Pruthvi Geetam — Volume I — Addendum 1

పృథ్వీగీతం — మొదటి సంపుటం — Addendum - 1

1961 · Telugu (te) · 32 pages · Human-proofread

పృథ్వీగీతం

మాదిరాజు రంగారావు

స్వేచ్ఛా కవిత్వం

పృథ్వీగీతం

ఆచార్య మాదిరాజు రంగారావు

SWECCHAA KAVITHVAM

PRUDHVI GEETAM

Prof. Madiraju Ranga Rao

© Dr. M. Santhosh Kumar

Rasadhuni Sahithi Parishath, Hyderabad - 28

ప్రథమ ముద్రణ: సెప్టెంబరు 1961

రసధుని ప్రచురణ హైదరాబాదు.

పునర్ముద్రణ: జూన్ 2026

అనుపమ ప్రింటర్స్

శాంతినగర్, హైదరాబాద్

ఫోన్ : 040–23391364

I

గుండెలోతుల నుండి త్రవ్వుకొని వచ్చు

సౌందర్య రసానగాఽవిష్కారము నీ ఆకృతి

చైతన్య కళాశక్తి మూర్తీభవించిన శిల్పము

నా స్మృతి నాక్రమించుకున్న నీవెరుగని విస్మృతి

నిశ్శబ్దం నిద్రావస్థనుండి మేల్కొని

నైల్యస్థితి దాటిన సమయం

నా మనో రోదసి ప్రాభాతమయంచేయు

మహోదార జ్యోతిస్సాహితీ పుంజం.

వాడిన కనుచూపులు పెనవైచుకొని

ఏ పురాజన్మ రహస్యాలనో స్మరింపజేయు

శరన్నీల గగన రేఖలు బింబించుకున్న

సరశ్శోభా తరంగములుబికి వచ్చు కనులు.

ఒక అనుభూతి వెలుగు ఊహల సాగుదలవలె

ఒకగాలి కదలిక విసరుకు పరవశమై

ఎదపై, మసృణ వలాహక హస్తం హత్తుకొన్న

దిగంత రేఖా కిర్మీర ప్రశాంత మహాకాశం.

అశ్రుకణ సమూహమొక రాతిరూపు చెందినట్లు

శిశిర మరుద్వితతి పెనవైచుకొన్న, అగ్ని శిఖామతి;

ఆర్తరవము మ్రోగి మ్రోగి నిల్చినట్లు మ్రోడువలె నిశ్చలంగా

భూమిపై, ఒక మూల మృత్యువు నీడవలె పడి ఉన్న నేను

ఈ అనిర్ణీత ప్రపంచ పరిధి మానవతామృదు జన్మ ఎత్తి

ఏదో ప్రవృత్తి మిడుకుచున్న నాకెన్ని జన్మలకో కలసి

బ్రతుకు లోతులు స్పృశించి వెలుగులు త్రవ్వి తలకెత్తు నీవు

ఒక మంచుగాలివలె, నా వెంట సాగిరావా? అనలమూర్తిని, నేను

ఆకాశం వలె అందని నీ స్పర్శానందానుభూతి భావన;

మైనరాల పరవళ్లుత్రొక్కు, అమృత భరోత్సాహంతో

దీప్తమైన ముఖమెత్తి, దీర్ఘమైన ఊహల రెక్కలుచాచి

నీనీడనైనా అందుకొనగా, అహొ! ఎంతకాలం యత్నించా

ప్రతి దినమొక నిశా ధూమశకల పిహితానల మండలమై హసింపగా

ఎంతకాలం నుండో, హిమ శిలవలె బిగిసిపోయి

ఎంతలోతుననో అట్టడుగున దిగబడి ఉన్న

నన్నొక్కమారు వెలుగు గడ్డకెత్తుకొని పోయి

నిర్ఝరివలె ప్రవహింపజేయు వైహాయస

చరదరుణమూర్తి\nనామనశ్చక్షువునకు నీరూపమెంత దగ్గర అంటే

నా రూపానికీ నీడకు మధ్య ఎంతదూరమో అంత

అవిచ్ఛిన్న కాల గమన స్వరూప వ్యాఖ్యానమతులు,

రవికీ శశికీ గల సంబంధం, మనకు గల బాంధవ్యం.

సంధ్యాసమయం సమాసన్నమయ్యే వరకు నిత్యం

లజ్జారుణ భావరమ్య హసన్ముఖ దీపశిఖవలె,

వెలుగు రెక్కలతో ఎగిరివచ్చి, నిప్పుకోల్పడ కన్నులు

నాలో లీనమైన నీ రూపం మరలినట్లే తెలియదు.

మలి సంజవోలె వాలిపోవు నాకనురెప్పలలో

తొలి సంజలందు వెలుగు వోలె దూకు నీ ఆకృతి

ఉదయాకాశంవలె విప్పారెడి కను రెప్పలలో

అనురణించు దృక రేఖాతీతమైన నీ భావన

ఇంతవరకు ఈ సంకీర్ణ ప్రపంచంలో మసలుతూ

ఏవర్ణపు దుస్తులు ఏ రాగధ్వని స్పర్శ ఎరుగని

నానగ్న మనః ప్రకృతిస్థితి, సూక్ష్మాతి సూక్ష్మంగా

మలగిన, ఒక సుందర శివరూపము నీ ఆకృతి.

II

జన్మించిన లిప్తనుండి నాముఖంలో బింబించి

అనుక్షణం సమయం కోసం వేచి ఉన్న భవిష్యత్తు.

వదలబడిన ఊరుపుతో మేల్కొన్న మనస్సుతో

గాలిపిండులో కలసి అంతమొందిన వర్తమానం.

అంతలో ప్రత్యక్షం, స్పర్శాలోచన గమన శక్తి లేని

ఆకాశం ఆవరించిన, ఆలోచనా రమణీయము గతం.

కాలంయొక్క అవిచ్ఛిన్న సంగీతం వినడానికే

లేచి కూర్చున్నవి శ్మశానంలో నిదురించే నీడలు.

కోరిక గల ప్రాణి సమూహం మాత్రమే వెలుగువలె

కదలుతుంది బ్రతుకుతుంది జన్మిస్తుంది తిరిగీ.

ఒక భయ రేఖాధ్వనికనిశ్చయంగా ఎగిరి

ఎక్కడో అవిజ్ఞేయంగా వాలిపోవు పక్షులవలె,

ఒక లిప్తకు వేరొక లిప్తతో సంబంధం లేని

మనస్సులోని చిత్రమైన ఊహలకనుగుణంగా మలగి,

ఎప్పుడో ఎక్కడో విసరబడి నశించిన

చరిత్ర దృష్టికందని వైప్లవ జీవితాలు.

రేణువులు రేణువులుగా గాలిలో ఎగిరిపోవు

బూది కుప్పవలె మారిపోవు శరీరంగల మానవుడు

క్రీనీడల చెరసాలలో బంధింపబడి ఖైదీవలె

బ్రతికినంతకాలం మానవునకే ఎక్కువగా శత్రువు

ఆకాశంపైని ఒక్కొక్క నక్షత్రంయొక్క హాసం

శ్మశానంలో నిప్పురవ్వలవలె భావింపజేయు రాత్రి

పరుపబడిన చీరకుచ్చెళులలో దాగిన పృథివి

విసరబడిన కొంగు చాటున కన్పించని దిగ్వలయం.

ఈదిక్కుల ముఖంలో తెలివిదూకుడు ననుసరించి

భూమిని ఆక్రమించుకొన్న మానవుని నిభృతవర్తనం,

ఇంతవరకు పొందలేదు మానవతామనోజ్ఞతాభిజ్ఞత.

మనఃపరిధుల ఆక్రమణతో, అందలేదు పరిపూర్ణత

ఎదురెదురుగా జంటగా మూకలో కలిసినపుడు

ఎప్పుడు చూచినా ఒంటరిగా సామాజికంగా

ఎక్కడ చూచినా వీధిలో, విరామస్థలంలో

ఫ్యాక్టరీలో ఆఫీసులో కన్పించే మనిషి ముఖంలో

నిన్నటి గురించి నిరాశ, నేటి గురించి అతృప్తి

రేపటి గురించిన ఆలోచనల అందమైన బొమ్మలు

ఒకే మనిషిలో మనకు తెలియని ఊహింపరాని సంస్థితిలో

ఒక దృష్టినుండి తప్పించుక తిరుగు అసంఖ్యాక మానవులు.

లిప్తల మార్పుతో, సంఘటనలో మార్పు లేమీ జరుగనట్లు

ఒక నీలి తెర తొలగగానే వేరొక ఉదయం భాసించినట్లు.

ఇదమిత్థమని నిర్ణయింపగా వీలు లేని విపరీత సృష్టిలో

ఒక జంతువు మృగం లేదా రాక్షసుని జీవితంలో

ఎప్పుడో ఒకప్పుడు భయాత్మక మృత్యు సామీప్యంలో

ఒక మూర్తి రేఖకట్టి బయల్పడు దేవతా భావం.

నిర్ణయింపగా ఊహశక్తి ప్రసాదింపబడిన తరగతి

నిత్యజీవితం విడదీయరానంతగా అల్లుకొనిపోయి,

జీవిత కాలంలో ఎన్నడూ మోసులెత్తకుండ దేవతా భావం

సర్వ వ్యాపృతమై ఎప్పటికప్పుడు అణగద్రొక్కు రాక్షసత్వం.

ఈ సమార్ద్ర ప్రవృత్తి యొక్క వివృతరూపం

సంగీతం సాహిత్యం శిల్పం త్యాగం,

ఈసమార్ద్ర ప్రకృతి యొక్క సంవృతరూపం

అధికారం తీరనిదాహం వ్యాపార మనోలక్షణం

వివేక సహిత రాగరహిత అంతర్ముఖీనదృష్టి

ప్రపంచ తత్వ సౌందర్యసమున్మీలనావలోకనము,

వైయక్తిక సామాజిక సహస్రభావనాపరిధుల

అతిక్రమించిన, మృదుజీవుల దివ్యానుభూతి విశేషము.

జీవితమొక చివర తెలియని చీకటి వంతెన

సంఖ్య తెలియని అనుభవాల వెలుగుమెట్లపై

అడుగడుగునకొక పునర్జన్మ ఎత్తినట్లుగా

గమనం సాగించు నను అవలోకిస్తూ వరుసగా

కదలిపోవు ఉలుకని పలుకని సంగీతాత్మలు లిప్తలు

ఈ లిప్తల సంపుటికాలం, గమనం అవిచ్ఛిన్న సంగీతం

వెనుక నుండి క్రిందికి ఈడ్చు ఎవరిదో యత్నపు కదలిక

ముంగల, పైకి పోవగా నౌకవలె; హస్తోర్మికా సహస్రము.

దుఃఖత్రయ రేఖల సాగుదలతోనే ఆరంభమై

ఎన్నో యుగాలనుండి పుంజీభవించుకున్న సంస్కృతీచిహ్నం

మానవుని, సుఖభావనా నివిష్ట జీవితం

ఒక స్థితిలో బింబీకరించుకున్న దర్పణం, కాలం.

జీవితంయొక్క మొదలు చివర బిందువులను

ఈలోకంతో కలుపు దివ్య రేఖ పరమేశ్వరుడు.

ఆశ్చర్యానుభూతినంటి వెలుగులోతులు త్రవ్వుకొని

అలౌకికంగా సాగు జిజ్ఞాసా ఫలితం, వేదాంతం.

III

నేను కాదు తిరుగుతున్నది దిజ్మూర్తిని

గ్రహాలు, వానిచుట్టూ భూవలయం

నాముందు, ప్రక్కల రెండుమూడు నీడలు

నా వెన్ను నంటి వచ్చు సూర్యుని కరచ్ఛాయలు.

ఉరలు కంటి వెలుగుల నడ్డుటకై

సర్వంసహ విస్తరించిన తమో వేల,

నిదురలో అనురణించు పీడకలలు

యోగశిఖపై రాలిపడు ధూళికణాలు.

రెండు చెక్కలుగా వ్రయ్యలై

ఒకదాని నొకటి విడువలేని

ఒక దాని ముఖంచూచి వేరొకటి

ప్రక్కకు తప్పుకొని, ఒదిగిపోవు;

ఒక అనుభూతి ఊహవలయితమై

ఇంద్రియ తర్పణీయ ఋతు చిహ్నితమై

దివానిశారూప సంకేతాలతో నిల్చిన

అవిచ్ఛిన్న దశాపరిణాహ రేఖ– కాలం.

నిదుర ముంపు వచ్చిపోయి మెలకువ కలిగేలోపల

కనులుమూసి తెరచేలోపల — మాట పెకలి వచ్చేలోపల

ఉషస్సు తూరుపు గడపదాటి అడుగువేసే లోపల

పాదరసపు గుళికలవలె జారిపోవు లిప్తాంశలు.

ఆకాశంకన్న నిడివైన, భూమికన్న బలమైన

ధ్వనికన్న వేగంగల, మెరపుకన్న వాడిమిగల

బాంబుకన్న భయదమైన, సృష్టికన్న సుందరమైన

ఆలోచనలు సారించు మేధాశక్తిగల మానవులు.

జీవుడు ఈ మానవ నాగరక జన్మఎత్తి

లౌకిక వ్యూహంలో చిక్కిన మృదువేళనుండి

సృష్టి బహువర్ణ సమూహంతో స్పష్టంగా

వికసనోన్ముఖమౌ లిప్తయొక్క స్పర్శ మొదలు;

ఒకనాటికొక దశలో అంతమొందని

అజ్ఞానంతో ఆరంభమైన ప్రపంచం.

ఎప్పటికప్పుడు సమస్యలు తీరినట్లు

అప్పటికప్పుడు భాసింపజేయు విజ్ఞానం.

ఎన్ని మెట్లు ఎక్కుతూ పోతున్నామో ఇలా

ఎంతఎత్తున ఉన్నామో ఎవరికీ తెలియదు

అప్పుడప్పుడు మెరపుతీవ మెరసినట్లు

దృష్టిసారిస్తే కన్పించేవి–శిలా పంక్తులు.

గాలి రొద ప్రసారం చేయు వృక్ష వితతి

దిగ్భిత్తికలకు వ్రేలాడు మబ్బుగబ్బిలాలు

అక్కడక్కడ సనసన్నగ నీడ బొమ్మలవలె

సంచరించు ప్రేతభావోపేతముఖులు.

అజ్ఞానాన్ని అధికంగా ప్రేమించే చీకటిముద్దలు

అకారలోపంగల తేజస్విని ద్వేషించు దివాంధులు

విమానం మ్రోతవిని తీతువు కీచుమని అరచినట్లు

స్పుత్నిక వేగంచూచి ఎద్దుకంట తడి పెట్టినట్లు.

ఒక నదీ మహావర్తంలో చిక్కి

పల్లటీల్గొను నావవలె

తలకు మించిన వ్యూహంలో

అసువులు కోల్పోవు భ్రష్టమతులు.

కాలానికొక చరిత్ర నిర్మింపజేయు వారి

జీవితంలో, ఒక సమార్ద్ర పరిష్వంగంతో

నిప్పుపంట పండింపజేయు హసన్మూర్తులు

మసృణనవాగ్ని శిఖాభ సౌందర్యజీవులు.

అధికార వ్యామోహం, కీర్తి కాంక్ష ప్రబలి

అంతరింపబడిన ఒక రాజవంశ రక్తంతో

తడిసినట్టిదే వేరొకటి ఆవిష్కరింపబడి,

అణగద్రొక్కబడిన ఒక జాతి, మతం స్థానంలో

జరుపబడి వేరొక జాతి మతాభ్యుత్థానం

సహస్రధా చీలిపోయి అందని ఊహమార్గాలు.

ఆక్రమించి అవనితలం ఆకాశమండలం

ఆచంద్రార్కం స్వీయ యశోబింబాలుగా

నిల్వడానికే, నిన్నటివరకు సాగిన రాజరికం

చేసిన, సర్వతోముఖ ప్రయత్న ఫలితం.

మనస్సు లోపొరలో అణగి మణగిన

పశుభావం మృగతత్వం — భిన్న భిన్న

రూపాలలో, ఆవిష్కరించుటకు చేయు సాధన

మానవుని లౌకిక ప్రచాలనంలో నీతిభాగం.

లౌకిక జీవన దశాభేదస్ఫూర్తి

మనః పరిధుల విస్తారత చూపు

యశః పతాకాచ్చ కాంతి బింబాలు

చరిత్రలో నిలిచిపోయిన వెల్గు మెట్లు

కల్లోలానిలంవలె మనోఽంతర పదవి

సుళ్ళుతిరుగు ఊహల స్వేచ్ఛాగమనం

కార్యదశకు చేరిన భయవేళా సన్ని వేశం,

అనియమిత మానవ ప్రగతి చరిత్రలో

పూర్వాపరస్థితికి మధ్య ఏర్పడిన లోయలు.

విస్మరింపబడిన అసంఖ్యాక రాజుల వీరుల

కళేబరాలతో పూడ్చబడి కన్పించు దిబ్బలు.

ఈ దిబ్బలపై రప్పలవలె వసించు జనం

మనస్సులో పిశాచాలు కంటిముందు నిప్పుసెకలు.

మబ్బు తున్క కన్పిస్తే చెమ్మగిల్లు కనుకోసలు.

శరీర సంస్పృష్టిగా సాగితే శీతల వాయురేఖ

ఒకడొకడు పొందు ఆనందం బ్రహ్మపదవి చేరిక.

బిగిసిన నేల నిండుగా వానకురిసి సడలి

ఒక నవ్వు పోచ ఉద్గమించలే దింతవరకు

*

గోధుమ వన్నె త్రాచులవలె దిగ్వలయం ప్రాకి

చండ ప్రచండోష్ణాంశు మాలా మూర్తియై

వలయికృత లిప్తల సమూహస్పర్శకు లోగిలి.

అంతలో పరిణాహ రూపంలో మిన్ను మన్ను

అగ్నిశిఖా కలాప జాలంతో అవతరించిన గ్రీష్మం

కణకణలాడు నిప్పుకల హసంతీ హల్లీసకం.

దూరం నుండి ఒక జలకాసారం వలె కన్పించు

ఒక ఆకాశం విడిచి, శుష్కింపజేసి ప్రకృతి సర్వస్వం;

శరాళి గుంఫనంవలె ఎడమినుమంతలేక

హత్తుకొన్న సూర్య కరోజ్జ్వల దీప్తులు

నిప్పులు కుప్పలుగా బూది చెరగి పోయు

సుడులు సుడులుగా తిరుగు వడిగాడ్పులు.

ఒక పెద్ద ఇసుక దిబ్బవలె పగలు

నల్లని రాతి గుట్టవలె చీకటి రాత్రి

గాలిలో తేలు దూదిపింజలవలె వెన్నెల

నీటి బిందువు కోసం మానవుని తహతహ.

కొడి గట్టిన కోపశిఖ వలె ఉన్న ఆకాశం

మసి బట్టిన అద్దంవలె ఉన్న దిఙ్ముఖం

అంటుకొని నిప్పు ఆర్పబడిన బొగ్గువలె ఉన్న భూమి

ప్రాణాధారం కోసం కదలిపోవు మానవుని ప్రయత్నం.

వర్తమానంపై క్రమ్ముకొన్న దట్టమైన అతృప్తి

భవిష్యత్తు గురించి పెంచుకొన్న నవాశలు

జలద శకలం కన్నిస్తే చాలు గగనభాగంపై

విద్యుదాభ కళా పూర్ణమౌ ముఖ పంక్తులు

సామూహిక తత్వంలో మరువ బడిన ఆత్మగత చైతన్యం

సంఘశక్తి పీడన క్రింద అంతరించిన వైయక్తిక వికాసం.

ప్రాపంచిక విభిన్న మూలశక్తులచే ఆకర్షింపబడి

తమకు తెలియకుండా ఒక మారు లొంగిపోయి,

నిలువడానికి సూది మొనంతైనా

సన్నని వెలుగు దారుల విస్తృతి

రక్షణకై పరితపించు బ్రతుకులు

ప్రతి అంగుళం అంగుళం మేర నేలను

మ్రింగి వేయడానికి జల బిందు సమూహంగా

మాటి మాటికి ఉత్సహించు సముద్రం

జ్వలదగ్ని సమోహా సంభ్రాంతిమత్

సంధ్యాటవీ, ధావన్మృగపక్షి సమూహము

రవి బింబ సమాచ్ఛాదన మేఘమండలీ

కల్పిత ఛాయా వాగురానిపతిత జీవరాశి

ఉన్మాద ప్రలపనా సముద్భ్రమన్మరుదావళి

మరుదావలీ సంచాలిత నిర్యూహవృక్షావలి

అశాంతి ఆనందంతో నగ్న నృత్యం చేయు

యుద్ధోన్మాదిని సినీవాలి రాక్షసీ అట్టహాసం

*

ఆకాశముఖంపై సంధ్యా ప్రశ్నలవలె

స్పర్శగుణం, చలనశక్తి, వ్యక్తిత్వంలేని

నడిచే నిలువు నీడల మూకలు—

వేగ గమనశీలి కాలం వదలిన ముద్రలు

అగ్నితో మాసిపోని ఊహలతో పూడ్చబడని

మానవుని ప్రగతి చరిత్రలో చీకటి లోయలు

నిశ్శబ్దం సమావరించిన శిలా విగ్రహాల

పాదాల ముందు రాలిన కన్నీటి చుక్కలు

పర్వతాల హృదయ కర్కశ స్వభావాన్ని

సంగీతంతో సముద్రానికి చేర వేసే నదులు

రాత్రి –

సహజావేశంతో నాలోని అంతశ్శక్తిని

తన వశం చేసుకుని ఆనందించే నిద్రలో

అంతలో అంతమై మస్తిష్కంలో ఆరంభించు

స్వాప్నిక సన్ని వేశాల బలమైన సంఘర్షణ

ఉదయం–

కందగడ్డలా మారిన ముఖంతో మేల్కొని

హిమావృత సూర్యబింబ రూపంలో నిల్చిన

వెలుగు గుడిని చూచే చీకటి కళ్ళలో

తేలే చిన్ని చిన్ని పడవల్లా నిప్పు రవ్వలు

ఉదయం ఆరున్నర,

విరిసిన జన సంచలం

మతి పోయిన చంద్రుని ఆలోచనల లిపి

అర్థరహితమై మాసిపోయిన వేళ

సూర్యుని విశాల హృదయంపై వ్రాలిన

సర్వ జగత్తు భయశోకం మరచిన వేళ

వెలుగు పోయి బీతు బీతుగా ఒంటరిగా

నగరంలోని దీప స్తంభాల చాటునుండి

వీణాశ్రుతులలో వినిపించని దీన స్వరాలు

వంకరలు తిరిగిన సూదులవలె చూపులు

క్రుంగిన భూమితలంపై

పాములు విడిచిన పుట్టవలె

కోర్కెలు ఫలించని ఇసుక దిబ్బవలె

సంధ్యాగ్ని కీలలకు పొగబారి

తెల్లదనం నశించిన ఆకాశంవలె

నేల వాలి పూర్తిగా అతికిపోయి

మన్వంతరాలుగా పరిక్రమించిపోవు

జగన్నాథ రథచక్రాలు పట్టుకొని

మృత్యువు ఊహలతో వదలని చీకటివలె

నీడలు వదలి పోలేని శైశిరాకారాలు

సాంఘిక సమభావ స్థితికందుకొనని

అన్న జీవుల ఆరాటం— ఆరని కాష్ఠంవలె

జీవితం క్రతువుగా పరిణమింపజేయు

మనః ప్రాణి ఆవేదన— జ్వలించే సప్తార్చివలె

పట్ట పగలు—

అగ్ని పర్వత శిఖరం ఒరిగి పడినట్లు;

తనపై ఆకాంక్ష, లోకంపై మమకారం

ప్రక్కవాడితో జీవితంలో అజ్ఞానంలో పోటీ

నిశాఽగమన సంధ్యాసమయం

జాతులు జాతులుగా, మాలలు మాలలుగా

ఇత స్తత ఉడ్డీన విహంగమ సమాకీర్ణమై

చివరలు నీలీకృతమౌ విలోచన పథం

విశ్రాంతి కోరు నిరంతర యాత్రిక సమూహం

పైన అన్నపు మెతుకులవలె చుక్కలు

క్రింద విద్యుద్దీపంచుట్టూ కలవరించు చీకటి

తానై మేల్కొనదు–ఎవడైనా మేల్కొల్పితే

నిప్పంటిన రాక్షసిబొగ్గు – విప్లవం

*

ఆకాశానికి భూమికి మస్తిష్కానికి మనస్సుకు

ముఖ్యంగా తనకైనా తన పరిణామం తెలియని

— పరిణాహ రోదసి

మానవుని ఇష్టాఽపూర్తికి చిట్టచివరి దశ

ఈశ్వరుడు, అతని పాదాల ముందు

అవసర మస్తక సోపాన పంక్తి వలయం

అతని శిరఃపదము మీరి దాటి పోగల

తమలోని ఆత్మభావం తెలియని జీవులు

పరివర్తన చెందని అనాది వారసత్వ చిహ్నాలు

సుత్తెల మ్రోతలు విని ఎరుగని కొండరాళ్ళు

ఋతు పరివర్తన శక్తికి నిల్వ లేక నశించు

ఆకురాలుపు, చిగుర్పు, పెరుగుదల ఎరుగని —గడ్డిపోచలు

జీవితాంతం వెలుగుతూ త్రైగుణ్య విపర్యయంతో

అసంపూర్తి కామనలతో చల్లారని మనఃశ్మశానం

కళానుభూతిలో, లౌకిక వలయంలో

ఆనందం దుఃఖం పేరిట నగ్నంగా

ఉద్విగ్నంగా దీప్తమతికి గోచరించు

అశాంతి గోళిక వివర్త దృశ్యాలు

కాల నియమం లేకుండా సంచరిస్తూ

అజ్ఞాతంగా, అద్దం వంటి బుద్ధితో

అవిజ్ఞేయంగా బింబించు మనోభూమికలు

IV

రక్తారుణ పాద ముద్రలు ఎంత దూరం సాగినవో

అంతవరకు అడుగడుగునా, పలుకు లేని

చూపులేని నడవలేని ప్రతిబింబాలు తప్ప

ఎక్కడా ఎవరి నిజ స్వరూపమూ కన్పించలేదు

ప్రక్కన నడిచే చెట్లకు నాభాష తెలియదు

వాటిలో ఒకరి భాష వేరొకరికర్థం కాదని

తరువాత తెలిసింది చేష్టలను బట్టి

ప్రక్కన నడిచే కొండలకు నా రూపం కన్పించదు

వాటిలో ఒకరి కళ్ళు వేరొకరిని చూడలేవని

తరువాత తెలిసింది నడతను బట్టి

వెనుక నడిచే నీడలకు నా ఉనికే తెలియదు

వాటికి చెవులు, నోళ్ళు, కళ్ళు లేవనుకున్నా మొదలు

తరువాత తెలిసింది జీవం కూడ లేదన్న సంగతి

వెల్గు గీత దాట లేని చీకటి బంతుల వలె

అక్కడక్కడా దాగి దాగి తిరుగు

జ్ఞాన స్ఫూర్తి ఎరుగని జంతువులు తప్ప

ఎక్కడా నా కంటికి మానవులు కన్పించలేదు

ఊహగత మనస్సౌందర్య వర్తిత్వం పెంచుకుని

మానవులను చూడడానికింతగా తపించడం దేనికి?

మనోజీవం నశించిన శవాలు; పీడించే దెయ్యాలు

కంటికి, రంగు వేయబడి కన్పించే మట్టి బొమ్మలు

అంత ఎత్తు కొండ కొమ్ము మీది నుండి

దూకి, సరస్సుపై వాలి పోయిన క్రీనీడలు

కారు మొగిళ్ళ గుంపులు—నల్లని త్రాచు పాములు

బహు విచిత్ర జంతు సమూహ రూపాలు

అద్దంలో అస్ఫుటంగా కన్పించే నీడ బొమ్మలు

పగలు వాటి చుట్టూ నిద్ర వంటి బ్రతుకుతో

రాత్రి మేల్కొని ఒకరి నొకరు పల్కరించుకొని

చీకట్లో నవ్వుకునే కుర్చీలు — కాగితాలు, కలాలు

ఉదయం కాగానే ఏమీ ఎరుగనట్లుగా కన్పిస్తవి.

ముఖాంచల విన్యాస వైఖరి నుండి తప్పించుకొని

ఒక చోట కూడి స్వేచ్ఛగా సంభాషించు కొనే హృదయాలు.

శ్మశాన పాద ముద్రలు – ఇంకా కొంత దూరంలో

ఆత్మీయత, ఆలోచన, నాదశక్తి ఎరుగని

కపాల ముఖ సమాగత వాయుగీతాలు – విని

హర్షంతో వేయి రెక్కలు కట్టుకొని ఎగిరే అడవిపిట్టలు

అవల ఏమున్నదో వాటికి తప్ప ఎవరికీ తెలియదు

దూరం, సుదూరం వెళ్ళిపోయిన నేను

నా మస్తిష్కంలో తిరిగే

ఒక ప్రక్కకు ఒరిగిన ప్రపంచ గోళం

క్రిందికి వాలిపోయిన ఆకాశం

స్థిరమైన ఉనికి ఎరుగని నీడబొమ్మలు

బుద్ధిని వదలని — తృష్ణ తీరనికామనలు

దూరం బహుదూరం వెళ్ళి పోయిన—

నా పాదాలక్రింద ధూళి రేణువులు

నా కనుచూపు సాగి ఆగి మలగిపోయి

శూన్యంలో కలసి మాయమైనంతవరకు

నిల్వుటద్దంలో కన్పించే, వెనుక గీయబడిన

పిచ్చిగీతల్లా నాకు తెలియని నోరులేని లిపి

ఎంతదూరం ప్రాకినా ఎంతసేపు ఆలోచించినా

అంతరిక్షం హస్తగతమై గ్రహాలు స్నేహితులై పోయినా

పైనఆపైన ఇంకా పైన దేనికోసమో ఆరాటమే.

అగమ్యగోచర విస్తార సముద్రం

అవతలి తీరం చేరడానికి ఓడ,

ఒక దాని వెంట ఒకటివచ్చి నిలువనీయక

దాటి వేయు, ఎత్తబడిన చేతులవలె అలలు.

మనిషి యెక్క ఉనికికి మొట్టమొదలు

కావలసింది కొన్ని అడుగుల నేల.

ఆహారం అధికారం సంపాదన రక్షణకు

తనకుగల శత్రువుల బారినుండి

ఎప్పటికప్పుడు స్థితిగతి కాపాడుకోడానికి

తలలెత్తిన ఆలోచనల పరంపరలు;

ఒకక్రమంలో తాల్చిన ఆకారాలు

ఈ కోటలు పేటలు సామ్రాజ్యాలు.

ఏదో ఒక మతనియమంలేని మానవుడే లేడు

ఎక్కడో ఒక బిందువునుండి మొదలుకాని గీతలేదు

వలయంవలె చుట్టబడని అంచులుగల ఊహలేదు

అతడు పొందిన మనోదశా పరిణతిలో

బుద్ధియొక్క దీప్తిలో జీవనవిధా పరిణామంలో

వైశాల్యం వైవిధ్యం ఎంతైనా ఉండవచ్చు.

దాహం క్షుధ లైంగిక విషయ వాంఛలు

అలౌకికానందం అవసరం గుర్తించి ప్రాణికి,

పుణ్యపాపఫలాలు, స్వర్గనరక లోకాలకు

ముడివెట్టి, ఈశ్వరుణ్ణి సృష్టించుకొని;

వీటి సుగమ సాధనాన్వేషణామార్గంలో

అధికార మర్యాదలతో, అహంకారౌన్నత్యంతో

క్రమక్రమంగా క్లిష్టమైన వ్యూహనిర్మాణంలో

మలచబడిన జీవితంలో, అహర్నిశలు,

ప్రపంచంలో తనకు జరిగే సంఘర్షణనుండి

విముక్తి లేదా విజయానికి యత్నించు మానవుడు.

ఒక తుపాను, ఒక రాక్షస మలిన కృత్యం

ఒకదిశ, ఒక స్వభావంలో ఒదిగినట్లు,

ఒకపిచ్చివాని ఊహలు, సముద్రుని ఘోషలు

ఒక పద్ధతి, లయలో విశ్వాత్మలో లీనమై పోయినట్లు,

ఒక నియమిత రేఖను అనుసరించి నడుస్తుంది

అవిద్యమాన అనిశ్చిత సంకీర్ణ మహాసృష్టి.

V

కను విప్పిన లిప్త నుండి స్పష్టాఽస్పష్టంగా

నగ్నమైన నా తనువు నాలింగనం చేసుకొని

ఎంత విసిగినా వదలని హిమాసార సమీరం

జీవ సమూహం కనులలో పరాగం పోసి

అంధులనుచేసి, ఆనందంతో ఎంతకాలంనుండి

నను వెన్నాడుతూ తిరుగుతున్నదో తెలియదు.

ఉన్మనీ దశలో ఊహవలె ఆవహించి మనస్సును

నను వదలనీయదంతకంతకు వదలించుకోదు తాను.

తనకు లేదు శరీరం, నేనెరుగను ఊహవలయం

రోదసీ భావ మెరిగిన ఆకాశానికీ నాకు లేదు భేదం.

అవధులు లేని వంపులు తిరిగి మలపులు మలగి

అహో! అందాన్ని ఆచిపట్టుకోజాలని శరీరం,

కదలిపోవు, నిలకడ ఎరుగని ఊహసమూహం

భూమిని తాక లేదు, నింగినందుకోలేదింతవరకు.

ఒక నిదురవదలి వేరొకటందుకొనే లోపల

తీరం కన్పించని సముద్రం–సముద్రంపై

మొగిళులవలె తేలిపోవు చిన్న చిన్న పడవలు

పైన చంద్రబింబం–నోరు తెరచిన మహాకాశం.

నిదుర పట్టడంతో కాటికి కాళ్ళుచాచి

రెక్కలు విరిగి కుప్పగా కూలి పడిన రాత్రి,

ఎప్పుడో చివర ఊపిరి కాస్త వదలిన దినం

నిదుర వదలడంతో పునర్జన్మతో ప్రత్యక్షం.

భూమికీ ఆకాశానికీ పరిచయం కల్పించే సూర్యుడు

ప్రత్యణువణువు పులకింప జేయు వెలుగు వాకలు

అతణ్ణి చుట్టుముట్టి గుంపులు గుంపులుగా పరుగిడు పాములు

భూమివైపు వరుసగా రివ్వున విసరబడు పూలదండలు

విష్ణుపదం వీడిన బ్రతుకు, బ్రతికెరుగని మబ్బులవలె

నాపాదాలు పట్టుకొని వదలజాలని క్రీనీడలు.

ఒక వైపు ఆహ్వానపత్రంవలె మృత్యుముఖం ఒకటి

రెండవవైపు దేవతా ప్రసార హస్తాలవలె వెలుగు బారులు.

ఈ శరీరాంచల రేఖా పరీవృతమై వాయువులు

ఎదలో జ్వాలా సంగీత రహస్యం ఊదటం మానలేదు.

సన్నని రాగకరస్పర్శతో నిద్రనుండి మేల్కొల్పి

అగ్నికొక ఆకారం కలిగించి, మనస్సు కాహ్లాదం కలిగించి;

వికసించిన అరుణానేక సహస్ర ముఖాలతో వెలుగు

అగ్ని వచస్సమావృతమై పరవశమౌ వాయూత్కరములు.

ఒక నిర్మలాంతః కరణంలో ఊహల సాగుదలవలె

స్పష్టమైన రేఖల కొదిగిన ఒక దివ్యానుభూతి భావనవలె

స్వర విశేష కల్పనలో చకచ్చకితంగా భాసించు దేవీనృత్యంవలె;

వర్ణ సామరస్యంలో సన్నిహితం పొందిన మహాస్సౌందర్యంవలె;

మనస్సముద్రోర్మి కాంశువుల మలపులలో మలగిమలగి

ఒదిగి ఒదిగి పోవు మోహాపాదక వాయు స్వరారకములు.

ప్రసన్నతర సుషీమ దరస్మిత సౌకుమార్యం

ప్రళయభావం పొందిన ఝుంఝా తీవ్రత్వం;

ఒదిగించుకొని స్వీయకల్పనాకృతులలో ఒకటిగా

శరీరం పెనవైచుక నను అడుగుకదలనీయని;

ప్రత్యణువు స్థలం వీసర వోకుండగా వ్యాప్తి చెంది

ఒకలిప్తకాలం ఎక్కడా నిలుకడ ఎరుగకుండ కదలి,

ఎప్పుడలము కొన్నవో ఈ సర్వతోముఖ సంసారము

స్పర్శానుభూతి సుఖదుఃఖ భావకలనామూర్తులు.

సృష్టిగత ప్రాతర్మధురోహా స్ఫురణ వేళ మొదలు

లయస్థితివరకు సాగు మనఇంద్రియతర్పణా హేలలు

మృదు గీశ్శేఖరములు–– సమానోచ్ఛలితానతములు

మన్మనోనభస్థలీ చలన్మధుర వాయు పరిషత్తులు.

శిల్ప రేఖా సీమిత, సంగీత మాధురీ స్విన్న

కవితా ఫలా కారకాత్మలు

యాగినీస్వరూపలు, అమృత భావనా మధువులు

జ్యోతిశ్శిఖారుణదీధితులు.

రివ్వున దూసికొని వచ్చిపోవు మంచుగాలులు

అలలు అలలుగా సాగు కాంతి చక్రసహస్రములు

అనిర్వచనీయమైన ఒకానొక విశేషమనస్థితిచే

సర్వదా పరిపాలింపబడు దివ్యానుభూతికదంబములు.

*

గభీరమహోదధి మనస్సులో, వెరపుగొల్పు

ఉన్మాదపు కోర్కెల సుళ్ళు రేపి అనంతంగా;

నడవలేని చెట్లభుజాలపై చేయి వేసి ఊపి కదలిపోవు

గాలులు—నా వెనుక, మూర్తి లేని గుర్తింపరాని రోదసి.

విధి పేరిట వ్యూహంలో జొనిపి, ప్రభుత్వంచేయు

ఆశవలె, నాముందు చూపుమేర విస్తరించిన ఆకాశం.

వెలుగు వత్తులు వేసుకొని ఎదురుచూచే నాకళ్ళను

ఆవరించి, గాఢంగా అద్దుకొను, నిశ్చలమైన నీలిమబ్బుకళ్ళు

VI

రోదసి నిండిన సూర్యుని మొదటి కిరణం వలె

కౌగిలించుకొన్నప్పుడు

వేరొక రాత్రి వచ్చి పోవాలని మనస్సులో

ధ్వనిస్తుంది ఊహ –నిశ్శబ్దం నడకవలె

తుమ్మెద ఝుంకారంవలె, జలపాతం హోరువలె.

సాయం సంధ్యా వేళ సూర్యుని చివరి కిరణంవలె

దూరదూరంగా సూక్ష్మాతి సూక్ష్మంగా

విడిపోయిన నీవెవరవని అడిగితే

ఏమని చెప్పగలను ఈ చీకటి నీడలకు?

ఉదయం వరకు వేచి నిలచి ఉండే అదృష్టముంటేగా.

ఆనందం విషాదం సమభాగంగా అనుభవిస్తున్న

చంద్రుడు, కన్పించగనే నిలచిపోయేది నీవే, స్మృతిలో

ఈ నీలాకాశ తమస్సముద్రందాటి ఎలా రావాలనా?

నిశ్చల దృశాశ్రేణి నిర్మించిన వెలుగు వంతెనపై రా;

బడబానలంచే గర్భితమైన మహాసముద్రం

విద్యుత్కాంతి నిహితమైన నీలపయోదపంక్తి

ఊహయొక్క స్ఫూర్తి శోభపొందిన శబ్దబ్రహ్మం

ప్రణవధ్వని తరంగం భరించు విశ్వాంతరాళం.

భృంగీరవ సమ్ముగ్ధ పరాగ కిర్మీరిత దిశా పద్మం

సంగీతాత్మపొందిన తపఃఫల సాహితీ పుంజం.

సూర్యకర దీప్తిచే గుర్తింపబడిన దిక్కులుగల ప్రపంచం

సుసుందరరూప సమాశ్లిష్ట పరమ శివస్వరూపం.

ఈ జన్మలో నిను పొందిన నేను, నీ ఆత్మకొక రూపమిచ్చి

నను నేనొక పరిధిలో, శాశ్వతంగా బంధించుకోజాలను.

ఊహను ఆక్రమించి క్రియలో పర్యవసించు

గతాగత వర్తమాన ప్రపంచరూపంలో,

త్రైకాలికంగా నిల్చిన మృత్యువు రూపమే

ఈ జీవితంలో కలిగిన నీనుండి వియోగం.

వర్షధారా మధు పరిపూతమై

ప్రత్యణువు, సుఖానుభూతివేలా

సమార్ద్రనిబిడ పరిష్వంగంకోసం

ఔత్సుక్యంతో ఎదురుచూచు;

గ్రీష్మానల దాహప్రచండ వాయు గోళంవలె

నిత్య జాగ్రత్ వ్యగ్రమై ఉన్నది నాజీవస్థితి.

ఈ సర్వశరీర మొక విప్పారిన నేత్రగోళమై

నీదర్శన స్పర్శకోసం నవ ప్రతీక్షావ్యగ్రమై

సన్నని నీలిమొయిలు నీడల బరువులకు సదా

ఓర్వచాలీ చాలని అలసమృదుల భావంతో;

ప్రతిచిన్ని కదలికలో, గాలి వరుస తాకిడికి

ఊగిసలాడి, ఉరలు, ఫేనతరంగపంక్తులవలె

ఎక్కడి వెక్కడో తెగి రాలిపడు మంచు బొమ్మలవలె

సగం నిదుర బ్రతుకులో కలలు కురియు సుధావిశిఖ.

ఈ దేహం అగ్నిలో జ్వలించి భస్మసాత్కతృమై

ప్రాణం గాలిలో లయించి అంధగతి సాగిపోనీ,

కన్ను చెదరగొట్టు ఆకాశం విప్పిన వెలుగు చీకటి రెక్కలక్రింద

దీపశిఖవలె ఉన్న నన్ను చుట్టిన ఈ నీడలెలా వదలును?

లౌకిక కర్మగతుల అవధుల నతిక్రమించిన శాంత పదవి,

ఆసన్నామక జ్యోతీరూపంలో శాశ్వతంగా లీనమైతే తప్ప.

స్వర్ణకవాటం తెరువబడి, వ్యక్తావ్యక్త బ్రహ్మ భావనలో

మృత్యువునధిగమించి, అమృతత్వం పొందు జీవకళ.