Maro Udayam — Volume I — Addendum 1
మరో ఉదయం — మొదటి సంపుటం — Addendum - 1
1962 · Telugu (te) · 38 pages · Human-proofread
మరో ఉదయం
మాదిరాజు రంగారావు
ప్రచురణ
నవోదయ సమితి
హైదరాబాదు.
స్వేచ్ఛా కవిత్వం
మరో ఉదయం
ఆచార్య మాదిరాజు రంగారావు
SWECCHAA KAVITHVAM
MARO UDAYAM
Prof. Madiraju Ranga Rao
© Dr. M. Santhosh Kumar
Rasadhuni Sahithi Parishath, Hyderabad - 28
ప్రథమ ముద్రణ: ఫిబ్రవరి 1962
నవోదయ సమితి హైదరాబాదు.
పునర్ముద్రణ: జూన్ 2026
అనుపమ ప్రింటర్స్
శాంతినగర్, హైదరాబాద్
ఫోన్ : 040–23391364
ఇతర కృతులు
కిర్మీరం
మేల్కొన్న ఆకాశం
మనో భూమికలు
అద్దంలో నీడలు
అధునా
పునర్జన్మ ఎత్తాలి నీవు తప్పదు సుమీ ఇక
మరో మనోలోకాన్ని కల్పించు కోవాలిప్పుడు.
దుఃఖంతో ఆగిపోక కష్టంలో నిల్చిపోక
పతనంతో పారిపోక మరణంతో మారిపోక
రాయి నుండి రాకెట్ వరకెక్కడా ఆగిపోక
ఎన్నెన్నో రూపాల్లో అభ్యుదయం సాగిస్తూ
యుగ యుగాలు నడుస్తున్నా తరతరాలు నశిస్తున్నా
నీవేనీవే ఒకే ఒక అమరజీవివి మానవుడవు.
పేదవాని కోరికలో కుంచితమై ఒదిగి ఒదిగి
ధనవంతుని ఆశలో విశాలమై వ్యాప్తి చెంది
పొలిమేరలు చెరగిన ఈ విశాల ప్రపంచం
జగన్నేతల చేతులలో తిరుగాడే ఆట బంతి.
ప్రతి యుగానికొకే ఒక మానవ ప్రతినిధి పూర్వం
నేడో ప్రతివాడొక యుగ విధాత సంపూర్ణంగా.
మౌఢ్య బలంతో విశ్వాసంతో
చెలరేగిన ఒక జాతి మతం అకాండ తాండవం
పరస్పర ధాటీ ఘర్షణలో భగ్నమై
అతినవీన రూపంలో ఉదయించిన మానవత
అహంకార దర్పౌద్ధత్యం, అసహన శౌర్యోద్రేకం
రాపిళ్ళకు తాళలేక పరుగిడి కొండల్లో దాగి దాగి
చీకటి ముసుగు ధరించి, రక్షోభావ మావహించి
మానవత కోల్పోయి దైవపథి దృష్టి సాచు మానవుడు.
శాంతికీ యుద్ధానికీ, పురోగమన ధ్యేయానికీ
సౌఖ్యానికీ దుఃఖానికీ, తిరోగమన మార్గానికీ
జన్మకూ మృత్యువుకూ, ప్రతి అల్పానల్ప కృత్యానికీ
ప్రళయం వరకు సాగు మహా పరిణామానికి కేంద్రం.
ప్రతి మానవ మనోఽంతర పదవి వ్రేలాడే
బంధు భావ జాతి వర్ణ సక్త రక్త తోరణాలు
ఆత్మయొక్క సౌందర్య శిఖా ప్రవాహ మింకిపోయి
ఆది నుండి లాగబడుతూ వస్తూన్న జీవితాలు.
చారలు చారలుగా అట్టలు కట్టిన
నెత్తుటి గీతల బొమ్మల వరుసలు
పిశాచ హృదయం విలాసప్రదముగ
భద్ర పరచుకొని ఆనందించే ఆటవస్తువులు
గాలికి రాలి ధూళి కలిసి పోవు ఆకులవలె
ప్రాణాలను కోలుపోవు కసి మసగిన మృత్యుక్రీడ
రారాజులు ఆనందించే ఆనాటి పండుగస్థానం
ఈ నాటి ప్రజలు అనుభవించే స్వేచ్ఛా దివసం.
అవధులు లేని మహాకాల సముద్రం విడిచిన
సితాసిత మేఘ నిశ్వాస పరంపరలు సంఘటనలు.
ఏ భూమి సమార్ద్రమై, పరిమళ భరితమై భోగమయమై.
ఏ ఖండం బీడువడిన జీవితం గడిపేదీ ఎవరికెరుక ?
ఈ దిశ నుండి ఆ దిశ వరకు హుటా హుటిగా
హఠాత్తుగా గుమ్ములుగా ముట్టడించి ఒక్క మారు
ఊపివేయు ఝుంఝా పవనంవలె ఘోరాకృతి
వచ్చి పడిన యుద్ధాలకు క్షామాలకు భయపడి
కష్టాలు ఎదుర్కొని నష్టాలు సహించలేక పరుగిడి
బంధు భావ బంధాలను త్రెంచుకోని, సంపూర్ణంగా
ప్రేమ పూర్ణ సౌహార్దం వదలుకోని, శాశ్వతంగా
ఏ దేశం గర్భంలోనో, ఏ చల్లని నీడలలోనో
ఏ పచ్చని మైదానంలోనో, ఏ ఆకలి తీరేచోటునో
ఒంటరిగా గుంపులుగా తలలు దాచుకొని బ్రతికిన
ఈ మానవజాతి సమస్తం, తన ఉనికి కోసం క్రమంగా
సాగించి పోరాటం అలవర్చుకుంది అధికారం వికృతిలక్షణం
ఒకనాటి అవసరం ఆనందం బట్టి
అలముకొన్న అభిరుచిలో ఊహలో
వేషంలో వర్ణంలో, వ్రేళ్ళుదన్నుకొని
మనిషిని బహిరున్మీలిత ముఖునిచేయు;
ఒక దిశ గాఢంగా ప్రసరించిన
ఒక ప్రత్యేక విధా మనస్తత్వం
మార్పులు సహించని, చేర్పుకు తలవంచు
ఆకాశం ఆవరించు ఆశగల జాతీయత్వం
భిన్న భిన్న జాతులు, భాషలు, ఆలోచనలు
భిన్న భిన్న పద్ధతులు ప్రవర్తనలు విశ్వాసాలు
ఎక్కడా పొంతన కుదరని జీవన విధామార్గాలు
వీటిని అధిగమించిన మానవతా సూత్ర నిబంధితమై
దారిద్ర్యం దుఃఖం ఆపదలో, క్రౌర్యం కాఠిన్యంతో
విభేదాలతో ఎవరికివారు విభాజితులై విస్మరించి
నేలనాల్గు చెరగులా చెల్లా చెదరై విస్తరించి
తమ తమ బ్రతుకులు ప్రత్యేక చరిత్రలుగా
తమ ఊహలకనుగుణంగా మత సంస్కృతీ సాహిత్యం
మలచుకొని నిర్మించుకొన్న మానవ సమాజం
మధ్య మధ్య ఏర్పడి ఉన్న నీడలు లోయలు సముద్రాలుదాటి
ఒక విశాలరూపంలో అవతరించబోవు అఖండ మానవసృష్టి
వేల ఏండ్లనుండి ఈనాటి వరకు మానవుని
అదే మనస్థితి సాంఘిక రాజకీయ దుస్థితి.
రాసులు రాసులుగా రాళ్ళూ గుట్టలవలె
గుంపులు గుంపులుగా చెట్లూ చేమలవలె
ఎండకు ఎండి, వానకు తడిసి చలికి బిగిసిన
బండలవలె మొద్దులవలె మట్టిదిబ్బలవలె,
సంస్కృతీ సౌకుమార్యం, సౌందర్యం, ఊహశక్తి
సూక్ష్మదశలు ఎరుగని, జడభరిత మనస్థితి
ఈ సామాజిక రూపంలో నేలపై నిండిఉన్న
కశ్మల వాతావరణంలో కంకాళపు దుర్గంధంలో
మానవ రూపాల్లో నిల్చినట్టి బూది కుప్పలమయం
కళాహీన నిశారూప క్షుధాకర్శిత బానిసలోకం
నరనరాలలో తేజస్స్రవంతులు ప్రవహింపజేసి
చైతన్యమయం చేసి, ఆకృతులు నవాగ్ని శిఖలుగా
ఉత్తుంగ తరంగ నటత్ మహోద్వేగ ప్రవాహంవలె
పరుగులు ఎత్తించి ఉప్పైనవలె విరుచుకుపడు
మహాశక్తి, పీడిత ప్రజాశక్తి సమీకరణ విజృంభణ
మరొకసారి జరుగక తప్పదు, తప్పదు ఫలితం !
కూలిన కోటలు, కదలిన సింహాసనాలు వ్యవస్థలు
హతమారిన అహంయువులు, అణగారిన అగ్నిగుండాలు.
దారిలో మేల్కొన్న శవాలు గతితప్పని చరిత్ర భ్రమణం
ఇదివర కెన్నెన్నో కళ్ళకు కట్టిన ప్రబలమైన సాక్ష్యాలు
చరిత్రలో అణగి మణగి నివురుచే కప్పబడిన స్ఫులింగాలు
రివ్వున గాలివీస్తే చాలు కణకణలాడు దారిచూపు దివ్వెలు.
పురా ధర్మసూత్రపు బరువు క్రింద అణగి మణగి
భ్రమ హర్మ్యపు గోడల నీడల క్రింద ఎదుగుమాని
తనకు దొరికిన స్థలంతో తృప్తిపడి ఒదిగిపోయి
బ్రతికినా చచ్చినా ఏమైనా ఆరడుగుల నేలకన్న
ఎక్కువగా స్థలంకాని, ఏదైనా ఒక్క మనిషికి మించి
ఎక్కువ బలం కాని అవసరంలేని నిస్తేజోమూర్తులు.
వెలుగుకు భయపడి చీకటి కలవాటుపడి
చీమలవలె దోమలవలె ప్రాణదఘ్న భయంతో
పుట్టిన అరనిముసం నుండి చచ్చే అరనిముసందాకా
నిండా నూరేండ్లు బ్రతికినా, ఏస్థితి ఏలిప్తలోనూ
సంకల్ప నవోదయ మెరుగని, త్రపాహీన సేవామతులు
ఎక్కడ చూచినా అత్యధిక సంఖ్యలో జీరో విలువలు
ప్రజాస్వామ్య పద్ధతి సర్వహక్కులనుభవించు ప్రపంచ పౌరుడు
తిండికి బట్టకు స్వేచ్ఛకు కరవులేని సామాజిక వ్యవస్థలో
ఆలోచన అభ్యుదయం, సమగ్రమైన మానవతా వికాసం
మరో మనోలోకాన్ని సృష్టించుకున్నప్పుడే నిజం !
ఒక వినూత్న ప్రభు పథంలో నడుస్తున్న
మహాయుగ రథచక్ర విఘట్టితమై నలగి కలగి
గాలికి ఎగయు ధూళి రేణువులకు వెరగొందక
వెనుకబడి గుండె చచ్చినవాణ్ణి గూర్చి మరచిపోయి.
బహు విభేద దశా విభాజిత సంక్లిష్ట మనోరూపం
సంపూర్ణంగా మార్చుకోక తప్పదు ఆధునిక మానవుడు
విశ్వ భావనా ప్రపూర్ణ నవ్య సంస్కృతీ విజ్ఞానదృష్టి
వంపులు తీర్చి దిద్దుకోక తప్పదు దివ్యధునీ జీవితరూపం
మొదటి ఉదయం
ఉదయ తరణి వేలావధి కెదురుగా కూర్చున్న నేను
వెలుగు పొంగు వచ్చి ఎప్పుడు ముంచెత్తిందో తెలియదు.
ఇసుక దిబ్బపై తళతళలాడు కాంతి ప్రవాహంసాగినట్లు
కొండ కొమ్ము మీదినుండి జలధారాధుని స్రవించినట్లు.
ఒక జాగ్రత్ చైతన్యం వెలుగులతో ఆకాశం నిండగా
మాయా శూన్య జఘన్య స్థితి కొక సుందర రూపం వచ్చి
బ్రహ్మాండం పర్యంతం నాదశక్తి జనించి, కాలాభిజ్ఞతకలిగి
శవాలవలె వ్రేలాడుతున్న ఆశా రూపాలకు ప్రాణం వచ్చి
బహువర్ణ కుసుమ పరిమళం ఒక్కమారు సోడు ముట్టగా
ఇంద్రచాపంవలె మారినట్లుమనస్సు పొందిన వేలానుభూతి,
ప్రశాంత దీప కాంతి వదనంతో, హర్షధారాబాహువులతో
ఆకాశం భూమిని, పురుషుడు ప్రకృతిని కౌగిలించు కున్న సమయం
మనస్సులో చెలరేగిన పూర్వపు స్మృతి చిహ్నాలు
మరపు యొక్క మెలకువ కలిగిన కదలిక
సన్నని నీలి దారంతో చుట్టూ అల్లబడి ఉన్న
ఒక విచిత్రమైన సాలీడు పటం.
ఆవహించిన సంతోషాశ్చర్య హాస ముద్రల
గాఢత్వం చెరగని, ఏ తీవ్ర శక్తికోలొంగి పోయి,
మేల్కొనీ మేల్కొనని ఒకానొక అననుభూత స్థితిలో
కలల వరుసవలె కన్పించు అవిచారిత రహఃసృష్టి .
ఒక సన్నని ధ్వని మహా సంగీత స్వరంవలె
ఒక చిక్కని స్పర్శ మహానంద మధునదం వలె
స్వర్ణ ధారలతో తడిసి శరీరం వజ్రమయమై
హృదయం దేనికోసమో ఆరాటపడి తపించి
ఊడి పడిన స్వర్గ ఖండంవలె ఉన్న భూమిపై
కోపంతో సంతోషంతో చిందులు త్రొక్కు శిశువులవలె
అనంతమైన మహాకాల వృక్షపు నీడల వలె
కదలాడు మబ్బులవలె తేలికైన ఆలోచనలతో
గతి తప్పిన వానివలె, తిరిగి వెనక్కి వెళ్ళలేక
మతి తప్పిన వానివలె గుట్టలు పుట్టలు పట్టితిరిగి
అజ్ఞాన జలంతో దాహం తీర్చుకొని, విశ్రాంతి కలబడి
ఉదాత్త భావం ప్రకటించు సన్నని రేఖవలె, కాలంగడుపుతూ
ఒంటరి తనం సహింపలేక జంటలుగా గుడులుగా
పిల్లలతో పశువులతో గుడారం వేసుకొని నేలపై
హృదయం స్పందించి, బుద్ధికి తోచిన, దానియందు రక్తుడై
రహస్య మర్మం ఎరుగని నగ్నదిశవలె ఉన్న మానవుడు.
కనురెప్పల అంచులందు ఏదో బరువు తొలగినట్లై
తనువొక వరణీయ దేవతా ప్రసాద చిహ్నమై
వెలుగునుండి వెలుగువలె అవిచ్ఛిన్న ప్రజాతంతువుస్వర్గదమై
చీకటి గొలుసులతో బంధించబడి గళమెత్తిన మానవుడు.
చూస్తూ చూస్తూ ఉండగానే మహాకాల శ్మశానంలో
లిప్తాగ్ని జ్వాలలచే భస్మీపటలమైన సుకుమార ఉదయం
బ్రతుకొక అగ్ని గోళంగా భాసించి ఎవరిదారిని వారు
క్షుధాప నోదనకై పరుగెత్తు మహాజన సందోహం.
భౌమిక రూపంలో వివిధా కృతులలో మలగిన సౌందర్య జ్వాలలు
తమ తమ జీవితాలు ఆహుతి చేయు రసప్రలుబ్ధులు.
అప్పుడే ఉదితమైన ఒక విజయ చిహ్న కేతన ప్రచాలనం
ప్రక్కనే నశితమైన ఒక పరాజిత చిహ్న కేతన విశీర్ణత్వం.
ఈ దేహం కోసం పోరాటం సాగింపబడి మరణపర్యంతం
కూడుగుడ్డ పదవికీర్తియందు తృప్తి ఎరుగని జీవనవిధానం.
సర్వ ప్రపంచంలో కన్పించు ఒకే ఒక సామ్యభావస్థితిగతి
తమలో తాము నవసృష్టి కల్పించుకున్న కొందరు స్పృహాస్నిగ్ధులు.
బ్రతుకు మలపులుతీర్చు ఆత్మగత చైతన్య శక్తి మరచి
వినతమౌ సమయం కోసం సన్నహించు హ్రస్వదృష్టి,
కర్మ పటలంపై కదలు జడ వస్తు సమూహం నీడలతో
యుద్ధానికి దిగి, ఘర్షణలో శక్తి ఉడుగు మానవులు.
గగన మార్గాన కాలినడక ప్రయాణం చేసిన బాటసారి
అలసిపోయి పూర్తిగా విశ్రాంతి తీసుకోనున్నాడో లేదో
అతని కంటిముందే అనంతమైన వెలుగు సాంతమైపోయి
అంతకుముందు అవధిలేని ప్రపంచం, ఒక పరిధిలో
బంధించబడ్డది.
అగాధమైన మనస్సులో పొరలలోనుండి
ఊహల ఔల్బణ్యం అధికాధికమై
గభీరమైన తమస్సు అట్టడుగున నుండి
వెలుగుల ఆగమనం అత్యంత సముద్గతమై
అతి విశాల భావనలో సంవిలీనమై
అలలు అలలుగా సాగు నాదబ్రహ్మం
ప్రభు బుద్ధికి మాత్రమే భాసించు
పరిణత తపః ఫల దివ్య దశాస్వరూపం
ఎక్కడికో వెళ్ళాలని బయలుదేరి తనే ఒక గమ్యస్థానమై
దేనిని గురించో ఊహిస్తూ తనే ఒక ఉజ్జ్వల ఊహయై
బహు మార్గ ప్రధావన్మతి తానే ఒక సంగమస్థానమై
నైకరూపాలు ధరించి నిత్య యాత్రసాగిందు ఏకైక దీపశిఖ;
ఎదుటివాణ్ణి గురించి తెలుసుకొని తనను గురించి తెలియని
కార్య దశకు చేరేవరకు ఆగమనలిప్తల స్వరూపం ఎరుగని
ఒక వస్తునాశనంనుండి మరొక నవీనవస్తువు ఉద్భవించినట్లు
ఒకఘటననుండి వేరొకటి; చావునుండిపుట్టుకగల మానవుడు.
పరిభ్రమించి సుడిగాలివలె అతిక్రమించి అదృష్టసీమలు
తెలుసుకుని అపాయపు గుర్తులు అసాధ్య సముద్రందాటి
సన్నివేశాన్ని బట్టి నటనా స్వరూపంలో మార్పు వచ్చినట్లు
నియత కాల వేగశక్తి ననుసరించు బ్రతుకులో పరివర్తన.
వెరపుగొన్న మృదుభావుక మనస్సునుండి
మెరపు తోడి మేఘం వలె ఉద్భవించి
బ్రతుకంతా అల్లుకొని అందని పూలతో
ఊహ సుందరమై వాసించిన స్వర్వల్లి గగనం
మరపుగొన్న చపల దృష్టి కఠోరమతి నుండి
అశనిపాత వేళావిస్ఫులింగ చక్రంవలె జారిపడి
బ్రతుకంతా ఆక్రమించి నిప్పుకల కూడలితో
పడి ఉన్న, కదలిక ఎరిగీ ఎరుగని నరక భూమి.
ఒక లిప్తలో సహస్రాంశం వృథాపోని
సమరశక్తి సమాపూర్ణ అశాంతి మయ జీవితం
ఒక సుందర తీర్థంగా మార్చివేసి
శాంత పదవి చేర్చగల దైవ భావనాలక్ష్యం.
గజి బిజిగా క్రమ్ముకొని మేధను
కలతపెట్టు ఊహల సాగుదల
క్రమ పద్ధతి తీర్చబడిన సరిహద్దులు
ఈ మత విశ్వాస పరంపరలు.
అజ్ఞానంతో ఆరంభమై అజ్ఞానంతో అంతమొందు
కాంతి రేఖాతోరణం ఈ మానవజాతి వలయం
చుట్టూ చీకటి లోయలు, భయపెట్టు మృత్యువు నీడలు
దూర దూరంగా ఒదిగి ఒదిగి ఉన్న జీవ సమూహం.
అనిశ్చితమైన అలభ్యమైన దానికోసం జీవితం పిండబడి,
ఆవేదనా పూర్ణ హృదయ కుహరం నుండి పెకల్చుకొని
ముఖంలో, చంద్రరేఖ రూపంలో పొడిచిన మధుహాసం,
అసహజస్థితి కల్పించుకున్న వాతావరణం, ప్రపంచసాహితి
నిశ్చల నిశ్శబ్దంలో ప్రణవంవలె
అరణిలో అగ్నివలె
తమశ్శర్వరి చంద్రికవలె,
నిదురలో స్వాప్నిక దృశ్యంవలె
వ్యగ్ర మనస్థితి ఝటితి స్ఫూర్తి కలిగిన
సౌందర్యం పట్టలేక
శబ్దరూపంలో ఆవిర్భవించిన
ఊహవలె; భూమిపై నేను.
మృత్యుఘడియ విషాదఛ్చాయలు, జననకాల సంతోషరేఖలు
గమ్య మెరిగిన కడలి తరగలు,
గమ్య మెరుగని వాయుస్వరాలు
వర్షధారా సమార్ద్ర భూసారం గ్రహించి,
సముద్గమించిన పుష్పఫల భారావనత లతాతరువులు
ఏండ్లకొలది బ్రతుకు జీవులు
ఎంత త్వరగా వచ్చింది ప్రహ్లాదమయమైన
మరోదివసం. పునర్జన్మ ఎత్తినట్లుగా ఉన్నది
మనస్సుకీ శుభోదర్క సమయం.
సనాతన కాంతి చిమ్ము నా దృష్టిముందు;
స్వర్ణవలయ సమాక్రాంత సహస్రఫణ
ఫణాధర తరణి తేజశ్చక్ర భ్రమణం.
ఉదయం తరువాత
మొదలు చివర ఆస్తిక్యము అసలు లేని
ఒక మహానిబిడాంధకార పుంజం నుండి
అవతరించిన ఒక భాగం ఈ విశాల ప్రపంచం
అగ్ని శిఖల వంటి ఆత్మలతో సంచరించు మానవులు
మన బుద్ధికి ఇంకా తెలిసీ తెలియని
స్థలీ పరిణాహరేఖ అంత మొందు
మహాసముద్రంలో అక్కడక్కడ విరివిగా
తలలెత్తిన దీవులు మానవ జీవితాలు.
ఉదయ దిశాస్వర్ణ కాంతి దేహళిపై దృష్టి నిలపి
రాగ నిభృత వర్ణ సహిత మనస్సుతో
ఒక సుందర రూపంలో శివతాతి పథంలో
ఆది నుండి దేవతలను సృష్టించుకున్న ఊహశక్తి
నశించు దేహగత మోహం వదలి
జ్వలించు అమర వాక్ దీప్త మతితో
అనవరతం ఆత్మకు అధికాధిక స్థానమిచ్చి
గడుపబడిన పవిత్రాత్మవిదుల జీవితాలు.
దాటరాని వేగధురా మహాకాల ప్రవాహానికి
అడ్డంగా నిలువరింప జేయబడిన సేతువులు
అవిచ్ఛిన్న మానవ సంతతికాదర్శ ప్రాయమౌ
త్రైకాలిక యశ స్తనూ రమ్యశిల్ప తీర్థాలు
చిగుళ్ళు, ఆకులు పూలు ఫలసంతతి
ఒక చిన్ని బీజమందు నిక్షిప్తమై ఉన్నట్లు
ఒక విచిత్ర హృదయ సమాకర్షణాత్మక ప్రపంచం
మనోగత వాసనామయమై విస్తరించిన జీవితం.
స్వర్గఖండం అవతరించిన ముఖబింబం
అందులో నరకచ్ఛాయల వలె మ్లానరేఖలు
కాంతి బింబం అంతరించిన గగన వదనం
కను రెప్పలలో దాగిదాగి హసించు సౌర దీపికలు
అనూహితంగా నవోద్ధృత వేగదీప్తి రూపంలో
ఒక జాతి లేదా మనిషి బ్రతుకు బ్రతుకంతా
నిప్పులుపోసి మండించి, ముంచెత్తి ఎక్కడో తేల్చు
అకస్మాదాగత కర్మమయానలానిల తరంగాలు.
ప్రేయస్స్వ
రం విని, అంతారూపసౌందర్యం భావించి
దివ్యశక్తి హత్తుకొన్న హృదయంగల మానవుడు
కఠోర రావం వినబడి, బహిస్స్వ
రూపం చూచి
మృగబుద్ధి ప్రవర్తించు తెలివిగల మానవుడు
ఒక వైపు పరంపరగా నిర్మింపబడుతూ
మరొకవైపు వరుసగా కూలిపోవు గోపురాలు
ఆజనన శైశవ యౌవన జరాక్రాంత మృత్యుదశలు
నిరంతర సంకీర్ణ స్థితిమయ జీవిత ప్రపంచం.
అడుగు వేయడంతో లిప్త గమించక ముందు
ఆకర్షించి ఆశాపూర్ణత్వం పొందనున్న అభ్యుదయం
అడుగు తీయడంతో లిప్త గతించగనే
ఆశారహిత శూన్యభావ సమాత్త మృత్యువిజయం
దైవబుద్ధి చేతులెత్తి శూన్యంలోకి పరుగెత్తి
రాత్రి తప్ప దివమెరుగని, పుట్టుకతో అంధులు.
కళ్ళముందు వెనుక ప్రక్కల కన్పించు జఘన్యస్థితి
జీవితాంతం వెలుగు పోచ ఎరుగని అదృష్టహీనులు.
వాడిపోయి ఒరుగులవలె తనుకుమాసి
సగం కాలి ఆరినకట్టెలవలె కన్పించు ముఖాలు
ఆరోజు గడిస్తే చాలు నిండానూరేండ్లు బ్రతికినంత
ఎత్తైన ఊహలతో కాలం గడుపు జీవచ్చవాలు
బ్రతుకు బండలపై బోదలపై విరిసి కురిసి
మృదుత్వం కోల్పోయిన వర్షానేహ మధుబిందువులు
ఆశా పతాక శిశువు చెక్కిళ్ళపై ముద్దులతో
తుడిచి వేయబడిన కన్నీటి చారల గుర్తులు.
హృదయం స్పృశించని విలాసప్రాయసంతోషం
ముఖంలో కన్పించని కోపదుఃఖ సంభరితులై
అణచబడి అంతశ్శక్తి దీప్తి రేఖ; నిత్యయాత్ర సాగించు
మహాజనసందోహం పిల్లలు పెద్దలు యువతీ యువకులు.
మనిషిని హతమార్చి క్రోధాగ్ని బాపుకున్న
మనిషిని భక్షించి క్షుధాగ్ని చల్లార్చుకున్న
మనిషిని హింసించి మానవత్వం ప్రకటించుకున్న
మనిషిని క్షమించి దైవత్వంపొందిన మానవుడు
ఒకప్పుడు మృగంవలె జంతువువలె పక్షివలె
మరొకప్పుడు పామువలె పురుగువలె క్రిమివలె
పెరిగి, తరిగి, ఒదిగి మలగి; కలగి తలగి
బహుగుణ మిశ్రిత రూపంలో వెలుగొందుమనస్సు
ఒక ఋతువు శోభ ఒక గాలి తాకిడి
ఒక వెన్నెల అందం, ఒక ఆశ్చర్యఘటన
ఒక దుఃఖ విషయం, ఒక మహానందవార్త
ఒక సౌందర్య సమున్మీలనం, ఒక వేదాంత భావన;
సూక్ష్మ సూక్ష్మంగా తీవ్ర తీవ్ర దశలలో
జీవితంలో బహుధా సంవ్యాప్తమైన
అనుభూతులొక్కమారు ముట్టి దాడి జరిపినా
కదలని మెదలని మనో నైశిత్యం తెలియని
మానవాకారాల్లో పోత పోయబడిన
లోహమూర్తులు–నడువనేర్చిన విగ్రహాలు.
ఆకలిగొన్న ఆశతో, కసి బలిసిన కళ్ళతో
ఆరని హసంతివలె కణకణలాడు హృదయంతో
నవోహలు మొలకెత్తని మరుభూమి మస్తిష్కంతో
పగటి వేళ వీధిలో మనిషిని నిలవేసి విసిగించి
ఎండకు ఎండి వానకు తడిసి చలికి బిగిసి
విశ్లథమవని శరీరంతో భిక్షాటన చేస్తూ
రాత్రి వేళ ఏ గోడపంచనో, ఏ చెట్టునీడనో
అదుపులు సహించి, శారీరక కామన తీర్చుకొని
బైటపడి చౌర్యం సాగించి క్రౌర్యం కనబరచి
తృప్తిగా నిదురపోవు నీడలవలె పడి ఉన్న,
నిశ్శబ్దం రూపుకట్టి నివ్వెర పోయిన స్థితి
మానవ జాతి ప్రకృతి చావని దిశి బొమ్మలు
ఎన్ని మారులు యుద్ధం వచ్చిపోయినా
ఎంత కాలం శాంతి నెలకొని ఉన్నా
పాలన తలక్రిందై పాలకులు మారిపోయినా
ఎక్కడ బడితే అక్కడ చెక్కు చెదరని దిబ్బలు
దాదాపు అంతాపుట్టుకతో మగత నిదుర పోయేవాళ్ళే
ఎవడైనా మేల్కొల్పితే ఒక్కొకడు కత్తివలె పిడుగువలె
ఒకరినొకరు నిలువునా దోచుకొని హత్యలు గావించుకొని
మూక ఉమ్మడిగా, అలజడి రేగవచ్చుగా – అందులకే
శాంతియొక్క రక్షణ పేరిట సాగుతున్న సామాజిక వ్యవస్థ
గాఢమైన అనుభూతి హృదయం విశాల తరమైపోయి
తీక్ష్ణమైన భావనచే బుద్ధియొక్క ఔన్నత్యం పెంచబడి
హృదయంకదలించుఘటనతో ప్రవర్తనలో పరిణామంవచ్చి
మనస్సునువిచలితంచేయు దృశ్యంతో స్వభావం మారి
విజృంభమాణ ఘర్షణలో పతనమై విశ్లథమై
పునఃప్రారంభంతో క్రమపద్ధతి తీర్చబడి, మరల
ప్రతిష్టితమౌ మానవ సమాజ జీవిత సుదీర్ఘత్వం
ఆత్మీయ బంధుభావ జాతిగుణ వలయాలనుండి
విశ్వమానవతా సీమలవరకు మనిషిని నడిపించిన
రాజకీయ సాంఘిక మతావేశ తీవ్రతరశక్తులు.
ఈ సంకీర్ణ సమాజంలో మహాస్థానంనుండి నైచ్యస్థితిదాక
ఎన్నెన్నో వృత్తులు అవలంబించి బ్రతుకుమహాజన సమ్మర్దం
నవ్వుతున్న ప్రేల్తున్న కోపిస్తున్న దుఃఖిస్తున్న యోచిస్తున్న
నటిస్తున్న; వివిధ రీతులలో గతులలో వెల్గుముఖ పంక్తులపై
జారిన మంచు మబ్బు చీకటి వెలుగు నిప్పు తెరలచాటున
శూన్యం, ఆకాశం నీడల చుక్కల దిక్కుల; ధూమంవలె
ఆలోచనలు పూనిన సజీవ నిర్జీవ సహస్రాకృతీవిశేషాలు
సంతోష పెట్టి క్షోభపెట్టి ఆశ పెట్టి పరిభ్రమించు గోళాలు.
భిన్నభిన్న అనుభూతుల అవధులు ఎరిగి
బ్రతుకు లోతులు స్పృశించి కాని తృప్తిపడని
ప్రగాఢ భావనామతి ధురా రసార్ద్ర హృదయ
నికామ తర్పణీయ శీలురు, మహాజ్యోతిరాశయులు
చాంద్రీమృదు దృష్టితో, సూర్యాంశు హృదయంతో
ఈ కవితా రూపంలో మలగి శరీరాలు తాల్చిన
పొంగివచ్చిన వయస్సుతో, ఉబికివచ్చు అందంతో, కెరటాల్లా
జవ్వున ఊగిపోవు చాంద్రీ స్నిగ్ధతనూ హేలామూర్తులు
తమలో ఎంత లోతుగా ఆసురాంశ నిద్రాణమై ఉన్నదీ
భవిష్యత్తు తమపట్ల ఎంతగా దాసభావం వహించిందీ
తెలియని సాధుహృదయులు తెలిసిన కఠోర మతులు
కాలం పూసిన గులాబి మొగ్గలుచుట్టి ఉన్న కంటకప్రాయులు
హిమజ్వాలలలో ఇముడ్చుకొని రెక్క విప్పిన గులాబీలు
ఉష్ణాంశు గ్రామ స్పర్శకు ఎండిపోయి కొసదేరిన కంటకాలు
గాలి నిట్టూర్పులో వర్షాధ్వనిలో, గ్రీష్మాతప తాపంలో
చలి కోతలో ప్రతిధ్వనించు ఆగని జీవిత యంత్రధ్వని.
ఆమె హృదయాకాశ వీధి వర్షాగ్ర బిందువులవలె
విరిసి కురియు ప్రేమను ఎప్పటి కప్పుడు
ఇంకింపజేయు ఇసుక దిబ్బవలె ఉన్న పురుషుడు
అందంలో మట్టిలో; ఆనందం ఆకాశంలో కలిసి
చివరకు నేలపై నీరువలె నిల్వనిదై మనస్సు
దూదికన్న తేలికై రెక్క విరిగిన జీవిత నిశాసమయం
అగ్నివంటి పరిస్థితి ఆహుతియైపోయి
గాలిలో ఏకమై లయించి ప్రాణచ్చట
వాయువీధి ఇనుమడింపజేసి ఒక మహావిషాద రేఖ
స్మృతి పథంలో మాత్రం నిల్చిపోయిన మానవతి.
తెల్లగా తెల్లవారడంతో ముఖం నల్లగా మసిబారి
నెల జీతం నెలవంకవలె భాసించి జీవిత నిశాసమయం
గాలి తెరచాటున చుక్కలవలె ఏరుకున్న నాల్గు రాళ్ళతో
తూర్పున ఉదయమైతే పడమటి దిక్కు ముఖంపెట్టి నడచు
ముఖంలో కళ ఒక కలవలె ఎరిగి ఉన్న గుమస్తా నౌకరు
బ్రతుకులో కళ నిదురలో కల ఒకటిగా భాసించిన అధికారి.
పొరపాటు అలవాటై మరచిపోశక్యం కాని
మానసిక బానిసత్వం ఒక దర్పంగా భావించి
చావుకైనా సిద్ధ పడడానికేమాత్రం సంకోచించని
సంచలించని స్వభావం కోటికెక్కిన దున్నపోతులు
నీ వెందుకు పలకరించ కూడదంటే నీ వెందుకను
భావం వ్యక్తపరచి, ప్రక్కకు మలగు కళ్ళుగల
గుండెల్లేని శవాలు; గాయాల బాధ తెలియనప్పుడు
ఎటు గురి చూచి కొట్టినా ప్రయోజన మేమున్నది?
ఉన్నత మనోదశా ప్రాపణీయ సంధిలో యాతనపడు,
ఎన్ని మజిలీలు దాటినా ఇంకా స్థిరపడని మానవ సమాజం
ఆకర్షణ కోల్పోని, సంఘర్షణ వీడని చైతన్య కళలు
దివ్యదశలు ఊహచేయు చంచల మోహమతి ప్రవీణులు
తల్లి పిలుపుతో తండ్రి మాటలో శిశువు పలుకులో
భార్య నవ్వులో, వివాహసమయంలో, విలాసవేళలో
భక్తి భావనలో, రక్తి ఊహలో స్వాదుతర సంగీతం
దుఃఖంలో దారిద్ర్యంలో ఆక్రోశంలో హాహాకారంలో
మృత్యు సమీపంలో పిశాచ హృదయంలో, హత్యాబుద్ధిలో
ఉద్ఘోషించు, ప్రళయభావం పొందిన సంగీతం.
కొండలో ప్రవాహంలో చెట్టులో శూన్యంలో
మనస్సులో సర్వప్రకృతి నిక్షిప్తమై
నిరంతరం మ్రోగు వివిధ వాద్యధ్వని
అంతరాఘూర్ణమాన, అగాధ సముద్రంచేయు
ప్రదీప్తమైన లయలో; తన ప్రౌఢ సంగీతం
సర్వదిశల హోరున వినిపించు వాయుఝుంఝు
ఒక్కసారి గుత్తులు గుత్తులుగా కిలకిల నవ్వులతో
విసరి విసరి ఒడ్డున చప్పట్లు కొట్టి తిరిగిపోవు
మహాసముద్ర తరంగ సమూహంవలె హృదయంలో
దివానిశలు సంస్పందించు లయాత్మక భావన.
భవిష్యత్తుపై దృష్టికన్న గతంపైనే అభిమానం ఆలోచన
వర్తమాన సంపదపై అధికమైన మోహగంధం అనుభవేచ్ఛ
గతంలో ఆవిధంగా జరగడం ఆనాటి పరిస్థితి స్వభావం
మరోవిధంగా జరుగలేదనుకోవడం, వర్తమానకాల లక్షణం.
అతి నవీన పథంలో నడుస్తుంది
ప్రపంచం ఎప్పుడూ గతం మరచి
ప్రగాఢ సాహసమతి మానవుడు
ఎప్పుడూ నిలిచిపోడు ఒకేచోట
అందని, పరిచయంలేని అందం ఆదర్శం
మనోలోకంతో, స్నేహంకోసం మానవుని
ఆరాటం ఆందోళన అజ్ఞాతతృష్ణ
ఎన్ని ఎన్ని సహస్ర సమలు గతించిపోయినా
మమత చావని మృత్యువెరుగని ఉదయంవలె
తన మనః పరిణాహరోదసి దివ్య దశగా
మార్చుకోక తప్పదిక, ఈనాటి మానవజాతి.
అంతర్ముఖుడనై ఎప్పుడైతే నిశ్శబ్దంలోకి వెళ్ళిపోయానో
నా మనశ్చక్షూ రుచిరకాంతి ప్రసరించినంత వెలుగు మేర
అదేభూమి, ఆకాశం, నక్షత్రాలు
మానవుడు, సంపదలు, వాంఛలు
అవే లిప్తలు, దివానిశలు, సూర్యోదయా స్తమయం
ఋతుషట్కం, సంవత్సరాలు ఆగమన వినిర్గమనం
ధారావాహికంగా దేశకాలాణు నిర్భరమై
ప్రవహించు జ్యోతీ రేఖ
మానవుడు ఇదివరకే అందుకొన్న
మహోన్నత దివ్యదిశా సోపానాలు.
సృష్టింప బడవలసినవన్నీ ఇదివరకే సృష్టింపబడి
స్వర్గం నరకం మతం రాజకీయం. రామణీయకం
పరాకాష్ఠ నందుకొని సాధింపబడిన సంపూర్ణత్వం.
తిరిగి మరొక రూపంలో అనుభూతి భేదంతో ప్రత్యక్షం.
!?
సృష్టి రహస్యం ఇది ఇది అని ఎవరు తేల్చి చెప్పింది నిజం?
అందరికీ తెలిసినట్లే ఉంటుంది కాని ఎవరికీ తెలియదు!
తనే తన మృత్యువుకొక ఆహ్వాన పత్రంవలె మిగిలి
అంతంలేని జిజ్ఞాసతో తనే ఒక పరిశోధనా యంత్రమై
కనుగొన్న రహస్యం ప్రపంచంలో తెలియని దెవరికని?
స్వర్గదృష్టిలేని, నారక భయంలేని, వేదాంత వాసన ఎరుగని
తిన్నది అరగకముందే ముందు కావలసినతిండి కై తిరిగేవాడికీ
చెబితే కూడా తెలియని ఆలోచనలేని అంబేదకూ తప్ప.
అణువులో ఆకాశంలో భూమిపై సముద్రంలో ప్రతిచోటా
స్త్రీలో పురుషునిలో శిశువులో యోగిలో భోగిలో
శాంతిలో యుద్ధంలో శబ్దంలో అర్థంలో శ్రుతిలో స్మృతిలో
పూవులో స్వర్ణంలో కుచేలునిలో కుబేరునిలో వికసించిన;
సూర్యుడు చంద్రుడు ఉదయించే అస్తమించే వేళల
దిక్కుల ముఖాల్లో; నీలో నాలో పురాతన కాలాల్లో
మంటిక్రిందికి మింటిపైకి దెసలవైపు సాగిన జిజ్ఞాసలో
కళాత్మక దృష్టి, కల్పితమనస్థితి విస్తరించిన సృష్టి రహస్యం!
ఎందరిచే ప్రపంచింపబడినా ఇంతవరకెవరకీ అర్థమవని
ఎందరిచే అన్వేషింపబడినా చివర కెవరకీ లభ్యమవని
ఎంతకాలం గడిచినా నాగరకత మారినా జీవరాశి నశించినా
వ్యవస్థ తలక్రిందైనా అవసరంతీరని నశించనిశాంతియొక్క
ప్రతిబింబ ప్రతిధ్వనుల సమాహారం సర్వసృష్టి
సంగ్రహణకు ప్రసారణకు కేంద్రభూమి మానవుడు,
విభిన్న రుచులకు ఆస్థానమైన సమాజం ప్రేక్షక సదస్సు
ఎవరి ఆనందం తృప్తికోసం వారుచేయు నటనా వైదగ్ధ్యం
ఉదయ శిఖవలె వెలుగుతున్న సౌందర్యవతి ముఖం వెనుక
దాగిన భయంకర రాత్రిని కప్పిన సుకుమారచాంద్రీహాసానికి
హృదయం కవోష్ణ వేగచలితమై ఆలోచన పరిమళభరితమై
శతపత్రంవలె అందగించిన ఊహావలయం గల
పురుషుని మనస్సులో
ప్రేతంవలె ఇతరుల కంటికి కన్పించు మనిషి తనలోతాను
కల్పించుకున్న మహనీయ దేవతా భావనా వాగురనుండి
ఎట్లాబయటపడాలో తెలియని తెలిసినా సాధ్యం కానిమనస్థితిలో
నిబిడమై గుప్తమై ఉన్న సృష్టియొక్క విపరీత రహస్యం.
అద్దంలో ప్రతిబింబం స్పష్టంగా కన్పించకపోతే
దాని మీద నమ్మకం లేకపోయినా వస్తువేమి చేయగలదు?
ప్రకృతితో ప్రవర్తనలో చైతన్యంలో పురోగమనంలో
కన్పించు సృష్టిరహస్యం కాలం విప్పిన కంటి వెలుగు.
మానవుడు తన ఊహలలో ఆదర్శప్రాయంగా నిర్మించుకున్న
ఈకంటికికన్పించని జగత్తు యొక్క; ప్రతిబింబంప్రపంచం?!
దానవుడు తన చేష్టలో క్రియాత్మకంగా నిరూపించుకున్న
శాశ్వత సత్యరూపంయొక్క ప్రభ్రష్టగతులే సర్వవస్తువులు!
ఈ ప్రపంచ నిర్మాణ పరంపరకు మూలమైన కారణం?
నీరు! కాదు, గాలి! కాదు, అణుసంఘాతం! ఏమో ?
ఇంకావిడిపోకుండా మనస్సు అట్టడుగునతలఎత్తు సందేహం
మరోనాటికి పూర్తిగా వ్యత్యస్తమైపోయే ఈనాటి విలువలు.
గగనపదవి మేఘాలవలె, గాలిలో కలిసివినిపించుధ్వనులవలె
నీటిలో పడి తడవని నీడలవలె
గాలిలో కలిసి వినిపించు ధ్వనులవలె
ఆనందంతో, ఉత్సాహంతో విలాసంతో ఎక్కడ మొదలై
ఎక్కడ అంతమొందుతాయో తెలియని, మానవుని ఆలోచనలు
గగనకాసారంలో సహస్రకరాలతో, తల ఎత్తి,
నవ్వుముఖంతో వడిగా ఈది వస్తున్న సూర్యుడు,
ఒడ్డున మేల్కొని వేచి ఉన్న నా ఆశాపతాక
ఇంకా మేల్కొనని వారి స్వప్న ద్వార కవాటం.
ఈ కవాటం తెరుచుకొని, ఎంతదూరం ప్రయాణించకపూర్వం
ఈ ప్రమాదంలో పడకుండా బయట పడ్డవాళ్ళు చాల అరుదు.
ఈ సూర్యుని వెలుగులు ఎవరికోసం? మేల్కొనదలచినవాళ్ళకు.
ఈ గీతం ప్రయోజనం ఎంతవరకు? వెలుగులు ఆడినంతదూరం.
మరో ఉదయం
ఈ పురోగమనం ఎంతవరకు ? దిక్కుల అంచుల వరకు.
ఎంతకాలం సాగుతుంది ప్రయాణం ? ఉదయమయ్యేదాక.
ఎక్కడికీ సాయం సంధ్యవేళ? మరో మనోలోకానికి !
ఆ శాంతిని పట్టుకోడానికి ! ఈ రూపం మారిపోడానికి!
పద పదమున నెత్తురు చిమ్మే నేత్రగోళ గగనం ఎదురుగ
ఆగి ఆగి పరుగిడి వచ్చే చీకటి పిల్లల గుంపులు ప్రక్కన
రాబోయే యుద్ధజ్వర భయంతో వణకుతున్న వాతావరణం
మృత్యువు స్ఫురించేసరికి శాంతిపాఠం వల్లించుకంఠశోష.
అణురజో రూపంలో రాలిపడు రూబులు డాలరు విలువలు
బల మహాసంపదతో ఆకలితీర్చ యత్నించు తెలువులు
సామాన్యునిరాజ్యం సౌఖ్యం పేరిట అతని సర్వనాశనపథకం
ఒకే దేశం జాతిసిద్ధాంతంచాటునవిపరీత ప్రతీకారమనస్తత్వం
భూగోళం చుట్టివచ్చు విజ్ఞానమతి నిర్మితాణునవాస్త్రాలు
వాటిననుసరించి పరిభ్రమించు యుద్ధోన్మత్త చిత్తం
తన ఆధీనంలోలేని చిత్తాలోల నవోహలు కల్పించుకున్న
వైకృతస్థితి ననుసరించి నిర్మితమౌ మానవమాత్ర సమాజం
నిప్పురవ్వలు, తెరపిడి పడిన, దగాపడిఎత్తిన కళ్ళలో
మేల్కొని చీకటిలో తిరుగు పెద్దపులి మెరపు కళ్ళవలె.
కడుపు మంట ముందు, చుక్కల తలపులచుట్టు
చల్లారని శ్మశానంలో ప్రేతంవలె చీకటి ముసురు.
వర్షపు చినుకులు, మొండిగోడలపై ఎండుటాకులపై
పూరిపాకలపై పాడుగుడిపై పేదవాని చిరుకోర్కెలవలె.
తుపాకిగుండు దూసుక పోయిన అగ్నివంటి శరీరంపై
హంతకుని మంచువంటి గుండెపై — రక్తపు బిందువులు
సగం చావుకు తయారై దీనంగా కూర్చున్న ఈ రాత్రి
రాకకు సిద్ధమై ఉత్సాహంతో ఎదురుచూస్తున్న మరోరోజు
సగం మేల్కొని నిద్రపోవడానికి వేచిఉన్న నిన్నటి దినం
కలలు కనడం మొదలు పెట్టి తలలు పోగొట్టుకున్న జనం
ఉన్నది వదిలి లేనిది అదే పనిగా
రమణీయ లాభగతి ఆలోచిస్తూ
విజయ పరంపర వాంఛించేలోకం
ఎక్కడోకాని పొందదు ఆనందం తృప్తి
సమయంబట్టి ఒక్కొక్క డొక్కొకటి
వదలుకొని ప్రేమ అధికారం సంపద
లేదా అనుభవిస్తూ విరాగమతులవలె
వ్యవహరించు భోగైక జీవులు,
వశంకాని మహోద్రేక శక్తులు
పొందిన పరిపూర్ణ తృప్తి ఫలితం
ఒక త్యాగ నిరతి — మహావీరకృత్యం
సర్వసౌందర్య భూమిక కళాసృష్టి
అగాధమైన మనోజలధిని
కల్లోల మొనర్చే వాయుఝుంఝుకు
గమ్యస్థానం చేరకముందే,
ముక్కలు ముక్కలై పోయిన ఆదర్శ నౌకలు.
సూదులవలె చూపులతో క్రీపెదవి బిగపట్టిన పురుషులు
ఎరుపెక్కినచెక్కిళ్ళతో, బరువెక్కిన రెప్పలెత్తిచూచుస్త్రీలు
దుర్దినవేళ, దిక్చక్ర సమావృత శీతలచ్ఛాయాసంఛన్నమై
పరిణాహ మనోవీధి నిశాభ్రాంతి వెలుగు ఊహలదివ్వెలు
ఈనాడు అనిశ్చితంగా అవిజ్ఞాతంగా ఉన్న అదృష్టవిషయం,
రేపటివరకు నిశ్చితమై ఆశ్చర్యమయంగా కన్పడు ఘటన
ఈ ఘటనలో చిక్కుకొని అసువులుకోల్పోవు త్యాగమూర్తులు
బయటపడి తమ ప్రయోజకత్వం చాటుకొను శక్తిమంతులు
అమాయకతాపూర్ణ శైశవస్థితి గడచి పరిణత యౌవనదశ
ఆ దశనుండి మహానుభవ పరిపాకదశ వృద్ధాప్యం వరకు
చివరకు పరిహరించరాని మృత్యువు తదుపరి పునర్జన్మకోరి
జీవితమంతా ఒక వ్యాపార సరణి గడుపుప్రాణి సమూహం
+
ఎక్కడ ఎవరిని చూచినా వారిలో నా రూప ప్రతిబింబమే
ఎక్కడ ఎవరు మాట్లాడినా అందులో నా ఊహాప్రతిరావమే
కనబడు వినబడు జగత్తును పరిపాలించు మానవుని మేధ
కనబడని వినబడని దానికి అవర్జితమైన హృదయాకాశం
ఎంతలో స్వరూపం మారిపోయింది ఎంత వింతగా
తెలుపుగా నలుపుగా ఎరుపుగా ఎన్ని రంగు రంగులుగా!
అంతసేపు మృదుల మనోహర సంగీతం ప్రసరిస్తుంది.
అంతలో కఠోర మహాశనిపాతరావం దొరలిస్తుంది.
నడుస్తున్న నేను – నా దృష్టినుండి తప్పించుకోజాలని
శిలా విగ్రహాలను స్పృశించు స్నిగ్ధ నేత్ర మధురాధరాలు
చీకటి కాటుక కొండపై పడిజారు సూర్యుని దృక్ దీప్తులు
నేలపై చిమ్మబడిఉన్న పగిలిన గాజు బొమ్మల ముక్కలు
నిప్పంటుకొని మండి మండి మహానల జ్వాలలతో
మధ్యలో సముద్ర గర్భంలో మునిగిపోతున్న నావవలె
మృత్యువుచే ఆకర్షింపబడి ముఖం జేవురించిన రాత్రి
సర్వ దిశల అంతలోనే విప్లవాత్మకమైన మార్పులు.
బహు దూరంనుండి దగ్గరనుండి
వినవస్తున్న విభిన్న కంఠధ్వనులు
ఎత్తబడిన తలలు చేతులు
దించబడిన ఆలోచన ఆశాపతాక
ఇంకా వదలని నిద్రలో తూలుతూ
కలలుగను చీకటి మనుషులు
చుట్టూ దీపస్తంభాల వలె
మేల్కొని కాపలాకాస్తున్న తెల్ల దొరలు
ఎక్కడో తిరిగి తిరిగి ఇంటికి చేరుకున్న పక్షుల గుంపులు
ఎక్కడో పుట్టి పెరిగి ఎక్కడికో వెళ్ళిపోతున్న పశువులమందలు
ఏదో ఒకవిధంగా ఆరోజు గడిపివేయబడింది బాగానే ఉన్నది
మరొక మరొక రోజుపై నవాభిసారికాగత వ్యామోహం
కొండలపై మెరపులతో కన్నీరు కారుస్తున్న పయోదపంక్తి
అక్కడే తపించిచివరకు ఒక్క చుక్కైనానిలువలేనికొండరాళ్లు
ప్రక్కనేనేలపై బ్రతుకుబరువు ఎరుగని గాలికూగుపోచలు
వెన్కనేమండిమండి అగ్నిచల్లనైన బొగ్గులవలె మనుషులు
పైనచుక్కలు ఎప్పుడో మాయమైనవి
క్రింద భూమిపై కళ్ళుమూసిన తల్లి ప్రక్కన
వణకుతున్న చిరు పెదవులతో ఎండిన గొంతులతో
చేతులుచాచి తడుముకొను శిశువులు
ఒక్కటీ తిన్నగా లేని పిచ్చివాని ఊహలవలె
అల్లి బిల్లిగా అల్లుకొని చీలిపోవు బాటలు
ఊహలో బ్రతుకు గడుపు మనిషికీ వాస్తవికజగత్తుకూ
సిద్ధాంత సూత్రాలకూ కార్యరూపం తాల్చిన సృష్టి క్రమానికీ
ప్రేమరూప పరిణామానికీ, ఆత్మకూ అనాది ప్రపంచానికీ మధ్య
రెండిటినీ కలపగల విడదీయగల మబ్బు తెరలవంటి రేఖలు
ఆరిన దీపపు పొగక్రమ్మినకాలం కళ్ళు ఇంకా తెరపిడిపడలేదు.
కళ్లు ఉన్నా అంధులవలె, జీవం ఉన్నా శవాలవలె కూర్చోవలసిందే
మనిషిమీద మనిషికన్న జంతువుపైనే అతనికి విశ్వాసం ఎక్కువ
ఆలోచనల కవధులు లేవు ఉదయం మృత్యువు ఎరుగదు
ఒక యుగం గడచిపోయి వేరొకటి వస్తున్న దెంతత్వరగా
ఒక మనస్స్వ
రూపం మారి వేరొకటవతరిస్తున్నది వేగంగా
సృష్టి యొక్క ఆరంభంనుండి ఈ భౌతిక ప్రపంచశక్తుల
ఆకర్షణ సంపర్కం సంఘర్షణ ఏనాటికైనా ఒకేతీరు; తప్పదు
గ్రహసమూహ గమనం ఋతుచక్ర పరిభ్రమణం
సర్వసృష్టి వికాసవైఖరి కాలంయొక్క అధికారముద్ర
ఒకతరంనుండి వేరొక తరానికవిచ్ఛిన్నంగా అందింపజేసి
అమరత్వం సాధించి; మానవ నాగరికత తీర్చిన ఆత్మదీప్తి
– ంం –
నలందా ప్రైస్, సుల్తాన్ బజార్, హైదరాబాద్ .