లెన్ని మలుపులు తిరిగినా లక్ష్యం ఉంటేనే ప్రయాణం. పల్చని మంచు వలె తెర వలె నీడ వలె ఆలోచన దీని వెనుక అంటుకొనీ రమణీయాకృతి స్త్రీ కాలు జారినపుడు గాలి నవ్విన సవ్వడి కాలు సాగినపుడు గాలి మెచ్చిన ధ్వనీ. అడవిలో పొలంలో పల్లెలో పట్టణంలో శ్రమ వర్తనంతో సాగేను జీవిత చరణం, చేతి కందని ఎత్తులో గాలికి మ్రోగే ధ్వజస్తంభ ఘంటికల వలె ఆశలు అనాది వాసనల్నీ జన్మల బంధాల్ని పరికల్పన చేస్తూ ప్రేక్షకుల మనోవృత్తులతో సంబంధం లేని పాత్రలు ! అణువు నుండి బ్రహ్మాండం వరకూ అలముకొన్న అశాంతి ఆవరణంలో, మాటి మాటికీ శాంతి రేఖలు గీసుకొని సమాజం బ్రతికేను కాలం చేతులు చాచి రేఖల్ని చెరిపే యత్నం చేసేను పోషణతో ప్రారంభించిన జీవన ప్రస్థానం తిండితో గుడ్డతో ఎన్నటికీ ఆగిపోదు

పదవికీ కీర్తికీ ఎగబ్రాకుతుంది, సహజంగా తృప్తి ఎరగని విధంలోనే ఉంది జీవన పణం రణం. అలభ్యమనుకున్నా సరే ఆశా జీవులు జీవితాన్ని పిండీ విసిగీ వేసారీ చివరకు జీవితానంతర భావనలో ఆశ్రయం పొందేరు పర లోకాన్ని సృజించుకొనీ ఆనందం పొందేరు. ఋతువు శోభ కానీ హృదయ దీప్తి కానీ ఆశ్చర్యం ఆనందం చైతన్యం సౌందర్యంలో.- ఏ సూక్ష్మ తీవ్ర దశల్నీ అనుభవం పొందలేని మనో నైశిత్యం తెలీని లోహ ఖండాలు కొందరు ఆకలి గొన్న ఆశతో కసి బలిసిన కళ్ళతో ఆరని హసంతిక వలె కణకణలాడే గుండెతో ఎండ కెండీ వానకు తడిసీ చలికి బిగిసీ రాటు దేలిన దేహాలతో ద్రిమ్మరే వనచరులూ. రాత్రివేళ ఏ గుడారంలోనో చెట్టుక్రిందనో నిద్రా సుఖ కామన తీర్చుకొని బయటపడీ చౌర్యం సాగించే క్రౌర్యం కనబరచే నిశ్శబ్దం రూపుకట్టి నివ్వెరపోయే స్థితిలో నీడల వలె చుట్టుకొనీ తృప్తిగా నిదురపోయే దిశి బొమ్మలు ! వెలుగు సహించని చీకటి మతులూ. దైవబుద్ధి చేతులెత్తి శూన్యంలోకి పరుగెత్తే రాత్రి తప్ప దివ మెరుగని పుట్టంధులు ముందూ వెనక ప్రక్కల జఘన్య స్థితిలో బ్రతుకులో వెలుగు పోచ ఎరుగని భాగ్యహీనులూ ! ఎన్ని మారులు యుద్ధం వచ్చి పోయినా ఎంత కాలం శాంతి ముద్ర నెలకొన్నా పాలన తలక్రిందై పాలకులు మారినా మరు భూముల్లో చెక్కు చెదరని దిబ్బలవలె ఎక్కడబడితే అక్కడ సంస్కార హీనంగా దాదాపు అంతా మగత నిద్ర వరించిన వారే ఆకర్షణ కోల్పోని సంఘర్షణ వీడని విప్లవ మనస్తత్వంతో అగ్ని మూర్తులూ మార్పుకై రాజకీయ సామాజిక తీవ్ర శక్తులూ సమాంతరంగా దివ్య దశలు కోరే శాంత వర్తులూ

నవ్వుతూ ప్రేలుతూ కోపిస్తూ నటిస్తూ వివిధ రీతుల్లో రంగుల్లో భంగిమల్లో మంచూ మబ్బూ చీకటి గాలీ నిప్పూ వెలుగూ తెరల పొరల అంచుల్లో పరిక్రమించే ముఖ పంక్తులూ. సూదుల వంటి చూపులతో వేగంగా పెదవి బిగించి నడిచే యువకులూ ఎరుపెక్కిన చెక్కిళ్ళతో ఓపిగ్గా బరువు రెప్పలెత్తి లోకాన్ని కనికరించే యువతులూ ఆర్ద్ర పరిష్వంగంతో అమృతం వర్షించే కోష్ణ పరిష్వంగంతో అంగారం పండించే రాక్షసుని దేవతగా, దేవతను రాక్షసునిగా వెలుగూ చీకటి శిల్పంతో తీర్చే శృంగార కళికలు ! హృదయ గగనం నుండి జారే ప్రేమ బిందువుల్ని ఎప్పటి కపుడింకింపజేసే ఇసుక దిబ్బలు కొందరు అందం మట్టిలో కలిసి ఆనందం ఆకాశంలో మాయమై నిలకడ లేక మనస్సు దూదికన్న తేలికై బ్రతుకు అగ్ని కీల కాహుతియై గాలిలో లయించి ప్రాణచ్చట కాల గర్భంలో ఆశ్రయం పొందే అభిమాన వతులూ.

II . 4. పోటటీపడుతూ తమలో ఎంత లోతుగా ఆసురాంశ నిద్రాణమై ఉందీ తమ పట్ల ఎంతగా భవిష్యత్తు దాస భావం వహించిందీ తెలీని అమాయకులు, తెలిసిన విజ్ఞులు, ప్రతారించే లౌకికులూ ! అనుక్షణం ఏదో పోటీలో నిలబడక తప్పదు. అగ్ని పర్వత శిఖరంపై బ్రద్దలైనట్లుంది పగలు ఎక్కడ చూచినా తీవ్ర గమన వైఖరులే తమపై మమకారం లోకంపై తృష్ణ ప్రక్కవారితో మాత్రం అజ్ఞానంలో పోటీ. సాయం సమయం పాములు విడిచిన పుట్ట వలె ఉంది. కోర్కెలు ఫలించని ఇసుక దిబ్బవలె ఉంది సంధ్యానల కీలలకు పొగబారిన దిశలతో రాత్రి ! జీవన రణంలో అలసిన విరామ స్థితి వలె ఉంది. జాతులు జాతులుగా మాలలు మాలలుగా

ఇతస్తత ఉడ్డీన విహంగమ సమాకీర్ణమై- చివరలు నీలీకృతమై తోచే లోచన పథంతో విశ్రాంతి కోరుతుంది యాంత్రిక జన సమూహం. ప్రాణమున్నంత వరకూ త్రైగుణ్య విపర్యయంతో అసంపూర్తి కామనలతో రగిలే శ్మశానంతో ఆశా పూర్తికి చిట్టచివరి దశ స్వర్లోకం ఆపై పరమ పదం దైవం పాదాల ముందు అవనత మస్తక సోపాన దృశ్యం దైవ పదం నుండి బ్రహ్మపదం ఎగసే కోరిక ఉన్నా ! తమలోని ఆత్మరూపం తెలీని జీవ సమూహమూ. రుద్రభూమిలో శివ తీర్థం రణ భూమినుండి స్వర్లోకం మృత్యుముఖంలో సృష్టీ, నిద్రాలోకంలో స్వప్నఖండం ఆశావిస్తృతిలో తృప్తి రేఖలతో ఆనంద పరీతాత్ములూ గాలి వంటి అనుభవంలో తేలి ఎప్పుడెక్కడో కలిసి వర్షించే భూమిని పులకింపజేసి ఆనందంతో మాయమయ్యే చలచ్చంచల మేఘాల వలె ఎక్కడెక్కడి నుండో స్త్రీ పురుషులు విషాదంలో వైరాగ్యంలో జిజ్ఞాసతో భయంలో సందేహంలో అన్వేషణతో విజ్ఞానంలో వేదాంతంలో అనుభవానందంతో ధనం కీర్తి అధికారం జోడింపబడి జీవితంలో, మానవమాత్రులూ. అందం మోహం ఆనందం స్వర్గంకై ఆరాటం పోరాటం ఆటు పోట్లతో విజృంభించే విస్తరించే “అహం” భావంతో సౌభాగ్యంకై శాంతికై మానవుని తాపత్రయం సంధ్యారుణ రక్తిమతో ఆక్రందన సంఘర్షణ జీవితం వెనుక నున్న వాస్తవ శక్తుల్ని తలపించేను.

II . 5. ప్రయోగపథం మానవ మేథా శక్తితో ఆహార వ్యవహార సమస్య తీరి అరచేతిలో నిల్చిన ఇచ్ఛా మరణ శక్తితో భూమిపై యంత్రం వలె వ్యోమంలో విమానం వలె సముద్రంలో నౌకవలె విశ్వం బింబించే మస్తిష్కంతో తెలి మబ్బు కన్న తేలికైన సంకోచ వ్యాకోచ దేహాలతో సహజమైన సంప్రేరణ జ్ఞానశక్తి లేకనే అనుభూతి ఛాయ లేకుండా ఆగామి యుగంలో

అవసరాలకు మించని సంఖ్యలో అవతరించనున్నవారు విభిన్న రీతుల్లో ప్రమాణాల్లో వినిర్మిత మానవులు ! రసాయనిక జీవితంతో కొత్తయుగం తలపించే సోదరీ సోదరులు. చీకట్లను చీల్చి ఛిన్నం చేసి రూపు మాపీ ఈ దిశ నుండి ఆ దిశ కొలిచే చూపులలో జాతి వర్ణ వర్గ భేదాల్లేని శ్రేణులతో సహజోన్మీలన మతి ఎరుగని విజ్ఞాన మతులతో అశాంతి నణచీ సమతా సౌభాగ్యం పలికే వినూత్న వైజ్ఞానిక యుగ మహాయంత్ర పథం. (ఆల్డస్ హగ్జలీ వ్రాసిన "ఎ బ్రేవ్ న్యూ వరల్్డ" ఆధారంగా)

II . 6. మనో భూమికలు సూర్యుని పాదముద్ర లెంత వరకు సాగినవో ఎక్కడా ఎవరి నిజ రూపమూ కన్పించలేదు. ప్రక్కనున్న చెట్లకు నా భాష తెలీదు వాటిలో ఒకరి భాష వేరొకరి కర్థం కాదని తరువాత తెలిసింది దూరాననున్న కొండలకు నా రూపం కన్పించదు వాటిలో ఒకరిని వేరొకరు చూడలేరని తరువాత తెలిసింది. వెనుక నడిచే నీడలకు నా రూపం తెలీదు వాటికి చెవులు నోళ్ళు కళ్ళు లేవనుకున్నా కాని జీవం కూడా లేదన్న విషయం తరువాత తెలిసింది. వెలుగు గీత దాటలేని చీకటి బంతులవలె ఎక్కడబడితే అక్కడ దాగి దాగి తిరిగే- జంతువులు తప్ప ! నా కంటికెక్కడా పరిపూర్ణ జ్ఞానస్పూర్తి గల బింబాలగపడలేదు. దూరం బహు దూరం ప్రయాణించే నా పాదాల క్రింద అణగిన ధూళి రేణువులు మతి వదలని తృష్ణ తీరని కామనలూ కంటి ముందు ఎద విప్పి ఆహ్వానించే సమాజం. మింటి నుండి మంటికి జారిన మంచు తెర చాటునెవరో

నే సాగినపుడు ముందుకు సాగి నే నిలిచినప్పుడక్కడే ఆగి మనోదఘ్నంగా ఆలోచనా మూర్తి స్ఫూర్తితో కనుచూపు మేరలో నిలిచేరు కేసరచ్ఛవిని తలపించేరు. నా కాలి సవ్వడి నాకే భయంగా నా ఊహ పడగ విప్పిన పాములా నగ్నంగా వాంఛా సహితంగా నా ఆకృతి నాకే రెండు రంగులుగా ముఖం విప్పి చూసేసరికి వెనక మలిసంజ వేళల్లో జడలు రేగిన చీకటి రోదసి నావరించిన మౌన భావ సంస్థితి. దగ్గర దగ్గరగా దూర దూరం నుండి నడకలతో పరుగులతో గాలి సవ్వడి అది నవ్వు తెర ఏడుపు రొద ఏమైనా కావచ్చు. ఈ ఎడారులూ అడవులూ పొలాలూ మైదానాలూ ఆవరించిన మంచు తెర చాటు నుండి వెలుగై కన్పించే నో శాంతమూర్తి! ఎవరా విజ్ఞాన రూపం భగవంతుడేనేమో మానవ రూపంలో లోపంతో సమాజ తలంపై వివిధ శక్తుల మధ్య నా నీడను నిలిపే వెలుగు రేఖ కావచ్చు. లౌకిక జగదనుభోగంలో ఆనందం విషాదం పేరిట రసోద్విగ్న మతికి గోచరించే అశాంతి జీవన దృశ్యాలు కాల పరిమితి లేకుండా అద్దం వంటి బుద్ధిలో హృదనుభూతి కాంతితో బింబించే మనోభూమికలు !

II . 7. వాస్తవ చరణాలపై ఈ పురోగమనం ఎంతవరకు ? దిక్కుల అంచుల వరకు ! ఎంతకాలం సాగుతుంది ప్రయాణం ? మరో ఉదయమయ్యే దాకా ! ఎక్కడికీ సాంధ్యవేళ ? మరో మనో లోకానికీ, మరో సమాజ లక్ష్యానికీ. ఆ శాంతిని పట్టుకోడానికీ ఈ రూపం మారిపోడానికీ, సమాజ తత్త్వం ఇది అని, ఎవరు ప్రవచించింది నిజం ఎందరికో ఏదో తెలిసినట్లుంటుంది ఎవరికీ సంపూర్ణంగా తెలీదు ఎన్ని యుగాలు గతించినా ఇక్కడే ఉన్నాం ఉన్న చోటనే మానసిక వైక్లబ్యంతో రణమారణ భయోన్మనీ దశల్లో

ఎన్ని తరాలు గతించినా ఇంకా అక్కడే ఉన్నాం పురమనోరూపాల్లో. మానసిక వ్యాపారంతో తెలివి మీరిన ముఖాలతో ఎంత దూరం ప్రాకినా, ఎంత కాలం ఆలోచించినా అంతరిక్షం హస్తగతమైనా గ్రహాలు స్నేహితులైనా బ్రతుకు భోగ భూమి ఐనా మేర లేని వాంఛా పిపాసతో దేని కోసమో ఆవేదన ! సాధనకై యత్నం మానవసహజం. చీకటి ఓటమి నంగీకరించలేదు, వెలుగు విజయం పొందలేదు ఆకాశంవలె విస్తరించిన అజ్ఞానం తుది తెలీకుండా ఉంది దివానిశలు ఋతువులు వత్సరాలు ఒకదాని వెంట మరొకటి ఆగమనం నిష్క్రమణం పునరావృతం భౌతిక తలంపై స్వర్గమూ నరకమూ మతమూ రాజకీయమూ పరాకాష్ఠ నందుకొన్న లౌకిక స్థితి రూపాలూ తిరిగి తిరిగి మరో రూపంలో ప్రత్యక్షం. ఒక ప్రాణి సన్నని చూపులో ఒదిగి ఒక జీవి బరువు నిట్టూర్పులో తూగి సామాన్యుల కంటికి మట్టి ముద్దవలె వైజ్ఞానిక దృష్టికి భ్రమించే గోళం వలె వేదాంతికి భ్రమోదిత స్వప్నం వలె- స్పష్టాస్పష్టంగా సంపూర్ణాసంపూర్ణంగా భాసించే సుఖ దుఃఖాత్మక ప్రపంచం బహు విచిత్ర మనఃప్రభావ సంకలనం వివిధ భౌతిక శక్తి రూప సమీకరణం ప్రపంచ నిర్మాణ పరంపరకు మూల కారణం? నీరు కాదు మట్టి? కాదు! చైతన్యం అవునేమో భౌతికం కూడా! ఇంకా ఇంకా ఏమైనా కావచ్చు మరో నాటికి తల ఎత్తుతుంది మరో సందేహం కొన్నాళ్ళకు తోచే పరిష్కార సిద్ధాంతాల్లో ఎప్పటికప్పుడు వ్యత్యస్తమై పోయేను విలువలు గగన పదవి కదలే మబ్బుల వలె పవన లహరి వినిపించే ధ్వనుల వలె అంతటా సరిస్తూ తరగని వెలుగు వలె చేతికందీ అందని నీడల వలె ఆనందం విషాదం కలిసిన రూపాల్లో ఆలోచనలు ఎక్కడ మొదలై ఎక్కడ అంతమొందేదీ తెలీదు

విజృంభించే విరుద్ధ శక్తుల ఘర్షణలో పతనమై మళ్ళీ నిర్మాణోన్ముఖమై వికసిస్తుంది సమాజం అనాది నుండి సృష్టి రహస్య గవేషణలో అంకితమై పరంపరను రక్షించే వేదనా మహితాత్ములూ ఈనాటి వరకూ మారణ బుద్ధిలో తీవ్రతతో క్షమారహిత నైశిత్యంతో అలజడిలో సమాజం మతం రాజకీయం ముసుగులో దాగేను నిజరూపం! ఎన్ని అవతారా లెత్తబడినా ఎన్ని మతాలు ప్రబోధితమైనా ఎంతగా సాహిత్యం సృజింపబడినా ఎంతగా విజ్ఞానం ప్రపంచితమైనా ఎన్నిమారులు కాలం స్వర్ణ కిరీటం ధరించినా ప్రతియుగంలో అశాంతి నుండి అవినీతి నుండి దూరమైన సమయ మెంతని? ప్రతి వస్తువు నిర్మితిలో సృష్టి రహస్యం శోధించి ప్రతి చిన్ని కదలికలో కార్య కారణ మూహించి ఆకాశం పొర లొలిచే నిశిత హేతు దృష్టితో పైన ఆ పైన లోకాలు భావించి శక్తుల్ని దర్శించి మనిషిలో పక్షిలో పాములో జంతువులో పిపీలికలో ప్రాణశక్తి గుర్తించి జనూ రహస్యం శోధిస్తూ రోదసీయానంతో గ్రహతలం పై చరణంతో పురో గమన ధ్యేయం వదలని ఆశాజీవి మానవుడు.

II. 8. శాంతి చరణంకై యోచిస్తున్న శిశువు ఊహల వలె చుక్కలు చుట్టూ తడుము లాడే గ్రుడ్డివాని చేతుల వలె గాలులు అక్కడక్కడా బ్రతుకులు నిర్వేదంతో వెలుగులు! ఒకరి ఊహ వేరొకరికి చెప్పలేని మూగజీవులు ప్రకృతిలో మృదురూపం ధరించే ప్రళయం వలె గ్రీష్మంలో ఇంకే సరసి వలె, రవి అస్తమించే దిశ వలె మనసులో భయదాకృతి దాల్చే ప్రేమ వలె హృదిలో రాగం మాసీ దారి దొరకని అపరిచిత మహానగరం ఈ శతాబ్ది యంత్రీకృత జీవిత రూపం అదృశ్యమైన ఆశను ఊహలో మెరపు జ్ఞాపకం చేస్తుంది తొలి ప్రొద్దు ఏ ముఖంలో ఎప్పుడు పొడిచేదీ తెలీదు.

రాత్రివేళ భయ నిద్రా సమాధి వలె సంగీతం విరమించిన సముద్రం వలె ఉచ్ఛ్వాస నిశ్వాస పంక్తి ఆగిన శరీరం వలె ఒక్కొక్క సమయం జడీభూతమైనట్లుంటుంది. కొలిమి తిత్తుల వలె మండిస్తూ ఊపిరితిత్తులు ఏనాడో బిగిసి గడ్డకట్టిన ఆలోచనలతో ఎక్కడ వేస్తే అక్కడే మట్టి ముద్ద స్వభావంతో కబంధుని చేతుల్లో కీలు బొమ్మల వలె మనుషులు ఇంద్రియ తర్పణీయ భౌతిక సౌభాగ్యంతో గ్రహాంతర విజ్ఞానంతో హేతు పథ పురోగమనంతో, వ్యయమెరుగని వెలుగు వలె విజ్ఞేయ ప్రపంచం- అణు రజో రూపంలో రాలే రూబుల్ డాలర్ విలువలూ సైనిక బల సంపదతో ఆకలి తీర్ప యత్నించే తెలువులూ అంతరిక్ష గోళాల్లో ఆవాసానికై సంరంభం భూమిపై మనిషి తిండికీ బట్టకూ అఘోరించే అభాగ్యం భూగోళం చుట్టి రాగల అణుమారణ నవాస్త్రాలు వాటి వశంలో తిరిగే యుద్ధోన్మాదుల చిత్తాలు యాంత్రిక సౌభాగ్య వశమై ఆత్మ సౌందర్యం మరచేరు సంఘ శక్తి పీడన క్రింద వ్యక్తి వికాసం తరిగేను రాబోయే యుద్ధ జ్వర భయంతో వణకుతుంది వాతావరణం మృత్యువు స్ఫురించే సరికి కంఠం శాంతి పాఠంతో శోషిస్తుంది.

II. 9. మృత్యువెరుగని ఉదయం దగా పడిన జాతి తెరపిడి పడి ఎత్తిన నిప్పు కళ్ళు రాత్రి చీకట్లో తిరిగే పెద్ద పులి కళ్ళ వలె ఉన్నాయి. ఇసుక దిబ్బలపై ఎండుటాకులపై మొండి గోడలపై పాడు బడిన గుడులపై ఆగి ఆగి కురిసే సన్నని వర్షపు చినుకుల వలె చీకటిలో మిణుగురుల వలె స్మశానంలో గడ్డిపోచల వలె పేద వాళ్ళ బ్రతుకుల్లో చిరు కోర్కెలు తలపై వెలిగే విద్యుద్దీప కిరీటంతో వీడని ప్రాణ మిత్రం వలె ఇనుప స్తంభం ఎదురుగా కాలు విరిగిన కుర్చీ వలె సమయం

పగటి కలలు గనే కళ్ళతో ముఖ పంక్తులు కలలు కనటం మొదలు పెట్టి ఇంకా నిద్ర పోని జనం నేడు తలలు పోగొట్టుకునీ జనం రేపు నిజ స్థితికి వస్తుంది నిప్పంటుకుని మండే జ్వాలలతో ప్రయాణంలో సముద్ర గర్భంలో మునగనున్న నౌక వలె ముఖం జేవురించిన రాత్రి మృత్యువుచే ఆకర్షింపబడుతుంది నలు దిశల్లో అంతలో విప్లవాత్మకమైన మార్పులు నిద్రించి ఎన్ని వేల ఏండ్లో అయినట్లున్న అవని ఒక్కొక్క పొరను విదల్చుకొని మేల్కొంటున్నట్లుంది. పద పదంలో కాంతి చిమ్మే ఉదయ నేత్ర గగన మెదురుగా ఆగి ఆగి పరుగిడే చీకటి పిల్లల గుంపులు ప్రక్కగా చీకటి కొండపై నుండి జారే సూర్యుని వెలుగు లహరులు నడిచే పథంలో శిలా మూర్తుల్ని స్పృశిస్తూ పోయేను ఒకటి తిన్నగా లేని పిచ్చి వాని ఊహల వలె అల్లి బిల్లిగా అల్లుకొని చీలి పోయేను చీకటి బాటలు బహు దూరం నుండీ దగ్గర దగ్గరలోనూ విన వచ్చే విభిన్న కంఠ ధ్వనులు ఇంకా వదలని నిద్రలో తూగుతూ కలల గనే చీకటి మనుషులూ తెల్ల దొరల వలె కాపలా కాస్తున్నట్లు నటించే చుట్టూ ఇంకా ఆరని దీప స్తంభాలూ ఊహా లోకానికి వాస్తవ జగత్తుకూ సిద్ధాంతాలకూ అనుభవ స్వరూపానికీ మనిషీ మనిషికీ వస్తువుకూ వస్తువుకూ మధ్య విడదీసే చీకట్లు కలిపే వెలుగులూ ఆరే దీపాల పొగలు క్రమ్మి మూతపడిన సమాజం కళ్ళు ఇంకా తెర పడి పడలేదు కళ్ళు ఉన్నా అంధుల వలె ప్రాణం ఉన్నా శిలల వలె ఈ సమయం పడి ఉండి తీరవలసిందే. మనిషిపై మనిషి కన్నా జంతువుపైనే ఎక్కువ విశ్వాసం ఆలోచనల కవధుల్లేవు ఉదయం మృత్యువు నెరగదు. II . 10. ఈ వెలుగు అందరిదీ ఒక యుగం పోయి మరొకటి వస్తున్న దెంత త్వరగా ఒక మనో రూపం మారి మరొకటవతరించాలి సంపూర్ణంగా ఆరంభం నుండి నేటి వరకూ సమాజ భౌతిక శక్తుల

ఆకర్షణ సంసర్గం సంఘర్షణ ఏనాటికైననా ఒకే తీరు గ్రహ సమూహ గమనంతో ఋతు చక్ర భ్రమణంతో చేతనా చేతనం పై సమాజ కాల ప్రభావం,- ఒక తరం నుండి మరో తరానికి అందింపబడే మానవ సంస్కారాన్ని తీర్చే ఆత్మ దీప్తి ఒకటే. గగన కాసారంలో తలెత్తి సహస్ర కరాలతో ఈది వచ్చేను సూర్యుడు ఒడ్డున మేల్కొన్న ప్రాణి కోటి ఆశ పతాక ఇంకా మేల్కొననివారికి స్వప్నంలో భవిష్య దృశ్యం ఈ సూర్యుని వెలుగు లెవరి కొరకు? మేల్కోదలచినవారికీ, పరివర్తన కోరేవారికీ. మనశ్చక్షూ రుచిర కాంతి ప్రసరించి నంత మేర అదే భూమి! ఆకాశం! గాలి! నీరు! చీకటి! సూర్యుడు చంద్రుడు! నక్షత్రాలు! వెలుగు అదే! మనిషిలో లౌకిక శక్తుల ప్రతారణం! విజయకాంక్ష! • II 11. పరివర్తన గమ్యంతో పునర్జన్మ ఎత్తాలి మనిషి! తప్పదు సుమీ ఇక దుఃఖంలో మ్రగ్గి పోక కష్టంలో నిల్చి పోక పతనంతో పారి పోక మరణంతో మారి పోక మరో మనో లోకాన్ని కల్పించుకోవా లిప్పుడు పేదవాని కోరికలో కుంచితమై ధనవంతుని ఆశలో విస్తృతమై పరిమితి ఎరగని ఈ సుందర సమాజం జగన్నేతల చేతుల్లో తిరిగే ఆట బంతి ప్రతి యుగాని కొకే ఒక మానవ ప్రతినిధి పూర్వం ప్రతి వ్యక్తీ యుగ విధాత సంపూర్ణంగా నేడు మౌఢ్య విశ్వాస బలంతో చెలరేగే ఒక జాతి మతం అకాండ తాండవంతో పరస్పర దాటీ ఘర్షణలో నలిగి, మారి, కొత్త విధం పొందుతూంది పూర్వ సమాజం. అహంకారౌద్ధత్యం అసహోనోద్రేకం రాపిళ్ళకు తాళలేక పరుగిడి కొండల్లో దాగి చీకటి ముసుగు ధరించీ రక్షో భావమూని మానవత కోల్పేయే మనిషి, శాంతికీ యుద్ధానికీ పురోగమన మార్గానికీ తిరోగమన రీతికీ

సౌఖ్యానికీ దుఃఖానికీ జన్మకూ మృత్యువుకూ అల్పానల్ప కృత్యానికీ ప్రళయం వరకూ సాగే మహా పరిణామానికి కేంద్రం. ప్రతి మానవ మనోంతరాన వ్రేలాడేను బంధు భావ జాతి వర్ణ తోరణాలు! ఆత్మ సంస్కృతీ మహా ప్రవాహ మింక జేసే సికతా శ్రేణుల వలె మధ్య మధ్య కాల ఖండాలు! చారలు చారలుగా అట్టలు కట్టిన నెత్తుటి గీతల బొమ్మల వరుసలు! ఆట వస్తువులు! మనుషులు! పిశాచ హృదయులు విలాసాలకై భద్రపరచుకునే సంపదలు! గాలికి రాలీ ధూళి కలిసే ఆకుల వలె ప్రాణాలను కోల్పోయే అసంఖ్యాక సామాన్యులు కసి మసగిన మృత్యు క్రీడ! రారాజు లానందించే ఒకనాటి పండుగ. అవధుల్లేని సమాజ సముద్రం విడిచే మేఘ నిశ్వాస పరంపరలు సంఘటనలు ఏ భూమి సమార్థమై భోగమయమై ఏ ఖండం బీడు వడి దారిద్య్రమయమై బ్రతుకులు గడిపేదీ ఎవరికెరుక? ఎందుకనీ అంటే, సమాజంలో సర్వస్వమైన మనిషికీ ఇది మనిషిలో శక్తిదీ యుక్తిదీ. 11 . 12. నవతాస్పందనం దిశ నుండి దిశకు హుటాహుటిగా హఠాత్తుగా గుమ్ములుగా ముట్టడించి ఒక్కమారు ఊపేసే ఝంఝా పవనం వలె ఘోరాకృతి వచ్చి పడే యుద్ధాలకు క్షామాలకు భయపడీ కష్టాల్ని ఎదుర్కొనీ పరుగిడి బంధు భావ బంధాలను తెంచుకొనీ సంపూర్ణంగా ప్రేమ పూర్ణ సౌహార్ధం వదులుకొనీ ఏ దేశం గర్భంలోనో ఏ చల్లని నీడల్లోనో ఏ పచ్చని మైదానాల్లోనో ఏ ఆకలి తీరే చోటునో- ఒంటరిగా గుంపుగా తలలు దాచుకొనీ బ్రతుకు బరువు సాగించిన మానవ జాతి సమస్తం క్రమంగా సాగించి పోరాటం తమ తమ ఉనికి కోసం అలవరచుకొంది అధికార వలయాలూ కీర్తి శిఖరాలూ. ఒకనాటి అవసరం ఆనందంతో అలముకొన్న అభిరుచిలో ఊహలో వేషంలో వర్ణంలో వేళ్ళు దన్నుకొనీ మనిషిని బహిర్ముఖుని చేసిందొక భౌతిక విధాతత్త్యం.

దారిద్ర్యం దుఃఖం క్షామం యుద్ధం ప్రవాసంతో పరిణామాలకు గురియై ఎవరికి వారు విడివడీ నేల నాలుగు చెరగులా చెల్లాచెదరై విస్తరించీ తమ తమ సమూహాలు ప్రత్యేక చరిత్రలుగా విశిష్ట సంస్కృతీ నిలయాలకు ప్రతినిధులుగా జీవిత గమనం సాగించిందీ మానవ సమాజం. భిన్న భిన్న జాతులు భాషలు ఆలోచనలతో భిన్న భిన్న వ్యవస్థలూ ప్రవర్తనలూ విశ్వాసాలతో ఒకరి నుండి ఒకరు విడివడజేసింది జాతీయత్వం వీటి నధిగమించి వర్తించింది మానవతా బంధం. వేల యేండ్ల నుండీ ఈనాటి వరకూ సాంఘిక రాజకీయ నైతిక వ్యూహాల్లో మనిషిలో అవే! మూల మనోభావ సంస్థితులు. రాసులు రాసులుగా రాళ్ళ గుట్టల వలె గుంపులు గుంపులుగా చెట్టూ చేమల వలె ఎండ కెండి వానకు తడిసి చలికి బిగిసి మట్టి దిబ్బల వలె బండల వలె మొద్దుల వలె ఒక్కొక్కచోట జడభరిత సమాజ స్థితీ ఒక్కొక్క చోట విష వలయ సమాజ గతీ కశ్మల వాతావరణంలో కంకాళపు దుర్గంధంలో మానవ రూపాల్లో నిలిచిన బూది కుప్పలు కళాహీన క్షుధాకర్శిత పీడిత బానిస లోకం పురా కీర్తి చక్రం బరువు క్రింద అణగి నలగీ భర్మ హర్మ్యపు గోడల నీడల్లో ఎదుగు మానీ తనకు దొరికిన స్థలంలో తలదాచుకొనీ చీకటి కలవాటు పడీ వెలుక్కు వెరగొందీ చీమల వలె దోమల వలె ప్రాణ దఘ్న భయంతో పుట్టిన క్షణం నుండీ చచ్చే క్షణం వరకూ సంకల్ప నవోదయ మెరుగని త్రపా హీన సేవామతులు ఎక్కడ చూచినా అధిక సంఖ్యలో జీవో విలువలు. గ్రీష్మాతప శుష్కితమై శిశిర శీర్ణ పత్రమై రథ్యావీధి నడవ నేర్చిన మౌనాకృతులు, ఉదయ రథ చక్రం వెలుగు చాలు నంటీ నీడ బొమ్మల వలె కదలిపోయే సంధ్యా జీవులు!

ఆకాశచ్ఛత్రం క్రింద హద్దు మీరని ఆశలతో తమ నీడే ఒక బొంతగా చుట్టుకున్న అర్థనగ్న మూర్తులు నాలుగు చక్రాలూ విరిగిన ధర్మ రథ శకల పంక్తులు నిరంతరం పీడించే చిక్కు వీడని సమస్యలకు ప్రతీకలు ఆ రోజు గడిచిపోతే చాలు నూరేండ్లు నిండినంత ఎతెనా ఊహా గగనంలో ఎండిన ఒరుగుల వలె వ్రేలుతూ కాలిన కట్టె ముక్కలవలె గడిపే జీవచ్ఛవాలూ నరనరాల తేజస్రవంతులు ప్రవహిస్తూ ఆకృతులు నవాగ్ని శిఖలుగా ఉత్తుంగ తరంగ నటదుద్వేగంతో పరుగులు తీసే ఉప్పెన వలె విరుచుక పడే సమీకృత ప్రజావితతి క్రాంతి విక్రాంతి తప్పదు. కూలిన కోటలు ఎగిరిన సింహాసనాలు హతమారిన ఆహంయువులు అణగారిన అగ్ని గుండాలు దారిలో మేల్కొనవు శవాలు! గతి తప్పదు చరిత్ర భ్రమణం తిండికి బట్టకు స్వేచ్ఛకు కరువు లేని సామ్య భావ సామాజిక వ్యవస్థలోనూ మానవ జాతి సమగ్ర వికాసం ఏనాటికైనా భౌతిక శక్తులతో నైతిక రక్తితో మానసిక వికాసంలోనే !- ఒక మహాయుగ పథాన వేగ దీప్తితో సాగే సమాజ రథ చక్ర విఘట్టితమై నలగీ కలగీ గాలి కెగసే అణు ధూళికి వెరగొందక వైజ్ఞానిక భూమికలో నవ సమాజ రూపంతో మానవతా హృదయంతో పురోగమన లక్ష్యంతో నేటి మనిషి ఎత్తక తప్పదు! విశ్వ సంస్కృతీ రూపం పద పదంలో కొత్త శక్తి ధ్వనిస్తూ ఎద ఎదలో కొత్త సృష్టి స్పందిస్తూ స్వేచ్ఛా నవం 2. పడగెత్తిన ఉదయం కావ్యం (1973) మాదిరాజు రంగారావు అంకితం జీవన సహచరి