Padagettina Udayam (పడగెత్తిన ఉదయం) Collection 2 of Volume I — Swecchaa Kavitvamu by Prof. Madiraju Ranga Rao. Year: 1973. Language: Telugu. Canonical HTML: https://madirajurangarao.com/poetry/volume-i/text/padagettina-udayam --- శ్రీమతి ఇందిరకు పడగెత్తిన ఉదయం పడగెత్తిన ఉదయం కావ్యం స్వేచ్ఛా కవిత్వంలో ప్రయోగాత్మక రచన. ఒక వ్యక్తి జీవితంలో ఇరవైనాలుగు గంటల్లో అంటే ఒక రోజులో పొందిన అనుభవ రూపాల సంకలనం. పడగెత్తిన సమయం తనలో శక్తిని సమీకరించుకొని సిద్ధమైన కాలాన్ని సూచిస్తూంది. ఉదయం శుభ్రతకూ, స్వచ్ఛతకూ, వివేకానికీ, ఆశకూ ప్రతీక. ఉదయంతో సమాజంలో గతిశీలం క్రియాత్మకత ఇనుమడిస్తుంది. ఉదయ రూపాన్ని ఎందరో కవులు సమయ సందర్భాల్నిబట్టి అర్థవంతంగా వర్ణించారు. పడగెత్తడం ఉన్నతినీ, వికాసాన్నీ, జాగరూకతనూ క్రియాశీలాన్ని శక్తి ప్రసారాన్ని భావింపజేస్తుంది. "భూమి నిదుర నుండి మేల్కొంది"తో ఆరంభమైంది. “నిన్నటి రాజరికం నుండి నేటి ప్రజాస్వామ్యం వలె”, ఉదయ రూపం కన్పించింది. దేశంలో స్వాతంత్ర్యానంతర ప్రజాస్వామ్య స్థితి సూచితం. ఈ కావ్యం ఒక వ్యక్తి మానసిక తలంపై ఉదయంతో ఆరంభమైన సామాజిక రూపం మరో ఉదయ సూచనతో ముగుస్తుంది. ఈ రోజు పై మమత “వికసించిన మందారం”గా ఆశాస్ఫూర్తితో ఆరంభమయింది. మునుముందెట్లా ఉన్నా ఆ సమయం మనిషిలో నిర్మాణ వికాస స్పందనం సహజం. నేలపై జీవితంపై దృష్టి ప్రసరిస్తుంది. మధ్య చిత్రాలెన్నో! “యువకుడు ధరించిన సూటువలె ఉదయం రెపరెపలాడుతుంది. మెడలో వ్రేలాడే నెక్ వలె” మబ్బు ముక్క కదలుతుంది. ఎండ పైకెక్కగానే సమయం తిరగబడిన ప్రజవలె” చెలరేగిన సమాజ స్థితిని జ్ఞాపకం చేస్తుంది. అణువణువూ చలనంతో ఆరాటంతో పోరాటంతో జీవితం ఎదురవుతుంది. ఆకాశం అగ్నిచిత్రం వేయబడినట్లుంటుంది. ప్రజాస్వామ్యంలో హక్కులకై కనీసపు అవసరాలకై ఉద్యమించే సమాజం ఎదురవుతుంది. సమయం “దాహంతో పరుగెత్తు” తూన్నట్లనిపిస్తుంది. జీవితచక్రాలు వడివడిగా పరుగెత్తడమూ జరుగుతుంది. దారిన ఒకచోట రాజకీయ చలన్మతీ, మరోచోట వీథిమూలన గారడి చతురుడూ కన్పిస్తారు. ఇంకోచోట “తాకట్టు పెట్టిన” అంతరాత్మతో కదలే స్వార్థపరులూ ఎదురవుతారు. కట్ట తెగిన కోష్ణ సముద్రంవలె సమాజం! ఈ విధంగా యథార్థ జీవిత శకలాలు ఒకచోట యోజితమై కళారూపాన్ని పొందాయి. "చూస్తూ చూస్తూండగానే” కాలం గడుస్తుంది. పరివర్తనం కన్పిస్తుంది. జీవితంలో అనేకమైన సాధారణానుభవాల చిత్రణతో తీర్చబడింది. ఒకచోట పగలు “చెలరేగిన గ్రీష్మం వలె” భావితమైంది. ఇది జీవితంలో కఠోర వాస్తవాన్ని సూచిస్తుంది. సాయంకాలమయింది. గాలి స్తంభించింది. ఏదో తెలీని ఆనందం పెల్లుబుకు తుంది. ఆనంద బింబం కోసం మనస్సు ఎదురుచూస్తుంది. పగలు ఎండలో పరితపించిన శరీరాలకు అలసిపోయిన మనస్సుకూ చంద్రబింబంకై నిరీక్షణం సహజం. సూర్యుని అస్తమయం దాకా వేచిఉండే ఓపిక లేని చీకట్లు దూకనున్నాయి! తలలపై గడ్డిమోపులతో- స్త్రీలూ, చేతిలో ఒడిశెలతో పురుషులూ ఇళ్లకు మరలుతున్నారు. ఇది గ్రామీణ వాతావరణం లోనిది. రవి "మహావృద్ధువలె” నిష్క్రమించాడు. శశి “శిశువు వలె” ఉదయిస్తాడు. “దీనజనుల హృదయ శబ్దాన్ని మోసుకొనీ" గాలి “చెవిలో బాధారహస్యం” ఊదుతుంది. సినిమా జ్ఞాపకం వస్తుంది. ఎదురుగా "ఎయిరోడ్రామ్లో దిగే విమానంలా" నీటుగా ఎదురయ్యే స్త్రీ! ఆమె సాంఘిక సేవా ధురీణ! “చేతిలో చందాపుస్తకం”తో కదులుతూంది. ఒకటేమిటి! ఎన్నో దృశ్యాలు! దేశద్రిమ్మరులూ, దీపస్తంభాలూ, ఎండిన గొంతులతో దీన జనాళి! మబ్బు గురించి ఆలోచన! నీటి చినుగు గురించి ఊహ! వాస్త చిత్రణంలో ప్రతీకల ప్రయోగంతో రచన సాక్షాత్కరిస్తుంది. “రాత్రి వస్తుంది మాయ లాంతరులో", సమయం “బిచ్చగాని వేషంలో ఎదురవుతుంది”. కూచోని “కథలు వినే పిల్లల వలె” పైన చుక్కలు! ఈ సన్నివేశంతో మనస్సులో వెండితెర మెదలుతుంది. అడ్రసు పారేసుకున్న చంద్రుడు “ఎవరి కోసమో ఒంటరిగా వెదకుతూ” మెల్లగా నడుస్తూన్నట్లుంది. గాలి మాత్రం నిద్ర ఎరక్కుండా పహారా కాస్తుంది. రాత్రి ఎప్పటికో మెల్లగా నీలిమబ్బు రెక్క విప్పినట్లుంటుంది. గ్రీష్మతాపం వెనక్కు తగ్గింది. అంతటా ఆహ్లాద రూపం బింబిస్తూంది. చీకటి రైలు పరుగెడుతూంది. మబ్బులో మెరపువలె మనస్సులో ఉదయ స్ఫూర్తి! ఈ ప్రయాణంలో “ ఈరోజు” జారిపోయి, “నిన్న” అవుతూంది. “ముళ్ల కొమ్మల నుండి గులాబివలె” ఉదయం తలెత్తుతుంది. వెలుగు రాకతో చీకటి పాయలుగా చీలింది. నీడలు మాత్రం సాహసిస్తున్నాయి. మరో రోజు నవనవోన్మేషంతో ఎదురవుతుంది. ఉదయం పడగెత్తుతుంది. ఇదో అవిచ్ఛిన్న పరంపర! దేన్ని మరచినా దీన్ని మరవలేం. ఎప్పటికీ జ్ఞాపకముండే ఉషస్సు ముద్రతో మనిషి మేల్కొన్న స్థితి ఎంతో విలువైంది. మానవ సంస్కృతికి నిలయమైంది. ఉషస్సు గురించి ఊహ, అనుభవం, కవితాత్మకమైంది. మనిషిలో సహజమైన స్వచ్ఛమైన ఆత్మ ప్రకాశానికి సంకేతం. ఆ రోజు ప్రయాణం "రైలు మాని మధ్యలో విమాన మెక్కినట్లుంది” అనడం గడచిపోయిన జీవితాన్నీ, మారిన గమన రూపాన్నీ సూచిస్తోంది. “గతానికి గుడ్ బై” చెప్పడంతో మరో ఉదయంతో ఇంకో రోజులోకి ప్రవేశించే మలుపును గుర్తు చేస్తూంది. గతం ఇపుడు పాతబంధువు, ఉదయం కొత్త బంధువు. దీనితో భవిష్యత్తుకు స్వాగతంతో ఎప్పటికపుడు మార్పును పొందే జీవితం దర్శనమిస్తుంది. ఈ కావ్యాన్ని సమయపటలంపై భౌతిక మానసిక స్థితిగతుల దృశ్యచిత్రంగా భావించవచ్చు. జీవితం “ఫోటోగ్రాఫ్ కాదు", ఏ రోజు అనుభవం దానిదే, ఏ రోజూ ఏ రోజుకూ డిటో అసలే కాదు. ఏ మనిషీ రాతి బొమ్మ కాదు. ప్రతిరోజు కొత్త అనుభవంతో రూపొందే సజీవరూపం, జీవితం. ఈ కావ్య నిర్మాణరూపం, ఒకరోజులో వివిధ సమయ దశలపై వాస్తవ జీవిత రేఖలతో వెలసింది. ఒక వ్యక్తి జీవితగతికీ సమయగతికీ బింబ ప్రతిబింబ భావంతో ప్రకృతి భూమికపై అనుభవ దృశ్య పరంపర ఐదు కోణాల్లో కల్పితమైంది. 1. మొదటి సమయ దశ మెట్లెక్కి వచ్చే ఉదయంతో యోజితమైంది. ఇది జీవితంలో పైకి వెళ్ళగోరే మనిషి చుట్టూ కన్పించే పరిసరాలు, వాస్తవాలు కలిగింది. 2. రెండో సమయ దశలో పైకెక్కిన పొద్దుతో ఎండ! గ్రీష్మభావనతో చిత్రితమైంది. పగలు జీవితంలో ఎదురయ్యే నిబిడమైన తీవ్రమైన వేగమైన అనుభవ రూపానికి చిహ్నంగా స్వీకృతమైంది. ఆశ-నిరాశ, శాంతి-అశాంతి సంఘర్షణతో సమన్వయంతో జనచలనం ఎదుర్కొనే వడగాలితో వాతావరణం పదునెక్కిన వ్యవహార జగత్తును ప్రతిఫలిస్తూంది. లౌకికమైన క్రియాకలాపాల ఆధిక్యాన్ని సూచిస్తూంది. 3. మూడో సమయదశ సాయంసంధ్య. విషాద రేఖలతో ఎదురైనా ఆశారేఖవలె చంద్రబింబం విశ్వాసాన్ని పెంచేదిగా అవతరిస్తుంది. ఇంతవరకూ చెలరేగిన అలజడి ఉపశమిస్తుంది. ఇది విరామ సమయంగా గుర్తింపబడింది. దీని నుండి బయటపడే మనస్సు ఆశావహమైంది. ఈ సందర్భంలో చైతన్య స్రవంతి (స్టీమ్ ఆఫ్ కాన్హెన్నెస్) ధోరణిలో ఆలోచనారూపం ప్రవహించే సంవిధానం అవలంబింపబడింది. ఇందులో ఆంతర సంభాషణం (ఇంటర్నల్ మోనలాగ్) కూడా ఉంది. 4. నాలుగో సమయదశ రాత్రి. చీకట్లోను చుక్కలు స్వతంత్రంగా బ్రతికే ప్రయత్నం కన్పిస్తుంది. ఇది మనోనేత్రం, సుందరస్వప్నాల్ని కనే సమయం. భయం ఒక ప్రక్క తారాడే మాట నిజమే. భయాన్ని తొలగించే విశ్రాంతిలో నీలిమబ్బు రెక్క విప్పడం, పగటితాపం చల్లబడే స్థితికి నిదర్శనం. సన్నని జల్లు! మెరిసే మెరుపు! ఆర్ద్రమైన అవని! ఇంద్రధనూ రూపంలో లోపల విరిసే ఆశ, నిద్రలో విచిత్రమైన అనుభవగుణం చిత్రితమైంది. ఇంకా మనిషి పూర్తిగా మేల్కొని బయటికి రావడానికి సమయం పడుతుంది. 5. చివరి ఐదో సమయదశలో మంచుతెర కదలుతుంది. ఆశాపతాక రెపరెపలాడుతుంది. మరో ఉదయస్ఫూర్తి మెదలుతుంది. దీని పరిణత రూపమే మరో ఉదయం. ఇది నవనవోన్మేష మైంది. ఏరోజు కారోజు సరికొత్తగా దర్శనమిస్తుంది. ఈ రోజు ఏ రోజుకూ డిటో కాకూడదనే! ప్రతిరోజూ మనిషి కొత్త విశ్వాసంతో కొత్త ఆలోచనతో ప్రయాణానికి సిద్దం కావడం జరుగుతుంది. ఈ పరివర్తనతో మనోభూమికలో ప్రయాణం వేగాన్ని అందుకుంటుంది. ఇది విశిష్టమైన అనుభూతి గుణం కలిగిన పరివర్తనం. "రైలు మాని విమాన మెక్కినట్లుంద”న్న మాటలో మార్పుతో కలానుగుణమైన విశేషానుభవం సూచితమైంది. ఈ అయిదు సమయదశల భూమికపై రూపొందిన కావ్యంలో చైతన్యస్రవంతి సంవిధానంతో భావరూపాల ప్రతీకల సహాయంతో రచన ఆవిష్కృతమైంది. పడగెత్తిన ఉదయం సామాజిక స్పందనతో ఒక వ్యక్తి బాహ్యమైన ఆంతరమైన భౌతిక మానసిక స్థితి చిత్రణంతో రూపొందిన కావ్యం. Detroit, MI - U.S.A. 22-6-2001 - హరితస్వేచ్ఛాకవిత్వం I - మాదిరాజు రంగారావు 11. పడగెత్తిన ఉదయం భూమి నిదుర నుండి మేల్కొంది I. 1. భూమి మేల్కొంది నిన్నటి రాజరికం నుండి నేటి ప్రజాస్వామ్యం వలె పగటి కలలు మానింది నింగి వాస్తవికతను బింబించే మనస్సు వలె వడి వడిగా కొసరుతున్నాయి గాలులు అధికారం కీర్తికై ప్రజా ప్రతినిధుల వలె. చెట్లు తలలూపుతున్నాయి వారి సేవక గణం వలె గిరులు నిలద్రొక్కుకొన్నాయి పరమ మొండి ఘటాల వలె యువ చైతన్యం వలె నదులు పరుగులు తీస్తున్నాయి. మహా భుజగం వలె సమాజం మలుపు తిరుగుతూంది. ఉదయం మెట్లెక్కి వస్తూంది మనస్సు పదిమందిలో కలిసింది. సమాజ హృదయ చలనం వేగం హెచ్చింది. దిక్కుల్లో ప్రవహిస్తున్నాయి వెలుగు వాకలు మరో రోజు వస్తుంది తప్పదు కానీ ఈ రోజుపై మమత వికసించిన మందారం. రవి దారాలల్లే లోపుగా చీకటి తప్పుకుంటూంది నేర్పుగా నీడ మరువరాని చీకటి బంధువు దోషివలె ఒక మూల ఒదిగింది దీన్ని క్షమించినట్లుంది రవి చూచీ చూడనట్లున్నాడు. కదలే ఊహలవలె చెదురు చెదురుగా మబ్బులు ముక్కలు ముక్కలుగా సూర్యుని హరింపజేస్తున్నాయి నీడ బొమ్మలు డిఫెక్టర్లు, అక్కడక్కడా తలలెత్తాయి. ఆకాశం సచిత్రంగా ఉంది, ముఖం సాలోచనగా ఉంది. నిజానికీ వెలుగు కొత్త కాదు ఈ చీకటి అంతకంటేనూ స్థితి భావనలో ఉంది క్రొత్త, దృష్టి రూపంలో ఉంది భేదం వెలుగు వెలుగు! విజయశ్రీ శోభిత మూర్తీ! వెలుగు. నవ్వు! మా వాలకం చూచి విరగబడి పగలబడి నవ్వు! నీకు తెలుసు మా వర్ణ రూపం, మాకు తెలుసు నీ గుణ రూపం మింటిలో ఒంటరిగా రవి, మంటిపై ఒంటరిగా నేను అతడు కన్పించకపోతే ప్రపంచానికి చీకటి నేను కన్పించకపోతే సమాజంలో వెలితి తెలి నీలి వంపులుగా విరుగుతూంది ఆకాశం అహంకృతితో బుసకొడుతూంది గ్రీష్మం రాత్రి నుండి ఉదయం కోటికి పడగెత్తినట్లుంది. మృత్యువు చాచిన చేతుల వలె ఎదురుగా ఎండిన కొమ్మలు! నిరీహతో నిశ్శబ్దం విసుగెత్తి ఆవులించినట్లుంది రోదసి పాడు పడిన గుడి ప్రక్కగా నీరు లేని బావి దగ్గరగా నెరియలు పడ్డ భూమిపై ఆకులు రాలిన చెట్ల క్రింది నుండీ కాలాన్ని నిందిస్తూ బయలుదేరా నతాకాశాని కెదురుగా దూరంగా కుక్కలు పోట్లాడుకుంటున్నాయి దగ్గరలో పిల్లి ఎలుకను తరుముతూంది ప్రక్క ఇంట్లో అదే పనిగా ఏడ్చే పిల్లల్ని ఊరడించలేక తల్లి సతమతమౌతూంది స్టీలుచెంచా ఎత్తుకొని ఎగసీ కొరుకుడు పడని కాకి పక్క ఇంటిపై వదిలేసింది, దానికై వెదకుతూ పిల్లలు మూగారు కాలం గడవదూ! ఆ ప్రశ్న దేనికి? ఎవరి కోసమాగుతుంది మనింట్లో పెండ్లికా? ఆజన్మమిత్రం మనస్సు హెచ్చరించింది. అప్పుడే అంటించిన సిగరెట్ వలె ఉంది ఉదయం ఎవరికీ సమయం లేదు కాస్త నిల్చోడానికీ కూర్చోడానికీ నొసటిపై వేలాడే ప్రశ్నలతో ఎదలో దాగిన జవాబులతో ఈ పగటి ఫోకస్లో కాల చిత్రం తిలకించడానికి మిత్రమా! నీకు నాకే ఉంది సమయం చేతినిండా వీరి నెవరినీ ఎరగను కాని పరిచయమున్నట్లే ఉంది కళ్ళలో మెరుపులు చూస్తే వెలుగు నెరిగినంత బాగా. ఇదో చిన్న హోటలు! బీర్వాలో మిఠాయిని కళ్ళప్పగించి చూస్తూ ఒడిలో పడిన బూందీ పూసా ఏరుకొని మరీ నోట్లో వేసుకుంటూ తేనీరు సేవించే రిక్షావాలా మన సింపతీకి తగినవాడు, మనపై ఏ ఎపతీ లేనివాడు.- ఇంతకు ముందా చెట్టు క్రింద మనం కలిసిన చోట ఈ వేడి నీటికేనేమో అర్థించి బోణీ మీదేనని ప్రార్థించి సవారీ తీసుకొచ్చి 'పడగొట్టి' ఇందులోకి దూరాడు! ఎవరికి వారు పని తొందరలో బయట పడాలనే! అదో రకం ముఖ పరామర్శలూ! పరిచయ స్పర్శలూ తప్ప ఇక్కడ పెద్ద పెద్ద కబుర్లేమీ వినిపించవు ఏమని వర్ణించనీ పరిసరాలు! ఏవో నాలుగైదు కాలెండర్లూ ఒకటి రెండు కాళ్ళు అదుపు తప్పి ఊగే కుర్చీలూ బల్లలూ పట్టుమని పది మంది వస్తే కూర్చునేందుకు చోటు లేదు దూరంగా వీధిలో నడిచే బండ్ల వరస సవ్వడి వింటూ ఆ రాగం లయలో ప్యాన్ లేదని విసుక్కుంటూ కూర్చున్నా “ఆ డైలీ ఇటు దయచేస్తారా?” నా మీద నుండి చేయి చాచి ఆవల నున్న వ్యక్తి నొకరు అడుగుతున్నారు. “అబ్బ ఈ వాసన ఎక్కడి నుండి" అని క్రాస్ చేసాడో వ్యక్తి. “రాజకీయ సరోవరాల్లో చొచ్చిన లులాయాలూ వరాహాలూ చిమ్మే గంధ రేఖలు సుమండీ!" అన్నాడొక హాస్యప్రియుడు అలా ముందుకు వాలిపోయి కబుర్లేవో చెబుతూంటే అలా వాలిపోయి వెనక్కు “సరే” నంటూ నిట్టూర్చాడు మిత్రుడు మా మధ్య నున్నవీ కంటికి కన్పించేవి టీ కప్పులు! మాత్రమేనా మా మధ్య లేవూ! కదలే ఊహలూ కన్పించని ఊహలూ లోయలూ! కదలీ కదలని గాలులూ! మెరసీ మెరవని వెలుగులూ లోయలు! గాలులు! వెలుగులు! ఇంకా మరచిన నీడలూ! పొగలు చిమ్ముతూ వెళ్ళుతున్నాయి బస్లు ఫుట్ బోర్్డ పై నిల్చొని వేలాడుతున్నారు ఫీ ప్యాసెంజర్లు జీవన ఘర్షణలో వెనకబడిన అర్థరహిత వర్గ శకలాలు ఇందాక బస్కోసం చెట్టు క్రింద వేచి ఉన్న పెద్ద మనిషి జ్ఞాపకం లేదూ! నలుగురు పిల్లలతో అదిగో! వీధి మూల పాతిన కుటుంబ నియంత్రణం బోర్డు చూస్తూ చూస్తూ నిల్చొనీ సాగాడు ఎక్కడికి? ఇంటికే! చెట్ల తల వెంటుకల్లోకి పొడవు చేతులు చాచి గాలి మెల్ల మెల్లగా దువ్వుతూంది యువకుడు ధరించిన సూటు వలె ఉదయం రెపరెపలాడుతూంది మెడలో కంఠానికి వేలాడే నెక్ టై వలె అక్కడక్కడా మబ్బు ముక్క మాట బయటికొచ్చే లోపల ఊహ మలపు తిరుగుతూంది ఈ క్షణం కాల ఖండం! అల్పమైందైనా కొంత తృప్తినిస్తూంది బ్రతుకంటే భాయి చూడు! కడుపు కింత తిండీ ఆపై మేనికింత గుడ్డా ఉనికి కింత గూడూ ఇంతేనా? ఆపైన అంటే వెంటనే ప్రస్తుతానికి సెలవంటావు మనంలేంది ప్రపంచమెక్కడిది? మనస్సులేంది మానవత ఎక్కడిది? పదిచోట్లకు నడిస్తేనే అనుభవ పరంపర పొందేది మృత్యువు మధ్య పెరిగినవాణ్ణి నిజమెలా చెప్పగలను? నిజానికి మనకూ జీవితానికీ చాల దూరం నిజం చెప్పాలంటే మనం సంపూర్ణంగా బ్రతికే ఉన్నామా? నిజం చెబితే నిజంగా లోకం భరిస్తుందా? హర్షిస్తుందా? చూస్తూ చూస్తూ ఉండగనే అపుడే ఎంత ప్రొద్దెక్కింది? మన దేశంలో ప్రణాళికల అంకెల సైజులో ఉషస్సును చూడ్డమే పడదు లేచే సరికే ఉదయమైపోతుంది ఊహ క్రమ్మిన కళ్ళు ఊహ కొదగని ఆకాశాన్ని చూస్తున్నాయి ఎవరి సీమల్లో వారు! ఎవరి ఊహల్లో వారు ప్రతి ఒక్కరి ప్రయాణమూ పరిమితమే ప్రతి ఒక్కరి ఆలోచన చక్ర భ్రమణమే వెలుగు దివ్వె కింద చీకటీ చీకటి గద్దెపై వెలుగూ! అణువణువూ చలనం ఆరాటం పోరాటంతో జీవితం చీకట్లో మట్టిలో మృత్యువులో నుండి పరివర్తన! మరో రూపం.- తిరగ బడిన ప్రజ వలె చెలరేగింది గ్రీష్మం II. చెలరే గిన గీష్మం వీధిలోకి అడుగేయడంతో కన్పించే మొదటి దృశ్యం కళ్ళు బయర్లు క్రమ్మే ఎండలో ఆకాశం అగ్ని చిత్రం వహించింది. పృథ్వి పచ్చదనం దాచుకుంది గుండె వెచ్చదనంతో నిండింది గుంపులు గుంపులుగా పక్షులు దొరికిన నీడ నాశ్రయిస్తున్నాయి పట్టపగలు రోడ్ ప్రక్కగా చుట్టూ దారాలు దింపి గాలి కెగిరి పోకుండా రాళ్ళతో నిలిపిన గొడుగు క్రింద వంచిన తల ఎత్తకుండా చెమట బిందువులు రాలుతూ చెప్పులు కుట్టే ముసలి మొగం ప్రక్కనే తోడుగా నీటి చుక్కకై మొగం వాచిన చెట్టూ! టాక్సీలు తిరుగుతున్నాయి ఎన్నికల్లో నాయకుల వలె ఎన్నికల్లో నిల్చిన ప్రజా ప్రతినిధులకు మల్లే బిచ్చగాండ్లు హోటల్ ముందు దారికడ్డంగా నిల్చున్నారు అన్ని వాయిద్యాలూ ఒక్కమారు యథేచ్ఛగా మ్రోగినట్లుంది అపుడపుడు మన శాసన సభలూ ఈ బజారుకేమీ తీసిపోవు ఎండ లక్షాధికారి మెడలో జరీ కండువా వలె ఉంది వ్యాపారి నడుస్తున్నాడు కిళ్లీ నమిలి నడిరోడ్పై ఒలికిస్తూ బొడ్లో దోపిన తాళం చెవుల గుత్తి క్రిందికి వ్రేలాడుతూంది ముందుకు జారిన బొర్రపై ఒక్కటి చరచాలనిపించింది ఎదురుగా వచ్చే ఏమీ తెలీని అమాయక కుర్ర కుంకకు! నదులూ మైదానాలపై నుండి వచ్చే గాలేనా? ಆ దీని సంగీతం చట్టుబండలు కాను, ఎడాపెడా వాయించేస్తూంది వచ్చేది ఒక్క నీలి మేఘాన్ని తరలించుకొని రాకూడదూ! ఆశకు అవసరం ముఖ్యం, ఔచితి లేదు, సమాప్తి అంతకన్నా లేదు ఒక గడప దాటి మరో గడపకూ ఒక చెట్టు నుండి మరో చెట్టుకీ ఉద్యోగం లేని విద్యావంతులవలె వేడి గాలులు తారాడుతున్నాయి ఒక బాధ నుండి మరో బాధలోకి ఒక గాధ నుండి మరో గాధలోకి కాలు గాలిన పిల్లుల వలె ఒక్కొక ముఖం ఒక్కొక సైన్బోర్డలా ఉంది. ఒక్కొక్క మస్తిష్కం ఒక్కో గది ఒక్కొక్క గుండె ఒక్కొక్క బల్్బ ఎవరినీ లెక్కచేయకుండా వీధిలో శబ్దం పైబడి చిరాకు పెడుతూంది వీధిలో గుడ్డ పరచుకొని కూచున్న బికారి దేశానికి ఎవరెంత విసరినా ఒక్కరోజు తృప్తిగా గడవదు. చూపుమేర ఊరుబయట ఎక్కడో ఒకచోట పచ్చదనం ఊరులో దీన్ని మ్రింగే వెచ్చ వెచ్చని కడుపులెన్నో! పేకాటలో తురుఫ్ ముక్కలవలె రాజకీయ చలన్మతులు! ఉపన్యాసాలు గలగలల వలె ఎండుటాకులు రాలుతున్నాయి నిన్న చూచిన ముఖాలే! నిన్న విన్న గొంతుకలే! వచ్చిపోయే వాళ్ళను వీధి కళ్ళప్పగించి చూస్తోంది బారులుగా గుదులుగా జనం చెలరేగిన బాలసముద్రం! మండుతూన్న శ్మశానంలో కోర్కెలు చివురించే దెన్నటికి? ఏడుస్తూన్న సమాధులపై నిశ్శబ్దం మాట్లాడే దెన్నటికి? ఎండ రెపరెపలాడుతోంది ఆకాశం శవం కన్నా భయంకరంగా ఉంది భయ సందేహాలు జ్వలిస్తూ సమయం దాహంతో పరుగుతీస్తూంది ప్రతిమలు వెలుగు కలలుకంటూ శాపగ్రస్తంగా పడి ఉన్నాయి ప్రమోషన్ గురించి ఆలోచిస్తూ మెట్ల ప్రక్కన నిల్చున్నాయి యంత్రాలు అదేపనిగా శ్రమశక్తిని శబ్దిస్తున్నాయి వీధి మూల గారడివాడు పిడికిలి విప్పి అరచేయి ఊది రూపాయి నోట్లు సృజించి డబ్బులడుక్కుంటున్నాడు. సామాజికులూ పాల్గొనే ఈ నాటకంలో నట ప్రేక్షకుల మధ్య ఏ భేదం లేదు. వ్యాపారంలో అంతరాత్మ ఎప్పుడో తాకట్టుపడింది మనస్సు కీలు బొమ్మ వలె ప్రవర్తిస్తూంది ఇనుప యంత్రం వలె తిరిగే జీవిత చక్రాల్ని చూచి వసంతం అడుగేసేందుకు వెనుకా ముందూ ఆలోచిస్తోంది. గగన ముఖంపై సెగ గడ్డవలె సూర్యుడు తెల్లదనం మాయమైంది పచ్చదనం వాడిపోయింది ఆకాశం నీలి అందం సరస్సులో కన్పిస్తూంది భూమిపై ఎర్రని ఉద్రేకం ఉరకలెత్తుతూంది- అగ్ని పర్వతం బ్రద్దలవనున్న క్షణం వలె వాతావరణం ఎంత తప్పుకున్నా మీద మీదకు కదలి వస్తోంది పోటీ పడుతూ సూటిగా ఈటెల వలె దూసుకపోయే మతిలో రాకెట్లతో, గతిలో బుల్లెట్లతో మనుషులు! నాలుక తడియారి మెలికలు తిరిగీ ఎర్రని ఎండలో ఇసుక దిబ్బపై పడిపోయే మనిషి చెవిలో గాలి బ్రతుకు పాట ఊది పోస్తూంది వేడిగా ఇపుడు నీరూ నీడ గురించి కల తప్ప ఏముంటుంది? గుడి ప్రక్కనే గుడిసెలో మడి లోకాని కావల తడి యారిన గొంతుకతో కథ ఆగిన బ్రతుకులో యౌవనం వేసిన మొగ్గ వడగాలికి కోత వడింది తనయ ముఖం తలపుతో తల్లిగుండె బీటలు వారింది మండి మండి అవని ఎర్రని వెలుగులతో బూది కుప్ప అవనుందా? తిరిగి సృజన మహిమ చూపనుందా? మంటలతో సుళ్ళు గొన్న వాతావరణంతో సమాజం కట్టతెగిన కోష్ణ సముద్రం వలె కదలుతూంది. III. పరివర్తనా ముఖం పగలంతా ఎండకొట్టి దుమ్ము చిమ్మి విసిగింది దిక్కుల చూర్లు పట్టుకొని వెలుగులు వ్రేలాడుతున్నాయి వాతావరణం స్తంభించింది, గాలి కావాలి గాలి వేగంగా రావాలి ప్రతి ఒకరూ కోరేది ఇదే జాలరి వల పన్నినట్లు నీడ క్రమ్ముకొస్తూంది ఇది సాయం సంధ్య, సమస్యలకు నిలయం, ప్రశ్నల తూణీరం సూర్యుని మృత్యువుతో చీకటి బ్రతకాలనుకుంటూంది. సటాచ్ఛటలు విదల్చి నిల్చిన సింహం వలె నున్న సంధ్య కాలుని వేటకు బలియై శవ రూపం పొందుతూంది పక్షి వాలుగా దిగుతూంది! చీకటి పల్చగా మొదలైంది ఒక సుదీర్ఘ విషాదమేదో కొండవలె నిల్చినట్లుంది ఏదో తెలీని ఆనందం బింబం వలె రానుందా? విషాద స్వరంతో సాయం సంధ్య ఒక్కమారు ఎరుపు నుండి నలుపులోకి దిగిపోతూంది గాలి సోమరి మబ్బులను జో కొడుతూంది స్థితి ఒక కొలిక్కి రావడానికి త్వరపడుతూంది పడమటి తలుపులు మూతపడీ అవని నడుము వాల్చే వేళ చుక్కల చిరు వెలుగుతో ఆశలు రెపరెపలాడుతున్నాయి వాగు పొంగువలె ఎగసే ఆత్మీయతతో ఆకాశం పండు వృద్ధు వలె ఉంది. గుండె లోతు నుండి వెలిగే వేదనతో భూమి కదలని గోవు వలె ఉంది. ఎక్కడో పూచిన పూల వాసన ఎదను విచలితం చేస్తూంది ప్రక్కనే ప్రవహించే వైతరణి దేహాన్ని గగుర్పొడిపిస్తూంది ఆ దూరాన గుట్టపై దేవుని చూడాలంటే ఎంత శ్రమ ఆ పైకి చేరుకోగనే అంత శ్రమ! ఏమయ్యేదో! గుండె నిండుగా ఊపిరి తీసుకునేది శరీరం చైతన్యంతో పరవళ్ళు తొక్కేది మంచు క్రమ్మిన గగనం వలె స్మృతులు నిండిన మనస్సుతో మేడలూ గుడిసెలూ దాటి దూరం వెళ్ళి నిల్చున్నా ప్రపంచం స్థాణువైందా? అనిపిస్తూంది, కాని కాదు. జడస్థితిలోనూ మంద్రంగా అంతశ్చలన ముంటుంది గుడిసెలతో ఊరు చివర పెరిగిన గడ్డం వలె ఉంది విద్యుత్తంత్రుల అవసరంతో చెట్లకు క్రాప్ చేసారు సూర్యుడస్తమించే దాకా ఓపిక లేని చీకట్లు దూకబోతున్నాయి. అనాధ శిశువుల వలె అక్కడక్కడా నీడలు పడిఉన్నాయి ప్రక్క చేనులోకి ఎలుకలు పరుగిడుతున్నాయి సందుల్లోకి చీమలు, బారులుగా వెళ్ళుతున్నాయి కంచె పక్కగా తొండలు దౌడుతీస్తున్నాయి పాము నెరియ లోనుండి తలెత్తి లోపలి కెళుతూంది. అలసి సొలసి లోలోపల మసలుతూ మరలుతున్నారు పొల్లాల్లో నుండీ కర్మాగారాల్లోనుండీ అర్థనగ్న శరీరులు. మానవత చోటు చేసుకొన్న వాలకంతో పైకి నవ్వుతూ అర్థవాద వికృత మతులు తరలుతున్నారు.- నెత్తిపై మోపులతో బరువుగా నడుస్తున్నారు స్త్రీలు చేతిలో ఒడిశెలతో ఇంటికి మరలుతున్నారు యువకులు దూరమైన వ్యక్తులు ఇంటి తలపులో నిమగ్నమైనారు ఇంతసేపు చిరుమబ్బును తలపించే ఫ్యాక్టరీ పొగ ఆగింది అవనిపై దూకడానికి చీకట్లు ముని వ్రేళ్ళపై ఉన్నాయి జగత్తును తమలో బంధించేవీ, తమ ఉనికిని గుర్తింపజేసేవీ దిక్కుల్లో నుండి నేరుగా కళ్ళ నాక్రమింప జూస్తున్నాయి ధూళి క్రమ్మిన అద్దంలో బింబం వలె ఉంది కాలం ఎంతలో వస్తుంది ఒక తరం పోయి మరో తరం! అంతలో వస్తుంది మార్పు జీవనగతి ఆలోచనలో రవి వృద్ధు వలె నిష్క్రమిస్తే శశి శిశువు వలె ఎగసేను ఒక సమయ సమాప్తితో మరో దశ ఆరంభమౌతుంది వెలుగు సుళ్ళుగా తిరిగీ చీకటి సంద్రంలో కలుస్తూంది జీవన సంరంభం నుండి పక్షులు స్వేచ్ఛను కోరుతున్నాయి జీవన వ్యాపృతి నుండి వ్యక్తులు విరామం కోరుతూన్నారు. శత్రువు నుండి బదులు లేని వీరుని వలె ఇంతవరకూ విజృంభించిన ఎండ అలసిపోయింది ఇంత సేపూ కాల్చుకతిన్న సూర్యుడు మెల్లగా కందగడ్డ ముఖంతో తప్పుకున్నాడు. ఎంత విషాదమీ సాయం సంధ్య? నీలి వాన కురవనుందా? ఇసుక దిబ్బపై నిల్చిన మనస్సు సరిస్తూంది నది వలె ఊహ విరిసి క్రమ్ముతూంది నీలి మబ్బు వలె పచ్చని పచ్చని బ్రతుకు బయలు చూచి ఎంత కాలమైంది? చల్ల చల్లని ఎదలో నీటి జాలు చూచి ఎంత కాలమైంది? అందని వెలుగు బంతిలా మానవత దొర్లుతూ పోయేనా? III . 2. సాయంకళలో అడుగులో అడుగేస్తూ నడచే దీనుల హృదయ శబ్దం మోసుకొనీ ఊగుతూ తూగుతూ కదలుతూ గాలి వచ్చిపోయే వారి చెవిలో బాధా రహస్యం ఊదుతూంది బడలికతో నిదుర కొదుగుతున్నాయి ప్రాణులు దుఃఖంలో ఆశ వలె ఉదయించింది చంద్రబింబం కుంటుపడిన కోర్కెల వలె చుక్కలు మొరాయిన్నాయి. చల్లారిన శిఖలతో రోజు బూది దిబ్బ వలె ఉంది అలసిన గుండె ఏ కప్పు క్రిందో విశ్రాంతి కోరుతూంది చిరుగు పట్టి మాసిన గుడ్డలతో బయటికి రా వెరచే వారి వలె నీలిదిశల మాటున మబ్బులు తారాడుతున్నాయి మనసు లో పొరల్లో దరిద్రుని ఈహల్ని తలపిస్తున్నాయి గతుకులు పడిన భూమిపై పశ్చిమ క్షితిజ దృశ్యం చరిత్రలో మిగిలిన శిథిల సౌధం వలె ఉంది సమాజ రథ చక్రార పంక్తి వదలని సంధ్యా జీవులతో కాలం చీకటిని ఎదిరించేందుకు సిద్దమౌతున్నట్లుంది. “సినిమాకు వెళ్ళదామా?” “ముందు టీ వనై టూ” “నీ మొగం సినిమా” ఇంకా ఫస్ట్కు పదిరోజులుంది "పార్్క లోని స్నేహితులు! అదె చెట్లు! మన కోసం నిరీక్షిస్తాయి” “పద”! అంటూనే నాలుగు అడుగులూ రోడ్ను క్రాస్ చేసి తీరిగ్గా పెద్ద హోటల్ ముందు నిలిచాయి. ఆమె నీటుగా ఎయిరోడ్రామ్లో దిగే విమానం వలె ఎదురైంది చందా పుస్తకం తీసేనని పరిచితులకు భయం వేసింది అంతటా కలయజూచింది సెంటర్లో వెలిగే గ్రీన్ ట్ ఇంతకూ ఆమె! ఎవరంటే సాంఘిక సేవా ఘన మతి. అంతా కాసేపటికి తేరుకొని ఎవరి పనిలో వారు పడ్డారు మనస్సు నిండిన చిత్రంతో నేను బరువుగా లేవక తప్పలేదు లోనికెళ్ళినవాళ్ళు బయటికి రావడానికెంతో సేపు పట్టదు ఆలస్యం చేస్తే వేటింగ్ క్యూ చేతిలో కప్ లాగేట్టున్నారు. కాలి క్రింద సిమెంట్ రోడ్ ఎంత దూరం సాగింది? నేటి సమాజమూ అంతే ఘన ప్రమాణమందుకుంది. అపుడే సన్యాసులు బిచ్చగాండ్లు ఇళ్ళ ముందు మూగారు పగలు కళ్ళు మూస్తున్నట్లుంది సాయం కళ్ళు తెరుస్తూన్నట్లుంది. కడుపులో శూన్యంగా నున్న ఆకాశం పీడకల కంటూంది దూరం నుండి చూస్తే దీపస్తంభం, నీడ ఉరి తీసిన మనిషివలె ఉంది ఉరీ! చావు! అమ్మయ్యో! ఆ మాటలంటేనే భయం!- III . 3. అపుడపుడూ నేనూ నా స్నేహితుడూ ఈ కాలిబాటనే ఒకరి చేయి ఒకరు పట్టుకొనీ వచ్చేవారం మునిమాపులో ఒకరి ప్రాణం ఒకరు ఆచి కొనీ సాగేవారం ఒక మూల విసరేసిన పెట్టెలో ఎలుకల వలె మైదానంలో నిలిపిన గుడారాల్లో దేశద్రిమ్మరులూ ఈ రోజు పడమటి దిశ అంతరించిన వెలుగు రేపు తూరుపు దిశ మొలకెత్తేనని ఆశ, రోజూ వచ్చేవే ఇరు సంధ్యలు! అయినా ఎంతో కొత్తగా కన్పిస్తాయి బ్రతుకు బరువు రంగులతో సరికొత్త రూపం ధరిస్తాయి! చెట్లపై నుండి వెన్నెల సందు చేసుకొని ప్రసరిస్తూంది ఆకుల చెక్కిళ్ళపై జారి నీలి ముసుగులోకి తొంగిచూస్తూంది చుట్టూ చీకటి గోడల వరస కన్పించీ కన్పించడం లేదు ఈ స్థితి గమనం తీరు ఊహ కందీ అందకుండా ఉంది రాత్రి గుట్టలపై నిలిచిన గుడిసెలు నీటి అలల మధ్య పడవల వలె ఉన్నాయి ఎప్పుడు అదృశ్యమై పోయేదీ తెలీదు! ఎప్పుడు బయట పడేదీ తేలీదు! అశాంతిలో మౌనంగా మనిషి విడిచే విశ్వాసాల్లో అనలం విప్లవ భవమై ఊపిరి తీసుకుంటూంది మరోవైపు నుండి భూమి రేణువుల్లో గాలి తరగల్లో సమీచీన సంస్కార గంధం మనస్సును శాంతపరుస్తూంది కూడకముందే మబ్బుల్ని గాలి చెదర గొట్టజూస్తూంది. తృష్ణార్తయైన భూమి బీటలువారి చెక్కలైంది ఎక్కడో దూరాన కెరటా లెగసే సముద్రం! ఇక్కడో కాలి క్రింద ఎండిన గొంతుతో జనావని మబ్బు మాటలతో ఊహలతో ఇసుక తిన్నెపై చేరాం అయ్యో! నీటికా? నూనెకా? అంటే రెండూ అవసరమే నీరు ప్రాణం నిల్వడానికీ నూనె సంస్కారం పెంచడానికీ ముందు నీరు బ్రతుక్కి ప్రాణం! ఆపైన అవసరం సంస్కారం. ఇక్కడ నీటికై నూనెకై అన్వేషణ సంఘర్షణ నిరంతరం మబ్బులు చీల్చుకొనీ మెరపుతో వాన తప్పకుండా వస్తుంది ఉదయంపై ఆశ కొన ఊపిరిలోనూ రెపరెపలాడుతుంది భిన్న శక్తుల సంచలన సమాకలనంతో జరుగుతూంది పురోగమనం. చేతిలో మాయ లాంతరుతో వచ్చింది రాత్రి సర్వం తనలో లీనం చేసుకో జూస్తూంది IV. వెలుగు నీడలో చీకట్లో స్వతంత్రంగా మనేందుకు చుక్కలు ప్రయత్నిస్తున్నాయి చలి గాలిలో వత్తివలె కాలం వెలుగుతోంది బరువుగా బిచ్చగాని వేషంలో ఉన్న ఈ సమయం చేతిలో ఒక్కపైసా విదలించే చేయి కన్పించడం లేదు అలసిన శరీరాలతో సోలుతూ గూటికి చేరలేని పక్షులు ఏ చెట్టునో ఆశ్రయం పొందుతున్నాయి ఏ పంచన చేరి గడపజూస్తున్నాయి చలి గాలికి తాళలేక సూర్యాగ్నిని తలచుకుంటూ తమలో వెచ్చదనాన్ని హెచ్చవేసుకుంటున్నాయి నిశ్శబ్దం గుండెలో కత్తులు దూసినట్లరుస్తున్నాయి చీకటి సునాయాసంగా ఊపిరి తీసుకుంటూంది ప్రపంచానికి కాగే స్థితి లేదు, మనస్సుకు నిలిచే ఓపిక లేదు కష్టమూ సుఖమూ ఆగిపోదు, దుఃఖమూ ఆనందమూ నిల్చిపోదు నిద్రకు చోటు వెతుక్కుంటూ దొరికే ఆశతో నీడతో మిత్రునితో ఇంకా వేచి ఉన్నా. తండ్రి మెడ చుట్టుకొని వ్రేలాడే శిశువు వలె చంద్రరేఖ తల్లి కొంగు పట్టుకొని తిరిగే శిశువుల వలె చుక్కలు. ఈ రాత్రి తలుపుకు వేసిన తాళం చెవి ఎక్కడుందో తెలీదు ఎందరో తలుపు బయటనే ముంగిట్లో నిలిచి పోయారు. చంద్రుడు లేని రాత్రి వలె జీవితం మబ్బులో మెరపు వంటి తెలివితో మంచు శాలువా కప్పుకొని ఈజీచైర్లో పడుకున్న రీతి ఉంది సమాజ మానసం- ఎనెస్తీషియాలో ఆపరేషన్ వలె నిశ్శబ్దంలో గతిరేఖలతో అక్కడక్కడా సమయం సవ్యాజంగానే ఉంది ఎదపై అడుగుతీసి అడుగు వేసే శిశువు వలె నిశ్చితంగానూ సుకుమారంగానూ గడుస్తుంది కాలం అగాధమైన సముద్రంలో భయరహిత ప్రాణుల వలె చెట్ల కొమ్మల్లో పక్షులు ముడుచుకొని పడుకున్నాయి సృష్టిలో విషమ స్థితుల్ని మరపించే నిద్రాలోకంలో మనోనేత్రం సుందర స్వప్నాల్ని కంటున్నట్లుంది. చీకటి మరుభూమిలో ఒకే ఒక గగన వృక్షం క్రింద కూర్చొని కథలు చెప్పుకునే పిల్లల వలె చుక్కలూ మేడ గోడల ప్రక్కనే నీడలు చుట్టచుట్టుకొని పరున్నాయి బీద బిక్కు ఉన్నచోటునే కలలు పోగుచేసుకుంటున్నారు శిథిల నిర్మాణాల్ని పట్టుకొని వ్రేలాడుతున్నాయి గబ్బిలాలు విశేషం లేని బ్రతుకులు సశేషంగా ఆకర్షిస్తున్నాయి బలహీనులు లోలోన కుమిలి ఏడుస్తున్నారు మంచి వాళ్ళ మనుకునే వాళ్ళు హాయిగా నిదురిస్తున్నారు పిచ్చి వాళ్ళు నిద్ర పట్టక అరుస్తూ వీధుల్లో తిరుగుతున్నారు నిదుర పోవడానికి చోటు దొరకని వారుండనే ఉన్నారు. బలరహితుల ఆశ్రయానికీ బలసహితుల సాహసానికీ వీలైన ఈ సమయం ఒకరి గురించి మరొకరు ఆలోచిస్తున్నారు ఏదో కదలిక! అంతలో నిశ్శబ్దం ఇంతలో ధ్వని! నిదుర నిలుస్తుందా? మెలకువ ఆగుతుందా? నిరాశ పరచుకున్న ఎడారిలో ఆనంద ప్రవాహమూహిస్తూ శాంతి చెరగిన రాత్రులు వెలుగు పావురాల్ని తలుస్తూ మేల్కొన్న మనిషి గమనం ఇంకా మొదలు కాలేదు. వెండి తెర మెదలుతూంది మనస్సులో నీడ కల కదలుతూంది దానిపై వెండి తెరపై కాలం బింబిస్తోందా? నీడ బొమ్మలతో సమాజం రహిస్తుందా? IV. 2. అర్థరాత్రి మేల్కొనే అర్థరాత్రి ఆవులిస్తోంది వదలని సమస్యల్లో మేల్కొనీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉన్నట్లుంది వాతావరణం అంబేదగా తయారైనట్లుంది సద్దుమణగినా ఎక్కడి నుండో సవ్వడి వినిపిస్తూనే ఉంది అడ్రస్ పారేసుకొని ఎవరి కోసమో వెదుకుతూ ఒంటరిగా మింటిలో నడిచే దెవరది? ముఖంపై జుట్టును పైకి దువ్వుతూ నిల్చేరు? చీకటి గోడపై పచార్లు చేసే దెవరవది? నగరానికి వచ్చిన కొత్త మనిషా? రాజకీయ ఖైదీయా? జైల్ సెంటీయా? బయట పడిన మనో బింబమా? వీధి దీపాలు కునికి పాట్లు పడుతున్నాయి గాలి ఏదో చెప్పబోతోంది కాని పెగలడం లేదు నిదుర తెర ఉండి ఉండి జారుతూంది దీపాల్లో మెరసే రంగులతో రాత్రి స్వప్న కాసారం వలె ఉంది బంధింపబడిన మనిషి నేరం గురించి యోచిస్తున్నట్లుంది మహా వృద్ధు ఆరాటంతో తడుముతూ అడుగు వేస్తున్నట్లుంది. ఈ సమయం వెలుగు దాచి చీకట్లును పంచుతూంది ఎక్కడో మేల్కొన్న అలికిడి వినిపిస్తూంది సమయం గళంలో స్వరాన్ని సరి చేసుకుంటున్నట్లుంది రాత్రి నిదుర లోతుల్లో చీకటి పారుతూనే ఉంది వెలుగు అంచులు కన్పించీ కన్పించకుండా ఉన్నాయి దోమల సంగీత ధునికి కళ్ళు తెరపిడి పడని మెలకువ! నిద్రా శిథిలాల్లో హఠాత్తుగా ఉలికిపాట్లు కలవరింతలూ! ఎక్కడెక్కడో ఎత్తిన చేతులు! ఐదు మొనల బాకులు! ధ్వని! అంతలో నిశ్శబ్దం! గడియారం సవ్వడీ! గుండెలయ! వీటి మధ్య నుండి నిశ్శబ్దం సుకుమారంగా కదులుతూంది శబ్దం మధ్య మధ్య నిశ్శబ్దాన్ని పదును పెడుతూంది ఆకాశం ముఖం చాటుచేసుకొని కన్పించడం లేదు నెత్తురు చిమ్మే వెలుగు గాయాలు! అడవిలో కొరవి దయ్యాలు- నిశా ముఖాన నెత్రుగీతలు స్పష్టంగా చిత్రాకృతి వహిస్తున్నాయి మనస్సుకు చీకటి ఎక్కడలేని పని కల్పిస్తూంది యుగాలుగా నిశ్చలంగా ఒకే చోట పడి ఉన్నాయి గుట్టలు యుగాలుగా ఉత్సాహంతో ప్రవహిస్తున్నాయి నదీ నదాలు భూమిపై స్వర్గాన్ని ఊహిస్తూ నారక మతితో మనుషులూ దారి ప్రక్కన ఆకర్షిస్తూ పేర్లు చెక్కిన కీర్తిశిలలూ, స్తంభాలూ, సముద్రుడు చేతులు చాచి ఎన్ని యుగాల నుండో భూమిని తనలో కలుపుకో జూస్తున్నాడు. జగత్తు నిద్రాముద్రితమై కల్లోల స్థితి ఆగినట్లుంది అలజడి చెందిన మతులకు నిద్ర ఒక విశ్రాంతి పదం విషాదంలో ఆలోచన కలిసి అందంగా ఉందీ సమయం కిటికీ నుండి చూస్తే కన్పించే ఏకాకృతి! చీకటి కాదు కాదు దూరం నుండి రానున్న వెలుగు నీడ కావచ్చు మనస్సు చెదరిన స్థితిలో భ్రాంతి రూపం ఔనేమో! భగవంతు డెక్కడున్నాడు? ఇది ఆతని నీడేమో? గతమూ భవిష్యత్తూ తెరచిన వర్తమానం కళ్ళు నా కళ్ళ ముందు సమాజం, కళ్ళ వెనక అతీతం. ప్రపంచ నాటకరంగంపై పాత్రలు మనుషులు ; ఉండి ఉండి పూవులా పక్షులా అగ్నులా అనిపిస్తుందొకొక్కప్పుడు. అణువణువూ చైతన్యంతో కొత్తరూపం వహిస్తూ క్షణక్షణం మనస్సులో కొత్త ఊహలు ధరిస్తూ గ్రహాల పరిచయంతో దేవతల కల్పనతో చీకటిలో వెలుగై పురోగమించేను మనిషి! నదీ ప్రాంతాల్లో నుండి గాలులు ప్రియోక్తులూ ఎడారి ప్రదేశాల్లో నుండి గాలుల ప్రార్థనలూ పచ్చిక మైదానాల్లో నుండి గాలుల దీవెనలూ ఒకదాని తరువాత మరొకటి మొదలైంది భగవంతుడు ప్రసాదించిన వరం! ఎంత కోమలంగా ఉంది ఇంతకు ముందు వరకు కఠోరంగా ఉంది అంతలో మారింది నెత్తురు గడ్డకట్టి నరాలు స్తంభించినట్లు శాపగ్రస్తమై పడి ఉన్న ఈ చీకటి శిథిల ప్రపంచంపై చైతన్యం వెలుగు రవ్వలు రాల్చేనా? పుష్పించేనా? నిద్ర ఎరగని గాలి సమాజంలో జీవరహస్యమూదుతూంది. కాలం నీలి మబ్బు రెక్కలు విప్పింది పెంకె ఘటం గ్రీష్మం వెనక్కు తగ్గింది V. మబ్బు రెక్కల క్రింద అంతగా చూపిన ప్రతాప చిహ్నాల్లో ఏ ఒకటీ నిల్వ లేదు నేలను మండిస్తూ నింగిని మెరపిస్తూ జలధిలో పొగలు రేపే గ్రీష్మం చివరకు చెమటలు పట్టి బేజారైంది ప్రాణి కోటి కాహ్లాదంగా ఆకాశం క్రిందికి దిగినట్లుంది క్షుధార్తుల పక్షాంచలాలు స్పృశిస్తూ వ్యథార్తుల ఆశాంచలాలు తడుపుతూ అరమూత కాటుక కళ్ళలో మేల్కొన్న మెరుపు తీగెల సౌరుతో వచ్చింది మెరపు మెరసీ, గాలి వీచీ, కిటికీ తలుపులూగిసలాడాయి శిఖలు చేతులు ముడుచుకున్నాయి, మొగ్గలు ముఖాలు విచ్చుకున్నాయి మాయలేడి వలె చీకటి రైలు పరుగిడుతోంది ఇక వెలుగు రైలు రావడానికెంతో సమయం లేదు మేఘాలు బంధువుల వలె వరసగా వచ్చి చేరుతున్నాయి బిగబట్టిన ఆశల పెదవులు సడలుతూన్నాయి దాగిన రహస్యంతో పైకి రానున్న మహా పద్మం వలె ఉంది గగనం. దిక్కుల చెక్కిళ్ళు నిమురుతూ, మెరపు చూపులు చికిలి పెడుతూ మత్తిల్లిన ఘన శరీరాల్ని చురుగ్గా పదును పెడుతూ కదలే గాలి ఎదపై కాలం నిశ్చింతగా వాలినట్లుంది. నిదురకూ మెలకువకూ మధ్య సరించే చేతనా తరంగాలతో పవన శక్తి కదులుతోంది దిశ నుండి దిశ దాకా నింగి తంబురా వలె మ్రోగుతోంది. మబ్బు క్రమ్మి గొడ్డలి విసరినట్లు మెరుపు మెరసింది శక్తి ఉద్భవించింది, క్షణం కాంతి ప్రసరించింది రూపం మారింది, మరో రూపమవతరిస్తోంది.స్వేచ్ఛాకవిత్వం I - మాదిరాజు రంగారావు పాలిపోయిన భూమి రాగ సుందరమౌతూంది ఆశల్లో ఇంద్రధనుస్సు ఇంకా గుప్తంగానే ఉంది భూమిలో సుఖజీవనంకై మనిషి తాపత్రయం మనిషి కోరేదీ అంతరాయ మెరుగని సంతోషం ఇది దొరకదు సంపూర్ణంగా, దొరికినదానితోనే తృప్తి పడాలి ఆందోళన చెందే ఈహలు, పసిపాపల వలె విశ్రమించాయి మనసులో ఊహలో పెదవిపై శబ్దంతో నింగి నుండి వర్షంతో అవనిపై సృజనతో అలల వరుసవలె అనుభూతులు కదిలేను జ్ఞానంతో మనస్సు వలె మెరుపుతో మేఘం విలసిస్తూంది ఉల్లోల జల తరంగ రావంతో అవని ఆకాశాన్ని కీర్తిస్తోంది శబ్దానికంతం లేదు! శబ్దం లేని క్షణం లేదు! అగ్ని ఋతు నిష్క్రమణంతో ప్రకృతి శోభా హరితమైంది మృత్సా గంథంతో కృత్నమైన అమృతానుభూతి వశమైంది గాలి చెంగలిస్తూంది లేడి వలె, మాట ఎగురుతూంది పక్షి వలె! మబ్బులో మెరుపు వలె ఉదయ స్ఫూర్తి! మరో రోజు మొదలు! ఇంకా మనిషి నిదురలోనో కలలోనే ఉన్నట్లుంది. చీకటి తెర తొలగుతూంది, బూది రంగు మారుతోంది మానసికానుభవ దృశ్యం ఫిల్్మ వలె కదలుతూంది నీల గగన మైదానంలో పోరాడే శశి శిశువు అలసిపోయాడు నిశా శిలా సంధుల్లో నుండి దిక్కులు చివుళ్ళు తొడుగుతున్నాయి సగం నిదురు సగం మెలకువతో ప్రపంచం నలుపు తెలుపు రంగులతో కొత్త చిత్రమేర్పడుతూంది మాటలతో నవ్వులతో పాటలతో కేరింతలతో వెలుగు మలుపు తీసుకుంటూందీ సమయం నిశ్శబ్దాన్ని ఛేదించే శబ్దాన్ని ఒడిసి పట్టుకుంది కాలం, నిన్న నేడు రేపు మొదలుగా కాలం వేసే అడుగులు ప్రవాహం నీటిలో సుడులతో తొలగిపోయే అలలు! ప్రయాణంలో ఈ రోజు జారిపోయి నిన్న అవుతూంది ఎదలో స్మృతులు భయం వదలి హ్లాదమయమౌతున్నాయి కొండపై అగ్ని జ్వాలా భ్రాంతి! పక్షులూ ఇంకా కలగంటున్నారా! నిదుర చాలించండి ప్రియమిత్రులూ! ఉదయం పడగెత్తుతూంది VI. హంస వలె నేను చెదురు చెదురుగా అక్కడక్కడా నిలిచిన మంచును గాలులు దూర దూరంగా జరుపుతూ పోతున్నాయి రాత్రి వెలిగిన భయం ఇంకానా? ఎపుడో ఆరిపోయింది మంచు గుండెల్లో అగ్ని రగిలింది పక్షులూ ఎగరండి గగన సముద్రం తిలకిస్తారా? అదెంత పని మీకు అవనిపై దృశ్యాలు చూస్తారా? మీకిదో పని కాదు. ముళ్ళ నుండి గులాబి వలె దిక్కుల్లో నుండి వస్తూంది ఉదయం ఎదపై ముత్యాల దండ వలె మంచు బిందువులు నిల్చేను తల్లి కొంగుచాటున పిల్లలవలె తొంగి చూచేను వెలుగుల వెలుగు ಜಿಲ್ಲ విరిసింది! ఉషస్సు శుచియై నిలిచింది. గంధం తెర వ్రేలి వచ్చింది! మనస్సు కొంత ఊర్పు తీసుకుంది ప్రపంచం విషాదం నుండి తేరుకుంది, ఆనందం ముఖంలో వెల్లివిరిసింది ప్రతి మనిషీ ప్రయాణం సాగించాలిసిందే ఎవరి కిష్టమున్నా లేకపోయినా ప్రపంచంలో. రేణువుల సందుల్లో ఉందీ పిడికిలి సందుల్లో ఉందీ ఆకాశమే దిక్కుల మధ్య నుందీ ప్రపంచమే! ఎక్కడైనా బ్రతుకు బ్రతుకే జగత్తును వెలుగు క్రమ్ముతూంది! మనస్సును వివేకం క్రమ్మాలి ప్రతి రోజూ వచ్చే రోజుకు మొదటిదీ, పోయిన రోజుకు చివరిదీ విప్పారిన రెక్కలతో నిటారుగా నిల్చిన శరీరాలతో ప్రపంచంలోకి ప్రవేశించే ముందు ఒక మాట కాలాన్ని కప్పుకొని నిద్రించకండి, మనస్సులో నీడల్ని వెలిగించండి. ఈ చెట్టు అగ్నికి దగ్ధమవుతుందని భయపడ నక్కరలేదు ఈ చెట్టు నీటిలో కొట్టుకపోతుందని దిగులు పడ నక్కరలేదు ఇది అగ్ని కాదు, ముంపు కాదు! వెలుగు! వెలుగు! జీవన సంకేతం! చీకటి రాకతో ఒకటైన నీడలు క్రీనీడలు వెలుగు రాకతో ఎక్కడి వక్కడ విడిపోయాయి వెలుగు నింగి నుండి దిగిన హంస వలె ఉంది, సమాజ సరస్సులో మానవీయ పద్మం వలె సూర్యుడు సృష్టికి ఆశా పతాక! మనిషిలో మానవతకు ప్రతీక!- నిన్నటి రాత్రి గతానికి దగ్గరి బంధువు VII. మరో ఉదయం నేటి ఉదయ సంధ్య వర్తమానానికి పరమ మిత్రం ఎందరో ప్రేమించిన చంద్రుడు చూపు నుండి తొలగాడు జీవన రుచితో ప్రజతో పయనం తప్పదు మృగమూ మొక్కా పక్షి జంతువూ కాదనీ తాము మనుషులమనీ అందరికీ బాగా తెలుసు అయినా అపుడపుడూ మరచిపోవడం కద్దు అపుడపుడూ ఇక్కడ నదులే ఎండిపోతాయి అపుడపుడూ ఇక్కడ పచ్చదనం లోపిస్తుంది. రాతి యుగం నుండి స్పుట్నిక్ యుగం వరకూ అరణ్యం పల్లె పట్టణం జీవిత సంస్కృతి చరణాలతో నిద్ర కల మెలకువతో బ్రతుకు దారి మలుపులతో ప్రయాణం సాగుతుంది గతాన్ని భద్రపరచుకొనీ ఈ గుట్టల్లో చెట్లల్లో ఎవరా సంచరించే మూర్తి ఈ నీడల్లో మబ్బుల్లో ఎవరా పలకరించే రూపం ఈ చీకటి కోటపై నుండి ఎవరా లంఘించే బింబం పడగెత్తిన ఉదయం మానవ నవోన్మేష హృదయం VII. 1. చైతన్యంతో ఒకటై నిశ్శబ్ద యంత్రం నుండి ధ్వని వెడలుతూంది జనం కదులుతున్నారు మెలకువను ఋజువు చేస్తూ నిదురపోయిన కొందరికన్నా శిలలే నయమనిపిస్తూన్నాయి వేదనతో గుండె నిలిచి ఉద్రేకంతో నరాలు బిగిసి సంక్షోభం పొందే సమయం ఉదయం మొగ్గవేసింది దారిలో గాజు ముక్కలు కొనదేరి మెరుస్తున్నాయి అనుభవాలు జ్వలిస్తున్నాయి భూతాలు పొంచి ఉన్నాయి లోకం ఏడ్చినా చేతగాని విధంగా సమాజం బ్రతకలేక చావదు జడత్వం క్రమ్మిన బ్రతుకుతో కిటికీ తలుపులు మూసుకొని ఇంకా లోపలే ఉన్నవాళ్ళు! ఈ సమయం బయటికి రావాలి. వివేక విలసనంతో క్రియా శక్తితో మనో లోక దీప్తితో ఎవరు కాదన్నా మెలకువ పైబడి తరుముకొనే వస్తుంది దారిలో నిలబడి దెయ్యాలు మంచి చేసుకో జూస్తాయి భౌతిక సత్యంతో, చారిత్రకావసరంతో నేటిని గుర్తించి చెదరిన జనశక్తులు సంఘటితమై ఒక్కటై వెలగాలి చైతన్యంతో నిరాశతో భయపడి పరుగెత్తక కాలాన్ని మేల్కొల్పాలి! ఎడారి దాహం తీరితే చాలదు! సస్యశ్యామలం అవాలి. ఉదయ హర్షంతో పసికందు నరాల్లో నెత్తురు వలె అవనిపై చైతన్యం జాలువారుతూంది తెల్లని పావురాళ్ళు తీర్చిన మనః పరిషత్తుతో సమాజమా! నీ గురించే ఆలోచన జరుగుతూంది ఈ కృతి భూమికలో నీ గురించి ఉద్దేశించి ఈ సమయం నా గురించి మాట్లాడక తప్పడం లేదు. VII. 2. గుడ్ బై చావు ఘడియ సమీపించి వాలిన ముఖంతో చంద్రుడు నిష్క్రమించిన ఆ రాత్రి మళ్లీ మళ్లీ వస్తుంది జీవన రాగంతో నృత్యం చేసే ఉదయమూ వస్తుంది అయితే ఈ రోజు! ఏ రోజుకూ డిటో కాకూడదు మంచులో ఆర్ద్రత, నీటిలో ప్రేమ, గాలిలో మానవత అద్దుకొని వచ్చే ఉదయం స్వేచ్ఛాశక్తిని నింపుతూంది చారిత్రక యధార్థ్యంతో వైయక్తిక చైతన్యం సమాజాభ్యుదయానికి మొట్టమొదటి ఆశా రూపం పూలలో మధు ధారవలె నరాల్లో శక్తితో వచ్చే ఉదయమెపుడూ క్రొత్తే! హృదయమెపుడూ సజీవమే. గడచిన రాత్రి కార్నివాల్లో చూచిన ముఖాలు పేరు కింకా బ్రతికే ఉన్నాయి అక్కడక్కడా! ఈ పొద్దు మూల మూలల నక్కి నక్కి చీకటి వాగులు ప్రమాదగీతాలు పాడుతూ వచ్చిపోతూనే ఉన్నాయి ఓ మైత్రీరమ్యుల్లారా! మీరే చెట్టెక్కి కూర్చున్నా ఈ గడసరి ఉదయ ముఖం మిమ్మల్ని ఇట్టే పట్టేస్తుంది- మీ ముఖాలు పరిచయమే! మీ చర్యలు అవగతమే పూవులో వెచ్చని రసధునితో ఇంద్రధనువు మనస్సుతో ఉషస్సు వంటి ఊహతో మేల్కొన్న మనిషీ పరిచయమే సిద్ధాంతం అవసరమే! చర్చల సుడిగుండంలో తలదూర్చే మనిషీ కవీ ఎక్కడ తేలేదీ తెలీదు. ఎత్తూ లోతూ గల అనుభవం హేతు దృష్టికందదు నమూనాలో జీవిత గతి నిర్దేశించడం కుదరదు ప్రతి వస్తువునీ చీకటి వేరు చేస్తే ప్రతి మనస్సునీ వెలుగు కలిపేస్తుంది గడ్డి పోచకై అర్రులు చాచే ప్రాణి కోటితో పాటు చల్లని గాలికీ హ్లాదపడే హృదయ లోకమూ ఉంది అంతటా నిశ్శబ్దం! ఎక్కడుంది? నిద్రలోనూ లేదు.