Soundaryasikha — Volume I — Addendum 1
సౌందర్యశిఖ — మొదటి సంపుటం — Addendum - 1
1963 · Telugu (te) · 46 pages · Human-proofread
సౌందర్యశిఖ
మాదిరాజు రంగారావు
ప్రచురణ
నవోదయ సమితి
నారాయణగూడ, హైదరాబాదు
స్వేచ్ఛా కవిత్వం
సౌందర్యశిఖ
ఆచార్య మాదిరాజు రంగారావు
SWECCHAA KAVITHVAM
SOUNDARYA SHIKHA
Prof. Madiraju Ranga Rao
© Dr. M. Santhosh Kumar
Rasadhuni Sahithi Parishath, Hyderabad - 28
ప్రథమ ముద్రణ: 1963
నవోదయ సమితి, నారాయణగూడ, హైదరాబాదు.
పునర్ముద్రణ: జూన్ 2026
అనుపమ ప్రింటర్స్
శాంతినగర్, హైదరాబాద్
ఫోన్ : 040–23391364
2
ఇతర కృతులు
కిర్మీరం
మేల్కొన్న ఆకాశం
మనో భూమికలు
అద్దంలో నీడలు
పృథ్వీగీతం
3
సౌందర్యశిఖ
ఉజ్వల తర సంగీత తరంగ
స్పందనల కదలికతో
వచ్చింది ఆమె కాంతిమతి
నీడ ఎరుగని దీపశిఖ!
అంధకార శిలాపంక్తుల అకస్మాత్తుగా
చందన శీతల ఛాయా వృక్షసమితిగా
జీవనశకలం స్వర్లోకానికి ప్రతిబింబంగా
దివ్య దశగా, పరిణమింపజేయు కాంతిపుంజం!
ఉదయం తీసుకున్న మొదటి నిశ్వాసంలోని
అనంతకోటి ఆశాపతాకల ఉత్సాహ దీప్తి ;
తెరచిన కళ్ళనుండి చిందు అమృత బిందువులు,
ముఖంలో అలలు అలలుగా సాగు సుమ హాసం.
వర్షాగమనవేళా శీతల సుకుమార వాయువువలె
లిప్తల మెట్లపై అడుగుల చప్పుడుతో వస్తూన్న
ఆమె పాదాలముందు బారులుగా విచ్చిన వెలుగులు;
దృష్టిపథంలో గుత్తులుగా ప్రబ్బికొన్న నీలిమబ్బులు.
హృదయంలో పల్లవించి, పెదవిపై కుట్మలించి
వాక్కులో సుమించిన ఒక మహా దివ్యానుభూతి
బహువర్ణకాంతి సమ్మిశ్రిత వాయుప్రసార వలయం,
లిప్తలు పరిమళ భరితం చేయు సౌందర్యశిఖ.
ఝుంఝానిల తీవ్రత్వం నైశిత్యం
అణగిన మొదటి క్షణంవలె
పరిమళదళ వదనంపై రోచిర్వాసంతో
విచ్చిన హిమ బిందువువలె
సర్వధ్వనులు సంగీత స్వర విశేషాలు, తనలో
ఆనందంతో లినీకరించుకున్న అఖండశాంతివలె;
ఆవిష్కృతమైన అవ్యక్తనాద ప్రతిబింబం
మూర్తీభవించిన అమృతభర సౌందర్యలహరి.
ఆశాపరివేషితమైన అఖండశాంతి
ఆమె వెంటనంటి పరుగెత్తి వచ్చింది మూర్తి కట్టి.
ఇతరుల కభేద్యమై అగోచరమైన నా అంతఃకరణంలో
ఆమె కదలిక, కాలచక్రం యొక్క లయాత్మక గమనం.
రవికిరణం భూమిపై అడుగిడక ముందే,
ఒక పల్చని గాలితెరపై ఊహాచిత్ర పరంపర
సృష్టించుకున్న, ఆకాశ శతపత్రంవలె ఆమె
గగన భాగంపై మేఘపంక్తి అవతరించగనే
స్వాదుతర సంగీత మాధురీ స్విన్నమై తనలో తా
పరవళ్ళు త్రొక్కు రోచిరుదార సముద్రంవలె, నేను
ii
దివినుండి అవిచ్ఛిన్నంగా కురియు
దివ్యామృత స్వర్ణధార !
భూమిపై తరగలొత్తుకొని
వ్యాప్తమౌ పరిమళ ఝురి!
దిక్కులేని దిక్కువలె, చీకటి రాయివలె
పడివున్న నన్ను ఉజ్వల మయంచేయు;
వాయు వీధి ఎగసి దూకి వెలుగునింపు
రెండు ఉదయ తేజోలతికలు, నీకళ్ళు.
గ్రీష్మ వేళా వాయుమండలం
చందన వాఃపూర్ణమైనట్లు
నాభావ జగతి నీ అవతరణ
మొదటి చివరి వసంతోదయం.
సౌందర్యం భరించలేక మూత పడిన కన్నులలో
సందు చేసుకొని ప్రవేశించిన నీ కనుచూపులు,
వీణాతంత్రీ కమ్రనాద తరంగంవలె ఝుమ్మున
మెయి విరుపుల హొయలుతో దిగివచ్చు సుషమాశిఖ,
చంద్ర రేఖాబింబితమై పై కెగయు కెరటాలవలె
దిగ్వసనం ధరించిన సముల్లసత్ వక్షోజాలతో
స్మిత సుమరుక్ దీపంతో, శరన్మేఘ శిల్పాకృతి
ఎదురుగా నవనీత పాత రావమృదుపాద ధ్వనితో,
కదలివచ్చు నిన్ను చూచి, అలల తలలు వంచి
గాలులు ఆ క్షణం స్తంభించి నిల్చినవి గర్వంతో.
లేమంచు పొరవ్రాలిన గులాబి రేకులవలె
చిరునవ్వు వెన్నెల హత్తుకొని
శోభారుణ దీప్తములై మృదువుగ కంపించు
చిరు పెదవులపై బింబించిన;
ఊహ జగతీ ఇంద్ర చాపవల్లీ రేఖలోని
వర్ణాలెన్ని సమీకరించి మేళవించి;
రహస్సౌందర్యం రాసులుగా ప్రోదిచేస్తూ
విశ్రాంతి ఎరుగని గాలి
సముద్రంపై కెరటాలను వలె;
సుప్త కళికలవలె అవిదితంగా
గడచిన లిప్తలెన్ని అర్పించా నీకు
సమర్చనంగా—
రవి దీపం అస్తమించగనే నాకు కన్పించినది
నీవు. ఊహబిందు రూపం. చంద్రబింబం.
దీపం ఉన్నప్పుడు ఆరినపుడు చూచా
ఆ నవ్వు అంగారవల్లి; హిమస్వప్నం,
ఆ కదలిక నిశ్శబ్దవలయం చీల్చుకొని
సాగు, మృదుల సంగీత లహరీ విలాసం.
ప్రాణవంతమైన నాదలహరి చకచ్చకిత కాంతివలె
విచ్చిన శతపత్రంవలె నీరూపం భావించినంతనే,
నిద్రిస్తున్న లిప్తలు మేల్కొని సుస్వర సాంగీతికులై నవి!
మందీభవదీహలు అగ్నిజ్వాలా చేలములై నవి!
గాలికి అంచెలు అంచెలుగా తేలివస్తూ
నీటి ఒరపిడికి అణగి, వడికి ఉబికి
లేచి ఎగసి దూకివచ్చు వెలుగు కెరటంవలె;
నిశా రూపం దాల్చిన కనులనుండి
దూకు దృక్చంద్రికతో; జ్యోతిర్వలయమై
వచ్చి నాలో లీనమైనది నీరూపం.
కాలం విప్పిన తీవ్రమైన కంటిచూపునుండి
తెలివిగా తప్పించుకొని నన్ను మరపులో బంధించి,
ఏ నీడ తన రహస్యం బైటపెడుతుందోనని
శంకించి, చేతిలో ఒదుగకుండా
జంకి చూపులో నిలువకుండా;
చలన్మతి చంచల వర్షాంబుద రమ్యతనూ!
గాలివంటి ఆలోచనతో పటంవలె తిరుగుతున్న
నీకోసం వేచి ఉన్న ఎన్ని అబ్దాలు; ఆశ్చర్యంతో
మంచుకొండలవలె నిలువునా నిలచిపోయినవి!
ఎన్ని వసంతాలు నీ ముగ్ధరూపం చూస్తూ చూస్తూ
మనోజ్ఞ దశలుదాటి హసంతికలై ఆరిపోయినవి
నీవు మాత్రం కనుబొమలువంచి ఆకాశంవలె,
వహించిన మౌనముద్ర ససేమిరావీడవు!
వెలుగు వత్తులు వేసుకున్న వేయికళ్ళనుండి
మంచు నీటిబొట్లు జలజల రాలుస్తూ;
నిశ్శబ్దంగా కరగిపోతున్నది కాలం!
iii
సృష్టిగత నవోహలో ఒదిగి ఒదిగి సుప్తాకృతి
వ్యక్తి గత పరిధిలో స్వప్నాకృతి పరిణమించు;
నా నేత్ర గోళ పరిధి నాక్రమించిన
జ్యౌత్స్నీ స్నిగ్ధ శరీరాంచల రేఖావలయం
యుగ యుగాలనుండి సౌందర్య తృష్ణతీరక
ఈ స్త్రీ రూపంలో మలగిన ఉదయ కిరణం!
నా నేత్ర వీధి కుసుమించిన కాంతి వల్లిక
నా ఊహ జగతినిండుకున్న పరిమళఝురి !
నిశ్శబ్దంగా కాలం వేస్తున్న అడుగులచప్పుడు,
చప్పుడులో లిప్తానేక మంజీర ధ్వనులు,
ధ్వనిలో హసించు అక్షర గత నవోహలో
అనురణించు, సౌందర్య మహానుభూతి తప్ప
నిజంగా నీ వెవరవో తెలియదు! ఇంతవరకు
ఏదో ఒక వర్ణంలో వైఖరిలో వాక్కులో
నీ రూప విచారణ ప్రవహింపజేసి బ్రతుకులో
కల్పనకవధి కల్పించని ఊహమతి లేడు పృథ్విలో.
సన్నని మంచు పొరలచే కప్పబడిన
సూర్యుని, తేజశ్చక్ర క్రమావసరణంవలె;
ఒక ఉషస్సు ఒక ఋతువు ఒక ఉగాది
మనోజ్ఞ తరుణంవలె భూమికి దిగిన నీవు;
యుగాలుగా జీవుని అంటి పెట్టుకొని ఉన్న
ఒక సుందర ఛాయా రూపానివి!
యవ్వన కెరటంవలె ఊగి వచ్చిపోవు నీకు
ఒక సంగీత సౌందర్యం సంతరించు వాయువును
పగలు రాత్రి పేరిట ఎన్ని దీపాలు ఆరినవి!
కాలగమనం ఎరుగనీయదు నీ ముఖబింబం.
నీవు అందవు అయినా పరుగిడుతుంటవి
చంద్రునివెంట మేఘాలవలె ఆలోచనలు.
నీవు చిక్కవు అయినా వెతుకుతుంటవి
దిక్కుల వెంట గాలులవలె ఊహలు.
జలధిమధ్య ద్వీపంవలె నీ వియోగ పరీవృతుడనై,
నీడమధ్య దీపంవలె నీ వియోగ సమావృతుడనై,
పైకి ఎగసిపోవాలని చూస్తూంటా ఆకాశంవైపు.
మనస్సులో జ్వలించే అగ్ని యొక్క ప్రతిబింబం,
పెదవులపై బింబించిన నీ మనోహరదరహాసం.
నా ఎదపై నగ్నంగా వాలిపోయిన ఉషస్సు నీ రూపం.
సమాకర్షించి నన్ను బధిరుణ్ణి అంధుణ్ణి చేయు
ఈ వాయు సంగీతం ఈ సౌవర్ణ కళాశిల్పం
పదపదంలో ప్రత్యణువున మాధుర్యం సౌందర్యం
స్పందించు వసంతమూర్తి, నదించు రసాకృతి.
కనుచూపులలో విరిసిన నక్షత్రకాంతులు
పెదవి వంపులలో ఒదిగిన సంధ్యాలహరులు
చిరునవ్వులలో జ్వలించు వెన్నెల వత్తులు
చక్షూరమ్యాకృతి మలగిన దివ్యమనోరూపం.
శంపాలతలు కుసుమించిన కన్నులు
ఆశాశిఖలు వెలిగించెడి చూపులు;
వియోగాగ్నితో నిండిన పూలనది
అమృతభావనావధిగా వెలిగెడు సౌందర్యశిఖ
iv
దట్టంగా క్రమ్మిన మంచుపొరలను
చీల్చుకొనివచ్చే ఉదయకిరణం వలె
స్మృతి వలయంలో భ్రమించునీవు.
సముద్రంలో కెరటంవలె
మబ్బులో మెరపు వలె
స్పష్టంగా కన్పించి క్షణమాత్రం
అంతలో మాయమౌ నీ రూపం.
ఏ అద్దంలో బింబించదు
కంటికి కన్పించని సౌందర్యం.
ముఖంలో బింబించి
హృదయంలో ఇస్తుంది సాక్షాత్కారం.
గభీర నిశ్శబ్దంలో జనించి
ఉచ్ఛ్వాస నిశ్వాసంలో లయించు,
ఒడ్డున విఫలమయ్యే
కడలి తరగలవలె అడుగుల చప్పుడు.
ఆకాశంలో నిలువునా నిలచి చూచు వృక్షాల వలె
దిశలలోకి అడుగులు తీసి కదలిపోవు నదులవలె ;
నిను పరివేషించిన స్వర్లోక గవేషణలో
విభిన్న చలాకృతులు దాల్చి తిరుగు ఊహలు వాంఛలు !
అబద్ధపు వంపులంటి ప్రవహించు
నిత్య సత్య జలవాహిని వలె
బ్రతుకులోని లోయలు నిండి
పూలనది వలె విరియు వెలుగువు !
నీకు ప్రశస్తి లేదు కారణం ?
మృత్యువు నీడనైనా ఎరుగవు గనుక !
ప్రేమపూర్ణ కాంతిశ్రీ !
ఆసీమాంతం చెంగలించు రసఘృణి !
ప్రభాత వేళ రోదసి ధరించిన
వెలుగు ముసుగువలె ఉన్నది
మనస్సులో ముగ్ధ ముగ్ధంగా పొడిచిన
నీ భావగత సంతోష తరంగం !
సంధ్యారాగంలో ఆర్ద్రమైన
పూలమబ్బులు కదలునప్పుడు
నీవే వస్తున్నావని మ్రోగుతుంది
నిశ్శబ్దం నిండిన నా హృదయం !
గ్రీష్మం కన్న స్వప్న సముద్రంనుండి
సాగిన మేఘమాలిక !
భూదేవత పెదవులపై నవ్వు మొలక
లెత్తింపజేయు వర్షధార !
ఆగామి శిశిరం వెనుక దాగిన
సుమనోజ్ఞ వసంత రేఖవు
కాల వృక్షం పూచిన పూవులో
దాగిన ఫల స్వరూపానివి !
v
సాయం సంధ్య కుట్మలించనిదే
అప్పుడే ఎక్కడికీ సన్నాహం!
అలా తొందర పడతావెందుకు
ఇందాకేగా విరసించింది ఉదయం!
నిద్రా సరస్సులో వికసించిన
స్వప్న కల్వారం వలె నీవు
జాగ్రదవస్థా తీరంలో
చంద్రునివలె పరిభ్రమించునేను.
కొండలు చీల్చుకొని వస్తుందినది
మబ్బులు చీల్చుకొని వస్తుంది మెరపు
గుండె చీల్చుకొని నీవురావు బైటికి
ఈ వర్షంలో, ఎండలో, చలిలో, నేనేరానా?
సముద్ర మవతలనీవు ఇవతలనేను
నీటిపై తేలు చంద్రనౌకలో రానా?
ఈ దిశనుండి ఆ దిశకు వ్యాపించిన
శశి రశ్ములు పట్టుకొని రాకూడదూ!
నదిపై ఆకాశంపై భూమిపై రోదసి,
ప్రసరించిన సూర్యచంద్ర రేఖలవలె
ఆవరించిన నిశా తమోచ్ఛాయలవలె
హృదయగతానంద దుఃఖానుభూతులు
నిను గూర్చిన భావ పరంపరలో
గమించి పోవు జీవితం
నీ సుందర రూపావిష్కరణతో
అవతరించునేమొ మృత్యువు?
మృత్యువు ఆసన్నమయ్యేదాకా
ప్రతీక్ష సలుపవలసిందేనా?
సదా ప్రతీక్షా వ్యగ్రుడను నేను
అఖండ కాలస్వరూప మతివి నీవు.
ఒక సుందర దివ్యానుభూతి యొక్క
ఒక మహోన్నత ప్రమాణం స్వర్గం.
ఆ స్వర్గం యొక్క సంపూర్ణవికాసం,
లయమెరుగని సంగీతం నీ రూపం.
ముక్తకాలు
క్షణక్షణం మార్పునొందు ఈ అనశ్వర జగత్తు
ఎవని హేలకోగాని ఏరోజున కారోజే
ప్రశ్నా పత్రం వలె ప్రత్యక్షం కంటికి
జవాబుకోసం మనిషి మారును మనీషిగా
ఏ పెదవులపై విరిసిన హాసశ్రీలీసుమాలు
సంజల వన్నెలో కలసి మరునాటికి తమకు తాము
శ్మశాన పదవినొందినవి క్రొత్త వాటికిచ్చి స్థలం
లేదు క్షణం వివృతి లేక వికాసనవసృష్టిలేక
దూరంగా ఆకాశం ఎక్కడనో భూదేవిని
కౌగిలి పూనిన రీతిని మనస్సును ప్రగాఢంగా
అల్లుకొని అంతలోనె పుట్టిగిట్టు లౌకికమౌ
తీవేలు, మనిషిని వదలని నీడలు పొగమబ్బుగములు!
రాకెట్ గోళాలను స్పృశించి రాగలమనిషి
గోళ నిజ స్వరూపాలు ఫోటో తీయగలాడు
ఎదుటి వాని మనస్సులో జరిగే ఇంద్రజాలం
ఎరిగిననాడే అతనికి కలుగుతుంది నిష్కృతి
సూర్యుడు ఆరిపోడు భగవద్భావన చావదు
తమస్సు ఉండదెపుడు, ఆశలేక బ్రతుకు లేదు
యుగాలు గతించినా ఆదియుగ మనస్తత్వం
వస్తూంది పరంపరగా ఏదో రూపంలో
నిద్రను జయింపలేడు అందుకే అంత ఇష్టం
గతం చచ్చినా రాదు అందుకే దురభిమానం
భవిష్యత్తు భద్రమే అందుకే ఎంతో ప్రేమ
అనంత కాలం పురుషుడు, అఖండగమనం స్త్రీ.
ఒక మహోజ్వల గాధవలె పొంగిపొరలెడు కడలి
ఒక వలపువలె కదలి వచ్చెడు గాలి తరగ
ప్రేమభరిత హృదయంవలె వెలుగు పూర్ణచంద్రుడు
నిత్యములీ రసమూర్తులు మానవుడుండువరకు.
మల్లీ సౌరభములు ఝుంఝూ మారుతములు
ప్రేయో నిదానములు ప్రళయ మహోగ్రగతులు
మానవ ప్రకృతిలోన రెండుగ ఒదిగి ఉన్న
అమృత సరోమూర్తులు అగ్ని గోళదీపులు.
మనసు లోతులను వెతుకు కన్నులు కొందరివి
మనిషి రూపాన్ని చూచు కన్నులు కొందరివి!
కండ్లే ఉంటవి చూపులుతప్ప కొందరికి
గ్రుడ్డి వాళ్ళవలె ఉన్నవారికి చూపు, జాస్తి.
ప్రతి ఉదయం నిశా మృగాన్ని వేటాడు రవి
గగనవనంలో అవతరించెనో లేదో
మేల్కొని నిదురించు పర్యంతం భూమిపై
మనిషిని వెంటాడే మనిషి, నీడను నీడ.
ఏ గమ్యము చేరుటకై సాగుచున్నవీ నదులు
ఏ ఖండమునార్ద్ర పరుప తరలుచున్నవి మొగిళ్ళు
ఏ విధిననుసరించి నియతిగా భ్రమించు గోళాలు
ఆ మహార్థము ధ్యేయముగ వెలుగుచున్నవి బ్రతుకులు.
ఈ మట్టిలో ఎన్ని ప్రాణులు లీనమయ్యెను
దీనినుండి మరెన్ని సంతతులవతరించెను.
ఉదయం వలె జనించి సాయంవలె నశించెడి
మానవులు, ఈ మహా ప్రపంచ రథ చక్రాలు.
వెన్నెలకు కులములేదు, మనస్సులేదనుభూతిలేదు
మనిషి కున్నది మనస్సు, దానితోనే అన్ని ఉన్నవి,
ఇవిలేనిది యోగులకు, అంతకన్న అలౌకికులకే
లేదని నమ్మించడం లౌకిక మూర్తులకే సాధ్యం.
గ్రీష్మం వచ్చింది నిప్పు రెక్కలు విప్పి
బంగరు కుప్పవలె భాసించింది జగత్తు,
రాత్రి వచ్చింది మసక కన్నులు విప్పి
బూది కుప్పవలె మారిందదే లోకం
ఆగకు నడువు ఆలోచనతో ముందుకు
ఎదురుపడనీ గుట్టలుగా పెను చీకట్లు
విచ్చుకొని వెలుగు దారులు అవే ఇస్తవి.
గమ్యం తెలియనపుడు చాలు ఉన్నచోటు.
నిద్దురలో స్వప్నంవలె ఉన్నది ప్రపంచం
భూగోళంపై తిరుగు బొమ్మలు ప్రాణులు
మనిషి మనస్సులో ఉన్నవి స్వర్గం నరకం
పైన ఉన్నవో లేవో మన కనవసరం.
మృత్యువు మరో రూపమే గతం
అనుభవాత్మకం వర్తమానం
ఆశాఽభాసము భవిష్యత్తు
ఈ మూడిటి సంపుటి జీవితం.
ఉదయించిన చుక్కలు మతిలో
ప్రసరించిన వెన్నెల హృదిలో
అహంకార రూపం దాలిచి
కనులముందు నిలచిన అహంకారం
బైటికి వదనంపై మంచుతెర
లోన తిరుగు ప్రళయాగ్నిగోళం
పెదవులపై మధుహాస హాసం
ఊహలలో పిశాచ తాండవం.
కవులు ఎందరు పుట్టిగిట్టిరి ఇంతవరకు?
భావమెప్పుడు నవంనవతాబంధురము.
పరిచిత మార్గము అంధునకైనా సులభం
నవీన మార్గం ఎవరికైనా అసులభం.
ప్రొద్దుగ్రుంకిన తక్షణం పశ్చిమ దిగ్ముఖంపై
మేఘ శకలాలవలె వీధుల్లోనడచే జనం
ఎవడి ముఖం చూచినా ఆరాటం ఆవేదన
మతిలో రేపటి ఉదయంపై అల్లబడు ఊహలు
మిన్ను మన్ను ఏకం చేస్తూ
కనురెప్పలు ముంచుక వచ్చే
సుదీర్ఘ నిశా తరంగం
సవేగ నిద్రాకురంగం.
వత్సరాలు ఋతువులు పక్షాలు రోజులు
పునఃపునరావృతమౌ కాలచక్రం
కోపాలు తాపాలు ఈర్ష్యలు కలహాలు
అదే మనస్సు అవే చేష్టలు ఊహలు.
కష్ట జీవి ఫాలం పై చెమర్చిన స్వేదబిందువులను
పరిహరించు శీతల హస్తాలతో వచ్చెను ఉగాది.
ఈ నాటికైనా అతని బ్రతుభీడుపడి; మారిందికు చిగిర్చి ఉంటుందని
ఎన్ని యుగాలు గతించినా పాతబడని ప్రాణబంధువు.
బీడుపడి; మారిందిఒకచోటునుండి కదల్లేరు కొంతమంది
వాళ్ళ శరీరం వాళ్ళకే బరువు ఊహకు
వారు రారు ఇతరులను ఏడ్వజేస్తూ
వారుపోరు ఇతరులను నవ్వజేస్తూ
జీవితం గడుస్తుంది యంత్రంవలె
కొందరికి ఆరిపోని దీపంవలె
కొందరికి క్రమ్మిక వదలని నిద్రవలె
కొందరికి అవిచ్ఛిన్న యజ్ఞంవలె
ప్రపంచం దగాకోరు అని తెలియనిదెవరికి ?
ఇందులో మోసపోని వ్యక్తి ఎక్కడున్నాడు?
ఆ వ్యక్తుల సమాహారమేగా ప్రపంచం!
అందుకే మనిషికొక మతం! మతాలన్ని ఒకటి.
దాహంతో చావనున్న వారు
మహానదిలో దింపబడ్డారు
దాహం తీరడం దేవుడెరుగు
తిరిగి కంటికి కన్పించలేదు.
నీ నా కళ్ళముందు పుట్టి పెరుగు శిశువు
నీ నా కళ్ళముందు పండుబారిన వృద్ధుడు
ఒకరి ఆగమనం మరొకరి నిష్క్రమణం
ఎడపెడగా, చూపుల కలయిక ఒక్కచోట.
స్నేహం పరిమళించెడి ఎదలో
పూవులో జ్వాలవలె ఆవేదన
సంపెగ రెక్క విప్పు చూపులో\nసంధ్యవేళ రక్తి మవలె ఊహలు
చంద్రబింబం వెనుక జ్వలించు సూర్యుడు
చంద్ర వదనం వెనుక జ్వలించు హృదయం
వీచు గాలి పొరలో ఒదిగిన వెన్నెల
తోచు అడుగు జాడను వదలని కన్నులు!
మహానది స్త్రీ ఒక రసాకృతి!
పురుషుని కామం ఒక దాహం అంతె !
ఒక పరిధిలో స్వతంత్రురాలు
స్రవించలేదు ఆధారం భూమిలేక.
నీలాకాశంపై వెలిగే చుక్కలవలె
ఆమె నీడ చాటున దాగి ఉన్న గుండెలు!
తరగలుగా విరజిమ్ము నవ్వులతో, పూల
గుత్తులవలె విరియ బూచిన ఆలోచనలు.
ఆమె కదలికలో, ఒంపులన్ని చుట్టివచ్చు
నిశ్చలతలో, నీరాజనమెత్తెడి చూపులు
నీలి మబ్బులనుండి దుమికెడి మెరపులవోలె,
ఆ సమయం తదుపరి అంతా చీకటి వెలుగు.
నందన వనం వంటి మానవ హృదయం
బీడుపడి; మారింది ఆతని మేధస్సు
అణ్వస్త్రంవలె కడుభయంకరంగా,
జ్వలిస్తున్నవి శీతల మృదు వాయువులు!
మహామతికి కాలం మహా జవాశ్వం
కొందరికి నిశ్చలన పర్వతతుల్యం
మందమతికి, కదలు చెట్ల ఆకులవలె,
భాసించు అనుభూతి, అది మానసికం
మనిషి ఏ స్థితిలో ఏ పదవిలో ఉన్నప్పటికీ
అతని క్రియలో ప్రతిబింబిస్తుంది నిజతత్త్వం
క్రియా వైవిధ్యమయం ఈ జటిల ప్రపంచం
కాలం దేశం బట్టి మారదు మనోభూమిక !
కొన్ని పూలు పూయవు మరికొన్ని వికసించవు
వికసించిన కొన్నిటికి పరిమళం శూన్యం.
కొందరికి హృదయం ఉండదు అదృష్టవంతులు.
ఆవేదన అనుభూతి ప్రసక్తి ఉండదసలు
సూర్యోదయం కాగానే ఇప్పుడిపుడు
నాకళ్ళలో కదలెడి వెలుగు మిల మిలలు
తుమ్మెదలవలె ఝుంకృతి తిరుగు మనుషులతో
శోభారుణ పద్మం వలె ఉంది ప్రపంచం.
ఒక నాటికి తుది అవని గ్రంథం ప్రపంచం
చాల మంది చదవరు కొందరు చదువుతారు.
అర్థమయిన వాళ్ళసంఖ్య అమిత స్వల్పం
ఎవరేమన్నా ఎవరి ప్రపంచం వారిది.
ఖైదు నుండి విముక్తులు ఇద్దరు హంతకులు
ఒకరినొకరు చూచుకొని సాగారు ముందుకు
ఒకడి కళ్ళలో పరచబడిన ఆకాశం
మరొకడి కళ్ళలో తిరుగుతున్న గోళాలు
బ్రతుకు ఇంకా ఇంకా బ్రతకాలంటుంది.
నదిపై తేలి వచ్చు అలల వలె ప్రియంగా,
దూరంగా మృత్యువు, గాలివలె ధ్వనిస్తూ
వచ్చు కొద్ది, ఉల్లాసం అధిక మౌతుంది.
గుండె గాయంతో జ్వలించునపుడె
తెలుస్తుంది జీవిత మెంత బరువో !
వత్తి కాలుతూ ఉన్నంత సేపు
చూపగలదు వెలుగు ప్రపంచానికి.
రాగంలేని మనిషి లేడు భువిని
వర్ణం లేని వస్తువు కన్పించదు
ఒక స్థితి రీతి బట్టి కలుగుతుంది
ఇతని కానందం దాని కందం.
ఆకాశ మతిక్రమింప దురాశతో
తహతహతో పైకి పైకి ఎగురువిహంగం
రవి తేజములకు మండి భగ్గున బొగ్గై
ఏ మట్టిలో కలిసిపోయేది, ఎరుగదు.
నా కళ్ళలో నీరు ఆవిరి ఐపోయింది
బైటికి రాకముందే వేదన కెపుడో !
అదృష్టం మేల్కొన్న గులాబి వదనంపై
ఉదయం ముత్యాల్లా మంచునీటి బొట్లు !
రాత్రి పూల మొగ్గలవలె కలలలో తూగి
ఉదయ రూపంలో ఉదయించిన ఈ రోజు !
నౌక వలె మునిగి పోతుంది సముద్రంలో
చివరకటు ఇటు ఎటుచూచినా శూన్యమంతా
హృదయంలో క్రీడానీడలు ప్రతిఫలింపజేసి
నిరంతరం ఆగకుండ నడుస్తున్న కాలం.
మంచు కొండ పై చలికి వణకుతున్న వెలుగులు.
నేలపై దరిద్రంతో అణగి ఉన్న మనుషులు.
ఒక గాలికి చెట్టు ఆకులు కొమ్మలవలె
ఒక ప్రభుత్వకు ఒదిగి ఉండు మనస్తత్వం.
ఒక స్థితిలో మండి పడి కాల్చు అగ్నివలె
ఒక దర్పంతో ప్రభుత్వ నెరపు అహంకృతి.
సామాన్యుని గుండెలో, బిగిసిన
హిమశైలం వలె కరగని బాధలు.
సామాన్యుని బ్రతుకులో ఎదురై
మరుభూముల వలె మారిన ఆశలు.
ప్రతి మనిషి మనస్సులో ప్రమాణాన్ని బట్టి
సుందర కాల్పనిక నిర్మాణ పరంపరలు
వాస్తవికంగా గాలి తెరవీస్తేచాలు
గుర్తించరాక చెదరిపోవు ఇసుక గూళ్ళు.
ఎవని ఊహలేస్థితిలో ఏ యాకృతి పూనునో !
ఎవని బ్రతుకేరీతిగ మలకలు తిరుగునొ!
ఎవడికెరుక ? తనకు తెలియని దానిని
తెలిసినట్లు విశ్వసింప జేయడమే లౌకికం !
.
ఒకడు దూదికన్న మిక్కిలి తేలిక చూపును
మతిలో పాముకన్న ఎక్కువ విసపు కోరలు
ఒకని చూపు కోతకు పనికిరాని కొడవలి
అతని చేతము రాక్షస గణక్రీడా యోగ్యం.
విపదబ్ది మునిగిన ఒకని మనసు
నవనీత సదృశము మసృణమగు.
సుఖాబ్ధి తేలెడి ఒకని మనసు
అగ్ని సదృశము దాహకమ్మగు
చిత్త జల్లుకు మొలిచిన గడ్డి పోచలు
ఎంతకాలం బ్రతుక గలవు శక్తి గలిగి !
గాలి వాటున పెకలు కవితలో
ఏ వస్తువున్న నేమి? ప్రతిభ లేనిది !
ఎంత వయస్సు వచ్చిందో పైనబడి
అంతకాలం హరించిపోయింది!
మెరపువలె గతించింది నిన్నటిరోజు
విహంగంవలె వచ్చి వాలింది ఉదయం
చచ్చి బ్రతికే వాళ్ళ సంఖ్య అల్పం
బ్రతకడానికి చచ్చే వాళ్ళు ఎక్కువ.
కొందరిని మృత్యువు అమావాస్యవలె
కొందరిని పూర్ణిమవలె వరిస్తుంది.
మరో ఉదయం కోసం మనిషి ఆశతో బ్రతుకుతాడు
హృదయహాసంతో రాత్రులు దీపం వెలిగించగలడు.
మృత్యువును జయించడమే చివరకు మిగిలేదతనికి
చలికి బిగిసిన జీవం అంగారం కోరుతుంది !
మట్టిలో కలిసిన ఏ సుందర హృదయాల్లో
దాగిన కోర్కెల రూపాలీ పచ్చని పోచలు!
ఏమంద భాగ్యుల కళ్ళనుండి పతితమైన
బాష్ప కణాల్లో దాగిన ఆశాస్వరూపాలు!
పంకంలో మనోహర మృదుపద్మాలు
గులాబీ పుష్పంచుట్టూ కంటకాలు
మల్లీ నికుంజంలో విషసర్పాలు
ప్రకృతి మానవుడు, బింబ ప్రతిబింబం.
వెలుగులో తమ వ్యక్తిత్వం స్ఫురింపజేసి
చీకటిలో పరిలీనమౌ ఆకాశం భూమిసర్వం
బ్రతుకులో దీపశిఖవంటి మనసునంటి
ముందు వెనుక మలగు సుఖదుఃఖపు వెల్గునీడలు !
మహాకాల కాసారంలో విరిసిన
కనక శతపత్రం సూర్యుడు, కాదు!
అంధకార వలయంలో సహస్రాబ్దాలుగా
పరిభ్రమించు మానవ హృదయాగ్ని గోళం.
కాలదేవత మనస్సులో విరిసినమల్లెలు
ఉబికిన సంతోష తరంగాలు, చుక్కలు, కాదు!
ఒక భాగ్యహీనుడు రాల్చిన బాష్పకణాలు
హృదయం ఎగజిమ్మిన అగ్ని శలాకలు.
దుఃఖమయ జీవితంలో హ్లాదైకబింబం
తమో గగనపథంలో పారాడే శిశుశశి,
అవును. పాషాణ హృదయం భేదించుకొని
ఉద్గమించిన సౌందర్య కళాశిల్పాకృతి.
ఒక్కమారు వీచింది గాలి తరగలు తరగలుగా
కొన్నిపూలు రాలిపడిపోయినవి గుదులుగా
కొన్ని మొగ్గలు వికసించినవి దరహాసంతో
ఒకే స్థితి భిన్నిదశలలో భిన్న పరిణామాలు.
పగలు రాత్రులు పై బడి వచ్చిపోతున్నవి.
యుద్ధాలు క్షామాలు సైపక్ వెలిగిపోయినవి
ఇంకా మేల్కొనని జనం ! గుండెల్లోని
గాయాల బాధ ఎరుగని శవసందోహం!
చీకటిలో చివికిన బ్రతుకు నెత్తిచూపు దీపకళిక
భాగ్యహీనుని కంటినుంటి జారిపడు బాష్పకణం.
బాష్పకణంలో నినదించు బడబాగ్ని సంగీతం.
శిథిల మనశ్చిత్రపుటడుగుల చప్పుడులు.
చెట్లు కనే కలలు పూలు పండ్లు
వాని ఆలోచనలకు ప్రతిరూపాలు నీడలు
నదులు కనే కలలు పొలాలు ఎడారులు
వాని ఆలోచనలకు ప్రతినిధులు తరంగాలు
మనిషి కనే కలలు ఇతరులకు కనిపించవు.
అతని ఆలోచనలకు ప్రతిబింబాలు
అజంతా హిరోషిమా, బూక్కులు స్పుత్నిక్కులు
దేవతలు రాక్షసులు, తాను మరి ఇతరులు.
వ్యక్తి బ్రతుకులో చివరి ఘడియలు
విషబిందు మయ కాంతి బింబాలు
గతస్మృతులు కేంద్రాలుగా
భ్రమించు ఊహా గోళాలు.
గతిస్తుంది మానవయుగ పరంపర,
మేధా విలసనం, హృదయ స్పందనం
మానవ క్రమ పరిణామస్ఫూర్తి కట్టి
నిలుస్తుంది చరిత్రలో అనవరతం.
★
ii
ఉషస్సు ఊర్పులో, తమస్సు కూర్పులో
జనురానందంలో, మృత్యు విషాదంలో
మనిషి రూపంలో, కాలభ్రమణంలో
లేదు మార్పు ! మార్పులేదు ! లేదు !
నాడు నేడు రేపు ఒకటే,
అడవులు గిరులు ఝురులు
రవిచంద్రుల చూపులు
భువి మనుషుల మమతలు
ప్రతి నిమిషమొక నూతన రూపంతో
ప్రతి మనస్సు ఒక నవ్య రాగంతో
ప్రతి మేధ ఒక క్రొత్త ఆలోచనతో
భౌతిక జీవితంలో క్షణ క్షణ పరివర్తన
నిన్నటి పరివర్తన
నేటి దృష్టిలో సంప్రదాయం
నేటి పరివర్తన
రేపటి దృష్టిలో అభ్యుదయం
కాలం కనులు గప్పి పబ్బం గడుపుకొనే
అమావాస్య వంటి హృదయం గల మనిషి
కాలం నడక నంటి బ్రతుకు నడుపుకొనే
దీపపు వెలుగు వంటి మనస్సు కలా డొకడు !
కాలం కనులు విప్పి జగతికి వెలుగునిచ్చు
సూర్యుని వెలుగు వంటి బ్రతుకు ఫలమొకరిది !
నాడు నేడు రేపు సమాజపు సరిహద్దులలో
చక్రమణం చేయు ‘తర్కం తెలియని ఎద్దులు’
అశాంతి ప్రతిచోట, నేటి సాహిత్య విమర్శవలె
కార్మికుని కడుపులో, రైతు ముఖకవళికలో
యఽ జీ ఓ కన్నులలో, ఆఫీసరు మనసులో
కవిశ్రీ సమూహంలో, నాయకమణి బృందంలో
ప్రతి మనస్సులో ఉద్భవించు ఊహ వెనుక
సమయంకోసం వేచి ఉన్న స్వభావమూర్తులు
క్రియాచరణలోకి దూకిన అసంఖ్యాకశక్తులు
ఊహలో నిలచి పోయిన బహుళ తత్వ రేఖలు
పక్షిలో పాములో చెట్లలో జంతువులో
ఇంకా పంచభూతాల్లో దైవత్వం దర్శించి
ఆరాధించడంలో జీవితం సాగించు మానవులు
మానవుల్లోని మానవత్వం ఎరుగని దానవులు.
కాల గర్భంలో కలసిపోవు ప్రతిమానవుడు
కాలముఖంపై వెలసిన ఒక వర్ణ రేఖ
బహువర్ణ విచిత్ర రేఖావలయ ప్రపంచం
ఎప్పటికప్పుడు మారిపోవు చిత్రశాల
రాత్రి చలికి భయపడి కప్పుకున్న
బొంతలు తొలగించి, కళ్ళు తెరచి
ఉదయ కాంతి ముఖం చూడడానికి
సంకోచించు నిరాశాహత జీవులు
సాయంసంధ్యా వర్ణంలో కలసిపోయి
ఏనాడో తమ వ్యక్తిత్వం రూపుమాసి
రాత్రికి దివ్వెల హారతి పట్టగ వేచి
కళ్ళు విప్పుకొని ఉన్న ఆశాసహిత జీవులు
హిరోషిమాగా మారిన మానవహృదయం
మరోమరో ఉదయాన్ని చూడగలదు కాని
ఎరుగబోదు సృష్టికి ప్రాణభూతమైన
చైతన్య స్పందనలో వికసించు సౌందర్యం
ముగిసిన కలవలె గతించింది రాత్రి
కలలు కనడం మాని మేల్కొన్నాడు మనిషి.
తూర్పునుండి సాగిన వెలుగు పూలవర్షం
మనస్సును ఆర్ద్రము పరిమళం గావించింది.
ఒక వలయం నుండి విముక్తమై పోయింది దృష్టి
విప్పిన కనుచూపులలో సంగ్రహితమైంది సృష్టి.
మనిషి కంటివెలుగులో కన్పించే దృశ్యాలు
ఒకటా రెండా? ఎన్నని లెక్క పెట్టగలం ?
వాని అనుభవంలో మనస్సు ప్రసరించే రీతులు
ఒకటా రెండా? అవియెన్నో వానికి తగినన్ని.
మబ్బుల దుస్తులు ధరించి వెలిగెడి రోదసివలె
ఆశా చిత్రాలు నింపుకబ్రతుకు మనోజీవులు.
కదలిపోవు సమాజ రథచక్రపు టిరుసులు
వదలక వ్రేలాడు అసంఖ్యాక సంధ్యాజీవులు.
సామాజిక బంధనలో సతమతమౌతూ నిత్యం
మూఢవిశ్వాస పరంపరల కాహుతియౌ జనం.
ప్రజాస్వామ్య దేశంలో నియంతృత్వ రాజ్యంలో
స్థితి మారినా మానవ మనస్తత్వం మారలేదు.
మానసిక వ్యాపారం ప్రబలుతూన్న ఈ శతాబ్దంలో
పాశవిక ప్రవృత్తి ధరిస్తూంది మరో నవ్యముగ్ధాకృతి.
మనిషి మనిషికన్న ఉన్నతంగా బ్రతుకదలచినపుడు
నాటికి నేటికి ఏనాటికి నశించదు సాహిత్య ప్రాముఖ్యం.
మనిషి మనిషికన్న అధికంగా బ్రతుకదలిచినపుడు
నాటికన్న నేడు మీరుతుంది విజ్ఞాన ప్రమేయం.
ఒక ప్రక్క అంతరిక్ష శోధనలో విజయసాధనల యత్నం
మరోప్రక్క అంతర్బహిఃక్షోభలతో జీవితంలో పోరాటం.
జీవిత సమరంలో అడుగడుగున దాటవలసిన కాలం
ఆవరించి భయపెట్టు నీడలు! విచ్చి ఆకర్షించు వెలుగులు.
ఉదయం వెలుగు సూర్యుడు,
రాత్రి చీకటి చంద్రుడు
వివృత సంవృత రూప జగద్భావనలో
పరివర్తన, సృష్టి సౌందర్య వికాసం.
విశిష్ట బహు భావానుభూతి
ఈ విచిత్ర సృష్టిలో ఎవరికి?
కాలస్వరూప సౌందర్యాభిజ్ఞత గల
ప్రమాణ మెరిగిన పరిణత సూక్ష్మమతికి!
iii
గ్రీష్మంలో ఇంకిపోయిన నదివలె
సూర్యుడు అస్తమించిన దిశవలె
ఇంకా చావుతప్పిన బ్రతుకు గడుపు
ఇరవయ్యో శతాబ్దంలోని సామాన్యుడు.
గాలిలో అదృశ్యమైన ఆశను
మేఘంలో మెరపు జ్ఞాపకం చేస్తున్నది.
సూర్యుడు తమ ముఖాన
ఎప్పుడు పొడిచేదీ ఎవరికీ తెలియదు.
రాత్రివేళ భయంకర నిద్రా సమాధివలె
సంగీతం విరమించిన సముద్రం వలె
ఆగిపోయింది కాలం నిశ్శబ్దంగా
ఉచ్ఛ్వాస నిశ్వాసం ఆగిన శరీరంవలె
అంతరిక్ష గోళాల్లో ఆవాసానికి
ప్రయత్నాలు విరివిగా సాగుతున్న ఈనాడు
భూగోళంపై జీవించే సహవాసికి
తిండికీ బట్టకూ అఘోరించే అభాగ్యం!
కొలిమి తిత్తులవలె మండిస్తూ ఊపిరితిత్తులు
చలికి బిగిసి ఏనాడో గడ్డకట్టిన ఆలోచనలతో
ఎక్కడ వేస్తే అక్కడే మట్టిముద్ద స్వభావంతో
కబంధుని చేతుల్లో కీలుబొమ్మ సామాన్యుడు.
ఒక నియంతవలె వీచే గాలి అదుపులో ఒదిగి
తలలూపుతూ చప్పట్లు కొట్టు చెట్లగుంపులు.
కవితా వస్తువును చర్చల్లో సిద్ధాంతీకరించి
కవిత్వం మినహాయించి సందేహ రహితంగా
తమలో సుప్తమైన అహంకారానికి
వర్ణాకృతి ఇవ్వబడుతున్న సాహిత్యం!
రక్తంలో చురుకుదనం బుద్ధిలో మెరపుదనం
కంటికి కనిపించని గోడలను పగులగొట్టు సాహసం
తనలో విశ్వవిశాలత్వం పెంపొందిన మనస్తత్వం
అవసరం సామాన్యునికి ఒకే ఒక మానవతా సూత్రం.
సామాన్యుడు విడిచే భారసహిత నిశ్వాసం
తేలిక పరచగల అపూర్వ సాధనం;
ముక్త కంఠంతో సర్వత్రా వినిపించు
వర్గరహిత సమాజ పరిణామ నినాదం!
iv
నిల్చి యోచిస్తు గ్రుడ్డివాని ఊహలవలె చుక్కలు
చుట్టు వెతుకుతున్న గ్రుడ్డివాని చేతులవలె గాలులు
ఒకరి సంజ్ఞ వేరొకరికి తెలియని దుస్థితిలో ఉన్న
మూగ జీవుల మనోభరిత మహావేదన నింపుకొని
బయల్దేరి అక్కడక్కడ ఒదిగి ఉన్న మసక వెలుగులు!
ప్రకృతిలో మృదు రూపం ధరించిన భయంవలె
మనస్సులో భయదాకృతి దాల్చిన ప్రేమ వలె
అంధకారం ! పగిలిన అంధకారం ! ఆక్రమించిన అంధత్వం!
తలపై వెలుగుతున్న విద్యుద్దీపకాంతి కిరీటంతో
ప్రక్కనే విడిపోజాలని ప్రాణమిత్రం ఇనుప స్తంభం
క్రింద కాలు విరిగిన కుర్చీవలె పడి ఉన్న చీకటిలో
ఒక మూల కూర్చున్న ‘సన్డే’ మణులు
‘సన్డే’ మణులు రాత్రి పోయిగాని చేరరు నివాసం
‘వన్ డే’ లా గడచిపోతుంది వాళ్ళ జీవితం !
ఆశలు హద్దు మీరకుండా, వైవిధ్యమసలే లేకుండా
ఓటు హక్కు తెలీకుండా, ఓనమాలు వచ్చీరాకుండా
తమ నీడే ఒక బొంతగా చుట్టుకున్న నగ్న జీవులు,
సమాజ సమరంలో దూరం విసరబడిన అదృష్ట హీనులు
నాలుగు పాదాలు విరిగిన ధర్మం యొక్క రూపశకలాలు!
నిరంతరం పీడించే చిక్కు విడని సమస్యలకు ప్రతీకలు !
ఆకాశచ్ఛత్రం క్రింద ధరామహిత గర్భంలో
వృక్షచ్ఛాయలలో పాడుబడిన గోడల ప్రక్కన
ఎంగిలి విస్తరాకుల చుట్టూ మూగిన ఈగల రొద
అనురణించు ఊహలు గల సంధ్యా జీవులు !
గ్రీష్మాతప శుష్కితమై అగ్నిచే సగం దహింపబడి
రథ్యావీధి నడవనేర్చిన చెట్లవలె, మౌనాలాపంతో
ఉదయ రథచక్రం వెనుక వెలుగుదాలు నంటివచ్చు
నీడ బొమ్మలవలె కదలిపోవు సందేహ జీవులు.
ఈ స్థల మా స్థలమని లేకుండా
ఈ జాతి ఆ మతమని లేకుండా
ఏ మూలనుండి వినిపించినా
క్రాంతికారక కంఠధ్వని తరంగం!
ఈ స్థల మాస్థలమని లేకుండా
ఈ జాతి ఆ మతమని లేకుండా
ఒక పెట్టున మ్రోగుతుంది
సామ్యవాద ప్రపంచ హృదయం!
I
హిమజ్వాల
ఈ ఉషస్సాహిత్య వీధుల
రెక్క విప్పిన మొగిలు నీడలు!
ఈ నిశా నిద్రాంబరమ్మున
సాశ్రు శిఖల విషాద స్వరములు!
ఈ ప్రశాంత మహాకాశము ఒకసారిగ
మృత్యుతాండవ రవము విన్పించునేమిది?
ఆ హిమాలయ కందారాసీమ మ్రోగెడి
కృతఘ్నతా భరశతఘ్ని చయ యత్నములు !
ఈ గడ్డపై వీచు శీతల వాయువులు
సదా సుమనోభిరామములు
రివ్వున దూసిచను పదను కత్తులవోలె
ఎదకు భాసించునవి యేమి?
ఆ హిమ భూమి కదలు సైనిక నేత్రములు
వదలు సర్ప దృశాగ్ని కీలాచయమ్ములొ!
పురాణవీధీ చరన్మోజ్ఞ దేవతా
సమూహ సమూహ దీపించు నివసనము
హత్యాబుద్ధి ఇట చరించెడి జీవులెవ్వరు?
సూర్య తేజము మ్రింగనెంచెడు మబ్బుమూకలు!
శతపత్ర ముగ్ధ వదనము పైన
నెత్తురు గంట్లవలె, అంతలో
హిమ శీతల స్వచ్చభూమి పై
అగ్ని కణములవోలె, భాసించి
మూకలు మూకలుగ వచ్చిపడు
కాలముద్రా మూర్తులెవ్వరు?
శాంత తేజో లీన రేఖాదేవి
హిమాచ్చ సుషమా ఫాలతలమున
అగ్ని కీలలు రక్త ఝురులు సృజింప
నెంచెడి చీకటి ముద్దయెవ్వడు?
ప్రతి భారతీయుడు విడిచిన
ఒక్కొక్క ఉష్ణ నిశ్వాసమ్ము
తమో రాత్రివలె భయదమై\nదీర్ఘమైహిమభూమి చుట్టినది!
ఒక్కొక్క హృదయమ్ము రవి
బింబ సదృశ తేజస్ఫూర్తి
చీకటి శవము కాల్చగా
పండు నిప్పులను చెరగినది !
ఉదయాస్త మయ దివారాత్రములు
ఋతువులు కామనల కాస్థానములు
క్షణములు, తృటిలో మరచి సర్వము,
ప్రదీప్తమతియై; గగన మెత్తున
ఫణసహస్రము విప్పి నా జాతి
నిలచినది కాల భుజగము రీతి,
నిప్పుగప్పిన నివురు గాలికి లేచెను
ఎవని చూచిన ఒక్కొక డగ్ని గోళము
ఎవని హృదయము ఎంచిన దుఃఖభరితము
బాడబాగ్ని వహించు మహాసముద్రము!
స్వేచ్ఛా సమాజ రిరక్షా వ్యగ్రమై
నా దేశమే చైతన్య సంభృతమై
మేల్కొని జ్వాలవలె శతకోటి ముఖముగ
తేజోఽసహ్యమయ్యెను శత్రుకోటికి.
కొండవలె నిలచి కదలిక లేక
కలల తూగెడు జాతి కాదిది !
చెలియలి కట్ట ఎరుగని వార్నిధి
నిత్య భాస్వర దేవతామతి !
మహా దాహము గొన్న కాలము
రక్తఝురులను కోరుతున్నది.
కాలమును కబళించనీయము
ఖడ్గ వ్యూహము విభేదింతుము !
ఎదపై నిప్పుల కుంపటి
దించిన ఆ కృతఘ్నులను
తుద ముట్టింపగ త్వరగా
హిమ జ్వాలలను ఆర్పగ
జ్యోతిర్ధూమ జల సంభృత
నవ ఝుంఝూహుంకృతితో
ఉరుములతో మెరపులతో
రణవ్యూహ నవమతితో
కదలుము నేపాల్ ప్రాంతము
తరలుము లడక్ భాగము.
కదలండి శతఘ్నులవలె
ప్రొద్దుపొడవడానికి బదులు ఈ రోజున హఠాత్తుగా
యుద్ధం వచ్చి పడింది, మన ముఖాల ముందు :
యుద్ధ వార్త వినిపించిందో లేదో
జ్వాల లెగసే పూల నదుల వలె
నిప్పులు చిమ్మే గోళాలవలె
చైతన్యం విరిసిన స్త్రీలు పురుషులు.
ప్రళయ సముద్ర తరంగాలవలె
బుసలు కొట్టు త్రాచులవలె
ఘోషలతో, పూత్కారాలతో
నేల ఈనినట్లు ఎక్కడ చూచినా
దేశం నలు మూలల వీధుల్లో మైదానాల్లో
ప్రతీకారవాంఛలు ప్రకటించే జన సందోహం!
దేశాభ్యుదయ యజ్ఞానికంకితమైన దేశంపై
విరుచుకుపడి ఎగిరే చైనా సమర విహంగం రెక్కలు
తుత్తునియలు చేసేవరకు, చివరిమనిషి తెగేదాక
తుది చూడక విశ్రమించరు ! ఎంతకైనా సంసిద్ధులు !
కార్మికులు, కర్షకులు, మేధావులు, విద్యార్థులు
ఒక్కొక్కరి హృదయమొక శాంతి కపోతీ నివాసం
నివాసంపై తుపాకులు ప్రేల్చే హంతకుణ్ణి మరవ కండి
ఇందాక వచ్చాక అడుగు వెనక్కు వేయడం జరుగదు !
మనం పీల్చేగాలి అప్పుడే బరువెక్కిందీపాటికే
లేవండి మహాగ్నులవలె కదలండి శతఘ్నులవలె !
శత్రు పాశవిక ప్రవృత్తి నిరోధానికి
చండ ప్రచండత్వమే పరమౌషధం
శాంతి పాఠాలు వల్లిస్తే చెవి ఒగ్గే
సమయం ఏనాడో అంతరించింది !
మబ్బు మెరపులకు భయపడి
సహజ గమన వ్యవహారం విడుస్తుందా ప్రపంచం?
మెషిన్ గన్లకు ఉలికిపడి
భూభాగం గౌరవం వదలుతుందా భరతదేశం !
పిడుగులు ప్రహరింప జేసే
యంత్రశక్తి మేఘానికెంత తెలుసో
పన్నిన భూకబళన వ్యూహం
సాగిచావదని చైనా కంతే తెలుసు !
బలప్రయోగ వైఖరితో రాజ్యవిస్తరణ తత్వం
కాలానికి కత్తులవంతెన కట్టాలని వేసిన పథకం
ప్రజాస్వామ్య సంఘటితశక్తి ఎన్నటికీ సాగనీయదు.
కూల్చివేస్తుంది తప్పక భాయీ ! చౌ ఎ లై !
ఇన్నాళ్ళు ఓపిక వహించిన ఈ శాంతి ఖండం
ఈనాడు ఉండి ఉండి బ్రద్ధలైన అగ్ని పర్వతం
ఉద్రేకోత్సాహంతో, రుద్రతాండవోద్వేగంతో
అగ్ని ఝురులవలె పరుగెత్తండీ ! సైనికులార !
లోహరాక్షసుని కుతంత్ర వ్యూహం
విచ్ఛిన్నం చేసే దీక్షలో
నిమగ్నులైన నా సోదరులారా !
స్వేచ్ఛా ప్రపంచ బలం సర్వం
ఈ దేశం వెనుకే ఉన్నది !
ఈ యుద్ధంలో తుదివిజయం మనదే !
ఆ మంచుకొండలలో విద్యుత్ప్రవాహంవలె
మండే శక్తులతో నిలచిన నా సోదరులారా !
ఈ దేశభవిష్యత్తుకై వెలిగింపబడిన జ్యోతుల్లారా !
విషవ్యూహం ఛేదింపగ నిలచిన అమృత మూర్తుల్లారా !
గుండెలో బాకు రువ్వి కీర్తి పతాక ఎగురవేసే
శత్రువు, వీడనిదే భూమిని జయించనిదే వారిని
సమర ప్రతిజ్ఞ వీడకండి ! సన్నాహం మానకండి !
లేవండి మహాగ్నులవలె ! కదలండి శతఘ్నులవలె !
ఈ ప్రజాస్వామ్య యుగంలో దేశంలో
ఏ మూల ఏ విపరీత కృత్యం జరిగినా
సామాన్యుని జీవితం పై దాని ప్రభావం
అసాధారణం ! ఆతని బాధ్యత అనల్పం !
కాలానికి కెదురీదకు ఓ మనిషీ ధనస్వామీ ! వ్యాపారీ !
పదంలో వేగం హెచ్చి వేగానికి రెక్కలు మొలిచి
సమృద్ధి సంపాదనకై లోపించకు స్వశక్తి యత్నం !
తెగించి త్యాగం చేయి ! మండించకు జీవితం !
బరువు నడకలతో మౌనముఖాలతో
ఆక్రందన స్పందించు అమాయకశీలంతో
నగవు హరించిపోయిన పెదవులు బిగించి
ఎక్కడో వంపులు తిరిగిన ఆకాశంలో
ఆశలు భద్రపరచుకొని
ప్రాణాలరచేత పట్టుకొని
పిల్లలతో పశువులతో
స్తంభించిన గాలిని
కత్తులవలె చీల్చుకుంటూ
తరలివచ్చే కాందిశీకులు !
మానవతా వాసనా స్పర్శలేని
ఇనుప హృదయాల కెదురుగా
దేశాన్ని రక్షించడానికి
దేహాన్ని డాలుగా ఉపయోగిస్తూ.
దేహం పైని రక్తసిక్త వ్రణాలు
గులాబి పుష్పాలుగా భావిస్తూ
ఒంటరిగా ఉన్నా తనచుట్టూ
పదిమంది నిలచి ధైర్యమిస్తున్నట్లున్న;
కోపంతో ఎర్రనైన ముఖంలో సైతం
చిరునవ్వు వెన్నెల చిందినట్లున్న
నిప్పులుక్రక్కే మంచుకొండలలో;
ముందుకుసాగే సోదర సైనిక బృందం!
ఈ దేశం అభిమానం ఆత్మగౌరవం
మూర్తీభవించిన మహా తేజశ్శిఖరం !
★
పద పద !
పదపద ప్రళయం
భీకర వలయం
ఛేదించుక పద !
పదపదంలో ఒక క్రొత్త లయ
ఎదలో స్పందింపగ క్రొత్త సృష్టి
ఆడుగు జాడ వెనక వదిలి
సాగిపో ముందుచూపు నిలిపి
నిదురించకు, నీ మస్తిష్కం
రాట్నంవలె మారును తథ్యం
ఒకరిలోని దౌర్బల్యం
మరొకరికి సౌబలమై
సాగుతున్న సమాజపు
సరిహద్దులు చెరిగిపోయి
ఉదయించు నవచరిత్రకు
అవరోధం హతమారుస్తూ
పద పద ! సమరం
దుష్కర సమయం
సాధించుక పద!
అబలసబలయై కలికాలంలో
వ్యోమవిహారం సాగిస్తున్న
ఈ ఇరవయ్యో శతాబ్దంలో
‘‘కోమా’’ వదలని అసంఖ్యాక జనం
దీర్ఘ నిద్రపోతున్న కొండలు !
రాత్రి నడవ నేర్చిన చీకట్లు!
పద పద ! దీప్తమతి !
తమిస్ర వలయం
చీల్చుక పద!
పద పద ప్రళయం
భీకర వలయం
ఛేదించుక పద !
పద పదంలో ఒక క్రొత్త లయ
ఎదలో స్పందింపగ క్రొత్తసృష్టి