Melkonna Aakaasham — Volume I — Addendum 1
మేల్కొన్న ఆకాశం — మొదటి సంపుటం — Addendum - 1
1959 · Telugu (te) · 16 pages · Human-proofread
మేల్కొన్న ఆకాశం
మాదిరాజు రంగారావు
స్వేచ్ఛా కవిత్వం
మేల్కొన్న ఆకాశం
ఆచార్య మాదిరాజు రంగారావు
SWECCHAA KAVITHVAM
MELKONNA AKASAM
Prof. Madiraju Ranga Rao
© Dr. M. Santhosh Kumar
Rasadhuni Sahithi Parishath, Hyderabad - 28
ప్రథమ ముద్రణ: అక్టోబరు, 1959
సాధనా ప్రింటరీ, హైదరాబాద్
పునర్ముద్రణ: జూన్ 2026
అనుపమ ప్రింటర్స్
శాంతినగర్, హైదరాబాద్
ఫోన్ : 040–23391364
1
నీలాకాశ గుహాముఖం నుండి
బయల్వెడలిన కాంతి సింహం
నిర్మల కాసార దర్పణంలో
తన ముఖం చూసుక మురుస్తూ
రోదసీ వితర్దికపై
బంగారు పూలు విరియ బూసిన
కాంతి వల్లీ నికుంజంలా
సంతోషంతో కూర్చుంది.
రోదసీ వితర్దికపై కూర్చుని
పకాలున నవ్వే కాంతి సింహం
నాకెంతో చూడ ముచ్చటై
దానితో కొంతసేపు హాయిగా
కాలం గడపి, ఆనందించాలని
చేయి చాచి సైగచేసి పిలిచా.
నాపై జాలి కలిగి కాబోలు
నా ప్రక్కనే నీరు నిండి వున్న
గాజు గ్లాసులోకి దూకేసింది
నీటి చుక్క తొణకలేదు
గాజు గ్లాసు పగులలేదు
గాలి తెరల మంపులపై
తుమ్మెద కాలి జాడల్లా
నీటి అలల వంపులపై
మంపుగ కదలిపోవు గాలుల్లా
గుండెలోతు పొరల నుండి
ఎగయు రాగ మాలల్లా
వ్రేలికి చిక్కక కదలిపోవు
పాద రసపు గుళికల్లా
ప్రయత్న నైష్పల్యాన్ని
అంగీకరించనీయలేదు
అసంతుష్ట వాసనామయ జీవులతో
అర్ధ సుషుప్తిలో, అపుడపుడూ
కాంతి సింహాలూ, చీకటి దెయ్యాలూ
మనుషుల రూపాల్లో స్నేహం చేయడం కద్దు.
కొంతసేపు అలాగేవుండి అంతలో
నీడబొమ్మలా, మారిపోయి
కారు మొయిలులా చీకటిలో
నేస్తం కలిసి పోయినట్లు గుర్తు
చీకటి గుహలో దాగిపోయినా
మెరపులా ఎప్పుడో దూసుకవచ్చి
మీదబడి, నిలువునా నిండు
ప్రాణం తీసేస్తుందనే ఆలోచనకు
అంతగా నిజం వున్నట్లు తోచదు
అయినా శాంతంగా వచ్చి
ప్రతి ప్రాణి వెంట కొంతసేపు
నీడలా తిరిగిపోవు,
ఈ సింహానికి అంతగా భయపడి
ఓ మూల దాగిపోవడం దేనికి?
2
ముఖ్యంగా ప్రతినిత్యం నేను
ఆనందం విషాదం అనుభవించే ప్రపంచంతో
వదలలేని ప్రగాఢ సంబంధం కలిగినవాడిని
బ్రహ్మైక్య భావనచేసి మీకు అందకుండా
ఎక్కడో దూరంగావుండి మాట్లాడే ఇష్టంలేదు
భయంతో కూడిన గట్టి నమ్మకంతో
తమ కీర్తిని కాపాడే మనుషుల కోసం
బ్రతికే, దేవతలు వాళ్ళ బంధువులు
అభిమానులు నివసించే ఆకాశంపైన
లోకాలను ఆగ్రహంతో, అనుగ్రహంతో
కాంతి బాహు సూత్రాలలోకి తీసుకొని
ప్రేమించే సూర్యునిలో, కామించే చంద్రునిలో ;
అహంకారంతో సర్వం భస్మసాత్కృతిచేసి
ఆనందంతో నవ్వుల తెలిప్రోవులతో
గాలిలో ఎగిసే, జ్వలించే అగ్నిలో
లోకాన్ని మాయంచేసి మాట్లాడని చీకటిలో
అజ్ఞాన రేఖా సంవృత జ్ఞానం, అభిమానం
ఏకాంతం మౌనం ప్రసాదించే ఆలయంలో
చర్చిలో మసీదులో, సమాధిలో శ్మశానంలో
శూన్యంలో అంతమొందు ప్రపంచంలో అంతటా
వాయువులా వ్యాపించి, అణువులో ఒదిగిపోయి
వ్యష్టిగా సమిష్టిగా బ్రహ్మాండం విస్తరించి
పూర్వం చాలమందికి వాళ్ళ సంస్కార
వాసనల స్థాయి భేదాలను బట్టి
భిన్న భిన్న రూపాలలో స్వభావాలతో
అగుపించి, చరిత్రగతికి వ్యతిరేకంగా
సిద్ధాంతాల్లో ప్రమాణాలతో తన స్థానం
స్థిరత్వం సంపాదించుకున్న దేవునితో
ఇరవయ్యో శతాబ్దంలో బ్రతికే మనిషికి
ఆధునిక టెలివిజన్ యంత్రంలో
సంభాషణ జరిగిందని చెబితే
ఇందులో ఎవరూ విశేషంగా ఆశ్చర్యపోయి
సశేషంగా ఊహించి, అనుమానాలకు
ఏ మాత్రం అవకాశమివ్వ నవసరం లేదని
––మనవి.
ప్రపంచం విజ్ఞాన యంత్రశాలగా
మారి, వ్యక్తి జీవితం రాజకీయ
తత్వంలో లీనమైపోయి; మతం
మనిషికి చీకటి లోయలా అగుపడి.
జీవితానికి క్రొత్త వ్యాఖ్యానం బయలుదేరి
ఆలోచనలతో స్వభావం పూర్తిగా మారిపోయి
దానితో క్రియాదశా పర్యవసానం మారిపోయి
ప్రేమ ద్వేషం అనుభూతులు కేంద్రంగా
నడిచే మానవ పరిణాహ పరిణామ
చరిత్రకు క్రొత్త విలువ లేర్పడుతున్నవి.
చరిత్ర అట్టడుగున నిటారుగా దిగిన
చీకటి నీడల్లో కలసి పోయి
వారసులేనాడో అంతరించిన నిన్ను
మరచి పోవడానికి ఎంతో కాలం పట్టదు.
చంద్రలోకం తరువాత సూర్యలోకం
మానవుడు ఆక్రమించుకుని సంపూర్ణంగా
నిన్ను పదవీభ్రష్టుణ్ణి చేస్తాడు నిజం.
అందుకని ముందుగా మేల్కోడం మంచిది.
సృష్టికి ఆరంభ దశలోవలె మృగాలకు
దగ్గరిగా బ్రతికే కాలం అంతరించి
ప్రస్తుతం జంతు దశ దాటిపోయిన
ప్రపంచంలోని నేటి మానవుడు–
రామణీయక–రసానందానుభూతి
వికసించిన సాహిత్యం, సౌందర్యం
మనోదశకు చెందిన మానవత్వం
పుంజీభవించిన సంస్కృతీ శిల్పం
రేపు –
ఏనాడో ఎక్కడో జరగబోయే
యుద్ధం యొక్క విపరీత పరిణామం
ఒక దేశం అనుభవించే బానిసత్వం
అలముకొన్న అజ్ఞానం అలసభావం
మరోదేశం యొక్క పురోగమన వేగం
సామాన్యుని ప్రస్తుత జీవితాన్ని
కదలించి ఆకర్షిస్తున్నప్పుడు–
హృదయాన్ని స్పందింపజేస
ఒక జాతి మనోలక్షణం
మరో జాతి ఊహాసౌందర్యం
ప్రపంచం సమంగా అనుభవించి
ఆనందిస్తున్నప్పుడు— రేపు
భేదరహిత సమస్త మానవజాతి
మనస్సు శరదాకాశంలా స్వచ్చమై
విశాలమై, ఊహలు గాలిలా అంతటా
వ్యాప్తమై, అవతరించిన విశ్వభాషలో
వినిపిస్తుంది మానోహర కాంతిగీతం
శిలలో ఆకారంలేని ఆత్మలో
దేశ వ్యాప్తంగా సుప్రతిష్ఠుణ్ణిచేసి
సర్వవేళలా నిన్ను రక్షించడానికే
జరిగిన ఉరిశిక్షలు, అవమానాలు
హత్యలు యుద్ధాలు అసంఖ్యాకాలు
నీ రూప కల్పనలు మలచడమే
అతి ముఖ్యమైన ప్రయోజనంగా మారి
సౌందర్యం సౌకుమార్యం మిగిలిపోయి
చివరకు యాథార్థ్యం కోల్పోయిన కళలు
జీవితంలో అలసిపోయి, విశ్రాంతి
సంఘంచే తరమబడి శరణ్యం
పొందదలచిన మనిషికి ఏమాత్రం
ఊపిరి సల్పనీయని, నీ కీర్తిసౌధ
నిర్మాణానికుపయుక్తమైన పునాదిరాళ్ళు
మాయలో మగతలో మౌనంగా
ఎవడికీ కన్పించకుండా కాలంగడిపే
నీకు, ఆగామి శతాబ్దాల ఆగమనం
చరమరాత్రి ఘడియలతో నిష్క్రమణం
భూకంపం—యుద్ధం–క్షామం
ప్రభుత్వ పతనం—అన్నీ మానవ
దురదృష్ట హేతుజనిత సంఘటనలుగా
నీ సాహస కృత్యాలుగా చెప్పుకొని
ఇష్టంలేని బాధ్యతలను గమనించి
నీ ఇష్టానుసారంగా మాపై నీవు
ప్రయోగించే భయంకర దారుణ
మారణాస్త్రాలు, దారిద్ర్యం, రోగం,
మృత్యువుకు; భయంతో లొంగిపోతూ
ఎత్తిన తల దించడం ఆచారం
వంచిన తల ఎత్తడం అపచారం
మర్యాదాలోపంగా పరిణమించి –
కాంతి కిరణ శకలం ఎరుగని
ఆకాశంలా చాచబడిన, చీకటి
చేతుల క్రింద ముడుచుక కూర్చొని
ఆశీర్వాదంగా భావించే దైవదశలు
అంతరింపజేసి క్రమంగా ఇంతవరకు
‘స్ఫుట్నిక’ దశకు చేరుకున్న
ఇరవయ్యో శతాబ్దం మానవుడు.
ఎన్నో మైళ్ళ దూరంలోవుండి
నేను మాట్లాడుతూ నీకు కన్పిస్తుంటే
చూచే కళ్ళమీద నమ్మకంపోయి
గాజు బంతిలా మారిపోయి
ఆశ్చర్యపడ నవసరంలేదనుకుంటా.
నిన్న అసంభవాలనుకున్నవి ఈరోజుకు
పూజలతో ప్రార్థనలతో నిమిత్తం లేకుండా
రేపటికి ఆశ్చర్యం లేకుండా సంభవించడం
ఇరవయ్యో శతాబ్దం కాలం లక్షణం
మానవుణ్ణి వున్న చోటునుండి కదలనీయని
అనాదినుండి సంభవించే కర్మహక్కులు
వారసులకు సంక్రమించకుండా చెయ్యడం
ఇరవయ్యో శతాబ్దంలోని మానవ స్వభావం
గతానికి మానపుడు చాల దగ్గరి బంధువు
వర్తమానం అందులో శిలానిద్ర వదిలించే
విప్లవం క్షమించరాని శత్రువు వంటిది అతనికి
జడజగత్తుకూ కాలానికీ ప్రగాఢమైత్రి
మానవుడీ మైత్రిని భగ్నంచేసే మహాయుధం
అతనికీ కాలానికీ సముద్రమంత శత్రుత్వం.
అక్కడక్కడా చీకట్లతో వెన్నెలలతో నిండి
గాయాల బాధలతో మూల్గులతో, రక్తంతో తడిసి
లోయలతో ఎడారులతో భయానకంగా
ఒంటరిగా, మౌనంగా, కోపద్వేషాగ్ని చిహ్నాలతో
అడవులతో జంతువుల మృగాల తత్వంతో నిండి
ఇంతవరకూ సమరేఖాభావస్థితిలో నడవని
ప్రపంచ చరిత్ర కారణ మనోదశలు వ్యత్యస్తమై
సిద్ధించిన స్వాతంత్ర్యం సమభావం ఊహలతో
కిరీటాలు అగ్నిలో మండి భస్మమై రాలిపోయి
సామాన్యుని హృదయం ఉదయకాంతి చక్రమై
ప్రతి వదనం హసించే సుమస్తబకంగా మారడం
ఇంతవరకూ సాగివచ్చిన శత్రుత్వం ఫలితం
ఇంతవరకూ సాగించిన మానవుని ప్రగతిరేఖ.
వదలబడిన అణ్వస్త్రంలా ఎదురులేని,
మైదానంలో విసరబడిన బంతిలా
చేతికందని వేగంతో పరుగెత్తే కాలం
సృష్టికే తెలియని భవిష్యజ్జాతక చక్రం
కాలాన్ని నియమించలేడు దేవుడు
కాలానికి తలఒగ్గక తప్పదు
ఉదయ సంధ్యాగమన వేళ
తూర్పున పాలిపోయిన
మంచుమనిషివలె పెదవి
కదల్పక మౌనంగా వున్నా వేం ?
‘‘నేనెవరినో నాకు
నీవిప్పుడు చెప్పేదాక తెలియదు
నిజం చెబుతున్నా విను
నీవే అంటే మానవుడే దేవుడు’’
3
ప్రతి క్షణక్షణం ప్రత్యణువణువు
పరస్పర సన్నికర్షణము నొందుచు
శైలీ రూపము నొందు, అదృశ్యమాన
జీవిత సమాధిని కదిలించే గాలులు
పొంగులుగా గుమ్ములుగా క్రమ్ముక
వచ్చిపోవు వెల్తురుల, ఇరులతో
కూడిన తొలి మలి సంజలందు
విరిసిన మనసు మల్లెపొదలలో
తుమ్మెద బారుల రొదలతో
గుప్పున కమ్మని తావులతో
ప్రాణ దఘ్నముగా నిండుగా
మెల్లగా కదలివచ్చు గాలులు,
హృదయాంబుధి విలోల వీచీ
తంత్రీ మృదు నిస్వన మోహన
సాళగ రాగాలను వినిపించే
క్రమ పరిణామ పరిణాహ మేధా
ప్రపంచ దిశల, ఆలోచనా
కిర్మీర పరాగం విరజిమ్మే గాలులు.
శిలల ఒరపిడులతో కదలిపోవు
సెలయేళ్ళ సన్నని చిరునవ్వుల
సవ్వడి వలె, నా గొంతు నుండి
సాగివచ్చు పాటలకు శ్రుతులుపోయు
ఎత్తిన అలల తలలపై మెత్తని
కాలు ఊని కదలివచ్చి గాలులు.
యంత్రంలా రొదతో గడచిపోవు
బ్రతుకు విడిచే బరువు నిట్టూర్పులు
నాగలిలా మెల్లగా కదలిపోవు
బ్రతుకు వదిలే వేడి నిశ్వాసాలు
మోసుక వచ్చి; రాత్రింబవళ్లు
సగం గాలిలో సగం నీటిలో తేలు
నా గుండె నూపు, స్వనమంజులములౌ
పరిమళ సంభార వాహులు –
బ్రాహ్మీ ముహూర్త మహిత వేళ
మనోవాంఛా తరంగ మాలాలోల
స్మృతి పథాన, పూర్వ జన్మ గత
వాసనా ప్రపంచముల నూహింపజేయు
పసిపాపల పెదవులపై చిందులాడు
వెలుగు నవ్వుల అలల గలగలవలె
ఆరని ఎద మంటలతో శత్రువులా
మనసును కదిలించి కవ్వించెడి
ఈ గాలుల నేనెలా మరవగలను
ఈ గీతం వినిపించక వుండగలన?