Samaya Darpanamu (సమయ దర్పణము) Collection 7 of Volume I — Swecchaa Kavitvamu by Prof. Madiraju Ranga Rao. Year: 1986–87. Language: Telugu. Canonical HTML: https://madirajurangarao.com/poetry/volume-i/text/samaya-darpanam --- అందరిలో ఉంటుంది బీజం విత్తబడీ ! ఏ పూవో ? ఏ ఫలమో ? తలపై నుండి నీతులూ ఉపదేశాలూ ! తరలిపోతాయి ప్రమూలకో ! మనస్సు ఊతగా ఎంత దూరమైనా కాలం కదలుతుంది నిశ ఎంత భయదమైనా ? ఇది లేంది ఉదయ మెక్కడిది ? నీవు చెవిలో విసరే మాటకు బదులుగా ఎదలో పలికే మాటలు తలచుకో నీ ముఖాన్ని చూచుకో కాస్త ! అద్దంలో రోజు రోజుకీ ఎట్లా మండుతూందో ! వయసు తెలీకుండానే కాలం గడచి పోతూంది ? దీన్ని మనో దర్పణంలో చూచే సమయమే లేదు ఆవిరామ తరంగాల్ని శాసిస్తుంది గట్టు, “నిలు నిలు” మనీ ఆవేగ తరంగాల్ని తోసేస్తుంది గాలి “పద పద”మనీ మెరపుతో మబ్బు జీవితంలో విస్మృత రస పథాన్ని జ్ఞాపకం చేస్తుంది. జగత్తు నుండి పొందే అనుభవం మానస గుహలో భద్రమౌతుంది మృత్యు హేలతో నదిలోకి దూకడం కాదు జీవన రాగంతో నది ! నీలో ప్రవహించనీ రాగం చిమ్మే ఆర్ధ రూపం ముందు వెలుగు సైతం ఫాలతలం వంచి కదలిపోతుంది ఈ జీవిత చిత్రం ఎప్పటికీ ముగిసేది కాదు ఏదో మిగిలే ఉంటుంది కాలం అందరికీ సమానం ! జీవిత దర్పణంలో బింబాలే వేరు ! వేరు ! IV. సమయ దర్పణం 1. నాలో ప్రవహిస్తోంది నది (1986) 2. నాకు జాపకం ఉంది (1987) మాదిరాజు రంగారావు అంకితం సౌమ్యమూర్తి శాంతమనస్వి జస్టిస్ శ్రీ వేముగంటి మాధవరావు గారికి1. సమయ దర్పణం - నాలో ప్రవహిస్తుంది నది నాలో ప్రవహిస్తోంది నది (1986) నాలో ప్రవహిస్తోంది నది, కదలి పోయే జన సమూహం వలె కాలాన్ని తనపై మోస్తూ జీవితాన్ని తనలో స్పందిస్తూ అల అల పై ఆనంద శిఖరం అలక్రింద తత్త్వ రహస్యం నాలో ప్రవహిస్తోంది ధుని, సాగిపోయే ఆలోచనా తతివలె తనలో ఆకాశాన్ని బింబిస్తూ, తన ముందు ఆదర్శాన్ని లక్షిస్తూ ఒక్కొక్క బిందువులో క్షణ రూపం ఒక్కొక్క బిందువలో జీవన నృత్యం నాలో ప్రవహిస్తోంది నది ఆది మానవుడు విసరే కేకలతో వేద ఋక్ బంభర ఘోషతో యుగ యుగాల చరిత్రను దొరలిస్తూ ఒక్కొక్క బిందువులో సింధు వంత ధైర్యం ఒక్కొక్క బిందువులో పవన జవం నాలో ప్రవహిస్తోంది ధుని వెనక్కి చూడని కన్నీటి అలలతో ఆకాశం అదుముకున్న హృదయంతో సగం మునిగీ సగంతేలీ బుద్ధుడు క్రీస్తు గాంధి కరుణజలం! నీలో ఉంది చూడు ఈ నదీ రూపం నాలో ప్రవహిస్తోంది నది, దీన్ని ముక్కలు చేసే దురాశతో విసరిన కత్తుల తళతళలు! చీకట్లో వెన్నెల మిల మిలలు నా పెదవులపై ఊగేను నవ్వు! నా గుండెలో నవ్వేను మందారం నాలో ప్రవహిస్తోంది ధుని, కెరటాలు ఆరాటాల ఆస్పాలనంతో కెరటాల పోరాటాల జిగీషా మతితో జనాళి యోచనతో ఘర్షణతో బిందువు బిందువులో ప్రాకే విద్యుత్తు కెరటాల్ని ముందుకు నడిపిస్తుంది నాలో ప్రవహిస్తోంది ధుని, శిరశ్శిఖరం నుండి పాద మూలం దాకా ఒకటై పరుగులో జీవన సంగీతానికి శ్రుతి పోస్తూ తలపులో జీవన రూపానికి రుచి నిస్తూ ఆర్ద్రతతో ధరాతలం హరిత వనం చేస్తూ చీకట్లో ఆర్త నాదం మోసుకునీ దైన్య శీకరాలు కప్పుకొనీ నాలో ప్రవహిస్తోంది నది ఎగసే కెరటాల శిరస్సులతో భగ్న గాథలు చెబుతూ; ఆరుణ చిత్రాలు చిత్రిస్తూ మెరిసే తారల కన్నీటి ముత్యాల్ని స్ఫురింపజేస్తూ ఈ నదీ జలం లోతుల్లో ప్రణయ రహస్య ముంది ఈ నదీ వలయం అంచుల్లో స్నేహ వలయ ముంది ప్రతి ప్రాణినీ ఆకర్షించే జీవన రూపం నాలో ఉంది భూదేవత గుండెల్ని స్పృశిస్తూ మానవ జీవిత సత్యాన్ని ప్రతి ఫలిస్తూ మలకలుగా పాయలుగా వంపులుగా కొండల్ని చుట్టీ లోయలు దూరీ విషమ శిలల పై అడుగు లేస్తూ, ఎడారి ఇసుకపై తెరలుగా తరలుతూ ఒడ్డు నుండి చూచేంత సేపూ ఏ ప్రశ్న లేదు నీటిలో అడుగేయడంతో సమస్య మొదలు! నాలో ప్రవహిస్తోంది నది! కదలిపోయే కాంతి ఝరిని జ్ఞాపకం చేస్తుంది. మేఘం కన్పించగానే ఆనందంతో నృత్యంతో పరవశించే నది! ఎడారి చూచి విలోలమై కరుణతో కపోల పాళి నిమురుతుంది ద్వేషం హింస నిండిన మానవ చరిత్రలో హైన్యాన్ని దైన్యాన్ని చూపే ద్రుతగతితో ఎదురుగా నిల్చిన శిలల్ని పర్వతాల్ని జాలిగా పలకరిస్తూ వినిపిస్తూ గళ గళత్సంగీత దుని! నీలో నాలో ఉందీ నదీ రూపం అక్కడక్కడా ఎదురుగా పడి ఉన్న మొండి బండలపై నుండి పొర్లుతూ అణువణువులో పురోగమన చైతన్య చరణాలతో దారి కడ్డంగా అడుగుల్ని చీల్చే కరకు రాళ్ళపై కదులుతూ కోలాహలంగా ప్రాణికీ మనిషికీ జీవన రుచి చూపిస్తూ పద పదంలో రాగం పల్లవించే శోభతో మనిషి మరచిన ఆర్ద్రతను జ్ఞాపకం చేస్తూ నాలో ప్రవహిస్తోంది నది నాలో ప్రవహిస్తోంది నది! పురా స్మృతుల్ని తలపుకు తెస్తూ మనిషికీ మృగానికీ భేద మంతరించే దశల్నీ హృదికీ శిలకూ అంతరం నశించే స్థితుల్ని మౌఢ్యం క్రౌర్యం ఆవహించిన జడ మతుల్నీ స్పృశించే ఆరాటంతో కదలే ఈ నదీ తీరాన! ఎన్ని ఉన్మత్త శిఖరాలు! ఎన్ని హత్యా చణ క్రీడలు పీడిత జీవితాల నుండి మ్రోగే నినాద పంక్తులతో దారిలో శిలల్లో స్వప్న జలం నింపే ఆరాటంతో యుగ యుగాలుగా ఆర్జించిన సంస్కృతీ బింబ రూపంతో తనతో కాలాన్ని పయనింపజేస్తూ తనపై సమయాన్ని అవలీలగా మోస్తూ గలగల ధ్వని కళతో ఆగని సంగీతంతో నాలో ప్రవహిస్తోంది నది హృదయ శిఖరం స్పృశిస్తూ మానవతా గభీరమై చింతనలో ప్రణవ నాద తరంత రస శ్రేణులతో గతిలో కదలే వాస్తవ జీవిత చిత్రాలతో భూమిని మ్రింగే మహదాశతో ప్రతి బిందువులో రహస్యం ప్లవిస్తూ నాలో ప్రవహిస్తోంది నది బిందువు బిందువులో బడబానల శక్తి అల్లుకొని విద్యుద్వల్లి వలె లహరుల్లో దాగిన వెలుగునీ మంటనీ కోపాన్నీ తలపిస్తుంది ఎన్ని నాగరకతల్నో వహించిన బుజాలతో ఆశా కేతనమై ఆడుతుంది తరాల నిష్క్రమణంతో వదలిన చరిత్రతో మానవుణ్ణి తలపిస్తూ తరుముకొని వచ్చే జీవన మర్యాదతో నాలో ప్రవహిస్తోంది నది. నాలో ప్రవహిస్తంది నది, ఎవరు కోరినా కోరక పోయినా అలల ఆగమనంతో మేల్కొన్న ఆశా చలనంతో పగలు రాగంతో ఎదపై వెలుగులు హత్తుకొనీ రాత్రి బాధ్యతతో వీపుపై చీకట్లు నిల్పుకొనీ శబ్దం కరిగి నాదమై, రేఖలు కలిసి రూపమై, అనుభవం వెలిగి జీవితమై క్షణాలు సాగి కాలమై, గమ్యానికి పరుగెత్తే ఎడతెగని రైలు వలెధుని. ప్రతి వైపు నుండి వచ్చి కలిసే రేఖ లొక్కొక్క సమయంలో నదిపై తరలే కల్లోల తరంగాలకూ, ఎదలో కదలే ఉల్లోల కురంగాలకూ, జీవితంతో ఒక్కొక్క చిత్ర రూప స్ఫూర్తినిస్తాయి, బింబాలై. ఒక వర్ణం కమ్ముకొని మరో వర్ణం ఒకరూపం రూషితమై మరోరూపం గర్భితమై మానవ ప్రకృతి సమస్తం, ఋతు పరివర్తనతో నాలో ప్రవహిస్తూంది నది మనిషి శక్తిని పరీక్షిస్తూంది. లోపల కదలే జీవ రాశితో, నిద్రలో, సరస్సు వలె ఉంటుంది. లోతు తెలీని జలావేశంతో, మెలకువలో, ప్రవాహమై కదులుతుంది మనసులో ఆశలు ఉన్మిషితం చేస్తూ తీరంలో స్మృతులు వదలుతూ వర్తమాన గతి చరిత్రతో, క్షణాలు అలలపై శ్రుతి మహితంగా అణువణువూ కదులుతూ సముద్రం వైపు పరుగు తీస్తూ ఆలోచనా స్ఫూర్తితో అనుభవ స్పందనలో ఉంది! నీలో నాలో నదీ రూపం ముక్కలైన దేశాల్ని కలుపుతూ అడ్డుగా ఉన్న పొలిమేరల్ని చెరపుతూ మానవతా మధుర జలంతో స్నేహమయం చేస్తూ స్పందించే స్వేచ్ఛలో ఉత్సాహంతో బిందువు బిందువూ కలుస్తూ విడిపోతూ మారుతూ నిరంతరం ఎన్నో ప్రశ్నలకు సమాధానాల వలె ఎన్నో సమస్యలకు పరిష్కారాల వలె సమష్టి చైతన్యంతో నాలో ప్రవహిస్తోంది నది ఆకాశం నుండి సరించే సూర్య కిరణ పంక్తుల్లో ఒకటై పోతూ దూరాన దిశల నుండి జారే చీకటి చినుకుల్లో కలసిపోతూ కన్నీటికి నిలయమైన కళ్ళలోని నిద్రిస్తూ ఉద్రేకం ఉరకలెత్తే గుండెలో దూరుతూ రేణువు రేణువుపై చేసే నృత్యంతో, జీవిత దృశ్యం తలపించే నీల వర్ణ ప్రళయం రచిస్తూ, హరిత వర్ణ సౌందర్యం సృజిస్తూ నాలో ప్రవహిస్తూంది నది మనసులో మ్యూజియం జాడలతో భూమితో గలగల సంభాషణతో హృదిలో దీప శిఖా సంవేదనతో గగనాన్ని గుండెపై భద్రంగా నిలుపుకొనీ ఎగసే పక్షుల శ్రేణీ బింబంతో శూన్యాన్ని సౌందర్య దృశ్యంతో పల్లవితం చేస్తూ కుసుమితం చేస్తూ పేర్చిన మొగలి రేకుల పంక్తిగా నాలో ప్రవహిస్తోంది నది దూకిన హంసీ సమూహయానంగా అఖిల సంస్కృతి దశల్లో మానవ పరిణామ దశలకు సాక్షిగా నాలో ప్రవహిస్తూంది నది! మనిషి ఆశాబింబపై గీతమై అపుడపుడూ ప్రాణుల్ని హతమార్చే నియంత వలె తుఫాను భీభత్సంతో దుస్స్వప్నం అంతం చేస్తూ భూదేవి కళ్ళలో పెదవులపై శరీరం అణువణువూ సృజన శక్తి లాస్యంతో నాలో ప్రవహిస్తోంది నది అవనిపై దారి చేసుకొనీ పోరాడుతూ బలంగా, స్వేద జలాపూర్ణమై వేగంగా మనిషిలో బాధల్ని కరిగిస్తూ, భయాన్ని దూరం చేస్తూ చాంద్రీ సిత కరాలతో స్పృశిస్తూ నాలో ప్రవహిస్తోంది నది నేలపైమట్టి పొరల్ని దువ్వుతూ రాళ్ళపై గుట్టలపై నిల్చిన మనుషుల్లో రంగు రంగు పూలనీ ఆదర్శ ఫలాల్నీ సృజిస్తూంది సంఘర్షణలో మానవతా సందేశం వినిపిస్తూంది అణగి పోని విశ్వాసంతో ఉచ్చలిస్తూ ఆగిపోని పోరాటాల పతాకలతో హింసలో పీడనలో బాధాసిత కథలతో చరిత్ర నవ గతులతో అక్షర బిందు పంక్తుల సుదీర్ఘ రచనలో సందేశం శబ్దిస్తూ సతతం కదలే చరిత్రలో అలలు పుటలతో గతిలో సమూహ చైతన్యంతో కన్నీళ్ళ స్వేదమూ కలిసి ఒకటై నాలో ప్రవహిస్తోంది నది. తరంగ గతిలో వాస్తవాన్ని బింబిస్తూ ఫేన పంక్తిపై స్వప్నాలు మోసుకొనీ నిశ్వబ్దాన్ని స్వర చిత్రతాలతో నింపుతూ సుప్త చేతనలో గుప్త మూలంనుండి నాలో ప్రవహిస్తోంది నది నిద్రించిన వ్యధ మేల్కొని వెనక్కు తిరిగి చూడకుండా పరుగెత్తినట్లు మళ్ళీ నిద్ర అనేది ఎరక్కుండా ఎక్కడా నిశ్శబ్ద మనేది లేకుండా ఎదురు బడిన శిలలపై గలగల రవళితో నాలో సరిస్తోంది ధుని తప్త ముక్త రిక్త మృత్యు విషమభూముల్లో జీవన పద చిహ్నాలతో అణువణువులో నిద్రా ముద్రల్ని వదిలిస్తూ రాగ కళనిలుపుతూ ప్రాణితంగా పగలూ రాత్రి వివిధ తరంగ ధునితో ప్రవహిస్తోంది నది ఉదయ కాంతి ప్రతిఫలించే అరుణధారలతో వైష్ణవ ప్రతికృతిగా దేశం నుండి దేశానికొకే బాట ఒకే ఊహ ఒకే ఒక లక్ష్యంతో నలు దిశలా చిమ్మేస్వర లహరులతో చివరకు కరుణ జలధి కలుస్తూంది ప్రతి అలలో సూర్య కాంతి నిలుపుకొనీ కణ కణంలో రస రూపం నింపుకొనీ ప్రతి ఎదలో హరిత వనంపై ఆశతో సంపదకు ప్రేరణయై జన చేతనయై బిందు బిందు ఘర్షణలో విద్యుదగ్నితో తరంగాల పోరాటంలో పరివర్తనతో వేగంలో జన సమూహ శక్తి నటత్ రూపంతో దురిద్రాశా ముఖాన రసమయ శీకర కళతో నాలో ప్రవహిస్తోంది నది ప్రతి తరంగంలో అనల స్వరం పలుకుతూంది ప్రతి స్వరం చలనంలో కరుణ రసం చిలుకుతూంది ప్రతి ప్రాణీ ఎరిగిన హృదయం భాషతో సుదీర్ఘమైన ఆయుః ప్రమాణంతో పాయలుగా చీలుతూ కలుస్తూ తరలే ప్రజా సమూహం వలె నాలో నది! ఒకపుడు మనలో సుప్తమై ఉండొచ్చు! హిమ తుషార శ్రేణుల్లో ఒకప్పుడు మనలో గుప్తమై ఉండొచ్చు! పాతాళం అంచుల్లో శ్రమ ఫలాకృతీ! ఆనంద రూపమూ! తనతో ముడిపడీ! కర్మాగార ధ్వనీ శ్రమ జీవన లయ! సంచరణాకృతితో స్థల స్థలంలో నవ రాగం ప్లవించే నాద ఝరీ చరణాలతో దేశ దేశ జాతి జాతి సుమ సౌందర్యంతో అనుభవాన్ని పంచుతూ మానవ కథా మహా గీతమై నాలో ప్రవహిస్తోంది నది మహా స్వప్నమై సహస్ర ఫణ సర్పమై ఖండ ఖండ కాలాని కఖండ సంకేతమై గాలి కెగిరి ఒక దిశలో కదలే ఆశ్వత్థ వృక్షం ఆకుల గలగలతో భయం ప్రేమ కోపం శాంతి భావగతితో మానవ వమాజ బింబమై నిరాశా శిలల్ని స్పృశిస్తూ ఆశా శిఖరాల్ని లక్షిస్తూ రాత్రికలల్ని నిజం చేస్తూ స్నేహ హస్తాలతో స్నిగ్ధ హృదయంతో నాలో ప్రవహిస్తూంది నది ప్రతి మలుపులో ఒక్కొక్క చరిత్ర ముఖాన్ని స్పృశిస్తూ తీరాల్లో ఉదార గుణ ముద్రలు వదులుతూ, సికతా రేణువుల్లో ఆనంద కళికలు బింబిస్తూ నిరీహనూ నిష్క్రియనూ పద పదం వదిలిస్తూ ఎడారి ఎదను ప్రేమ జలంతో చకితం చేస్తూ ప్రవహిస్తోంది నది. వివిక్త రిక్త క్షితిజంలో దూర దూరం పోయినంత మేర రసమయ దృశ్యంగా మౌన ముద్ర వీడని శిలాశ్రేణికి రాగ రసంతో అందినంత మేర ఆర్థాకృతి నిస్తూ బిందు బిందువులో గుప్తమై సూర్యుని మృదు తేజంతో నిద్ర అనేది ఎరగకుండా కలలనేవి తెలీకుండా పగలూ రాత్రీ ఊహలో పద పదంలో అమృత పంక్తియై నాలో ప్రవహిస్తోంది నది బిందువు నాక్రమించి మరో బిందువు తరం నుండి తరం వలె నిబిడమై కదలే మహా ప్రజవలె చరిత్రలో సంస్కృతీ రూపం వలె గడియారం ముళ్ళను కదిలిస్తూ గుండెలయను పలికిస్తూ ఏడ్చే వాళ్ళు లేని దీన హీన శిలలపై కన్నీటి పూలు చిమ్ముతూ ప్రయాణ దాహంతో చాచిన దోసిళ్ళలో దూరదూరం నీళ్ళు చల్లుతూ భయపు పొరల్ని చీల్చేస్తూ ఆశ్చర్య తరంగాల్ని దిశల్లో విసరుతూ కల నుండి వాస్తవానికి దిగిన వర్తమాన ప్రపంచ చిత్రం వలె పైపై నుండి దీర్ఘ దీర్ఘంగా కష్టాల్లో బాధల్లో ఉదార కిరణ పంక్తి వలె ఎదలో శబ్ద ప్రపంచాన్ని మోసే టెలిగ్రాఫ్ తీగల్లో ధ్వని ప్రసారాన్ని తలపిస్తూ బిందువు బిందువులో ప్రేమ నిండిన త్యాగ చలనంతో నాలో ప్రవహిస్తోంది నది, ప్రతి వ్యక్తికీ జీవన లక్ష్యం బోధిస్తూ నాలో ప్రవహిస్తోంది నది, నదిపై వంతెన, వంతెన పై నుండి క్రిందికి చూస్తే పగలు సూర్యుణ్ణి రాత్రి చంద్రుణ్ణి చుక్కల్నీ తనలో బింబించుకొనీ పిడికిలి నుండి బయట పడిన రహస్య చిత్రం వలె కన్పిస్తూ వంతెనపై మిత్రులూ బంధువులూ అపరిచితులూ ఎందరెందరో! వంతెనపై అడుగేసే మనిషి! చివరిదాకా ప్రయాణం చేయక తప్పదు భగవంతుని గురించి ఆలోచనకూ ఆకాశం చూచేందుకూ సమయం లేదు శిలలుగా పడి ఉన్న హిమం బిందువు బిందువులై కదులుతూ తరలుతూ క్షణాలు నిండిన జీవిత కథలతో, స్వేచ్ఛకై ఆరాటంతో, శాంతికై వేదనతో బిందువు బిందువులో కొత్త సృష్టికై కలలతో అల అలలో అవనిపై దూకేందుకు కోర్కెలతో బిందువు బిందువూ కలసి అసంఖ్యాకంగా ఏకమై సమాజమై ఒకే స్వరం, ఒకే ముఖం! ఒకే ఆత్మతో నాలో ప్రవహిస్తోంది నది లోతు తెలీని రాత్రి నిద్ర నుండి మేల్కొన్న ఉదయం వలె ఉదయం సూర్యుడు పై కెక్కే కొద్దీ మోదుగ పూల జ్వాలా నృత్యం వలె కష్టం, దుఃఖం మరచి పనిపై కదలే శ్రామిక జన సమూహం వలె ఆకలి గొన్న కంఠం నుండి ఎగసే బాధా శబ్ద తరంగిణివలె మానసికోద్వేగ రణత్ మంజీర ధ్వనులతో నాలో కదులుతోంది నది తుపాను వేళ వల్గత్ తరంగాలతో గతిలో వినాశన శక్తితో బ్రతుకుపై విషాద ముద్రల్ని వదులుతూ, నాలో ప్రవహిస్తోంది నది చరిత్ర కంటిన మాలిన్యాన్ని మృదు కరాలతో శుభ్రం చేస్తూ ఆవేశ తరంగాలతో వివేక జలాలతో మానవతను గుర్తుచేస్తూ నాలో ప్రవహిస్తోంది నది! శాంతి దేవతా కాంతి వదనంతో ప్లే గ్రౌండ్లో తెల్లని దుస్తుల్లో వరసగా పరుగెత్తే పిల్లల వలె తుది రేఖ లెరగని జీవితం వలె నిర్వచితం కాని కవిత్వం వలె స్విచ్ ఆన్ చేసిన టార్్చ లైట్ వెలుగు పుంజం వలె ఎక్కడెక్కడో దాగిన భయ సుందర ప్రాణుల్ని ఎదుట నిలుపుతూ స్పందనలో వర్తమాన జీవిత దృశ్యంతో నాలో ప్రవహిస్తోంది నది నాలో ప్రవహిస్తోంది నది నాలో భాగమై రమణీయ స్త్రీ రూపమై విడిపోయే ఊహరాని ధాత్రీ బంధంతో, నాలో జీవితమై చేతనయై మార్మిక క్షితిజం నుండి క్రిందికి దిగిన వాస్తవ ప్రపంచంతో దీర్ఘాయువు చరిత్రతో మరచిన అనుభవాల్ని అనుక్షణం జ్ఞాపకంచేస్తూ ఆగని గతిలో మానవ చరిత్రతో నాలో ప్రవహిస్తోంది నది. రాత్రి కురిసిన చీకటి జాడల్ని తెల్లవారే సరికే మాత్రం కన్పించనీకుండా రాత్రి స్వప్న ఖండాల్నీ పగటి ఇంద్ర జాలాన్నీ అగాధంలోకి విసరేస్తూ క్షణం నుండి క్షణానికీ స్థలం నుండి స్థలానికీ కదలుతూపోతూ నాలో ప్రవహిస్తంది నది! దీనిలో బింబాల్ని అందుకో జూచేను మనిషి యుగాల సంస్కార ప్రభతో! నాలో ప్రవహిస్తోంది రసధుని! ఎన్ని యుగాలైనా పాత పడని ఉదయం వలె ఎన్ని తరాలైనా మాసి పోని త్యాగం వలె దూకే మంటల్నీ ఎగసే నిప్పు కణాల్నీ జల శీకరాలతో అద్దుతూ బిందువులో విద్యుత్కళికలతో ఎగసే ఉద్వేగ శక్తితో శూన్య దిశల్ని కలుపుతూ పోయే వాస్తవ జీవన రూపంతో ఆహ్లాదం కలిగిస్తూ నాలో ప్రవహిస్తోంది నది అరణ్యం నుండి బండల సందుల్లో నుండి ఇరుకు లోయల్లో నుండి త్రాళ్ళు తెంచుకొనీ విముక్తమైన స్వేచ్ఛ వలె వెనక్కి తిరక్కుండా నాలో పరుగిడుతోంది నది, లయ తప్పని వేగంతో ఎంత దూరం పయనించినా అలసి పోని అడుగులు వేస్తూ ధరిత్రిపై సరించే అఖండ జాగృతియై వ్యక్తిత్వం వెలిగే చేతనతో నాలో ప్రవహిస్తోంది నది, ఒంటరిగా స్నేహ రుచితో తాను కదలుతూ ఎందరివో అవసరాలు తీరుస్తూ ఉదయం పగలూ సాయం రాత్రీ స్వర్ణ ధవళారుణ నీల వర్ణ రూషితయై రాత్రి నిద్రలో నీడ వలె కదలుతూ పగలు అగ్నిలో వెలుగై తరలుతూ అంతలో స్ఫటికమై అతీత రసాకృతియై నాలో సరిస్తోంది ధుని ఒరపిడిలో అలజడిలో ధైర్యంతో దూసుకుపోతూ ఉద్రేకం ఉల్లాసంతో గమ్యంపై విశ్వాసంతో బిందువు బిందువులో క్రియాశక్తితో విజయ రహస్యం స్మరింపజేస్తూ జీవన గతిలో అనుభవమూ ఆలోచన నిండిన పార్శ్వాలతో పిడికిట్లో బంధించలేని స్వేచ్ఛతో నాలో ప్రవహిస్తోంది నది వెలిగే ప్రపంచానికి బింబమై కదలే జీవితానికి ప్రతిరూపమై క్షణంలో నశించే స్థితి నుండి అనుక్షణంలో అవతరించే స్థితులతో కణ కణం జీవ ధారా శక్తితో మనిషిని సంకల్ప శిఖరంపై నిలుపుతూ పగలు అగ్ని కళలపై నుండి రాత్రి భస్మ రాశిపై నుండి పొరలి తరలి ఆకాశ బాహువలయంలో చేరే లక్ష్యంతో నాలో ప్రవహిస్తోంది నది ఆకాశం ఆదర్శానికి నిలయం! అవని వాస్తవ గమనానికి స్థిర తలం పగలు అలంకరించే సూర్య తేజంతో రాత్రి బింబించే నక్షత్ర కాంతితో వివిధ వర్ణ భేదాల్ని ఒకే ఒక రసాకృతిగా తీరుస్తూ మానవ ప్రస్థానమై నాలో ప్రవహిస్తోంది నది! మంజీర గుంజన్మృదు పద విన్యాసంతో యుగాల సంస్కృతితో, జాతి మత భేద రహిత సుస్వర మహితంగా కణ కణంలో కరుణతో మున్నీటి కథలతో! సంగీతమై జీవితమై ప్రాణంలో స్పందనతో ఊహలో చలనంతో ధరణీ పరిష్వంగ రాగ ధునీ ప్రకాశనంతో శక్తి చరణ ప్రసారంతో నిరంతర వర్తన పరివర్తనతో విషమ తలంపై సమతా భావంతో జీవన మర్యాదా లోలమై క్షితిజం చేతిలో మ్రోగే విపంచి నాదమై హృదిలో ఎగసే కపోతీ పంక్తియై ఆత్మ రూపమై, నాలో ప్రవహిస్తూంది! చైతన్య ధుని! అగ్ని నృత్యం చేసే అవనిపై ఆనంద వల్లీ కళలు నింపే కోర్కెతో వెలుగై దారిలో చీకట్లను పాతాళం లోకి తోసేస్తూ సత్యమై సస్య శ్యామల జీవితంతో, శిశిర ముఖంలో వసంతమై సుందరమై సుమ కేతనంతో మనో భూమికలో శివమై నాలో ప్రవహిస్తోంది నది! జీవిత కావ్యమై రసధునియై! (1987) మాదిరాజు రంగారావు అంకితం విమర్శలో పరిశోధనలో సాహితీ శిఖరం శ్రీ కోవెల సంపత్కుమారాచార్యులుగారికి 1. నాకు జాపకముంది నాకు జ్ఞాపకముంది, బస్ బరువుగా మృదువుగా కదులుతూంది చేతిలో వాలిన నక్షత్రాల్ని పిడికిట్లో బంధించి దిగే బిక్షువును దీప స్తంభం వలె కింద నిల్చిన కుర్రవాడు రెండు చేతులతో అందుకున్నాడు చేతులతో పరిసరాల్ని తడుతూ, చూపులో వెలుగు రెక్కల్ని దువ్వుతూ బిక్షువు, బస్ స్టాండ్ ప్రక్కనే చెట్టు క్రిందికి చేతిలో కర్రపై కాల వేగాన్ని నిలుపుతూ కదలాడు చెట్టుక్రింద తీరిగ్గా కూచొని పలకపై బలపంతో లెక్కలు గుణించే జ్యోతిష్కుని కళ్ళలో జాతకాలు గ్రహాల దశాంతర్దశలతో తిరుగుతున్నాయి. హఠాత్తుగా పగిలి క్రింద రాలి పడే అద్దం ముక్కల వలె మధ్య మధ్య నవ్వుల గలగలలు దూరం నుండి వినిపిస్తున్నాయి ప్రతి ముఖంలో రహస్యం కాపాడబడుతూ ఆట ముక్కలు ఆడబడుతున్నాయి లక్ష్య మెరగని సమాజం గుండెపై దొర్లే బరువులా దూరం నుండి వినిపించే వాహనాల ధ్వని వింటూనే అరచేయి ఆకాశంలో నక్షత్రాల్ని లెక్కపెడుతూ బిక్షువు నడిచేను ధూళి కమ్మీ పొగ బట్టీ కొడేసీ నీడ క్రమ్మిన అమ్మ కళ్ళు తళుక్కు మనిపించే ఆరాటంతో కళ్ళలో మెరసే నక్షత్రాలతో కుర్రకుంక దిక్కుల్ని తరుముతూ ఇంటి ముఖం పట్టాడు ఇంటి నుండి వీధిలోకి కదలీ క్రిక్కిరిసిన బస్లోకి తోసేయబడీ “పర్్స కొట్టేస్తా” రన్న వదలని భయంతో పెద్ద మనిషి జాగ్రత్త పడుతున్నాడు ముందుగా ఎక్కి కూర్చున్న పిచ్చివాణ్ణి పట్టుకొని కండక్టర్ దింపేశాడు అతడెపుడో దూరి ఎక్కడో వెనక నిల్చోడం చూచి చూడనట్టున్నాడు నాకు జ్ఞాపక జ్ఞాపకముంది, రైల్వే ప్లాట్ ఫార్పై జనం ప్రయాణంకై ఎదురు చూస్తున్నారు శబ్ద ప్రపంచం కోలాహలంగా ఉంది అక్షయ తూణీరం వంటి మనస్సు నుండి ప్రశ్న వెంట ప్రశ్న ఉద్గమిస్తూంది దగ్గరలో కాంటీన్ పొగ ఉక్కిరి బిక్కిరి చేస్తూ కదులుతూంది రైలు ఆగిందో లేదో ఒకర్ని తోసేసి మరొకరు! వెళ్ళాలనే తొందర! పంజరం నుండి వదలబడిన పక్షుల వలె గూటికి చేరే ఆవేగం చేతిలో గొలుసుకు పెట్ డాగ్ తో యువతి వేగ మందుకుంటూంది పగలూ రాత్రీ ఎడగెతని సంరంభంతో ఇదో అవిశ్రాంత బలసముద్రం రైలుకై ఎదురుచూస్తూ ప్లాట్ ఫార్మపై పచార్లు చేసే నా కెదురై బుజం మీద చేయేసి, “గుర్తు పట్టారా?” అని నవ్వు విసరుతూ రైలు రాకతో “బైబై”, చెప్పి, ఓ మనిషి మిత్రమై నిష్క్రమించాడు రైలెక్కి జేబులో చేయి వేస్తే, శూన్యం, మా స్నేహానికి మిగిలిన చిహ్నం నిశ్శబ్దాన్ని చీలుస్తూ ఎక్కడెక్కడికో? ప్రయాణికుల గమ్యమే సంకల్పమై చెట్లనీ కొండల్నీ ఊళ్ళనీ భూముల్నీ వెనక్కు పరుగెత్తిస్తూ రైలు పరుగిడుతూంది వినేందుకు ఓపిక ఉండాలేగాని ప్రయాణికుల జిహ్వాగ్రంపై శబ్దం బీజం నుండి శాఖలుగా కథలు నృత్యం చేసేందుకు సిద్ధంగా ఉంటుంది ఎదురుగా ఉన్న వ్యక్తి ఆపై వ్యక్తికి న్యూస్ పేపర్ అందిస్తూ గుడిసెలకు నిప్పు రెక్కల వచ్చిన వార్తను వినిపిస్తున్నాడు. తాష్లో కింది పెదవి పై పన్నుతో నొక్కి “దీనితో సరి” అని ఒకరు చేతిలో కార్డు తీసి విశ్వాస రమణీయంగా ఆపైన విసరేరు రైలు దారి తప్పకుండా కదలుతూంది, ఆట దారి వెతుక్కుంటూ సాగుతోంది నాకు జ్ఞాపక ముంది; ఆ ఇల్లు మానసిక భద్రతకు నిలయం జీవికకై ఎక్కడెక్కడో తిరిగి ఏ వేళకో గూటికి చేరినా మనిషిలో వీచే అశాంతినీ మండే బాధనూ మరపించే అమృత హృదయం, వేదనా గ్రీష్మంలో చల్లని నీడై, నిరాశా శిశిరంలో వెచ్చని నెలవై జీవిత వ్యథల్నీ మరపిస్తుంది, ఓపిగ్గా ఎన్నెన్ని కథలో వినిపిస్తుంది గోడకు సీల దింపుతూ వేలు చితికి గంతులేసి చివరకు సాధించిందీ అమర్చిన పోటో చూస్తూ ఆర్ద్ర నయనాలతో చూస్తూ నిల్చిన తల్లీ ఆశ సడలిన ప్రపంచంలో పచ్చని ముఖంతో అలంకరించే అవకాశాన్ని బయట గోడ సందుల్లో నుండి మొక్కలు జ్ఞప్తికి తెస్తున్నాయి నే వదలిన ఇల్లూ ఆగదీ చుట్టూ బంధు గణం తిరిగే జనతతీ ఎవరికోసం ఎవరు వచ్చేరో తెలీదు! ఎవరెవరో వెంట పడుతూంటారు ఎవరికి వారు కళ్ళలో అంగార కణాలతో పెదవులపై నవ కళికలతో ఎదలో బొగ్గు ముక్కల్నో మంచు ముద్దల్నో పూల మొక్కలో నిలుపుకునేరు ఉదయం ఉషః కిరణాలు ప్రవేశించనే లేదు ఇంట్లో గూడు నుండి పక్షి లేచి కూర్చున్న నా బుజాలపై నుండి ఎగిరి నిలువుటద్దం ముందు వాలింది అద్దంలో బింబించే ముఖాన్ని ముక్కుతో గీరడం మొదలు పెట్టింది నా అలికిడి విని చకితంగా కిటికీ నుండి బయటి కెగిరి పోయింది ఒకనాడు ఆటలో పిల్లలు విసరిన బంతికి అద్దం పగులు వాసింది అద్దం ముందున్న పక్షి కొక్కొక్క శకలంలో ఒక్కో రూపం కన్పించింది అన్నింటితో ఒంటరిగా పోరాటానికి సిద్ధమైంది మరునాడు కొత్త అద్దం వచ్చింది! విజయానికి తృప్తిగా ఒకే రూపం ఎదురైంది ఎదురుగా ఉన్న అద్దంలో ముఖం చూసుకొని పక్షి మురిసిపోతుంది గూటి నుండి రాలే ఎండు పోచ మనిషిలో పక్షిని విస్మరించనీయదు నాకు జ్ఞాపకముంది, వరండాలో కూర్చొనీ ఓ వృద్ధు గతంలో వెలిగిన తోరణాలూ పిల్లల భవిష్యత్తూ ఏ కరవు పెట్టేను ఆ కథలు అనుభవ గగనంలో ఎన్నటికీ తరగని చంద్ర కళలు పండిన జీవితంలో పరిమళించే వాత్సల్యంతో, వాలే కిరణాల కెరటాలు ఆమె సన్నని వక్కపొడి నమిలేంత సేపూ కాలం నిలిచే ఉంటుంది ఆమె దృష్టిలో తానో భగవంతుని వెలుగు దీపం ఆమెలో రాత్రి కురిసే మంచును కరిగించే ఉదయ కిరణముంది ఇళ్ల మధ్య పెరిగిన చెట్టు తమదేనంటూ ప్రక్క వాళ్ళు తగవుకు దిగేరు పెదవులపై నుండి ఎగసి పడే రాళ్ళకెన్ని గాజు ఎదలో భగ్నమైనాయి ముక్కలైన హృదయ దర్పణంలో ఏదీ స్పష్టంగా ఆలోచనకు నిలవదు కదలే బొమ్మల గురించే కాదు, వెలిగే సూర్యుని రూపమూ దృష్టి కందదు రాత్రి లైట్లు ఆరిపోయి, అగ్గి పెట్టెకై టేబిల్పై వెతుకుతూంటే చేయికి మెత్తగా తాకింది; భయ లహరితో దేహం జలదరించింది ఇంతలో లైట్లు వెలిగాయి; మనస్సు చీకట్లో మునక వేసి తేలింది చూస్తే ప్రక్కనే అభయ రూపంతో పెడ్ డాగ్ ధైర్య దీపం వలె ఉంది మెట్లపై నుండి మెల్లగా గదిలో ప్రవేశించిన నాలో రహస్యం వెలుగులో జారుకుంది, నీడలో ఒదిగి పోయింది పైన తిరిగే ఫ్యాన్ రెక్కల్ని తప్పుకొని పక్షి ఒడుపుగా ఎగిరిపోయింది నాకు జ్ఞాపకముంది, అతడు మరచిన సిగరెట్ కేసున్ను ఆమె బ్యాగ్ వేసుకొని అగ్గి పులె కదలిపోయింది జీవితంలో విచిత్ర ఘటన ఒక విధం మనస్తత్వాన్ని వెలిగిస్తుంది పై నుండి నీరు దొరలే నిశ్శబ్దం శిల వలె సమయం స్నిగ్ధంగా నవుతుంది ముందున్న పజిల్తో పగలు యోచిస్తుంది గాలి విజిల్తో కదలిపోతూంది ఇంటి వెనక మామిడి చెట్టు మండే గ్రీష్మంలో పచ్చగా పండ్లతో బాధారుణ ప్రపంచంలో ఆశా రూపం వలె నిలిచి ఉంది దీని నీడలో పూర్వ స్మృతులు; తప్త హృదిలో జలద పంక్తులు కిటికీ ఒక వైపు నుండి మరోవైపు దారాలతో అల్లిన సాలీడు వ్యూహం రవి కిరణాలకు మెరుస్తూంది; గాలి కదలికకు అలల వలె ఊగుతుంది నేలపై నిజం నుండి క్షితిజంలో కల్పన వలె యూకిలిప్టస్ చెట్టు నీడ కోరే ఎదను శిఖరంపై నిలుపుతుంది; ఆకాశాన్ని చూపిస్తుంది పగలూ రాత్రీ చక్రాలపై పయనంలో సందేహ పర్వతాలు అగమ్యారణ్యాలూ ప్రవహించే కలలతో ఒక తరం, ఎదురయ్యే ప్రశ్నలతో మరో తరం నిలుస్తుంది జలధిమధ్య ఎవరూ ఉప్పు నీరు గురించి చర్చిస్తూ దాహం మాట మరచిపోరు నాకు జ్ఞాపక ముంది కిటికీ అద్దం నుండి రోడ్పై జన సమూహ తరంగాలు పైకి చాచిన అసంఖ్యాక హస్తాలతో దూసే నిరంతర నినాదాలతో గోడకు నిలిపిన చిత్రపటంలో క్షితిజంలో సంధ్యారుణ మేఘం! మండే అరణ్యానీ దృశ్యం వలె; ఎగసే మహా జలధి నృత్యం వలె ప్యాన్ గాలి కెగిరి చెదరి కదలే కాగితాల రెపరెపల్లో నవ్వులు సిగరెట్ వెలిగేందుకు గీసిన అగ్గిపుల్ల ధ్వనిలో ఎగసిన ఆర్తి స్వరం ఉదయం నుండి రాత్రి పొద్దు వరకూ ఆ ఇల్లు కోలాహల సముద్రంలో శబ్దాన్ని వహిస్తుంది నిశీథి నుండి ఉషస్సు వరకూ ఆ ఒంటరి గది కలలు కనే దీపంతో నిశ్శబ్దంగా వెలుగుతుంది ఉదయం మొదలౌతుంది గూళ్ళ నుండి పక్షులెగరడంతో వరండాలో న్యూస్ పేపర్ దూకడంతో చేతిలో చిల్లర డబ్బుల గలగలతో కిటికీ నుండి గగనం అంతులేని ప్రశ్నల బరువుతో తొంగి చూస్తుంది కిటికీ బయట అవని! తృప్తి లేని సమాధానం వలె పరచుకొని కన్పిస్తుంది “నగరం భయంతో మండే ఈ సమయంమెక్కడికి?” అని వెనుక నుండి మాతృ స్వరం ఆలోచనకు మలుపు నిస్తూంది ఎత్తి వేసిన కర్ఫ్యూ గస్తీలో గన్ పాయెంట్పై నిలుస్తుంది ఇంటి ముందు బిక్షువు పై అనుమానం! ఏమో? సి.ఐ.డి. కాదు గదా! ఇంట్లో విద్యార్థి ఉదయం నుండీ పుస్తకం పట్టాడు! సినిమాకు ప్లాన్ కావచ్చు! ఉదయం తొలగనే లేదు, గ్రీష్మ పాత్ర ధరించి కాలం ఎదురౌతుంది చేతిలో గ్లాస్ నీటిలో ముఖం అద్దుకొని సూర్యుడు తృప్తిపడేను గ్రీష్మంలో పుంజీభవించిన జీవ శక్తితో మామిడి పరిణత రుచినిస్తోంది అప్పుడే నీటి చుక్క కోసం భగీరథ యత్నం మొదలైంది ఈ ఉదయం హిమసారం చేతి కందే స్థితిలో లేదు అగ్నీ ఆర్తీ చెరో వైపు వివిధ భంగిమలు ప్రదర్శిస్తున్నాయి కాలం మారిందని పెద్దలు తమలో అనుభవ శక్తిని మేల్కొల్పుతున్నారు పగలు కంకర కుప్పపై విశ్రమించిన కూలీలతో లారీ దూసుక పోతుంది ఇది, ఏ స్థితిలోనూ ఆగని పేద బ్రతుక్కి సంకేత మవుతూంది ఇంటి ముందు దీపం లేకున్నా చీకట్లో ఎవరూ దారి తప్పలేదు మాటలతో పాటలూ ప్రసంగాలూ వీధి నుండి ఉచితంగా వినిపిస్తాయి ఎవరికి కావలసిందీ అందిందీ చక్కబెట్టు కోవడమే ఇక్కడి పని! మనస్తత్వం పొరల్లో లోతుగా వేళ్ళు నిల్చి జీవిత వృక్షం రూపొందేను మనిషిలో ఆ చెట్టు వేసే పూలు పండ్లూ వివిధంగా ఆలోచన కందుతాయి ఎప్పటికప్పుడు కొత్త మనసులతో ఊహలతో సమాజం స్పందిస్తూంది ప్రతి బిందువులో ఒదిగి ఆకాశం ప్రతీ బీజంలో మేల్కొనీ జీవం ప్రతి అణువులో నిలిచి శక్తి ప్రపంచం! తర తరానికీ కొత్త రూపం! మంద్ర మధ్య తీవ్రంలో నిరంతరం బహిరంతస్సంఘర్షణతో జీవితం క్రమగతిలో జ్వాలయై లహరియై సామాజిక తలంపై కదలుతూంది నాకు జ్ఞాపక ముంది! ఎక్కడెక్కడో ఏరిన వస్తువుల్నీ కలలతో పాటు భద్రంగా నింపుకొని చేతిలో మూటతో చంకలో శిశువుతో ఆ వ్యక్తి ఎదురైన వారిలో ఎవరెవరినో శపిస్తూ వెళ్ళుతూంది ఆ మాటల్లో అగ్ని శిక్షలు వారిలో రహస్యాల్ని గుర్తింప జేసేనా? ఆమె ముఖంలో సెగలు చుట్టూ ఉన్న మాలిన్యాన్ని పవిత్రం చేసేనా? బస్ స్టాండ్ వద్ద ఎదురుగా మూటతో చంకలో శిశువుతో కూచుంది ఆమె కెవరూ గుర్తులేరు! లక్ష్యమూ లేదు! ఆ శిశువూ మూట తప్ప! అలసిపోయి రెప్ప వాలిన శరీరంపై స్వేచ్ఛగా దొరలే మొగ్గ వలె శిశువు ఆడుకునేను! చేతిలో ఎవరో అందించిన బ్రెడ్ ముక్కతో అక్కడే దగ్గరలో కుక్క పిల్ల ఆశతో తిరుగుతూంది ఆ పైన కాస్త దూరంలో ఆవు అరటి గెల వైపు ముఖం చాస్తూంది బస్ వచ్చేసింది, హడా విడిలో కుక్క పిల్ల బ్రెడ్ ముక్క కాజేసింది ఆమె లేచింది, ఏడ్చే శివువుతో అక్కరకు చుట్టం మూటతో బస్ ఎక్కింది నాకు జ్ఞాపకముంది! ఎగసే పాటతో అభినవ కల్పనతో వికసించే మరో యువతి బ్రతుకు పరిపూర్ణతకై తపించే తరుణంలో మెట్టి నింట్లో మొదటి రోజు మొగలిరేకైందో లేదో మరునాడు ఉదయం అనల కణం రాజుకొని అలసిపోయి చీకటి అంచుపై వాలిపోయింది నూరేండ్లు అందుకుంది! కిరోసిన్ అత్తరుతో ప్రేమ శిఖ దగ్ధమైంది! అంచెలపై ఆకాశాన్ని అందుకున్న సంవేదన మిగిలింది! పగలూ రాత్రి అంతలో రెండు క్షణాల్లో కుదింపబడినాయి! చుట్టూ కళ్ళు తెరచి వింత చూచే సమాజం గుండెపై ఒక్క తన్ను తన్ని క్షణంలో రెక్కలపై ఆయువు ఎగసిపోయింది! ఆకాశం అంచుల్లో కట్నాలూ! భూమిపై శిలల వలె మనుషులూ మానవతా మందారం అగ్ని చక్రమై బూది పొరలై తిరుగుతూంది నాలుగు వైపుల గోడల వలె నీడలు! వెనక బయటపడని సూర్యుడు యుగాలుగా వెలుగుకై నిరీక్షణలో బ్రతుకులు బండ బారాయి నీడల సందుల్లో నుండి ఒకటి రెండు మార్పు కిరణాలొస్తే ఏమౌతుంది? మరునాడు పత్రికల్లో విషాదవార్త చర్చలకీ కాలక్షేపానికీ ప్రత్యక్షం నాకు జ్ఞాపకముంది, మరో రోజు స్నేహితులంతా పిక్నిక్లో ఆటలతో పాటలతో విశ్రమాకృతులై కల వంటి స్థితిలో ఊగుతూ తూగుతూ ఏరు ఒడ్డున కూర్చున్నారు పై నుండి క్రిందికి జలాపూర్ణమై జారుతూన్న వికీర్ణ జల మౌక్తికాలతో సంధ్యా సవితృ కిరణాల్లో ఆలోచనా మణియై కళయై ఆమె వెలుగుతూంది కాలి ముని వేళ్ళతో నీళ్ళు చిమ్ముతూ తీరానికి అడుగు వేసింది వారి ముఖాల నుండి మాటల చూపులు తేనే టీగెల వలె ఉత్ర్కమించాయి గీసిన అగ్గిపుల్లలూ విసరిన సిగరెట్ పీకలూ హాలా రస శీకరాలూ దేన్నీ గమనించకుండా! సంధ్యా కిరణమై ఆలోచనా కళయై అడుగు వేసింది నీడలతో చీకటి! వస్తూంది; అంతా లేచి అడుగు ముందుకు వేసారు ఆమె సూర్యుని చివరి కిరణం వలె నిలిచింది, నీటిలో హంస అయింది పైకి చూస్తే అంతలో చంద్ర బింబమైంది అంతా ఇంటి దారి పట్టారు ఉదయం లేచి కళ్ళు తెరవగానే గోడపై కాలెండర్ వ్రేలాడుతూంది నిన్నటి తేదీని జ్ఞాపకంగా భద్ర పరచుకొనీ స్ఫుటంగా కన్పిస్తూంది నాకు జ్ఞాపకముంది, కిటికీ అద్దం నుండి కన్పించే వీధి దృశ్యం పొందినవీ అందినవీ రంగుల కలలు జేబులో వేసుకొని భద్రంగా ముఖాల కమర్చిన రంగు బల్పులతో మనుషులు వస్తూ పోయేరు తీరిక దొరికితే చాలు ఎదుటి వారి కళ్ళలో ముఖంలో మనసులో అబద్దాల మడతల్లో దాగిన నిజం గురించి అన్వేషణ సాగించేరు ఎదురైన మనిషి ముఖంపై అనల చిత్రం విసరుతూ సూర్యుని రథ చక్రాన్ని చుట్టి వచ్చే అనల స్వర భాస్వరంతో ఎదకు పసి కందును హత్తుకొనీ గుండెలయకు సమంగా అడుగులు వేస్తూ కన్నుల్లో నిశా జలధి తీరాన జ్వాలా దృశ్యంతో బయట ఆటలోనో పోట్లాటలోనో గాయపడిన పిల్లాణ్ణి ఎత్తుకొనీ కను రెప్పల్లో వంగిన నీలాకాశంతో తల్లి ఇంటికి వస్తూంది చెట్ల క్రిందనో దిశ ల్లోనో ముసుగుల్ని విసరేసి వెలుగుల్ని రువ్వుతూ ముఖంలో మాయ లేని మర్మం లేని స్పాటిక మానస బింబంతో అంతలో కలిసిపోయి పిల్లలు ఆటకై గంతులేస్తూ పరుగెత్తేరు నాకు జ్ఞాపక ముంది, జ్వాలా సింహంపైకి దూకనున్న ముఖంతో బులెట్ తగిలి పడే పర్వత ఫలకం వంటి వీపుతో రైఫిల్ ధ్వని సుడి గుండంతో, విసరిన బాంబు గుండెతో అడవి నుండి నగరానికి తరలే కధా ప్రపంచం వీధిలోకి అడుగేసి ఇంటికి తిరిగి వచ్చే నమ్మకం లేదు ఏ రోజు ఎప్పుడు రెక్కలు విరిగి కుప్ప కూలేదీ తెలీదు ఇంటి ముందు వెలిగే వీధి దీపాలు అవే ప్రతి రాత్రీ ఆలోచనలకు సరికొత్త రూపాన్నిస్తాయి దారిలో వెలుగు నీడలు అనుభవాలకు కొత్త ముఖాల్నిస్తాయి ఇంట్లో క్షణం దీపాలారి పోతే ప్రాణం లోయలో పడినటెతుంది అస్తిత్వాన్ని ఋజువు చేసుకునేందుకు కళ్ళు యమ యాతన పడతాయి అదృష్ట బిందువుల వలె వెలిగే దీపాలతో ప్రాణం కుదటబడుతుంది వెలుగులో పట్టించుకోని ఊహలు చీకటిలో తరుముకొనీ వస్తాయి చీకటిలో భయ సముద్రం వెలుగులో ఆనంద గగన మవుతుంది వీటి అవసరం ఒక ఎత్తు! అనుభవ యోగం మరో ఎత్తూ! రాత్రి నిశ్శబద్ధంలో మునిగిన చౌరస్తా! ఉదయం శబ్దంపై తేలుతుంది కోలాహల లహరుల్లో మనుషులు ఒకరికి తెలీకుండా మరొకరు! ఒక స్వప్నం కదిలిపోతే! మరొకటి దాన్ని స్థానంలో సిద్ధమవుతుంది వివిధ వర్ణ జీవితాన్ని వాస్తవం నిలుపుతుంది! ఆ క్షణం సత్యమై నాకు జ్ఞాపకముంది ఆరోజు నవ్వుతూ ఎదురైన ముఖాన నిప్పులు చిమ్మే చిచ్చుబుడ్లూ చెట్ట కొమ్మలకు మొగ్గలు తొడిగిన మంటల చివుళ్ళ భవిష్యత్తు వ్యవస్థకై పోరాటంతో అశాంతి శిఖరాలపై అడుగులతో నేలపై పొగలతో నీడలతో కదలి పోయే జ్వాలా శిఖలు రోజూ సూర్యుడు పైకి వస్తాడు మనిషి హృదిలో సృజనతో మంచు ముఖాన అరుణ బింబమై, ప్రకృతి నొసట అదృష్టబిందువై ఇసుకపై అడుగు జాడల్ని గాలి ఎత్తుక పోజూస్తుంది ఉన్నవాడో లేని వాడో ఎవరైతేనేం? అంతరంగం మాత్రం ఆలోచనా కులాయంలో నివసించే కపోతం ఉదయం లేవగానే బయటికి పోతుంది, రాత్రి కాగానే గూడు చేరుతుంది సమాజ కర్మాగారంలో ఉదయం బ్రతుకు తెరువును గుర్తుకు తెస్తుంది చీకటి తెరపై చంద్ర బింబం మనిషి పాత్రను గుర్తుకు తెస్తుంది. జీవిత యంత్రాన్ని సంకేతాలతో శాసించే ఇనుప చేతుల నీడల్లో పగలు ట్యూబ్ లైట్ వెలుగులో రాత్రి పెట్టెలో నక్షత్రాల్ని లెక్కపెడుతూ ప్లాస్టిక్ ముఖాలతో బ్రతుకులు తెల్లారే జీవితాలూ కన్పిస్తాయి నినాదాల మధ్య పెళ పెళ శబ్దం! పూల తోటలో కమరిన వాసన పొగల నుండి తరలింపబడే మానవా కృతుల వెనక దృశ్యంలో ఆత్మ శిఖరం నుండి దూకే వెలుగుతో మరణ భయాన్ని విసరేసే భవిష్యత్తు వాస్తవ చిహ్నాలూ! సమస్యకు కొన్ని పరిష్కార చిహ్నాలూ! మంచుతో బరువెక్కిన గాలిలో నిలువెత్తు ఎగసిన దుమ్ములో తల ఎత్తి చూచే పనిలేదు! తెర తొలగాకే సూర్యుని ప్రసక్తి! జీవితం ! గడియారం ముళ్ళ ఆవర్తనం కాదు మెరపులతో పిడుగులతో! చీకటి అంతం కాదు నాకు జ్ఞాపకముంది, ముందు తెలీని ప్రయాణంలో వర్తమాన క్షణం మౌన దీపమై దారి చూపిస్తుంది చరిత్రలో వెలుగు ఉన్నా నలువైపుల నీడల సన్నాహమే ఎక్కువ అజ్ఞానం దారిద్య్రం కన్నీటి మెరుపులో తళుక్కుమంటాయి మృత్యు రహస్యం మనస్సుపై గీసిన అగ్గిపుల్ల వలె వెలుగుతుంది స్వేచ్ఛనూ మానవతనూ మంటలపై వ్రేలాడ దీస్తూ బెంజ్మన్ మోలాయిడ్ను ఉరి తీసిన రేడియో వార్త ఆర్తి నిండిన ఆగ్రహంతో టెలివిజన్ దృశ్యం నియంతల్ని శపించే మాతృ హృదయ నిర్దోష! హిమ హృదయంపై ఒక శిఖరం నుండి మరో శిఖరానికీ మధ్య రక్త బిందువు లొలికే శిరస్తోరణాల పంక్తులూ ఒక్కొక్క బిందువులో ఒక్కొక్క సూర్య గోళం తిరిగేను ఒక్కొక్కటీ ఒక్కొక్క విషాద గాధను తలపించేను ఎక్కడ మానవతను జ్వాలలు చుట్టినా నన్ను దహిస్తున్నట్లుంటుంది ఎక్కడ ఆత్మ బింబాన్ని నీడలు క్రమ్మినా నన్ను పీడిస్తున్నట్లుంటుంది ముష్టి యుద్ధం నుండి మిసైల్ ప్రయోగం వరకూ హత్య నుండి ఉరిశిక్ష దాకా మానవ చరిత్రలో మారణ దృశ్యాలన్నీ వీడని ఆటవిక రూపాలే నిశ్శబ్ధ స్రవంతి వలె జీవితంలో వయస్సు కదలి పోతుంది చరిత్ర కవసరమైన ఊహలతో భవిష్యత్తును వెదకే చూపులతో వర్తమాన సమాజంలో కొత్త తరం త్వరత్వరగా ఎదుగుతూంది వెనుక నుండి దూకే అల వలె మరో తరం సిద్ధంగా ఉంటుంది మనిషిలో మానవతా రూపం ప్రక్కనే హింసతో రక్త చిత్రమూ ఉంది మనసులో ఉదయ రంజనంతో పాటు అనల చరణమూ ఉంది తన ప్రక్కన జరిగిన హత్యకు తోట పూలు వూయడం మానదు తన నీడలో హింసకు చెట్టు చివురేయడం, ఆపదు తూనిక రాళ్ళతో కొలిచే బ్రతుక్కి ఉదార లక్ష్యం అందదు నాకు జ్ఞాపక ముంది, మబ్బులో మెరపు చకచ్చకితంగా ఆలయాంగణాన చెట్టు క్రింద దరిద్రాంగన కన్నీటి బిందువులో ముఖం చూపి ఎట్లా దూసుక పోయిందీ పొలం గట్టుపై రెప్ప లెత్తిన కర్షకుని కళ్ళలో ఆశలు నిలిపి నీడైనా చూపకుండా ఎట్లా మాయమైందీ రాత్రి వేళ శబ్దించే ఏ అరుపు ఏ జడ రూపాల్ని మేల్కొల్పిందీ విప్లవ మృదంగ ధ్వనితో అడవిలోకి పరుగెత్తిందీ నక్షత్రాల వెలుగులో వెతుక్కుంటూ దారి పట్టుకొనీ ప్రయాణించిన మనిషి, ఉదయం వెలుగులో దారి తప్పిందీ అంగారం జ్వలించే ఆలోచనతో సమయ పటాన్ని రక్తమయం చేస్తూ భవిష్యత్తు కలలతో ముంగిట్లో అగ్ని గోళాల్ని భ్రమింపచేస్తూ నాకు జ్ఞాపకముంది, గ్రీష్మ నిశ ఇంట్లో విద్యుత్ప్రసారం ఆగి, దేశాన్నీ కాలాన్నీ శపిస్తూ చలిస్తూ విసన కర్రల కోసం వెదకుతున్నారు అట్ట ముక్కలకై గాలిస్తున్నారు పాత మిత్రుని కొత్త ముఖం వలె చీకటి ఇప్పుడే పరిచయమైనట్లుంది. నగరంలో నిన్నటి దహన కాండలో పొగ బారిన ముఖాల సౌందర్యాన్ని ఏ కిరణాలు సమయం దర్పణంలో చూపిస్తాయి మనస్స ఎవరి కోసమో ఎదురు చూస్తోంది! ఇంతలో కాలింగ్ బెల్ మ్రోగింది తలుపు తెరచి చూస్తే ఆట పట్టించాలనుకున్న పక్కింటి కుర్రకుంక! ఎవరో పూలు కోసి ఒడి నింపు కొనీ ఇంతలోపట్టుబడీ మనో దారిద్ర్యం మూట విప్పి ప్రదర్శించడమొక, ప్రహసనమైంది కొన్ని క్షణాల కంటిన సుగంధ లేశంతో తెల్లారిన తెలివితో కొందరు వీధులు తిరిగీ మనుషుల్ని అడిగీ జీవితాల్ని అమ్మజూచేరు మంచు క్రమ్మిన పూలలో స్వేచ్ఛగా రేకులు విక సించాలని ఆరాటం రాత్రి బిగిసిన మంచు కరగి ప్రవహించాలనీ ఆవేదన కిరణాలు ఒకటే అయినా ఒక ముఖంలో వర్ణం మరో ముఖంలో కన్పించదు ఉదయం రోజు వచ్చేదయినా! ఏ బ్రతుకులోను నిన్నటి వాలకం బింబించదు జీవనా వర్తంలో భ్రమిస్తూ బయటికి దారి కోసం వెదకుతూ పోవాలసిన చోటికి తప్ప! అన్ని చోట్లకు పోతారందరూ ఆశ ప్రగతికి సోపానాలు చెక్కుతుంది, జిగీషకు లక్ష్యం నిలుపుతుంది నాకు జ్ఞాపక ముంది మట్టి నుండి సువర్ణ పుష్పాలు చిదిమే పనిలో కృషీవలుడు మట్టి మనిషిగా చరిత్రలో ఏ సోపానంపై నిలిచిపోయిందీ జలద హృదయ గగనం నుండీ గ్రీష్మం గొంతు తడిపే వాన పడగానే బ్రతకడానికి భూమిపై భూమిలో శక్తులతో సంఘర్షణ మొదలౌతుంది దారి ప్రక్క ఎతెన దీప స్తంభాలు చేతి దీపాలను వెక్కిరిస్తున్నాయి తాము చూపే వెలుగు సరిపోదు; మరో చిన్ని వెలుగు సరిపడదు! రాత్రి మంచులో తడిసీ చెట్టు, ఉదయకిరణం కోసం ఎదురుచూచేను చీకటి సాహసించని మనశ్శిఖరాన్ని క్షణమైనా అందుకోవాలనీ మనిషి! బుజం నుండి దించేవీ బుజం పై కెత్తుకొనేవీ జ్ఞాపకం పెట్టుకోవడంలోనే జీవిత గమనంలో పగలూ రాత్రీ జ్ఞప్తికి లేకుండా పోతున్నాయి దున్నిన భూమి పంటకు రాగానే ముఖాన మన్ను చల్లి పైన నిప్పు విసరి ఆత్మ హత్యా నేరం వేసే! ఎప్పటికీ తమ విజయమే కోరే వీరులు ప్రాణం గాలిలో కలుస్తుంది నిజం ఆకాశంలో అదృశ్యమవుతుంది నాగరక శిఖరాలపై సూర్యుడు నిద్రలోనే! ఇంకా కలవరిస్తూంటాడు దాహంతో నిల్చిన మనిషికి నీటి బావులకై వేసిన ప్లాన్ చూపి ఊపిరి సలప నీకుండా రాజకీయం ఉపన్యసించే లోపల ఉదార మేఘం చెదరి పోయింది కారుణ్య స్రవంతి ఇంకి పోతుంది జీవితంలో మనిషి ప్రయోజన రేఖ సరళంగానో వక్రంగానో ఎక్కడో తలెత్తే స్థితిని ఎక్కడో రూపొందే స్థితితో కలిపేస్తుంది వేలి గోటితో చిమ్మ బడిన కంటి చివరి నీటి బిందు వెగసి ఆకాశంలో నక్షత్రం కావచ్చు! ఎదపై అనల కణం అవచ్చు నాకుజ్ఞాపకముంది ఎండలో పగలు జ్వాలా కెరటాలతో సముద్రం వలె ఎత్తిన పిడికిలితో జన శక్తితో ఒకే ఒక రూపంగా కన్పిస్తుంది నిరసనలో ప్రతిఘటనలో ఒకే గళన్నినాద పంక్తులతో కదలేను దారి ప్రక్కనున్న ప్రతి వ్యక్తినీ చైతన్యతరం ధారలోకి లాగేస్తూంది పరపీడన దారిద్ర్యం అజ్ఞానం ఎరగని ఆదర్శంలో వివిధ శ్రమ శక్తుల సమ సమాజ స్వేచ్ఛా నవ వ్యవస్థకై మానవీయ తేజంతో కదులుతూంది ప్రజా స్వామ్య గణం రైపిల్ వదలిన బులెట్ల ధ్వనికి ప్రజలు కాగితం ముక్కల వలె చెదరేరు కర్ఫ్యూ తొడిగిన శాంతి కవచంతో నగరం భయ శిలపై మౌన శిఖ అవుతూంది ప్రయాణంలో పరస్పర కలహాలతో హత్యలతో ఎన్ని యుగాలు గడిచాయి ఒకరి లక్ష్యం మరొకరికి శూన్యమై ఎంత చరిత్ర మట్టిలో కలిసింది వీధుల్లో గుడిసెల్లో చెట్ల క్రింద ఆకలి గొన్న ముఖాల్ని ఏ ఎలక్షన్ పెట్టెల్లో పెట్టి తాళం వేస్తే సరిపోతుంది సమాజంలో స్వేచ్ఛ కోరే మనుషుల్ని ఏ గదిలో తోసేస్తే పీడ విరగడౌతుంది? నాకు జ్ఞాపకముంది చీకటి మైదానంలో విడవబడిన వాలకాలు దారి తప్పీ వెలుక్కి మొగం వాచి తమ నీడల్ని తామే మోసుకొనీ నడిచేను కంఠ స్వరంలోని ఆర్తి గాలికి పదును పెడుతూంది మతిలో ఆలోచన కాలాన్ని రెక్కలపై ఎగరేస్తూంది కలలుకనే ఆస్థికలు మనిషిలోనే కాదు భూమి పొరల్లోను ఉన్నాయి చీకటి బూజలపై దూకే కాంతి సింహం మనిషిలోనూ ఉంది పగలు మెలకువలో పనిలో మరచినా రాత్రి కలలో నిజ రూపం దూకుతుంది బొగ్గు గనులు త్రవ్వుతూ రత్నం కోసం వెదకీ వేసారి కోపంతో నిప్పు రవ్వ విసరీ చివరకు భస్మాకృతి కోరే నిరాశామతులూ వాస్తవ జగత్తును మరచి అందని తత్త్వం వల్లించే జీరో మతులూ గోడ వెనుక నున్న వెలుగు నన్వేషిస్తూ కన్పించే మంటల్లో పడే భ్రాంతిమతులూ మేల్కొనే పగలు, నిద్రిస్తూ నిద్రించే రాత్రి, మేల్కొనే వ్యాపార మతులూ మాటకు జవాబు వస్తుంది! విసరిన రాయై నడతకూజవాబు వస్తుంది మెలకువ నుండి నిద్ర దాకా జ్వాలా ముఖాలతో కథలే కథలెదురౌతాయి గతం కళ్ళు తెరచిన శిధిలాల్లో వాస్తవాల్ని అన్వేషిస్తూ దొరికిన వస్తువుకు పురా రూప మిస్తూ దొరకని వాటికి పునా రూపం యోచిస్తూ పాషాణంలో స్వప్నాన్నీ శిల్పాన్నీ మలచుకునే కాంతిమతులూ ఊరి బయట శ్మశానాలపై సమాధులపై నుండి శాంతి వచనాలతో కన్పించేరు నాలో గత స్మృతుల్ని దువ్వతూ పట్టుకుచ్చుల వలె కదలే గాలులు చెరువు గుండెపై నుండీ చెట్ల బుజాలపై నుండి మొక్కల తల నిమురుతూ తీవెల ముంగురులు సవరిస్తూ కపోల పాళి మీటుతూ నాతో వస్తాయి నాకు జ్ఞాపక ముంది, కల్పనా హిమం వెనక నున్న ఉదయ సూర్యుడు ! దారి పొడుగునా గుర్తులతో జ్ఞాపకాలతో ప్రయాణం సాగుతూంది ప్రాణ మున్నంత వరకూ గుండెలో సూర్యుని ఛవితో జీవితం ఎదురయ్యే పొడుపు కథల్లో రహస్యం విప్పుతూ పోతూంది భూతలం దాటి జలధిపై ఆకాశం, జీవితం వలె ఎదురౌతుంది వివిధ వర్ణాలంకృతమై క్షితిజం సమయ దర్పణం వలె కన్పిస్తుంది ఒకరొకరి చేతులు కలిసీ, ఒకరొకరి ఊహ లల్లుకొనీ మనుషులు మనుషుల మధ్య నిశ్వబ్దం! మంచుతో వెన్నెలతో చీకటితో వెలుగుతో తరం కదలుతూంది గుండెలో పరుగెత్తే రైలుతో కాలం పయనిస్తూంది నిష్క్రియను సాయం సంధ్యలోకి విసరేస్తూ నాకు జ్ఞాపకముంది, జీవితంలో క్షణాలు పక్షుల వలె ఎగిరేవీ, పెంపుడు చిలకల వలె పంజరంలో నిలిచేవీ చిల్లర డబ్బు వలె గలగలలాడేవీ, పిల్లల ఆట వస్తువుల వలె ఆడేవీ అన్నీ మనస్సు కాప్సెల్లో అనుభవ రూపాలతో భద్రంగా ఆకర్షించేను బ్రతుకు బరువుతో మెల్లగా నడచే నా వెనుక నుండి పెట్ డాగ్ ఉత్తరీయం చుంగుల్ని అందుకునీ లాగుతూ ఆడుతూ వస్తుంది బిందువు బిందువుతో కలిసి ఏర్పడే జన సముద్రంలో ప్రయాణం ఎవరికైనా తప్పదు! పడవలో అందరికీ కన్పించని తీరంపైనే దృష్టి! చేతులకూ కాళ్ళకే కాదు మనస్సుకీ పడిన పంకెళ్ళతో మనిషి పద పదం సంకెళ్ళ ధ్వనిలో మూల్గే బ్రతుకు బరువుతో గుండ్రని చరిత్ర దారిన ఎంత దూరం వెళ్ళింది జ్ఞాపకముంది పూలు పండ్ల చెట్లతో చిత్రాలతో ప్రతిమలతో అద్దాల బీరువా ఉదయాన్ని భ్రమింప చేసే జ్వలదహంకారంతో పాటు ప్రవాహాన్నీ స్మరింపజేసే ఆశామయస్వరమూ ఆలోచనలో అంగారం జ్వలిస్తూ పూల తోటను మండించే మనుషులూ కొన్న మట్టి బొమ్మను గుండెకు హత్తుకొనీ వీధిలో మనిషి తగిలి పగిలిన ముక్కలపై పిల్లడి అశ్రు కళికలూ ఆహారంకై ఆరంభమై స్పర్థ, భూమికై విస్తరించి స్వార్థం పీడనలో సంపదతో అధికారంతో సమాజ మెట్లా జటిలమైందీ మొన్న ప్రశ్న ఎరగని శిలా గణం నేడు ప్రశ్నించడం మొదలు పెట్టింది నేడు క్రమంగా సమాజం జన చేతన శక్తుల చరిత్రయై కదులుతూంది నాకు జ్ఞాపకముంది, కిటికీ నుండి చూస్తే కన్పించింది కన్నీళ్ళతో కదలే చంద్ర బింబం, క్షిపణుల వలె దూసే పారావతాలూ ఎవరో తలుపు తట్టిన అలికిడితో! లేచి తలుపు తీసే సరి కెదురుగా మంచు శాలువా కప్పుకొనీ ఎర్రని ముఖంతో వీడని చీకటితో మనిషి! అలసటతో బరువెక్కిన కళ్ళతో వీడని చీకటితో పగలంతా తిరిగి ఏష్ టేలో చెదరని సిగరెట్ వలె రెండు చేతుల్లో ముఖంతో ఇంటి ముఖం పట్టిన యువాకృతి అడుగుల వెనక ధూళి పొర లెగసేను ముందు నడచే ఇనుప పాదాల క్రింద ఎత్తిన ఇనుప పిడికిళ్ళ మధ్య నలిగి పడిన స్వేచ్ఛా మందారం గుర్తులు నేలపై రక్త చిత్రమై కన్పించేను మనవతా గంధంతో ఉదార పవనం ఉండి ఉండి మధ్య మధ్య కదల్లేని చెట్ల వద్దకూ, మెదల్లేని రాళ్ళ వద్దకూ వెళ్ళి వస్తూంది పై దేవతల్ని క్రిందకి దింపి చుట్టూ అలముకొన్న మౌనాన్ని చీల్చి గుండెల్ని అనల ధారలో ప్లవింపజేసి, ఈ వ్యవస్థను మార్చే నినాద పంక్తి! సమయాన్ని చక్రం వలె పరుగెత్తింపజేస్తూంది ఉద్రేకోత్సాహం రాత్రిని మంటలతో నర్తింపజేయచూస్తూంది వెనక్కు తిరగడం లేదు, ప్రక్కఉ మరలడం లేదు సముద్రం బింబించే కళ్ళల్లో ఉదయం జ్వలిస్తూంది పైన కదలే మబ్బు ఆలోచనకు లక్ష్యాన్ని గుర్తు చేస్తూంది మట్టి నుండి లేచిన మొక్క! ప్రాణ శక్తి అస్తిత్వాన్ని జ్ఞాపకం చేస్తూంది వాలిన శిరస్సుల్ని నిటారుగా నిలుపుతూ వంగిన కాళ్ళను సరిచేస్తూ ముడిచిన చేతి వేళ్ళను విప్పుతూ పవన హస్తం కదలుతూంది మార్పుకు సంకేతమై మ్రోడుల్ని మధుమయం చేసే, ఆనంద సమయం నాకు జ్ఞాపకముంది ఆ గుడిసెలో దీపశిఖ పొద్దు పొడిచినా ఆకాశం వలె పరచుకొన్ని ఆకలితో కూర్చునే ఉంది చుట్టూ అవే ముఖాలు! చూపులకు బదులు ఆయుధాలు కన్పిస్తున్నాయి సంకల్పం మౌనాన్ని కదిలించే పలకించే మ్రోగించే సాధనమవుతూంది అంతర్వనంలో సింహం బయటికి వచ్చి మృదు హాసం చేస్తూంది మనో వనంలో కురంగం స్వేచ్ఛగా ఎగిరి గంతులు లేస్తూంది కళ్ళు పైకెత్తితే ఆదర్శం తొంగి చూస్తుంది కళ్ళు దించితే వాస్తవం ఎదురౌతుంది లయ సంభ్రమంగా తిరిగే చక్రాలపై మనషులతో రిక్షా దూరం బహు దూరం బాటను సాగదీస్తూ పోతూంది, ఊహను మరలిస్తూంది ఉన్మాదంతో ప్రేలే బాంబుల మధ్య ఉద్వేగంతో మ్రోగే రైఫిళ్ళ మధ్య ఆగిపోయే నిశ్వాసాల మధ్య నుండి శాంతి వచన రేఖలు విన్పించేను వినిపించే మాటలో అర్థాన్ని అనుభవిస్తూ కనిపించే పూలనూ ఫలాల్నీ అనుశీలిస్తూ నేలలో దాగిన వేళ్ళను వెదకుతూ మనస్సు కదులుతూంది బస్కై వేచి ఉన్న క్యూలో ఎదురు చూచే చూపులో వరసగా వచ్చిపోయే వాహనాలు! దేని గమ్యం దానిదే ఎవరి ప్రయాణం ప్రయోజనం వారిదే ! ఒక మూల నుండి విడిపోయిన శాఖల్లో నుండి ఉపశాఖలతో వృక్షం వలె కదలి తరలే మానవ సమాజం, వివిధ వర్ణ సంకలనం, ఈ నగరం సమాజాన్ని ప్రేమిస్తూనే తోటి మనిషితో పోటీతో సాగే ప్రయాణంలో ఎక్కడికక్కడ అతృప్తి ఆవేదన ఎప్పటికప్పుడు స్పర్థతో సంఘర్షణ ఆకు పూవు కొమ్మ ! చెట్టులో భాగాలు దేని ప్రత్యేకత దానిదే సమాజంలో! జీవన గమన విధంలో ఎవరి వ్యక్తిత్వం వారిదే నాకు జ్ఞాపకముంది దగ్గరలో వెలుగు లేకపోయినా కంటి నుండి జారే బిందువులో ఉంది ఒక్కొక్క బిందువు వెలుగుతో చీకటిని సిగ్గుపడేట్లు చేస్తుంది ఏడుపు! ఎవరి కిష్టముంటుంది? ఇష్టం లేకుండానే వచ్చేస్తుంది సంతోషమూ అంతే! తీరాన కెరటం వలె విరుచుక పడుతుంది పూలతో పండ్లతో చెట్టు ఆలోచనలో మబ్బుకై ఎదురుచూస్తుంది మాతృ హృదయ గంధంతో రస స్విన్నం కావాలనుకుంటుంది రాత్రి మంచుకు దాహం తీరదు, పగలు వెలుక్కి ఆకలి తీరదు నీరుకీ తిండికీ కరువైన మనిషిలో అగ్ని వృక్షం పడగెత్తుతూంది హిరణ్య హస్తం క్రింద వెండి గొడుగు క్రింద కవిత్వమూ కళ అవనతమై తోరణమై అలంక్రియను పొందే రోజులు మారాయి సూర్యుని ముఖంలో కన్పించని వర్ణ చిత్రం చీకటిలో కన్పిస్తుంది అందని కళా రహస్యాల్ని ఎక్స్రే చూపులు ఆవిష్కరిస్తాయి నాకు జ్ఞాపక ముంది దూరాన బిగ్గరగా విజిల్ వేస్తూపోయే రైలు గురించి పొలం దున్నే వాడికీ ఇష్టమే! చేతిలో నాగలి వదలేందుకూ సిద్ధమే ! ఇంటి ముందు పడి ఉండే కుక్కను వదలి ఇంట్లో పడకేసిన అవ్వను మరచీ గ్రీష్మంలో నేల చెక్క వాలకంతో ప్యాక్టరీ గేటు ముందు చక్రం వలె నిల్చేను జనం మధ్య మాటల్లో నాలుక పదును తేలుతుంది గ్రామీణ మౌన రూపం వీడి వదనం, నాగరక జల్పనం వహిస్తుంది మేడ, గోడ నీడలో కాల వేగ గతితో, యంత్రంలో భాగమై హృదయం చలిస్తుంది నవ్యతపై ఆకర్షణతో పరివర్తనపై కోరికతో జీవన రుచి సహజం ప్రతి పదంలో జన గణం కాంతి బింబ సోపానం కోరుతుంది రాత్రి కలలు ఎగిరిపోయి మనస్సు రాగ సృష్టి వహిస్తుంది నిశలో చీకటి నద్దుకున్న బాధా స్వరంలో అగ్ని, కాలాన్ని భస్మం చేస్తుంది రేపు ఉదయ చరణంతో భవిష్యత్తు స్వప్న బింబం కోసం వ్యక్తినీ సమాజాన్నీ రాజకీయ కాంతి ఝంఝ రెపరెపలాడిస్తూంది మేఘం ఇంటి ముంగిట్లో నర్తించలేదనో ఇంటి వెనుక క్రీడించలేదనో ఎదురు చూచే ముఖ పంక్తులు సాయం సంధ్యా క్షితిజాకృతి వహిస్తున్నాయి నాలుగు వైపుల నుండి అనుభవ కిరణాలు జీవితాన్ని శిల్పంగా మలుస్తున్నాయి మనిషిలో అనువణువు నృత్యంతో సజీవ ప్రపంచం కదులుతూంది గదిలో బల్బు వెలుగు స్పర్శతో వచ్చిపోయే మనుషుల్ని ఆనందింపజేస్తూంది ఎదలో ఆరిన బల్బుతో మనిషి హింసనూ హత్యనూ అవాహన చేసేను మనిషి వస్తువు కాదు, చీకటికీ వెలుగునీ స్పందించే మనోమూర్తి నిజాన్ని గుండెలో పొదచాటునో, గుహ లోనో దాచుకొనీ వెలగని బల్బులతో బూది పొరలతో వాలకాలు కన్పిస్తాయి రెక్కలు విప్పి ఎగిరే పక్షీ గర్జిస్తూ చరించే సింహమూ మనిషి ఆశలో అహంకారంలో రెండూ ఉన్నాయి అనుభవం లేకుండా అన్వేషణ లేకుండా ఏ రోజూ ప్రయాణం ఉండదు జన విముక్తికై పోరాటంలో ఎగసే ప్రతి స్వరానికి విలువుంది ఇలపై కాంతి చరణం వేసి దిశలో కాంతి హృదయం విప్పి స్నేహ రుచితో రాగ కళతో కదలే మనిషిలో విశ్వగీతం! గమ్యం చేరే కోరిక శ్రమను మరపిస్తుంది అనుభవాన్ని వెలిగిస్తుంది ప్రతిక్షణ మేదో మృదు ధ్వనితో రణిస్తుంది బింబంతో ఉదయిస్తుంది గతాన్ని వెనక వదిలేసి రైలు స్టేషన్ నుండి స్టేషన్ చేరుతుంది రైలు దిగి అవనిపై వేసే అడుగుల్లో అనుభవం స్వేచ్ఛతో స్పందిస్తుంది నాకు జ్ఞాపకముంది ప్లాట్ ఫార్పై గేట్ వద్ద పలచని మంచు క్రమ్మినట అనల ముఖంతో ఒంటరిగా వచ్చి పోయే రైళ్ళను చూస్తూ జన కోలాహలం మధ్య కూర్చున్న మౌన బింబం పతితో! వంచితో ! ఉన్మదిష్ణువో ఎప్పటికీ! సమాజానికి మిగిలే ప్రశ్న! రాత్రి ప్రయాణంలో రైల్లో తెరచిన కిటికీ నుండి క్రిందికి దూకిన వెలుగు ఎవరికి అందకుండా భయ భయంగా మమ్మల్నే అనుసరిస్తూంది వెలుగునూ నీడనూ మరిపిస్తూ టాన్సిస్టర్లో పాట స్వనిస్తోంది పెన్సిల్ చెక్కే పిల్లవాడి చేతి వ్రేళ్ళ సందున చకచక కదలే కొత్త బ్లేడ్ అంచు వలె సన్నని మెరపు నాలో స్మృతుల్ని కదలిస్తూంది ఎప్పుడో ఎక్కడో చూచినవీ తోచినవీ క్షణంలో ఒక చోట చేరేను