Manobhumikalu — Volume I — Addendum 1
మనోభూమికలు — మొదటి సంపుటం — Addendum - 1
1960 · Telugu (te) · 62 pages · Human-proofread
మనోభూమికలు
మాదిరాజు రంగారావు
స్వేచ్ఛా కవిత్వం
మనోభూమికలు
ఆచార్య మాదిరాజు రంగారావు
SWECCHAA KAVITHVAM
MANOBHOOMIKALU
Prof. Madiraju Ranga Rao
© Dr. M. Santhosh Kumar
Rasadhuni Sahithi Parishath, Hyderabad - 28
ప్రథమ ముద్రణ: మార్చి 1960
రసధుని ప్రచురణ హైదరాబాదు.
పునర్ముద్రణ: జూన్ 2026
అనుపమ ప్రింటర్స్
శాంతినగర్, హైదరాబాద్
ఫోన్ : 040–23391364
I
సంగీత వినిస్వన ప్రవికంపితమై
సమార్ద్రమై లయించి, నదించి
అంతలో ఘనీభవించు శిలవలె
ప్రగాఢమై, సూర్యతేజో నిభృత
మహాతైక్షతకు వాడిపోక
వెన్నెలల మృదూహలకు మెత్తబడు
నీల గగన ఖండం వలె
దుఃఖం అణువణువున వ్యాపించి
కదలీ కదలని గాలిపిండువలె
తాకితే అంతస్సౌందర్యం చిందిపోయి
భగ్గున మండించు దీపశిఖవలె
నిశ్చల సమరేఖా స్థితిలో ఉన్న
నా మనస్సులో ఎక్కడివీ ముంపుగ
అశాంతి హత్యాప్రయత్నం ఊహలు !
వార్ధలహరీ నదివలె ముర్మురిస్తూ
బుస కొడుతూ దీర్ఘతనూ భుజంగంలా
మలకలుగా మెలికలుగా తిరిగిపోవు
నా మనస్సులో— ఎక్కడిదీ అశాంతి !
జీవితం ఏ పరమ ప్రయోజన కళా
శిల్పాకృతిగా మలగిపోవడానికి నాంది ?
వెలిగే అహంకారం, విసరే చురుకుగాలికి
చీకటిలో మలచుకున్న ఆకారం— అశాంతి
*
ఆనంద లోకాధిపతులు రహస్యంగా
ఆత్మహత్యా ప్రయత్నంచేసే సమయం
ప్రోత్థ తరంగాలవలె తీవ్రాలోచనల
దూకుడుల అశాంతి — మనస్సముద్రంలో
ఋతు పరివర్తనతో స్వభావం మారిన
ప్రకృతి స్వరూపంలో, రాత్రి కళ్ళలో
భూమి హృదయంలో, ఆకాశం మస్తిష్కంలో
మానవుని మనో రోదసిలో, అశాంతి
జీవితంలో ప్రతిక్షణమొక సోపానం
అనుభవంతో గమ్యప్రాప్త సోపానాలపై
కాలూనుతూ వెళ్ళడం ప్రతి జీవికి సహజం
జీవుని బాహ్యస్వరూపం అశాంతి ప్రపంచం
*
శాంతి ! శాంతి ! శాంతి !
అశాంతి సమావరించని స్థలంగాని
వాయు రేఖ లేదా అణులిప్త ఐనా ఉన్నదా ?
అనంత విశ్వంలో ఎక్కడైనా?
సృష్ట్యారంభ బిందువునుండి ఇంతవరకు
బాణాలనుండి అణ్వస్త్ర ప్రయోగాల దాక
సాగిన వలయాకార చరిత్ర పరిధులలో
నియంతృత్వం నుండి ప్రజాస్వామ్యానికి మారిన
అజ్ఞాన జన సందోహం ఆలోచనా వైఖరి,
అశాంతిలో జరిగిన ప్రగతి శీల పరిణామం
పరిణామ హృదయంలో సూక్ష్మ సూక్ష్మంగా
తీవ్ర తీవ్రంగా చెలరేగిన అశాంతి
వదలిన గాయాల మాయని చిహ్నాలు
మనోజీవి ప్రతిభా కవితా స్వరూపాలు
తెరలు తెరలుగా జారిన భిన్నభిన్న వర్ణాలు
పొరలు పొరలుగా ఒదిగిన మానవ సమాజం
క్రియా వైపరీత్యం, ఊహావ్యాపారం లేని
శాంతిలో, మానవునికి నిజంగా శాంతి లేదు
*
హోరున విరుచుకుపడు పెనుతుపాను,
వార్షుక ప్రళయమూర్తి
అనాగరక అనాది మానవునిచే
చెరచబడిన ప్రకృతి గత సౌకుమార్యం
మనోరూపంలోని స్త్రీ స్ఫూర్తి
స్ఫులింగమై మేల్కొన్నపుడు— అశాంతి
సంధ్యా సమస్యలే సమస్యలు
చుక్కల ప్రశ్నలే ప్రశ్నలై
కంటికి వెలుగు కరువైనపుడు
సంప్రదాయ రేఖలు దాటబడి
చీకటి సహస్రధా చీల్చబడి
విప్లవం రెక్క చాచిన, అశాంతి
అహంకారం ప్రబలిన
అశాంతి యొక్క వీరకృత్య చిహ్నాలు
ఇంతవరకు మానవుడు
దాటి వచ్చిన పెరిగిన సోపానాలు
అనుభవించి కాలం వేసిన శిక్షలు
చలాయించి సామాన్యుల పై అధికారం
ధరిత్రికి ఏకత్వం, చరిత్రకు ఆకారం
కల్పించిరి రణదాహంతో రాజులు
శిక్షకులు; శాంతికి తామే రక్షకులుగ
గర్విస్తూ మౌఢ్యము ప్రాకారం బలసంపదకు;
అశాంతికి మనస్సులో ఆకారం నరకం
కల్పించిరి విశ్వాసంతో మత ప్రవక్తలు
గత కాలం మ్యూజియంలో బ్రతికి ఉన్న శవాలు
వారసులకు పనికిరాని బూజు పట్టిన చిత్రాలు
పూర్వం జరిగిపోయిన అశాంతి కృత్యాలు
భవిష్యత్ కీర్తిగౌరవాలు కొలిచే సాధనాలు
*
నగరం నడివీధిలో నడుస్తున్న నాకు —
సంక్షుభిత విభుగ్న పరికుంచితములు
వేదనా విశీర్ణ రేఖా పరిపాండురములు
ప్రొద్దుపొడిచిన, రాత్రి కురిసిన చీకట్లకు తడిసి
కోర్కెల కుబుసం తునిగి రాలిపోయిన;
ప్రశ్నలతో, ప్రశ్నల సంకెలలతో, కదలిన
సంకెలల గలగలలతో నిండిన ముఖాలు
గుప్పిళ్ళు గుప్పిళ్ళుగా కళ్ళలోకి విసరబడిన
చీకట్లవలె, నింగి బూది కుప్పనుండి
క్రిందికి రాలిపడు, తూర్పారపట్టబడిన
నిప్పు కణాలవలె; కొట్టవచ్చినట్లు కనిపించే;
కనిపించిన కొన్ని ముఖాలు — అశాంతి గోళాలు
*
మానవతా కేంద్రంనుండి గీయబడిన
ప్రగతి శీల పరిణామ శక్తి రేఖల
ఆక్రమణతో; సంప్రదాయ రేఖాసీమిత
సమాజ సరిహద్దులు చెరిగి పోతున్నపుడు
దైనందిన జీవిత సమస్యలనుండి
చిత్తగించిన పలాయన వాదంతో
తీరని సందేహాలతో ఇంతకాలం
ఆకాశం అవతలి లోకంపై ప్రశ్నలతో
విశ్రాంతికి అలవాటు పడిన గుండెలలో
అశాంతి ! హాహాకార హసంతులు!
*
ద్యావాపృథివి మేల్కొన్న క్షణంనుండి
వ్రాలని కనురెప్పల నీడలక్రింద
అవిచ్ఛిన్నంగా సాగే అనాది సంస్మృతులు
అనుభవాలు సృష్టియొక్క క్రియాంశలు
అవి మానవుని మృత్యువుతో అంతమొందవు
ప్రార్థనలతో యుద్ధాలతో అణగిమణగి పోవు
అశాంతిలోనే రెక్క విప్పుతుంది అభ్యుదయం
అది శాంతి సంచరణకు మహాకాశావకాశం.
II
ఊహలు ఉన్మత్తాకారం రూపొందిన సృష్టి
కదలికతో గమనం, అభిరుచితో జీవితం
అనుభూతితో పరమార్థం సాధించు మానవులు
వాళ్ళ బ్రతుకుననుసరించి వెలుగుంగరమువలె,
గాలి విసరువలె మృత్యువుతో అంతమొంది
ధూళి క్రమికతో రంగురంగులుగా కనిపించు
ఆకృతి లేని వాయుగోళం వంటి మస్తిష్కంతో
గాఢ నిద్రలో రెండు స్వప్న ఖండాలవలె
నల్లని కన్నులలో రాగ దీపికలతో — నేను
మృత్యువుకీతల నున్న ఈ లోకంలో
అడుగు తీసి వేసేలోపల ఒక దానినొకటి
మించిన వేగంతో, కొన్ని మించని వేగంతో
దాటిపోవు, పోలిక లేని అసంఖ్యాక ముఖాలు
ఆడబడుచున్న ఛెస్ బోర్డులు — వైకుంఠ పాళీలు
పెదవులపై చిరునవ్వులు — ముద్దుమాటలు
ఆవలింతలు — అరుపులు — తిట్లు — ఆక్రోశాలు
పదకోశపు ఎడారిలా కనిపించే పదాలకు
స్వరూపావిష్కరణ చేయు తీవ్ర శబ్దశక్తులు
మంచు, చలి — వేడి, ఎండ — గాలి
తెలుపు నలుపు ఎరుపు విరుపులు
ఆనందం అహంకారం కోపం దుఃఖం
విషాదం యోగం, అవధిలేని కాలం
పన్నెండు గంటలు — రాత్రి జాతకంలో మార్పు
కాలు జారినపుడు గాలి నవ్విన సవ్వడి
– రెండు మూడు పలుచని సన్నని నీడలు
వాని వెనుక నవనీతాకృతి స్త్రీమూర్తి
తిరిగి తిరిగి వచ్చిపోవు ఋతువులు
మలగి మలగి సాగిపోవు బ్రతుకులు
తెరచిన తలుపులు కిటికీలు — మౌనం—
నిన్న – ఈవాళ అంతం నుండి ఆరంభం
*
అక్కడక్కడ చెట్లు
చెట్లను వదలి ఎరుగని నీడలు
రెప్పలు మూత పడని నిప్పుకళ్ళు
భూమిలో కూరుకుపోయి కాళ్ళు
నడవ లేని చలన శక్తి రహిత
బహు విచిత్ర జీవాకారాలు
పొలాలలో పల్లెలలో నగరాలలో
తిరిగే మానవాకార ముఖాలు
చేతి కందని ఎత్తులో — గాలికి
మ్రోగే ధ్వజస్తంభ ఘంటికలు
*
జన్మ జన్మాల పరంపరగా వచ్చు
ఆత్మీయ, అనాది వాసనల
కల్పనలో మలగిన ఆకారాలు
కాల సూత్రం తెగిపోనంతవరకు
ప్రేక్షకుల మనోవృత్తులతో అవసరం
ప్రత్యక్ష సంబంధం లేని సినిమాచిత్రాలు
నా కంటికి కన్పించే సుఖదుఃఖాత్మకమౌ
అణువు నుండి బ్రహ్మాండ పర్యంతం
అలముకొన్న అశాంతి ఆవరణంలో
కాలం తన చేతితో ప్రతి లిప్తలిప్త
చెరుపుతూ వచ్చినా మాటి మాటికీ
శాంతి రేఖలు గీచుకుని బ్రతికే జీవులు
అసంఖ్యాక యుగాలుగా సాగివచ్చిన
మనస్సాహితీ సంస్కృతీ పరిణామం
మృత్యువుతో; మానవునిలో అంతం
మళ్ళీ జననంతో పునః ప్రారంభం
*
విశ్వాత్మయందు – విలీనమై
ప్రచరించు వాంఛా సమీరము
వియద్గత సూర్య తేజో హృదయం
రస సిద్ధి పొందిన జలాంతర్నాదం
సృజనాత్మక శక్తి సమున్మేష పృథ్వీ భాగం
ఆశలు అనంతంగా సారించు ఆకాశం
జీవకోటి మనస్సు సమాకర్షించు ఉషస్సదనం
వరకు – మెట్లు మెట్లుగా మలగిన
ఇంతవరకు దాటబడని, దగ్గరగా
చీకటి ముద్దలవలె, ఖండ ఖండాలుగా,
దూరంగా ఏకాకృతిగా కన్పించే అశాంతి
మానవుడు తన అహంకారానికి
ఆదర్శం ఔన్నత్యం ఆపాదించుకుని
దుఃఖం దౌర్భాగ్యం రూపొందించుకొని
ఆనందించే ఖండ ఖండ జీవితం
అతృప్తి చెందు ఏకాకృతి ప్రపంచం
బిందువు ప్రారంభం తెలియని
పరిణామం సాగిపోవు రేఖావలయం
*
సంధ్యా సమయ తాండవారభటితో
మనోఽంతర పథాలను నాదమయం చేసి
ప్రళయకాల ఝుంఝా హస్తాలు చాచి
నను గాఢంగా కౌగిట బూనే రుద్రమూర్తి
మూర్తీభవించిన అశాంతి –
నా జీవిత సారస్వతం సమావరించి
ఊర్జిత ఆనంద కళాస్ఫూర్తి – శాంతి
కలిగించే ఆకారం లేని ఈశ్వరుడు
*
అనూహ్యాకాశానికి ఆకారం కల్పించి
వ్యావహారిక జగత్తును సమావిష్కరించి
దుర్మార్గం క్షమించి, దుఃఖం మరపించి
మృత్యువుకు ప్రాణంపోసి రహస్యంగా
మొదట లోకాన్ని ప్రేమించినది సూర్యుడు
సమార్ద్రమై, భాగవత తేజోభావమయమై
కర్కశమై, దానవతాస్వభావ సంహితమై
నగ్నమతి మానవుని అశాంతి హృదయం
తరువాత నేర్చుకుంది ప్రేమతో విద్వేషం
*
నిద్రామాంద్యం వదలించుకుని, గమనం
సాగించిన సూర్యుని అడుగు జాడలలో
నడవడం ఆరంభించిన నాటినుండి
కాలం కదలిక గుర్తు పట్టిన మానవుడు
శ్మశాన వేదికపై యోగమూర్తి
రుద్ర భూమిలో శివతీర్థం
యుద్ధ భూమిలో స్వర్గలోకం
మృత్యు ముఖంలో పునస్సృష్టి
నిద్రాలోకంలో స్వప్న ఖండం
దర్శించిన భావంతో తృప్తి చెందిన
మనస్సాహితి మెట్లుమెట్లుగా సాగి
చలదిరమ్మద మేఘ పంక్తివలె
గాలి కౌగిలిలో తేలిపోయి ఎక్కడికో
ఎప్పుడో ఎక్కడో వర్షించి—
భూమిని నవ్వులతో పులకింపజేసి
లేదా తునాతునకలై పోయి గాలికి
దీనంగా చూచే దిక్కులనింకా ఏడ్పించి
దేవతలకు దెయ్యాలకు పనికల్పించి
విషాదం వైరాగ్యంతో వేదాంతం
భయం సందేహంతో విజ్ఞానం మేల్కొల్పి
విద్య అవిద్య ధనం ధరిత్రితో
అందం ఆనందం ముక్తి మోక్షంతో
ఆరాటం పోరాటం, ఆటు పోటులతో
విజృంభమాణ విస్తరణ శీలక అహంతో
సమశక్తుల సంఘర్షణతో, దుర్బలుల ఆవేదనతో
సంధ్యారుణ రక్తిమవలె సహజంగా శాంతంగా
అశాంతి, సంపరివ్యాప్తమై మహాకాశం
తిరిగి మొదలౌతుంది అణువుతో ఆశ్వాసం
*
ఆత్మ గుణాన్నధిగమించిన మేధాశక్తితో
ఆహార—వ్యవహార సమస్య లేనాడో తీరి
ఇచ్ఛామరణ జీవశక్తులరచేత బట్టి
భూమిని వదలి వ్యోమ పథంలో
విమానం వలె సంచరిస్తూ లేదా
జలధిపై తేలిపోతూ పడవ వలెనో
సోమ రస పానంతో కాలం గడుపుతూ
సుషుప్తిలో గాజు బంతుల వలె తిరుగుతూ
ప్రేరణాత్మక సహజ శక్తులు నశించిన
రసాయనక ద్రవ్య సముద్భూత మానవులు
*
తెలి మబ్బు కన్న కడు తేలికైన
కర్షణాకుంచన శీలక శరీరాలతో
విశ్వగోళం బింబించే మస్తిష్కాలతో
అంత స్సౌందర్యానుభూతి కోల్పోయి
నిలచి పోయిన ఆకాశంవలె ఆశ్చర్యంతో
మతి పోయిన భూమి వలె పరిభ్రమిస్తూ
నిశ్చల స్థితి ఎరుగని స్వీయ రూపం లేని
కాలాని కనుకరణాత్మక రూపాలు
అగామి విజ్ఞాన యుగం మానవులు
చీకటిని వేరుచేసే వెలుగు గీతవలె
సృష్టియొక్క ఆద్యంతాలు కొలిచే చూపులు
నిశ్చితంగా తరగతులుగా విభజింపబడిన
క్రమ సమున్మీలన మెరుగని బుద్ధిగత జీవులు
ఆరంభం–, అశాంతి నంతరింపగా
యత్నించిన వినూతన నూత్న యుగం
పూర్వపు తన సహజ స్థితికి రావడానికి
తూర్ణ చరా వేదనాగ్నితో,– అంతం.
III
ఎక్కడికక్కడే దూర దూరంగా
వాలిపోయి కంటికి కన్పించని నభస్సు
విరామ మెరుగని అశాంతి గీతం
వినిపిస్తూ ఎప్పటికప్పుడు వెళ్లిపోయే వాయువు
ఏనాడో తెగిపోయి హఠాత్తుగా
ఆలోచనా స్ఫూర్తి రేఖల సంబంధం
ఆకృతిలేని కదలిక ఎరుగని
మసక కళ్ళు మూతబడని అంధకారం
ఇసుక ఎడారి నాలుక చాచి
దూరంగా సరస్సులా కన్పించే
చంద్ర బింబం వైపు పరుగుతీస్తూ
ఎంతకాలానికీ అందుకోజాలని భూమి
నిలువడానికి సూది మొనంతైనా
సన్నని వెలుగు దారుల విస్తృతి
రక్షణకై పరితపించు బ్రతుకులు
ప్రతి అంగుళం అంగుళం మేర నేలను
మ్రింగి వేయడానికి జల బిందు సమూహంగా
మాటి మాటికి ఉత్సహించు సముద్రం
జ్వలదగ్ని సమూహా సంభ్రాంతిమత్
సంధ్యాటవీ ధావన్మృగపక్షి సమూహము
రవి బింబ సమాచ్ఛాదన మేఘమండలీ
కల్పిత ఛాయా వాగురానిపతిత జీవరాశి
ఉన్మాద ప్రలపనా సముద్భ్రమన్మరుదావళి
మరుదావలీ సంచాలిత నిర్యూహవృక్షావలి
అశాంతి ఆనందంతో నగ్న నృత్యంచేయు
యుద్ధోన్మాదిని సినీవాలి రాక్షసీ అట్టహాసం
*
ఆకాశముఖంపై సంధ్యా ప్రశ్నలవలె
స్పర్శగుణం, చలనశక్తి, వ్యక్తిత్వంలేని
నడిచే నిలువు నీడల మూకలు —
వేగ గమనశీలి కాలం వదలిన ముద్రలు
అగ్నితో మాసిపోని ఊహలతో పూడ్చబడని
మానవుని ప్రగతి చరిత్రలో చీకటి లోయలు
నిశ్శబ్దం సమావరించిన శిలా విగ్రహాల
పాదాల ముందు రాలిన కన్నీటి చుక్కలు
పర్వతాల హృదయ కర్కశ స్వభావాన్ని
సంగీతంతో సముద్రానికి చేరవేసే నదులు
రాత్రి –
సహజావేశంతో నాలోని అందశ్శక్తిని
తన వశం చేసుకుని ఆనందించే నిద్రలో
అంతలో అంతమై మస్తిష్కంలో ఆరంభించు
స్వాప్నిక సన్నివేశాల బలమైన సంఘర్షణ
ఉదయం–
కందగడ్డలా మారిన ముఖంతో మేల్కొని
హిమావృత సూర్యబింబ రూపంలో నిల్చిన
వెలుగు గుడిని చూచే చీకటి కళ్ళలో
తేలే చిన్ని చిన్ని పడవల్లా నిప్పు రవ్వలు
ఉదయం ఆరున్నర,
విరిసిన జన సంచలం
మతి పోయిన చంద్రుని ఆలోచనల లిపి
అర్థరహితమై మాసిపోయిన వేళ
సూర్యుని విశాల హృదయంపై వ్రాలిన
సర్వ జగత్తు భయశోకం మరచిన వేళ
వెలుగు పోయి బీతు బీతుగా ఒంటరిగా
నగరంలోని దీప స్తంభాల చాటునుండి
వీణాశ్రుతులలో వినిపించని దీన స్వరాలు
వంకరలు తిరిగిన సూదులవలె చూపులు
క్రుంగిన భూమీతలంపై
పాములు విడిచిన పుట్టవలె
కోర్కెలు ఫలించని ఇసుక దిబ్బవలె
సంధ్యాగ్ని కీలలకు పొగబారి
తెల్లదనం నశించిన ఆకాశంవలె
నేల వాలి పూర్తిగా అతికిపోయి
మన్వంతరాలుగా పరిక్రమించిపోవు
జగన్నాథ రథచక్రాలు పట్టుకొని
మృత్యువు ఊహలతో వదలని చీకటివలె
నీడలు వదలి పోలేని శైశిరాకారాలు
సాంఘిక సమభావ స్థితికందుకొనని
అన్న జీవుల ఆరాటం — ఆరని కాష్ఠంవలె
జీవితం క్రతువుగా పరిణమింపజేయు
మనః ప్రాణి ఆవేదన— జ్వలించే సప్తార్చివలె
పట్ట పగలు—
అగ్నిపర్వత శిఖరం ఒరిగి పడినట్లు;
తనపై ఆకాంక్ష లోకంపై మమకారం
ప్రక్కవాడితో జీవితంలో అజ్ఞానంలో పోటీ
నిశాఽగమన సంధ్యాసమయం
జాతులు జాతులుగా, మాలలు మాలలుగా
ఇతస్తత ఉడ్డీన విహంగమ సమాకీర్ణమై
చివరలు నీలీకృతమౌ విలోచన పథం
విశ్రాంతి కోరు నిరంతర యాత్రిక సమూహం
పైన అన్నపు మెతుకులవలె చుక్కలు
క్రింద విద్యుద్దీపంచుట్టూ కలవరించు చీకటి
తానై మేల్కొనదు–—ఎవడైనా మేల్కొల్పితే
నిప్పంటిన రాక్షసిబొగ్గు – విప్లవం
ఆకాశానికి భూమికి మస్తిష్కానికి మనస్సుకు
ముఖ్యంగా తనకైనా తన పరిణామం తెలియని
—పరిణామ రోదసి
మానవుని ఇష్టాపూర్తికి చిట్టచివరి దశ
ఈశ్వరుడు, అతని పాదాల ముందు
అవనత మస్తక సోపాన పంక్తి వలయం
అతని శిరఃపదము మీరి దాటి పోగల
తమలోని ఆత్మభావం తెలియని జీవులు
పరివర్తన చెందని అనాది వారసత్వ చిహ్నాలు
సుత్తెల మ్రోతలు విని ఎరుగని కొండరాళ్ళు
ఋతు పరివర్తన శక్తికి నిల్వ లేక నశించు
ఆకురాలుపు, చిగుర్పు, పెరుగుదల ఎరుగని
—గడ్డిపోచలు
జీవితాంతం వెలుగుతూ త్రైగుణ్య విపర్యయంతో
అసంపూర్తి కామనలతో చల్లారని మనఃశ్మశానం
కళానుభూతిలో, లౌకిక వలయంలో
ఆనందం దుఃఖం పేరిట నగ్నంగా
ఉద్విగ్నంగా దీప్తమతికి గోచరించు
అశాంతి గోళక వివర్త దృశ్యాలు
కాల నియమం లేకుండా సంచరిస్తూ
అజ్ఞాతంగా, అద్దం వంటి బుద్ధిలో
అవిజ్ఞేయంగా బింబించు మనోభూమికలు
IV
రక్తారుణ పాద ముద్రలు ఎంత దూరం సాగినవో
అంతవరకు అడుగడుగునా, పలుకు లేని
చూపులేని నడవలేని ప్రతి బింబాలు తప్ప
ఎక్కడా ఎవరి నిజ స్వరూపమూ కన్పించలేదు
ప్రక్కన నడిచే చెట్లకు నాభాష తెలియదు
వాటిలో ఒకరి భాష వేరొకరికర్థం కాదని
తరువాత తెలిసింది చేష్టలను బట్టి
ప్రక్కన నడిచే కొండలకు నా రూపం కన్పించదు
వాటిలో ఒకరి కళ్ళు వేరొకరిని చూడలేవని
తరువాత తెలిసింది నడతను బట్టి
వెనుక నడిచే నీడలకు నా ఉనికే తెలియదు
వాటికి చెవులు, నోళ్ళు, కళ్ళు లేవనుకున్నా మొదలు
తరువాత తెలిసింది జీవం కూడ లేదన్న సంగతి
వెల్లు గీత దాటలేని చీకటి బంతుల వలె
అక్కడక్కడా దాగి దాగి తిరుగు
జ్ఞాన స్ఫూర్తి ఎరుగని జంతువులు తప్ప
ఎక్కడా నా కంటికి మానవులు కన్పించ లేదు
ఊహగత మనస్సౌందర్య వర్తిత్వం పెంచుకుని
మానవులను చూడడానికింతగా తపించడం దేనికి ?
మనోజీవం నశించినశవాలు; పీడించే దెయ్యాలు
కంటికి, రంగు వేయబడి కన్పించే మట్టి బొమ్మలు
అంత ఎత్తు కొండ కొమ్ము మీది నుండి
దూకి, సరస్సుపై వాలి పోయిన క్రీనీడలు
కారు మొగిళ్ళ గుంపులు—నల్లని త్రాచు పాములు
బహు విచిత్ర జంతు సమూహ రూపాలు
అద్దంలో అస్ఫుటంగా కన్పించే నీడ బొమ్మలు
పగలు వాటి చుట్టూ నిద్ర వంటి బ్రతుకుతో
రాత్రి మేల్కొని ఒకరి నొకరు పలకరించుకొని
చీకట్లో నవ్వుకునే కుర్చీలు—కాగితాలు, కలాలు
ఉదయం కాగానే ఏమీ ఎరుగనట్లుగా కన్పిస్తవి.
ముఖాంచల విన్యాస వైఖరి నుండి తప్పించుకొని
ఒక చోట కూడి స్వేచ్ఛగా సంభాషించు కొనే హృదయాలు
శ్మశాన పాద ముద్రలు, –ఇంకా కొంత దూరంలో
ఆత్మీయత, ఆలోచన, నాదశక్తి ఎరుగని
కపాల ముఖ సమాగత వాయుగీతాలు––, విని
హర్షంతో వేయి రెక్కలు కట్టుకొని ఎగిరే అడవిపిట్టలు
అవల ఏమున్నదో వాటికి తప్ప ఎవరికీ తెలియదు
దూరం, సుదూరం వెళ్ళిపోయిన నేను
నా మస్తిష్కంలో తిరిగే
ఒక ప్రక్కకు ఒరిగిన ప్రపంచ గోళం
క్రిందికి వాలిపోయిన ఆకాశం
స్థిరమైన ఉనికి ఎరుగని నీడబొమ్మలు
బుద్ధిని వదలని — తృష్ణ తీరనికామనలు
దూరం బహుదూరం వెళ్ళి పోయిన—
నా పాదాలక్రింద ధూళి రేణువులు
నా కనుచూపు సాగి ఆగి మలగిపోయి
శూన్యంలో కలసి మాయమైనంతవరకు
నిల్వుటద్దంలో కన్పించే, వెనుక గీయబడిన
పిచ్చిగీతల్లా, నాకు తెలియని నోరు లేని లిపి
V
మంచు ముసుగు వేసుకున్న మనిషి
నా కను చూపు మేర చివర ఆగి
నా వైపు అడుగులు సాగించడం మాని
ఆలోచనా మూర్తిలా అక్కడే నిల్చిపోతే
నా కాలి సవ్వడి నాకే భయంగా
నా ఊహ పడగ విప్పినపాములా
నగ్నంగా వాంఛా సహితంగా కన్పించి
నా ఆకృతి నాకే రెండు రంగులుగా
ముఖం త్రిప్పి చూతును గదా వెనుక
మలి సంజ రెక్క నీడవలె నిలువునా
నేత్ర గోళాల నావరించిన నైల్యాకృతి
అప్పటి నుండి ఎటు చూచినా ఏకాకృతి
గగన చక్షుస్సంయోగానుభూతి ఎరుగని
సృష్టి విధా పూర్వ నిరామయ జలాకృతి
దగ్గరిగా దూర దూరంగా గాలి నడకల
సన్నని సవ్వడి వినిపిస్తుంది ఇప్పటి వరకు
చిరుకదలికతో తాటి మొవ్వల ముర్మురము
నవ్వు తెర ఏడుపు రొద ఏమైనా కావచ్చు
కళ్ళలో సూదులు గ్రుచ్చి అంధుని చేసి
ఆనందించే పిల్లలు ! ఎంత మంచి వాళ్ళు
వీరు బ్రతికి నంత కాలం ఇలాగే వుంటే
బిందువులో నీరులా, ఆనందాక్షరాలలో
దుఃఖానికి పర్యాయపదం భగవంతుడౌతాడా ?
నాకు కన్పించినది భగవంతుడని చెబితే
వాళ్ళను వదలి వేశానను కొని అమాయకంగా
ఎవడికి వాడు మనసులో సంతోషిస్తాడను కుంటా
VI
జ్వలదూహ శిఖలతో నిను ఆహ్వానిస్తా
పవమాన పంక్తివలె రివ్వున ఎగసిరా
కలసి పోయి మన మిరువుర మొకటిగా
నిలచిపోదాం ప్రకాశమాన రోదసి వలె
మన కంటి ముందు బూదికుప్ప సర్వ సృష్టి
మేధా పదవి వ్రేలాడే మబ్బు గుంపు స్వర్గావళి
అణువున కతీతంగా, సర్వాభిముఖీనంగా
స్ఫురించుదాం శైవతనూ సుషమారోచివలె
మన కను రెప్పవాలితే ఆరి పోయి సూర్యుడు
చీకటిలో పరిభ్రమించు దారి తప్పి చంద్రుడు
భూమిపై ఆకాశ ప్రభావ వినూత్న ముద్రలు
కనురెప్ప తెరవడంతో తిరిగి అంతా మొదలు
అనాది నుండి అవిచ్ఛిన్నంగా సాగి వచ్చు
ఒక్కొక్క జీవి నిల్వగా సంతరించుకున్న శక్తి –
క్షణం యుగం మన్వంతరం లేదా కల్పం
పాముగా, పక్షిగా జంతువుగా మృగంగా
బానిసగా, అధికారిగా మనస్విగా తపస్విగా
ఆకాశానికెత్తబడిన వెలుగు నిచ్చెన్నపై
మెట్లు మెట్లుగా అమర్చబడిన చీకటి
క్రిందినుండి చూస్తే పైకి ఒక దానిపైఒకటి
పైనుండి చూస్తే క్రిందికి ఒక దానిక్రింద ఒకటి
ఎక్కడో అంతమైనట్లు ఎక్కడికక్కడే భ్రాంతి
అక్కడే మొదలైనట్లు అక్క డికక్కడే స్ఫూర్తి
ఆరోహణ అవరోహణల క్రమం
దగ్గర అయినకొద్దీ ఈర్ష్య కోపం దుఃఖం
దూరంఅయినకొద్దీ జాలి ప్రేమ భక్తి
విచిత్రసంపుటీ సంగ్రథితము మానవహృదయం
ఊహలో తిరిగే భూమిని విభజించి
కాలానికొక క్రమ పరిణామం కల్పించి
కంటిచూపులో కదలిపోవు సూర్యుడు
అతని ననుసరించి గమనంసాగించు నేను
ఆకాశంవలె విడిచిపోను దిజ్మూర్తిని నిన్ను
అంతలో ప్రళయ భావమొందిన
వర్షాజల ప్రవాహ సముద్రిక్త నదివలె
దానవాంశ మలచుకొన్న జీవకోటి;
శరత్కాశ సరః పుండరీక విభా
రమణీయ కింజల్క పరాగ పటలివలె
మానవతా అందగించిన హృదయమూర్తి
సంఘర్షణ ఫలితంగా జన్మించిన
దుఃఖ నిరాసక్రియాచ్చ శీలకకళవలె
దేవతాత్మ పరిధివరకు విడివిడిగా
ఆవల ఇరువురమొకటిగా సంవిలీనమైపోదాం !
VII
అస్తమయం జరిగిపోయి ఏనాడో కళ్ళలో,
చీకటి రెక్క చాచి ఎగురు పక్షి కంటికి
దాటరాని అగ్ని మండలంగా — అంతలో
ఒక మృదు సుషీమ పవనవీచిక విసరుల
వాంఛానుగుణంగా, మలగి వెన్నెల వత్తివలె
భ్రమించే ఊహాచక్ర ధ్వనిమయ మస్తిష్కంలో
తిరిగి తిరిగి జ్వలించి జ్వలించి
ఏనాడో ఎప్పుడో బూదికుప్పగా మారు
ఈ అగ్ని శిఖాభ తనూ రేఖతో, క్షణం
భూమిపై నిల్వద్రొక్కి కొనగా, ఊహా లేక;
ఒక రాగానికి సంచలించి ఊగిపోవు జీవికి
రాత్రి వేళ దూరాకాశమందు కనిపించే
అమృతాంశుబింబంలో విలీనమౌదామని ఉన్నది.
భూమిని మరచి, ప్రాతరుదార కాంతిపుంజంలా
విశ్వాత్మలో ఏకమై నిరాకారమైపోతే తప్ప
తనలో దూకితే ఈ అగ్నిని ఆర్పగలదా? సముద్రం!
శరీరాంచలమాత్ర దఘ్న జలబిందు సమూహం,
అక్కడేగా రూపుకట్టున దెక్కడాలభించని శాంతి
అప్పుడే కన్పించునది సర్వజనుష్పలాభిముఖ జ్యోతీ రేఖ
వ్యావర్తిత సృష్టియొక్క అచ్చమైన తొలి వెలుగు రూపం
అద్దంలో నీడలు
మాదిరాజు రంగారావు
స్వేచ్ఛా కవిత్వం
అద్దంలో నీడలు
ఆచార్య మాదిరాజు రంగారావు
SWECCHAA KAVITHVAM
ADDAMLO NEEDALU
Prof. Madiraju Ranga Rao
© Dr. M. Santhosh Kumar
Rasadhuni Sahithi Parishath, Hyderabad - 28
ప్రథమ ముద్రణ: నవంబరు 1960
రసధుని ప్రచురణ హైదరాబాదు.
పునర్ముద్రణ: జూన్ 2026
అనుపమ ప్రింటర్స్
శాంతినగర్, హైదరాబాద్
ఫోన్ : 040–23391364
I
తూరుపుటద్దంలో ఒక చివర బింబించిన
నా ముఖం గుర్తించి గుంపులు గుంపులుగా
పురాణ పురా నివాస స్థలం వదలి అంతలో
దూరాకాశ తీర భూములు చేరిన భూతాలు
రువ్వబడిన రాళ్ళవలె కేరింతలతో రివ్వున
ఎప్పటికప్పుడు నా మనస్సు నాక్రమించాలని
ఏదో వేషంతో తిరుగు మృత భావనామూర్తులు
వెలుగులారి కొడిగట్టిన వత్తుల ప్రమిదలు
భూతాల సమావేశంలో ఏకగ్రీవంగా
ఆమోదింపబడిన తీర్మాన పాఠం
హిమ బిందు రూపంలో అంతటా
ప్రకటింపబడిన సమీరణ పత్రం
చదవటానికి యత్నించు చెట్ల గుంపులు
చేతులు చాచి చెరపివేయ ఉత్సాహిస్తూ
పసిమిచిందు ముఖాలతో చుట్టూ ఎగబ్రాకు
నను పట్టుక ఊగులాడు వెలుగు కెరటాలు
*
ఆకాశం నుండి భూమి వరకు సాగిన వెలుగు వంతెన
వెలుగు వంతెనపై సశబ్దకంగా నడిచే మనుషులు
ఒక దిశ నుండి మరో దిశకు సాగు గాలి వంతెన
సగం నిద్రలో నిశ్శబ్దంగా నడిచే మబ్బుగములు
భూమిపై వేల ఏండ్లుగా శిలాకృతుల రూపంలో
శాప వశాన పడిఉన్న ఊహగత సౌందర్యజీవులు
క్షుధాగ్ని కలుగని వ్యథార్త మెరుగని
శాంత భావనా రమ్య శిల్ప దీపశిఖలు
ఈ దీప శిఖల నీడల గొలుసులు పట్టుక తిరుగు
పొగ క్రమ్మిన అరమూత కనుల రాత్రించరులు
తెరవబడిన కనుల త్రాగి అమృతపు వెలుగులు
ఈ దీప శిఖల నాశ్రయించి తిరుగు దివౌకులు
*
ఎన్నో ఏండ్ల గ్రహణంనుండి విడిపించి నభోమణిని
భూమిని ఆకాశాన్ని రెండు ముక్కలుగా వేరుపరచి
మరుద్గణంతో దుస్థితి పారద్రోలి సుస్థితి కల్పించు శచీపతి
దేవతలకు మానవులకు చాల దగ్గరి బంధువు
హిరణ్య వర్ణ జాతవేద ప్రథమ పవిత్రమూర్తి
ప్రతి ఉదయం జన్మించు మృత్యూపచయ మెరుగని కవిక్రతువు
సవితృ బింబ నేత్రంతో సర్వం పర్యాలోకనచేస్తూ
హస్త నిహిత పాశంతో పవమాన నిశ్వాసాలతో
సువర్ణ పక్షాలతో వెలుగు క్షమామూర్తి ధృతవ్రతుడు
ఎంత పలుకరించినా పలుకకుండా
ఒకటి రెండు మాటలైనా సరే నాతో
అహంకారం అంధకారం అశాంతి
ఆవరించిన ఆవరణలో అస్పష్టంగా
భూమిపై నీడలు కన్పించేటంత ఎత్తులో
సంభాషణలు జరుపుతూ గాలులతో
కదలిపోవు జ్యోతిర్మయ ప్రతీకలు
ఇంద్రాగ్ని వరుణ దేవతామధుమూర్తులు
*
II
తూరుపుటద్దంలో మరో చివర బింబించిన
వికసన్మృదూజ్వల వదన ప్రాభాతసరసి
నిరంతరం శ్రుతి పోస్తూ కదలిపోవు
మృదు సుస్వర నాద వాయు పరిషత్తులు
విశ్వాసంతో సురభిళ నిశ్వాస పవన
వీచికలతో ఎదురు వచ్చి చాంద్రీహాసంతో
రోదసీ సమాక్రాంత మృదుల నతాకాశంవలె
తూరుపుటద్దంలో బింబించిన నా ముఖంలో
లీనమౌ, స్నిగ్ధనేత్ర పరినీల పయోనిధి
ఇంద్ర ధనూరజ్యమాన మృదులాశా కపోలపాళి
సంధ్యాకాల ముద్రలు స్ఫురించని ముఖం
చీకటి సుళ్ళు కన్పించని నీలికళ్ళు
ప్రాణ దఘ్నంగా ముంపుగా సాగిపోవు
చాంద్రీ స్నిగ్ధ పరిమళ వాయూర్మిక
అపుడపుడు అనూహితంగా నా మనస్సు ఒరనుండి
దూయబడిన కత్తిపోట్లకు గాయపడి చిరునవ్వుతో
ఈ గీతం రూపంలో మలగిన తుషారదీధితి
పెదవులు సంస్పృశించి కదలు నవనీతాకృతి
బహుపూర్వ జనూ రహస్య సౌందర్యాలను
వేదనా రూపంలో స్మరింపజేయు జీవగతచైతన్యము
జీవనాడులను వాయుతంత్రులవలె స్పందింపజేయు
దేవతాభావం రూపుకట్టిన సజీవ శిల్పాకృతి
రమ్యబుద్ధి, వెన్నెలల మృదూజ్వల ఊహలతో
గగన మండలం వాయుపథం భూవలయం
సత్వ భావ రమణీయతా సీమలుగా మార్చు
మనోదశ దాటిన ఆత్మభావనాంబుధి చంద్రుడు
అద్దంలో చూస్తే కన్పించి ముఖంలో ముఖం పెట్టి
అద్దం తీసివేయగనే ఊహను సమాక్రమించి
సుషుప్తిలో, ఉపాధి నాశ్రయించని–
ఆత్మలో సంవిలీనమౌ ఆనందరసాకృతి
*
III
అరెరె! ఎంతగా వెలిగిపోతున్న దీసృష్టి సౌందర్యంతో
నాకనులలోని వెలుగు లాహరించి ప్రమిదలు మిగిల్చి
బహిరింద్రియాల నాశ్రయించని ప్రదీప్త సౌరశక్తి
నా మనస్సు నావహించినది తరుమబడి లోకంనుండి
స్త్రీ పురుషులవలె కన్పించు సన్నని పలుచని నీడలు
చుట్టూ అందంగా అల్లరిచేయు శిశువులవలె గాలులు
స్త్రీ పురుష విభేదం దుస్తులనుబట్టి ఏర్పరచుకొనని
దృశ్యమాన జడ సమూహ వస్తు భిన్నమైన ఊహచక్రం
గ్రీష్మరశ్మికి భగ్గున మండి ఆరిన బొగ్గులవలె మొగ్గలు
అక్కడక్కడా శ్మశాన వాటికా సదృశములై నిల్చిన చెట్లు
అంతస్స్వ
రూపం చూచుకోలేని నడిచే చెట్లవలె మనుషులు
మనుషుల బుద్ధి నాక్రమించిన పాంచభౌతిక శరీర ప్రపంచం
ఝుంఝా సంగీతంతో లిప్తలో ఆకస్మికంగా
ఉన్మనీ చరమ దశ కందుకున్న
వాయూచ్ఛల దుగ్రరావ మహాభూత ప్రకృతి\nబీభత్స కథారచనా
పటుతరశిల్పం
వెను దిరిగి చూడక కదలిపోవు నదీ ప్రవాహంవలె
ఒకచోట నిల్చిపోయి పడియవలె, సీమితమైన కోర్కెలతో
ఋతు మనోజ్ఞ వర్ణ సామరస్య మెరుగని జీవితం
కదలిక ఎరుగని భూమివలె నిల్చిన అనంతకాలం
కర్ణ వీధి ప్రాకు భిన్నధ్వనుల వర్ణ సమామ్నాయం
బాల్యం నుండి యౌవనం, యౌవనంనుండి వృద్ధాప్యం
ఆరోహణావరోహణల క్రమం ముఖంలో బింబించు
మృత్యు రేఖలెరుగని క్రియా కలనావలిత జీవాకృతి
మబ్బుల నీడలవలె మానవుల జంతువుల రూపాలలో
ఒక వృత్రాహి లేదా రావణునివలె మనః ప్రత్యక్ష మార్గాలలో
సృష్టి రహస్యానికి వ్యాఖ్యానప్రాయంగా విచిత్ర రీతులలో
సంస్పందమాన జ్యోతిస్సాహితి మలచుకొన్న ఆకారాలు
అసంఖ్యాక యుగాలుగా ఊహించు ఆకాశమస్తిష్కంలో
ఊహకందని పరిణామ రోదసీ వక్షస్థలంపై
క్షణ మాత్రమాగకుండా నడచు భూమిపాదాలపై
వెలుగు చుక్కలపై గాలి తరగలపై పరమాణువులపై
సూర్యుని ఆలోచనల దీప్తి చంద్రుని హృదయ స్పందనం
ప్రత్యక్షానుభూతి ఎరుగని ఉన్మీలన మెరుగని కళ్ళు
గుడి, చర్చి, మసీదు అందులో అనాది దేవత
వేయి మనస్సులలోని ఊహల క్రమ్మిక సొగసుతో
వేయికళ్ళ చూపులతో పల్కరించు, సద్యఉదిత
క్రమ సమున్మీలన సృష్టియొక్క శిల్ప సౌందర్యం
వేయి రెక్కలతో ఎగిరి గాలిలో లీనమైనట్లు జ్ఞప్తి
స్పృశా స్పృహణీయానుభావ్య రమణీయము వాయువు
ఎప్పుడూ ఎవరికీ చాక్షుష సంయోగం కాని మాట నిజం
మనః ప్రత్యక్ష దృశ్యానుభూతి పొందు జీవి
రాత్రి వలె కాకపోయినా ఆకాశంవలె అంధుడు
రాత్రి కొక ఉనికి, ఆకాశాని కొక ఆకారం
అంధునికొక సుసుందర వర్ణమెరుగని ఆలోచన
అడుగు తీస్తే నుయ్యో గొయ్యో భూస్థితి తెలియని
తాను కదిలితే ప్రక్కన జంతువులో మృగాలో
మనుషులో రాక్షసులో మనస్సహజస్థితికందని
సహస్ర జిహ్వలతో మాట్లాడు జ్వలదగ్నివలె ఆరని ఆలోచనలతో
బహుకాలానికి నడి వీధి కలసి
అక్కడే నిలబెట్టి మాట్లాడిన
అంధుడైన ఒక మిత్రుని ఆలోచనలకు
కల్పించిన రేఖలు లేని ఆకారం
IV
బహుపూర్వ జనూస్థితులను గమించి
ప్రస్తుతం ఒంటరిగా బ్రతుకు వంతెనపై
పయనించు మనిషి అడుగు క్రింద అంగుళం మేర
ఒక్కొక్క మబ్బుముక్క; కంటిముందు మట్టిముద్ద
దూరంగా ధరణీ కాంతార దేశంనుండి
పరుగిడి వచ్చు పరిణామ దర్వీకరాభము
దగ్గరి దగ్గరిగా చుక్కల పూగుత్తులతో
సాగి వచ్చు సముల్లలన్మృదు నీల నతాకాశము
వంతెన కీతల మరి ఆతల చివరల ఏమున్నదో
ఇదమిత్థమని ఎవరికీ ఇంతవరకు తెలియదు
యుగాలనుండి పరంపరగా ధురాగతి వచ్చు
ఊహలు, అనుమానాల ప్రావార ప్రాకారాలు తప్ప
వంతెనపై అడుగువేసి సాగిన తరువాత గాని
మనిషికి తన వైయక్తిక స్ఫూర్తి భాసించదు
వెనక్కు తిరిగి పోదామంటే వీలుపడదసలు
అడుగు తీయడంతోనే కూలిపడి పోతుంటుంది
అక్కడే నిలచి పోదామంటే అంతకన్నా వీలు లేదు
ఎప్పటికప్పుడు భయంతో ప్రచలితమై మనస్సు
భవిష్యత్తును గాలివలె కౌగిట బూనాలనే ఆశతో
కాలాన్నడ్డి లాభంలేదు సూర్యుని రథచక్రాలనువలె
*
వంతెనపై ఇరుప్రక్కల అసంఖ్యాక యశఃపతాకలు
జాతి మత రాజకీయ విద్యాప్రచారక సాధనా స్తంభాలు
దివిటీలవలె అక్కడక్కడా కూర్చున్న రాజకీయ వ్రతులు
మత ప్రవర్తకులు – ఇహ పరలోక సంగ్రహ స్వరూపులు
ఇంకా –
ఒక పయః పారావారము మలచుకొన్న మధురాకృతులు
ఒక నీల వలాహక మసృణ కాంతి రేఖ లందగించు కనులు
ఒక ముగ్ధ సరోవరంపై మృదుల నతాకాశపు వంపులు
తొలి మలి సంజలందు గాలి పల్కరించు పూల సవ్వడులు
పరిపాలింపబడి ఒక అనిదంపూర్వ స్థితిచే
విసరబడి బహుదూరం ఒక విపరీతపు గాలిచే
ఒక ఊహ పరిధిలో మలచబడి బహు విచిత్ర రీతి
ఒక గల్లచపేటమువలె మ్రోగు వాయు ధ్వని వలె
ఒక వాయు రేఖ విలీనమౌ మధుర సంగీతంవలె
పైశాచిక రాక్షస మానవ దివ్యానుభవ
భావనా ప్రదీప్తమనోఽంబరాలంకృత దేహులు
*
వంతెనపై నుండి క్రిందికి చూచి మహదానందంతో
కళాసృష్టి వ్యక్తపరచు రసస్విన్న హృదయులు
భయపడి రెండు కనులు మూసుకొను అమాయకులు
ముగ్ధులై ప్రాణాలు మరచి దూకు మరికొందరు
మృదుజీవులు — సామాన్యులు — పరమ తీవ్ర ప్రకృతులు
అవిచ్ఛిన్నంగా నిస్సంశయంగా సర్వవేళల నడవబడు
ఎప్పటికప్పుడు, ఏ బుద్ధి విశేషంచేత వినిర్మింపబడని
ఒక స్థితికి చెందిన అనుభూతి యొక్క సుసుందర కల్పన
ఏ శక్తి చేత అంతమొందింపబడని—ఊహకందీ అందని
వంతెనలివి — తనపై వదలబడిన పాదముద్రలు
కాలంయొక్క ఆభరణాలు మాయని స్మృతిచిహ్నాలు
V
అగ్ని జ్వాలా చేలము ముడుతలు ముడుతలుగా
మనోజ్ఞంగా సంపరీవృతమైన నీలాంబుద దేహము
హిమాసార తుషారములు తెలిముత్తెములుగా
చిత్కళలవలె సంగ్రథితమైన భాసమాన నేత్రములు
భానూదయాదిశా సమ ప్రకాశమాన విశాల ఫాలము
ప్రకృతి శక్తి సమాహారైక స్ఫూర్తి రేఖ బింబించిన
దర్పణము ముందు – నేను
ఎటు ప్రసారించినా దృష్టి సమాకర్షించి ప్రత్యణువు
మనస్సును చలింపజేయు మృత్తికామయ వస్తు సమితి
కనులు మూసేవేళ కన్పించి, తెరచే వేళకు మాయమై
దివానిశలు చుట్టూ పరిభ్రమించు గ్రహకూటమి — పైన
*
మానవుని జన్మకు పూర్వమే సృష్టింపబడి
చపలత్వంలో స్థానమేర్పరచుకున్న నరకం
కాలం వదలిన, ఆరని కన్నీటి నిప్పుకణం
నిశ్చల బ్రహ్మాభబుద్ధిలో బింబించిన స్వర్గం
కాలం ముఖంలో విరిసిన ఆనంద మధుర రోచి
ప్రభు దయావిహీనమై తనుకు మాసిన రాతిరి ఒక వైపు
ప్రభు దయామధురాపాంగ రోచిర్వాసోదయం మరొక వైపు
సర్వదా ఒక తెల్వి దూకుడుచే మేల్కొల్పబడి
ఒక కల్పన తప్ప మూర్తి కట్టని రోదసివలె
కాల సూత్రంతో ఎన్నటికీ విడదీయరాని జీవితం
అతీంద్రియ శక్తిచే సంచరణచేయు జీవసమూహం
విచార ధారా రమణీయతా ప్రసన్న
జ్యోత్స్నాంశుమాలా మృదులావనతాకాశము— పైన
దృశ్యమాన శరీర ప్రపంచ సంహిత
దృక్త్వ జీవ గత చైతన్యము — నేను నా క్రింది భూమి
భూమిపై గుండెలు వ్రయ్యలైన పర్వతపంక్తులు
ఎక్కడో ఇంకి పోయి లేదా ఆగిన నదీనదాలు
వస్తువు గుర్తింపగా వీలు లేని చేతి కందని
ఊహ నాక్రమించి అతిక్రమించలేని నీడలు !
*
ఇద్దరు స్త్రీ పురుషుల రమ్యముఖ శిల్పాకృతుల మధ్య
ఇద్దరు వైరాయమాణుల మనస్సహజ ప్రేమ సౌందర్యంపై
ఒక స్వతంత్రమైన ఊహ చంద్రుని వెనుక అనంత పరిధి
జారిన క్రమ్ముకొనిన సాగిన, పొరలు పొరలుగా నీడలు
మృత్యువు కివతల అవిజ్ఞాత లోకంయొక్క
నీడల గుంపుగా, తలచబడిన రోజున ఈ ప్రపంచం
ఇచట స్థాపించబడిన సుందర పవిత్ర దేవాలయాలు
దివి నుండి జారిన స్మృతిలో వెలిసిన వెలుగు మేడలు
రివ్వున డొక్కలో దూసుకపోవు మెరపు బాకులు
నవ్వుల జడితో చిందులు త్రొక్కు మొగిలు ముఖాలు
నటనా చాతురీ నిగూఢ హాసం పెదవుల పొందికపై
సదా ఒత్తిగిలి ఉండు దుష్టోద్యోగి మనః ప్రకృతివలె
ఎప్పుడు విచ్చిపోవునో తమకై నా తెలిసి చావని
అగ్ని పర్వతాలవలె నున్న ప్రళయాంతస్సారణులు
నవ్వు తెరలు కప్పి ఎన్నో మానసిక హత్యలు జరిపి
పదునెక్కిన మనస్సులతో నా ప్రక్కన నడిచే మనుషులు
చూచి — మానసికంగా వాడి ఈ లోకం వీడి
లతాంతస్సౌందర్య సృజనశక్తి పరవశత ఊగిపోవు
భూనభోంతరాళ విసృమర భోగ వాయు హేలా మూర్తులతో
ఎంత దూరమైనా కలసి మెలసి పోయి తిరిగి రా స్ఫురించదు
ఆకాశం గొంతుతో కలిపి వినిపించే పృథ్వీ సంగీతం విని
వేయి కళలతో కాలం పెంచుతుంది జీవిత పరిణామం
ఎన్ని రోజులు గడిచిపోతే అన్ని రెక్కలు మొలచినట్లు నాకు
VI
అర్ధరాత్రము కెవ్వున వెర్రికేక
పిండు కట్టిన భయంతో నిశ్శబ్దంగా ఉన్న
ద్యావాపృథివి మనస్సులో మెరపురేక
రివ్వున గాలి వేసిన ఈలలకు
చివాలున చప్పట్లు చరచినవి చెట్లు
అలలు లేని చీకటి నీటిలో
ఒడ్డు నుండి ఏదో బరువైన వస్తువు
ఒరిగి పడిపోయిన చప్పుడు
అంతలో నిశ్శబ్దంలో లీనమైన స్థితి
ఝటితి స్ఫూర్తి కలిగి మేల్కొన్న మనస్సులో
ఒకటి రెండు పురాస్మృతుల కదలిక
కదలిక గుర్తుపట్టి ఎవరో మెల్లమెల్లగా
భయం భయంగా జారిపోయినట్లు గుర్తు
అక్కడక్కడా సగం నిద్రమత్తులో తూగుతూ
సగం మేల్కొని ఉన్న గాలులు– అలికిడి విని
గుంపులు గుంపులుగా సాగి అలజడిగా
ప్రతి అంగుళం అంగుళం మేర గాలించి
చిట్టచివరకు కాలి జాడలైనా తెలియని
స్థితిలో – విసిగి విసిగి, సీత్కారాలతో
చివాట్లు పెడుతున్నవి గలగల మ్రోగే చెట్లను
ఎప్పుడో, ఎక్కడో భయంతో ముఖం దాచుకున్న
చంద్రుని పాదాలు కనిపించీ కనిపించడం లేదు
ఎవరో చిత్రవధ చేయబడినట్లుగా
ఉదయాకాశ ముఖంపై పతాకవార్త
వెనుక ఈడ్వబడుతూ వచ్చే శవం
నీడతో వీధిలో నడుస్తున్న నేను
VII
సూర్యుని ఆశీః ప్రసార కిర్మీరీకృత భూమిపై
ఒక వలయం అతిక్రమించి పోవు లోపల
వేరొక వలయంచే సంపరీవృతమౌ పాదాలు
ఎన్ని ఏండ్లు గడచినవి నడవడమారంభించి
ఇంకా నీడబొమ్మలు కన్పిస్తూనే ఉన్నవి అద్దంలో
విడదీయరాని దుఃఖ త్రయంతో బంధింపబడిన
లౌకిక జీవిత గమనాని కత్యంతావసరమైన
సర్వ సామగ్రి సంభారం ఎక్కడిదక్కడ వదలి
ఎంత కాలానికీ కన్పించని దేవుణ్ణి మరచిపోయి
కంటి ముందు తిరుగు దెయ్యాలకు భీతి చెందక
అక్కడక్కడ వేసవి విరసించి కృశించిన మొక్కలు
దూర దూరంగా తప్పుక దాగిదాగి మలగు జీవులు
బాటసారుల కళ్ళలో దొంగచాటుగా దుమ్ముకొట్టి
అమాయకంగా కన్పించు ఇసుక దిబ్బలు, తుంగ దుబ్బలు
అక్కడక్కడ గొంతులు సవరించుకొను ఈలపిట్టలు
దగ్గరి దగ్గరిగా తూలి తూలి చను ప్రాణిసమూహం
గ్రీష్మం అందుకుంటే చాలు వనం తగులబడడానికి
సగం సగం కాలిపోయి పొగచూరిన కాష్ఠాలు
రెండు దివ్వెలతో ఎంత వెదికినా తృప్తి చెందని
నా ముఖాని కెదురుగా, సూర్యుడు గుర్తుగా
వంగిన ఆకాశం లేచి, విశాలమై భూభాగం
ఇచ్చిన స్థలీ పరిణాహ లబ్ధ మార్గాన నిశ్శబ్దంగా
వినిపించు సంగీతం వింటూ, కనిపించు దృశ్యం చూస్తూ
దేవాలయాలు — జనపదాలు పచ్చిక మైదానాలు
క్రమంగా దాటి ఎంత దూరం వచ్చాను ఒంటరిగా
ఫుల్లాత్మవలె నిల్చిన నిశ్చల గగన పద్మము
రేకుల పొరలలో హత్తుకొని పోవునంత దగ్గరిగా
నగ్నంగా వృక్షాలు నావైపే చూస్తున్నవి ఆశ్చర్యంతో
ప్రేమతో నదులు కొండలపైనుండి దూకి వస్తున్నవి
చేతులు చాచి వెతుకుతూ దేనికోసమో, ఎదురౌ గాలులు
కాలం యొక్క గత స్మృతులవలె రాలిపడు మంచుతెరలు
ఇరువైపుల పరికిస్తూ ఎప్పుడో గమనం సాగించిన నేను
నేనుగా గుర్తు పట్టడానికే ఇంతకాలం పట్టింది
VIII
నిస్సందేహంగా నాటికన్న నేడు
పరిణాహం చెందిన మనో ప్రపంచం
గ్రహాంతర యానంతో సృజనశక్తితో
తృప్తి చెందని మేధా విలసనం
చావు బరువులతో ప్రతిక్షణమొక
పర్వత శిఖరం దాటు మహాజనం
ఇంద్రియ తర్పణీయ పరికల్పిత
యాంత్రిక సమూహ సౌభాగ్యం
అసంఖ్యాక మానవుల మనస్సులలో
మనోజ్ఞ రూపంలో ఒదిగిన ఆకారం
ఒక వ్యక్తి హస్త రేఖపై ఆధారపడిన
అనిశ్చాయక ప్రపంచ భవిష్యత్తు
కళ్ళు తెరిస్తే చూపుమేర ఆక్రమించిన
పృథివీ స్థలీ పరిణాహ దూరదృశ్యాధ్వము
మెట్లుమెట్లుగా వ్యోమపథం సాగిన మనోదశలు
ఒక మహా సంస్కృతీ రూపంలో నిల్చిన చిహ్నాలు
ఒక వ్యక్తి జీవితంలో బహుధా వ్యాప్తమైన
వ్యయ మెరుగని వెలుగువలె విస్తార ప్రపంచం
*
భయ శోకావేశ మనస్సహజ దౌర్బల్యతలకు
లొంగిపోవు, అశాంతి కలవాటు పడిపోయిన
జీవితాలను క్రమక్రమంగా హరించు ఉదయం
సృష్ట్యాది నుండి నేటివరకు ప్రాణికోటి ఆహ్లాదరూపం
నియమిత కాలంలో శిశువువలె ఒకే రూపంలో ప్రత్యక్షం
*
మహాంబర గత సర్వ భూత ప్రకృతి ననువదిస్తూ
దిసమొలలతో నిటారుగా నిల్చిన తాళవృక్షాలు
ఉద్విగ్నంగా ఉత్సాహంగా ఉల్లాసంగా కదలిపోవు
మహాంబర ప్రావార పరీవృతతనూ నిర్ఝరిణులు
సహస్ర సహస్ర మృదుల బాహువులు ప్రసారించి
లిప్త లిప్త ప్రత్యణువణువు అడ్డగించు వాయూర్మికలు
మౌఢ్య విశ్వాస బలంతో వాయుదరీ ఘోషలతో
లక్షలాది వత్సరాలుగా వేరొక దశ ఉన్నట్లెరుగని
పురాణ ప్రగాఢ ప్రబంధ తనూ శైలవితతి
మనోనిభృత సౌందర్యం, మేధాగత సంస్కారం
ప్రాపంచిక విజ్ఞాన స్ఫూర్తిలేని మానవాకృతులు
ఆవిష్కృతాంతర్నిహిత ఆశ్చర్య స్వరూపాలతో
భవిష్యత్తు చేతిలో ప్రాభాత దీపశిఖలవలె
సహసా వేగంతో, అతిక్రమించి పోవు
జీవ భావ రహిత, సృజన శక్తిలుప్త
విజ్ఞాన కళా తాత్పర్య చిహ్న శక్తి రేఖలు
*
ఎన్ని యుగాలుగా గతించినా ఇంకా అక్కడే ఉన్నాం
మానసిక వైక్లబ్యంతో యుద్ధ భయోన్మనీ దశలో
దివానిశలు ఋతువులు ఒకదాని వెంట ఒకటి
ఆగమనం నిష్క్రమణం అంతలో అంతం సంవత్సరం
ఎన్ని యుగాలుగా గతించినా ఇంకా ఇక్కడే ఉన్నాం
మానసిక వ్యాపారంతో తెలివిమీరిన ముఖాలతో
చీకటి తన ఓటమి నెందుకు అంగీకరిస్తుంది?
అనంతాకాశానికి అజ్ఞానానికి తుది ఎక్కడ?
*
మనస్సులో శోక స్వరూపాభిజ్ఞత తెలియని పసివాడు
కాలనియమం లేకుండా అతని జీవిత సర్వాశలు
ఆకులతో పూలతో వైశాఖలై సహస్ర ముఖాలుగా
సుందరాతి సుందరంగా విస్తరించి ఉన్న శోకవృక్షం
IX
కృత్రిమ లక్షణ మనఃప్రకృతి యందు ప్రథమమూర్తి
రావణుని అశోకవనంలో ఆనందహీన శోకమూర్తివలె
అభ్యుచ్చయ పథోచ్ఛలిత విజ్ఞానయుగంలో
మానవుని జీవితంలో అంతరించిపోవు ఆత్మభావన
*
ఒక ప్రాణి సన్నని చూపులో ఒదిగి
ఒక ప్రాణి బరువైన నిట్టూర్పులో తూగి
సామాన్యుని కంటికొక మట్టి ముద్దవలె
మేధావికి పరిభ్రమించు గోళంవలె
వేదాంతికి చేతికందీ అందని బంతివలె
సంపూర్ణంగా, అసంపూర్ణంగా కనిపించు
ఆత్మ గగన చక్షుర్దర్శనీయానందమయ రూపం
సుఖ దుఃఖాత్మకమౌ అనంత భావనా రేఖలతో
స్పష్టాస్పష్టంగా ఆకారం మలచుకొన్న ప్రపంచం
వినూత్న నూత్న వైఖరులలో భిన్నభిన్న రూపాలలో
సృష్టి రహస్యం బహుధా వ్యాఖ్యానింపబడిన
వాస్తవిక మనోదృశ్య కళానుభూతి సంకలనం
శ్మశాన పదవికెంత త్వరగా వెళ్ళితే
అంత అదృష్టంగా భావించే వృద్ధుడు
సర్వం సన్యసించి జగన్మిథ్యాభావనతో
తత్వపదార్థ శోధన చేయు వేదాంతి
అధికారం హస్తగతం చేసుకున్న దర్పంతో
లోకాన్ని శాసించాలని కోరే పెద్దమనిషి
విద్యాబుద్ధి విలసనంతో లౌకిక పదవి
సుఖమయ జీవితం గడపనెంచు హితైషి
పరలోకం ఉన్నదో లేదో ఎవరికెరుక
ఐహిక భోగతృప్తితో సరిపుచ్చు ఇంకొకడు
*
న్యాయమైన వారి కోర్కెల ప్రకటనానంతరం
చాచబడిన ఐదు వ్రేళ్ళు మూసుకున్నవి క్రమంగా
ఎవరికి వారు లేచి వెళ్ళాలని ఉద్యమించగనే
బుసకొడుతూ ప్రాకుతూ సర్వశరీరం
కరవడ మారంభించినవి పాములవలె గాలులు
ఇంతలో మింటికప్పు కులి పడింది మీద
అక్కడే ఉండిపోయారు — ఐదు రూపాయిల నోటువలె
X
మనలో ప్రతివాడు తనకు తాను ఒంటరిగా
ఒక గాజు గోడల గదిలో చిర నివాసం
అవతలి మనిషిని గమనించడం పరీక్షించడమే కాకుండా
తనకు తా నతి గోప్యంగా ఉన్నానని ఊహించడం ప్రముఖంగా
దరవాజాలు కిటికీలు లేనే లేవు దీనికి
లోపలినుండి మనిషి రా వీలులేదు బయటికి
బయటినుండి లోపలికెలా వెళ్ళగలడని ప్రశ్న
అద్దాలు పగులగొడితే బయటికి రాగలడని నమ్మకం
సరోవరం పై నీటిపొర లొకటొకటీ ఒలిచేస్తే
అందులో ఉన్న చంద్రుణ్ణి పట్టుకొని ఆనందించినట్లు
*
ఒక మేరలేని అవసరాల కల్పనలతో అపుడపుడైనా
ఒకరి గదిలో చొరబడి ఏమున్నదో యేమిలేదో
ఏలాగో మరీమరి చూడాలని ఉంటుందింకొకరికి
ఎంతదూరం ఎన్ని దాటి వెళ్ళినా నేను
నాకు ఆవలి లోకానికీ మధ్య అడ్డుగా
ఎప్పుడూ ఒక గది అయినా నిలచి ఉంటుంది
అడుగువేసి ముందుకు సాగిపోయినపుడు నేను
ఎదురుగా నడుస్తుంటే ఒకటొకటి చంద్రునివలె,
ఎంత ప్రహ్లాద మయంగా ఉంటుంది మనస్సు
వేసిన అడుగు ఎత్తడం మాని వేసినపుడు నేను
ఎక్కడివక్కడే నిలచిపోతే ఒకటొకటి సమాధివలె,
ఎంత భయంకరంగా మారిపోతుంది మనస్సు
సృష్టియొక్క కదలికలోనే ఉన్నది అనిర్వచనీయానందం
ఎంత పరిణాహ జీవితమైనా ఒక మానసిక వ్యాపారం
మానవుని కోర్కెల సాగుదలకు చిట్టచివరి మెట్టు
మృత్యుపదవి — చీకటిముద్ద — అందుకే అంతభయం
XI
ఒక జాతియొక్క మహా సంస్కృతీ మందిరాలు
వెలుగు స్వయంజ్యోతీ మూర్తులొకనాడు
చరిత్ర గమనం పేరిట కాలం అయితే
మార్చి వేస్తున్నది భస్మ వేదికలుగా ఈనాడు
వెనుక గద్దలవలె పోనీ కాకులవలె బ్రతికినా
ఇప్పుడు ఎత్తుగా ఎగరడానికీ భూమిపై నిల్వడానికీ
బంగారపు రెక్కలు గద్దెలు ప్రసాదింప బడతాయని
ఆకాశ కేంద్రంనుండి వాయు సమాచారము
తుపాకి దెబ్బలకు భయపడి పిట్టలవలె
ఎగిరిపోవు కాలం ఏనాడో మారింది కాని
రూపాయి ఉన్న గుప్పిటలో చిక్కిన కాలం
కదలడానికే ఎంతగానో భయపడుతున్నది
అంధకార మూర్తులవలె నున్న మనుషుల
ప్రమిదలవంటి కళ్ళలో వత్తులు వేసి వెలిగిస్తే
ఒకేసారి సూర్య చంద్రులతో వెలుగు ఆకాశం
ఊడి పడిందని ఆలోచన చేస్తే! అనుచరులు!
సూర్యచంద్రులు ప్రకాశించు నిజమైన ఆకాశం
వెలుగు లోకం శాశ్వతంగా వెనుకబడినట్లే!
ఇంతకు రెండు కళ్ళు ఉన్నవనేగాని వీరికన్న
రోడ్లపైని కేంద్రాలలోని ‘‘సైన్బోర్డులు’’ నయం
XII
చీకటి గుడిలో కలవరించు మానవుని వేదాంతం
సృష్టి యొక్క ప్రథమ రూపం జలనిధితో ఆరంభం
మానవుని మొట్టమొదటి కోరిక సుఖం
తరువాత కష్టాలు తొలగించుకొనడం
నిదురపోవడం మేల్కొనడం బ్రతుకు గడపడం
నీటిపై సాగు పక్షివలె దేవునిపై ఊహ సాగించడం
తనకు తా నెన్నుకున్న సీమిత పరిధి
పరిమితాలోచనల ఆక్రమణలతో
తనపై నీడవాలితే ఉలిక్కిపడి
పరుగులు తీస్తూ దివానిశలనక
రక్షణా వ్యూహమతి
నైపుణీ ప్రకార జీవితం గడపడం
లేదా ఒక వంతెన వలె
వంగిపోయి వాలి పడి ఉండడం
అంశలతో అవతరించిన దేవతలమని
దెయ్యాలవలె ప్రక్క వారిని పట్టుకొని
స్వామ్యత్వము జన్మహక్కుగా భావించుకొని
ముఖాలు మార్చి లౌకికులమని వెలిగిపోవడం
ఒక్కొక్క జీవి యొక్క జీవితం
ఒక్కొక్క సూత్రానికి వ్యాఖ్యానం
చివరి అక్షరం చదివే వరకు
అర్థాన్ని గ్రహించడం సులభంకాదు
వెలుగు గీతవలె భూమిని చుట్టిన దృగ్వలయంతో
సముద్రాంభస్తరంగాలు లీనపరచుకొని తనలో
ఆకాశాన్ని ఆవరించి అదుముకున్న హృదయంతో
ప్రతి లిప్తలిప్త అర్పణచేస్తూ పోవడం జీవితం
సాధనా ప్రింటరి, హైదరాబాదు.