Idi Vietnam (ఇది వియత్నాం) Collection 4 of Volume I — Swecchaa Kavitvamu by Prof. Madiraju Ranga Rao. Year: 1974. Language: Telugu. Canonical HTML: https://madirajurangarao.com/poetry/volume-i/text/idi-vietnam --- సంస్కృతినీ శిల్పాన్నీ భుజాలపై ఎత్తుకొని నిలిచింది ఆర్ద్రతనూ మానవతనూ వదలేనా? ప్రయాణం మధ్యలో. కరాళ రూపం ధరించి సమయం కొడిగట్టింది. పారిపోయిన భవిష్యత్తు ఫాలభాగం చేరాలిసి ఉంది ఆగిపోయిన వర్తమానం అరచేతిలో కదలాలిసి ఉంది ప్రజాస్వామ్య చరణం సుగమంగా ముందుకు సాగాల్సి ఉంది. స్వేచ్ఛా నవం 4. ఇది వియత్నాం కావ్యం (1974) 1) విప్లవ చ్చాయలో 2) శాంతి వెలుగులో మాదిరాజు రంగారావు అంకితం అగ్ని సరస్సులో వికసించిన విప్లవ వజ్రం మహాకవి శ్రీశ్రీకి ఇది వియత్నాం విప్లవచ్చాయల్లో /శాంతి వెలుగులో ప్రజాస్వామ్య దృక్పథానికీ, మానవతా స్పందనకూ భిన్నంగా రాజకీయ కారణాలతో ఒత్తిడులతో ఒక దేశంలో సుస్థితిని భగ్నం చేసే తత్యానికీ, చివరకు అపజయాన్ని పొందే చర్యలకూ ప్రతిరూపం ఇది వియత్నాం. ఒక జాతిలో పుంజీభవించిన పోరాట పటిమతోపాటు సంకల్పశక్తినీ ప్రకటిస్తూంది. వస్తువు అంతర్జాతీయ ప్రాముఖ్యం కలిగింది. ప్రపంచంలో రాజకీయ దృక్పథాలకతీతంగా ప్రతి హృదయాన్ని కదలించింది వియత్నాం యుద్ధం. స్వేచ్ఛను కోరే, స్వాతంత్ర్యాన్ని కాపాడుకునే ప్రతి దేశంలోని పౌరునికీ ఉత్సాహశక్తినిచ్చింది. అమెరికా ప్రభుత్వ నియంతృత్వ వైఖరీ, అప్రజాస్వామ్య చర్యల్లో అమానుషత్వమూ ప్రపంచ దృష్టికి వచ్చింది. అమెరికన్ సైనికులు కమ్యూనిజాన్ని అరికట్టే నెపంతో శాంతి రక్షణ పేరుతో వియత్నాం నేలపై దిగడంతో ఆరంభమైందీ కావ్యం. అయితే కాలం గడిచేకొద్దీ ఓటమిని చవిచూచింది. ఆయుధ శక్తితోను విఫలమై శాంతిపై రక్తిని ప్రదర్శించిన అమెరికా ప్రభుత్వం సైనికుల్ని ఉపసంహరించుకొంది. ఇది వియత్నాం ప్రజల వీరోచిత విజయగాధతో ముగిసింది. అమెరికా సైనికుల ప్రవేశం నుండి నిష్క్రమణం వరకు జరిగిన గాధా రూపమే “ఇది వియత్నాం” కావ్యం. “ఆయుధాలు ప్రేలేను అహంకార గర్జాధ్వనితో, ఇది శాంతి సేవలో భాగమనీ ప్రచరించేరు” శాంతి సేవ పేరిట ఆయుధాన్ని చేపట్టే రాజకీయ చతురతలో బలప్రయోగ వైఖరి చిత్రితమైంది. మనుషుల్ని "మొక్కలుగానో రాళ్ళుగానో” తలచే మనస్తత్వంతో ప్రవర్తించే అమెరికన్ సైనికుల దుశ్చర్యలూ అశాంతి వాతావరణం మనముందు సాక్షాత్కరిస్తుంది. ఈ దుస్థితుల చిత్రణం పత్రికల్లో వచ్చిన వార్తలు ఆధారంగా రూపొందింది. వియత్నాం ప్రజలు అగ్రరాజ్య బలప్రదర్శనను లెక్కచేయకుండా సలిపిన వీరోచిత పోరాటం కళ్ళముందు సాక్షాత్కరిస్తుంది. నిద్ర “ఎరగని విశయై”, “శాంతి ఎరగని జ్వాలయై”, “వీర గాథా బింబమై” జన చేతన విజృంభించింది. చెట్లపైనుండి పొదల చాటునుండి రాళ్ళు గుట్టల వెనుకనుండి గొరిల్లా విధం పోరాటం ప్రబలింది. అడవిలో కదలే కారు దారిమధ్యన నిలిచిపోయింది. ఇదో వైట్ ఎలిఫెంట్. వర్ణనలో అమెరికా ప్రస్తుత స్వరూపం వాస్తవ స్థితికనుగుణంగా భావరూపాన్ని పొందింది. ఉత్తర వియత్నాంలో స్థితి రణ రూపాన్ని పొందింది. అంతటా కాల్పులతో, బాంబులతో అనలధూమం కమ్ముకొంది. దీని వెనకనుండి వియత్నాం ప్రజల ప్రతిక్రియ శబ్దిస్తూంది.స్వేచ్ఛాకవిత్వం I - మాదిరాజు రంగారావు ఈ విషాద వాతావరణంలో “మైలై” ఒక దుఃఖావిల కరుణాత్మక ఖండం, ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. మైలై, వియత్నాంలో ఒక ఊరు. అగ్నికీలల్లో మండి మండి శ్మశానశకలమయింది. ఇది “నాగరక చరిత్రలో అమావాస్య రాత్రి”గా వర్ణితమైంది. ఇక్కడ అమెరికన్ సైనికులచే విషవాయు ప్రయోగం జరిగింది. నీతిలేని రాజకీయం, మానవత లోపించిన ప్రవర్తన వియత్నాం ప్రజల్ని అనేక బాధలకు గురిచేసాయి. ఇది సామ్రాజ్యవాదాన్ని తలపించే అహంకార బీజం నుండి మొలకెత్తిన నిరంకుశ పరిణామ రూపం. ప్రపంచాన్ని కదలించింది. హృదయమున్న ప్రతి వ్యక్తిని చకితం చేసింది. ప్రజల స్వేచ్ఛనూ స్వాతంత్ర్యాన్నీ భగ్నం చేసే అమెరికన్ ఆయుధ బలాన్ని ఎదుర్కొనే వియత్నాం వజ్ర సంకల్పం సూచితమయింది. తమ శత్రువైన అగ్రరాజ్యాన్ని “మంచుబొమ్మ” గానే వియత్నాం భావించింది, ఎదుర్కొంది, సంఘర్షించింది. "నీ వెనుక నీడలమై అగ్నులమై వెలుస్తాం”, “నీ కాలి కింద కత్తులమై మెరుస్తాం" అన్న మాటల్లో నిశ్చలమైన ఆత్మవిశ్వాసం, నిర్దిష్టమైన కార్య ప్రయోజనం స్పష్టం. వేదనాతంత్రులతో క్రందించే వీర వియత్నాం, ఉత్సాహ శక్తిని బింబిస్తూందీ పోరాట భాగం. ఈ యుద్ధంలో అమెరికా ప్రభుత్వం నెపాల్్మ బాంబుల్ని ప్రయోగించింది. విషవాయువుల్ని ప్రసరింపజేసింది. తన విజయానికై ప్రజల విలయానికి దారితీసే విధ్వంసకరమైన చర్యలు మెట్లుగా అమర్చడం రాజనీతిలో భాగమైంది. పెద్ద దేశం అమెరికా ఒక చిన్నిదేశం నుండి వచ్చే తీవ్రమైన ప్రతిఘటననెదుర్కోలేక పోయింది. కాలం గడిచేకొద్దీ అపజయం రుచి చూడాలలిసి వచ్చింది. గౌరవంగా బయటపడలేక పోయింది. “రోట్లో తలదూర్చాక ఎంత పెద్ద తల అయితేనేం?” అన్న మాటల్లో అమెరికా జోక్యం ఎంత అనుచితమో, అసందర్భమో, ఎటువంటి అశాంతికి దారితీసేదో సూచితం. ప్రజాస్వామ్యేతర చర్యల్లో ఆర్ద్రత అదృశ్యమైంది. మానవత లోపించింది. కఠోరమైన పరిస్థితుల్లో ప్రజలు విజృంభించడం జరిగింది. విజయాన్ని పొందడమూ ప్రపంచాన్ని ఆకర్షించింది, అమెరికాను ఆశ్చర్యపరచింది. వియత్నాంలో తలదూర్చిన అమెరికా ప్రభుత్వం మెల్లగా తప్పుకునే ప్రయత్నం చేసింది. ఎట్టకేలకు శాంతి వాలింది. ఇది ఎగిరిపోకుండా శాంతి ప్రియుల ప్రయత్నమూ అవసరమైంది. దీనికై "ఎంత ఎత్తు కట్టేరో గోడలు! ఎంత ఎత్తు పెంచేరో మనస్సు” అన్న మాటల్లో భౌతికమైన కృషికన్నా మానసికంగా నిజమైన మానవతా పూర్ణమైన ప్రజాస్వామ్య వాతావరణం నెలక్పొడం ముఖ్యమన్న సూచన ఉంది. చివరకేర్పడిన శాంతి ఘట్టంలో “గత చరిత్రలో అనుభవ దృశ్యాలు ఆల్బంలో చిత్రాల వలె” నిలిచిపోయాయి. ఇపుడు శాంతికి ఆయువు హెచ్చింది. క్రమంగా స్వేచ్ఛకు అవకాశం కలిగింది. సుదీర్ఘమైన చీకటి రాత్రి కదలిపోయింది. నిన్న “గ్రీష్మాతపం వలెనున్న” కాలం ఇపుడు “వర్షమేఘ బంధుర”మయింది. ఆక్రందన ఆవేదన మృత్యువు భీభత్సం విషాదం అశాంతి నుండి, ఉత్తర వియత్నాంకు శాంతి చరణం లభించింది. కొన్నేళ్ళుగా మారణాయుధాల ధూమంతో నలుపెక్కిన ముఖాల్లో ఇప్పుడు వెలుగు రావడం విశేషం. చెట్ల కొమ్మల్లో పచ్చదనం వచ్చింది. పిడికిలి సడలింది. ఎక్కడో దూరంగా ఉన్న ఉదయం నేరుగా వచ్చి “ప్రజల ఎదపై” వాలింది. అడవుల్లో ఎక్కడెక్కడో “నీడలవలె” దాగిన వియత్నాం వీరులు, వెలుగులై “పొద్దుపొడిచిన ముఖాలతో” “శాంతి పూచిన కళ్ళతో" తమ నివాసాలు చేరుకున్నారు. ఇది వియత్నాం, వీరాంగణం. ఇపుడు స్వేచ్ఛతో "రెపరెపలాడే ఆశాకేతనం”గా నిలిచింది. ఈ ఉద్యమ కావ్యంలో విప్లవ గతిలో పోరాటంతో చివరకు స్వేచ్ఛ శాంతి విజయ పర్యవసానంతో సమాప్తమైంది. వియత్నాం ప్రజల వీరగాథారూపంగా ఆవిష్కృతమైంది. ఇది రెండు విరుద్ధ శక్తుల మధ్య సంఘర్షణ కారణంగా ప్రవర్తిల్లింది. ఒకటి రాజకీయ ప్రాబల్యం ధనబలం ఆయుధశక్తీ నిరంకుశ తత్యంతో అతిశయించింది. మరొకటి మనోబలం జనశక్తి స్వాతంత్ర్యేచ్ఛతో విజృంభించింది. ఈ సంఘర్షణలో మానవత నలిగి పోయింది. ప్రజాస్వామ్యం చెదరిపోయిందది. మళ్ళీ మానవతా ముఖం శాంతితో కన్పించింది. విప్పారిన రెండు రెక్కలతో శాంతి ఎగురుతూంది. మానవతారూపంతో కళ్ళముందు సాక్షాత్కరించింది. ఈ విధమైన సామాజిక భావ స్థానాలలో ఈ కావ్యం వివిధ స్థితుల సంఘటనల సంవిధానంతో రూపొందింది. ఈ కావ్యం విప్లవచ్చాయల్లో, శాంతి రెక్కల క్రింద అన్న రెండు భాగాలుగా ఉంది. వియత్నాం ప్రజల సంకల్పగతినీ కార్యాచరణకూ అద్దం పడుతుంది. మానవతా స్పందనతో విశ్వజనీనత్వాన్ని పొందుతూంది. బలమైన ఉద్యమ వస్తువుతో అంతర్జాతీయ కోణంతో వెలసిన కావ్యం "ఇది వియత్నాం" స్వేచ్ఛా కవిత్వానికి వైవిధ్యాన్ని ప్రసాదిస్తూంది. Detroit, MI - U.S.A. 27-6-2001 ఇది వియత్నాం ఆయుధాలు ప్రేలేను అహంకార గర్జాధ్వనితో I. 1. విప్లవ్చయల్లో విని కొందరు పాపం! మతిలో జలదమని తలచేరు ఇదో శాంతి సేవలో భాగంగా ప్రచరించేరు. మొక్కల వలె మనుషులు పుడుతూ చావడమేనా? సంకల్ప వికల్పం ఎరగని మ్యూజియంలో శిల్పాలా? నాగరకత పెరిగే కొద్దీ ఆయుధాల అవసరం జాస్తీ అవుతుంది. మనిషిని చూస్తే మనిషికి భయం నీడను మ్రింగజూస్తుంది నీడ. ఆటవిక యుగం నుండీ ఆయుధాల అవసరం లేకపోతే ఊహలో ఉండేనా? ఇంతటి క్లిష్టమైన రణ వ్యూహం వర్తనలో ఉండేనా? ఇంతటి తీవ్రమైన పదును రీతి. చెట్లపైనుండి గుహల్లోకి, గుహల్లో నుండి కట్టడాల్లోకి శిలాశకలం నుండి ఆటంబాంబు వరకూ ఎదిగిన మనిషి జిగీషలో తొలిగిందా? ఆటవిక లక్షణం? మనీషలో అణగిందా? ఆక్రమణ తత్వం. కళ్ళలో పూలు పూస్తాయి కళ్ళలో నిప్పులూ వెలుగుతాయి బ్రతుకులో నిర్మాణశీలంతో విస్తరణ గుణంతో అందంలో ప్రయోజనంలో రెండిటి అవసరం వేరు ఆయుధాలు ప్రేలనీ అహంకారం గర్జించనీ జలదానికి భంగం లేదు, వీర సంకల్పానికి చావు లేదు. ప్రకృతిలో పచ్చదనం మళ్ళీ మళ్ళీ మనసులో సంగీతం సమయ సమయం మనిషిలో శక్తి గతికీ రక్తి రుచికీ సంకేతాలు. అనల విధృతితో ఝంఝా గతితో ఈ శతాబ్ది చరిత్రలో జనగణ సమాజం నిద్ర ఎరగని నిశయై శాంతి ఎరగని జ్వాలయై వీరగాథాబింబమై, వియత్నాం నేలపై. I. 2. ధూమం వెనుక నుండి మంటలతో విసిరే గాలుల వడిలో సుడిగొన్న సంధ్యా క్షితిజంలో కారులో సాగిపోతున్నారు ప్రళయ గతితో యుద్ధమతులు ఎక్కడికీ ప్రయాణం? ఎందులకీ ఆవేగం జనపదాల్లో చరిత్రలో ఏ శకార వ్యూహం సృష్టించాలనీ వియత్నాంలో. చెట్ల చాటు నుండీ గుట్టల చాటు నుండీ అవతరిస్తున్నారు విప్లవ స్వేచ్ఛామతులు. విరామం లేక పడే డాలర్ బాంబుల మంటలకు ఎరుపెక్కీ ధగధగలాడే శక్తికీలలు. కారు కిరువైపులా కిటికీ బెజ్జాల కమర్చిన మెషిన్గన్లు మ్రోగుతున్నాయి విచక్షణారహితంగా చీకటి నిశ్శబ్దం. ఫోకస్తో టార్గెట్ గ్రుడ్డిగా మొద్దుగా టాంక్ సాగుతోంది. గుమ్ముగా పెరిగిన చెట్ల మధ్య నుండి సందుచేసుకొనీ వచ్చిపడే రాళ్ళ కెదురుగా లావుపాటి కారు నడుస్తోంది. హెడెట్్స పగిలినా గుడ్లక్ చెదరినా మొండిగా రాక్షసంగా దారిన కదులుతూంది పొగలు రేగి హాహాకారంతో అదిరిపడేను. మంటల వెలుగుల్లో అదో వైట్ ఎలిఫెంట్. ఈ భూమిని రక్షించేందుకు దేవదూతలు ప్రయాణిస్తున్నారు రోజొక గండంగా ముఖాన ఎవరి క్రాస్ వారే వహిస్తున్నారు. ఎవరూ తమ గోయి తాము తీసుకోనక్కరలేదు అవసరమైతే కారు ఉంది! అందుకది సరిపోతుంది. కారులో గాలిని కండిషన్ చేసినట్లే వియత్నాం ప్రజల్ని కంటోల్ చేయాలనే తమకేం? అన్ని అమరికలతో లోపలి నుండి అడుగు తీస్తేగా. నిప్పు తమకంటనంతవరకూ! బయట ఏమూపోతేనేం బూదిగా ధనబలం ఉన్నచోట శాంతి అదే దారికి వస్తుందా? స్వేచ్ఛను మాపే యుద్ధం శాంతిని తెస్తుందా? అడవిలో చెట్లపైనుండో గుట్టల్లోనుండో నిప్పులు చిమ్మే గుండెలతో మనుషులు కదులుతున్నారు. కారును పట్టేయాలనీ, ఏనుగును కూల్చేయాలనీ- అడవిలో కారు లేటెస్్ట మోడల్. ఆగకుండా నడుస్తోంది తిరిగి తిరిగీ ఎక్కడ మొదలైందో అక్కడికే చేరుతోంది. మంటలు విసరే గాలి గతిలో చిక్కుకున్న సంధ్యా క్షితిజంలో బూది కుప్పలు! రాక్షసుని నిద్రలో పీడకలల బొమ్మలు. మానవతా వేదిపై అనల ధూమచ్ఛటల్లో వీర గాథా జీవితాల తోరణ మాలా పంక్తులు! I. 3. అమావాస్యరాత్రి - మైలై గాలులు వీస్తున్నాయి కర్కశతి కర్కశంగా ఉత్తరం నుండి దక్షిణానికి జీవితం నుండి మృత్యువుకూ చెట్లను స్తిమితంగా ఉండనీయడం లేదు మనుషుల్ని ఏ కాస్త నిద్ర పోనీయడం లేదు. మంటలు ప్రసరిస్తునన్నాయి దిక్కుల్లో పడగలు చాచి అంతా ఏకం చేసేందుకో? సర్వం లీనం చేసేందుకో? గాలులు వీస్తున్నాయి సమయ దళాల్ని చీలుస్తూ గుట్టలూ మేడలూ గోడలూ! గగుర్పాటుతో నిక్కి నిలిచాయి. భవిష్యత్తు రహస్యాల్ని దాచుకునే బాలల నుండీ గతంలోని అనుభవాలు పరచుకునే వృద్ధుల వరకూ చలిలో వానలో ఎండలో భూమిపై కాలి నడకనా నీటిపై వెదురు పడవల్లో ఎదురు గాలిని ఉత్తరిస్తూ వీర జాతి నికేతనాలై ప్రయాణం సాగిస్తున్నారు. ఈ గడ్డకు ఎటువైపూ ఏ అభయ మార్గమూ లేదు "ఏ క్షణం బాంబులు మీద పడతాయో” “ఏ క్షణం విషవాయువు చిమ్ముతుందో” అనుకున్నంతసేపు పట్టదు! ఆ భయ క్షణం రావడానికి! మారణాస్త్రాల పొగల పొరలు చీల్చుకుంటూ ప్రజలు బరువులెత్తుకొన్నవారిలా వంగి వంగి పరుగిడుతున్నారు. మంటల్లో కలిసిపోతూనో, పొగల్లో దాగిపోతూనో బూదిలో బూది పొరలై కనుమరుగైపోయేరు దూరం విసరేసిన ఆట వస్తువుల వలె పిల్లలూ క్రింద పడిపోయిన పిడుగుల వలె వృద్ధులూ! అగ్రరాజ్యం రాజనీతి మంటల వెలుగులో కోపంతో ఎరుపెక్కిన ముఖం వలె ఉంది క్షితిజం. ఈ ఊరు ముఖాన మంటలతో పొగలతో కాలం చిత్రిస్తోంది బాధారుణచిత్రం! యుద్ధతంత్రం వేగంగా మలుపు తిరుగుతోంది మూల మూలనుండి బాధా స్వరాలు వినిపిస్తున్నాయి. సనసన్నగా పరాయి సోల్జర్లు సంభాషణలు అంచెలంచెలుగా వాటిని కప్పేస్తున్నాయి కన్నుల్లో అగ్నికి బదులు నీరు కురవాలిసిన క్షణం! మనసుల్లో ఆలోచన కన్న ఆవేదన పడాల్సిన క్షణం! పక్షికీ భయమే ముడుచుకొని ఎగరడం లేదు చేపకూ భయమే దాక్కోని ఈదడం లేదు స్వేచ్ఛా సంకల్పంతో దీక్షా కవచంతో లక్ష్యంతో ఈ క్రియా భూమిపై కదిలేదీ! వెలిగేదీ! మనిషే! మనిషి నిండుగా బాంబులు మోసుకొని వచ్చేను దురంహకృతిలో వరసగా బాంబుల గుండెలు ప్రేలేను వరసగా యుద్ధంలో టాప్ ప్రియారిటటీ ఏ నిజానికో గాని మైలైలో లక్ష్యం చేరడానికెంత కాలం పడుతుందో! చేతిలో గన్ తో లేస్తూ లేస్తే జాతీయాలాపంతో పడుతూ ఒరిగిపోయే వియత్నాం వీరుల కన్నుల్లో జారే మల్లెలు జాజులు మందారాలు గులాబీలు రంగురంగుల పూలు మానవతను పందిరిగా అల్లుతున్నాయి. ఇక్కడ వీరోచితమై ఉదయం వెలుగుతూంది ఇది శుభోదర్కమై చెదరని ఆశా వాస్తవం. శత్రువు చేతుల్లో పడిన “మైలై” ఒరిగే వీరుల రక్త సరసిలో నావయై తేలుతూంది అగ్ని కీలల్లో ఒకటై శ్మశానంగా మారుతోంది.- ఎండిన బావులై కళ్ళు ఆకాశంలోకి చూస్తున్నాయి ఆకాశం కురుస్తోంది అడపా దడపా బాంబుల వర్షం శాంతిని దగ్ధం చేసి సమాధులు సిద్ధం చేసి కొవ్వొత్తులు వెలిగిస్తారా? పూలతో భూషిస్తారా? విష వాయు సేచనతో ఈ వనాన్ని భగ్నం చేసి ఏ కోర్కెల పూలు పూయిస్తారీ మారణమతులు! భీతమైన ఎదలో శాంతి చరణం నిలవ లేదు నీతి లేని రాజకీయం కల్యాణం కూర్చబోదు ఎండిన చెట్టు కొమ్మ వలె విస్తరించిన కాలిబాటన ఆకుల గలగలతో మనిషి ప్రాకుతూన్న చప్పుడూ! వీడని పొగ మంచులో ఎగిరే పిట్టల వలె మారణ ధ్వని ధ్వనికీ మధ్య సందుల్లో నిశ్శబ్దంగా మోహరించి కదులుతున్నారు వియత్నాం వీరులు! అడవిలో సెలయేళ్ళవలె గడుస్తున్నాయి రోజులు. వినేవాడుంటే చాలు! ఇక్కడ బోలెడు కథ ఉంది నేలపైన నీటిలోను శవాలు వీర గాధా శకలాలు. పక్షుల్ని బెదిరిస్తే ఎగరడం మానతాయా? మనసును అదిలిస్తే మ్రానై పడి ఉంటుందా? ఎండిన సరస్సు వలె శాంతి నిలిచి ఉంది. గ్రీష్మంలో ప్రవాహం వలె సహనం సరిస్తూంది అహం ప్రేలే యుద్ధానికి దగ్ధమౌతూంది వియత్నాం భగ్నమయ్యే జాతి స్వేచ్ఛకు సంకేతం వహిస్తూంది. సూర్యుడు వేయి చేతులు చాచనీ చంద్రుడు వేయి చూపులు సరించనీ రణ నీతికి గుడై ఈ ఊరు “మైలై” మానవతకు గుడై ఈ రోజు “మైలై”. I. 4. మైలై మండి నీవు కసికసిగా విసరే బాంబులకు చస్తే నీ వెనుకే నీడలమై అగ్నులమై వెలుస్తాం వియత్నాం గడ్డపై విజయ వజ్ర సంకల్పంతో నీ కాలి క్రింది కత్తులమై మెరుస్తాం. పేదరికం అవమానంలో మేం చేసిన తప్పు I. 5. చరమాంకం ఓ పెద్ద మంచు బొమ్మ కెదురుగా తెగించి మోహరించడం ఆయుధ ధన బలంతో నీవు చేసిన ఒప్పు జన మారణ రణం! సైనిక బల నీతి వ్రణం ఇరువురి మధ్య నుంది ఆరని అగ్నిరేఖ చరిత్ర ముఖంపై అడ్డంగా కత్తి గంటు! మినుకు మినుకుమంటూ ప్రాణం ఉన్నంతవరకు శరీరం కదులుతుం దొక రణ యంత్రమై వీడుతుంది తుది నిశ్వాసం రణ పతాక రెపరెపతో కాలి క్రింద నీడవలె అణగ ద్రొక్కి అపజయం ఉరుముల వలె వినిపించే మా పద ఘట్టనలో భూమి గరుకు తగ్గుతూంది, ఊహ ఎరుపు ఎక్కుతోంది మా ఊపిరి రాపిడికి గాలి పదును పొందుతూంది. మా చూపుల వెలుగులో పగలు తళతళ లాడుతూంది మా ఊహల మంటల్లో రాత్రి భగభగ మండుతుంది శాంతి లేదు సహనం లేదు నీ బ్రతుకంతా వ్యాపారం స్తిమితం లేదు భద్రత లేదు మా బ్రతుకంతా ప్రళయం. అందంగా అల్లిన అబద్ధాల కుతంత్రాల వ్యూహంలో చిక్కిన అదృష్టానికి మురిసేవా? నీ యుద్ధం నింగి నుండి మా యుద్ధం నేల నుండి రెండిటి మధ్య అంతరాన్ని కలిపే అవకాశం శూన్యం స్వేచ్ఛగా తిరిగే పక్షుల పైనా నీ కసీ, గురి! క్రింద స్వతంత్రంగా సాగే ప్రాణుల పైనా నీ అక్కసు? బ్రతుకును నెత్తురు ముద్దగ మార్చేవూ మనిషీ.- ఎదురుగా ఎగసి పదును కత్తులై చిమ్మే పొగ మంటలై పట్టరాని వ్యథతో రోజులు సంబాధంగా గడుస్తూన్నాయి. పిల్లలనుండి పెద్దల దాకా మాకు ఆశీస్సులిస్తున్నారు. నీ ఊహలో శాంతి కపోత సంచారం మృగ్యం నీ వర్తనలో అగ్ని గోళ వర్తనం సత్యం ఒక దీపం ఆరిపోతే పది పది వెలుగుతూనే వేదనా తంత్రులతో క్రందిస్తోంది వియత్నాం ఇది జ్వాలా సందర్భం! రాత్రికి చరమాంకం ఇది స్వేచ్ఛా సంరావం! ఉదయానికి సంకేతం. I. 6. అశాంతి చక్రం ఘనత వహించిన దేశం నుండి బడుగు దేశానికి ఆహారానికి బదులు గుడ్విల్ గా బాంబుల సపె సవ్యాజమైన కరుణ బిగిసేను ఉరిత్రాడై కొమ్మకొమ్మనూ వేరుచేసే గాలి వలె రాజనీతి! పూవు పూవునూ బూదిచేసే కీలవలె యుద్ధరీతి! సౌభాగ్యం సంతోషం కోరీ అవమానం హింసకు భయపడీ రాజకీయ చతురుల చేతుల్లో పావుల వలె శాస్త్రజ్ఞులు! నేపాల్్మ బాంబు బ్రద్దలై విషవవాయువు కదలీ వియత్నాం వీథుల్లో అర్థనగ్న శరీరాలు కదలేరు జనం అడవికి శోభా రహితులై శిశిర నీతికి శీర్ణమై జీవితాలు కీర్ణమై. మహాసముద్రానికీ విశాలభూమికీ మధ్య చెలియలికట్ట ఉంది ఇక్కడ జడ జగతికీ ప్రాణ జగతికీ మధ్య రేఖ ఉన్నట్లు లేదు! నిర్మాణ దశ చిట్టచివరి మెట్టుపై ఉంది విలయ స్థితి మొట్టమొదటి వరసలో ఉంది. అపశకున లక్షణాలతో అపాయకర చర్యలతో సమయ మహా శిఖరంపై భయం గొల్పే తెల్ల మనుషులు ఎంత గొప్ప దేశమో! ఇపుడంత పెద్ద గందరగోళం ఆలోచనలో అసహనం, ఉద్రేకం వెంట ఆందోళన ఆందోళనతో ఆవేగం, ఆవేగం నుండి మారణం. అహంకార తాండవంతో, యశస్సు నిలుపుకొనే యత్నం ఈ చిన్ని దేశం నుండి బయట పడలేదు అమెరికా రోట్లో తల దూర్చాక ఎంత పెద్ద తల ఐతేనేం? I. 7. క్రాంతి వియత్నాం తరంగాలు! తరంగాలు! విలయ ధునీ తరంగాలు స్వర్గాన్నీ నరకాన్నీ ముంచెత్తీ వేగంతో అజేయ శక్తి ధురా తరంగాలు! తరంగాలు తప్తలోక వ్యధా భరిత గాధా కల్లోలాలై సుడులతో వడులతో పొరలి తరలి వస్తూన్నవి. నవ లోకపు తేజం వియత్నాం ఖండం వదనంలో స్వేచ్ఛా సంగీతం గొరిల్లా వీరుల ఆత్మలో. శిథిల హృదయ తలంపై ఎగసే మంటలతో మారణ చరిత్ర పేరూ, ఊరూ లేకుండా తుడిచేస్తూ తరంగాలు ఉల్లోల తరంగాలు విలయ ధునీ తరంగాలు! దిశదిశ వీర యశః కురంగాలు! నేలపై ఉత్సాహ మృదంగాలు! చితివలె మండే నిరాశపై పై నుండీ జనగణ చైత్యంతో జిగీషా రూపంతో యుద్ధ కళోన్మాదుల మతి పోగొడుతూ పొంగి పొంగి తరలి వచ్చే కల్లోల తరంగాలు బ్రతుకులో ఉందీ తెలుపు నలుపూ ప్రకృతిలో ఉంది సృష్టీ విలయమూ! నెత్తురు మంటల్లో ఆశా చిత్రం చూస్తూ బ్రతుకులు తెల్లార్చే వీర వియత్నాం నిశా వియత్ శత్రు జ్వలన లక్ష్యంతో II. శాంతి వెలుగులో II. 1. శాంతి బిందువు శాంతి వచ్చింది చిట్ట చివరకు ఆగి ఆగి భయభయంగా కాలిన కూలిన ఇంటికి ఇన్నేళ్ళకు అపరిచిత రూపంతో వేచి వేచి మరచి ఎదలో దారి తప్పిన వాస్తవం వలె ముసుగు తీసి తెల్ల ముఖం జేబులో పిస్టల్ దోపుకొనీ. చెట్టు క్రింద నీడలో విశ్రాంతికై నిలిచింది ఊహలో రణ వ్యూహం ఇంకా మిగిలే ఉందా? శేషాన్ని పూరించేందుకు కోపానికి తగిన సాధనం కోసమా? పై నుండి బాంబులు ఎపుడైనా పడవచ్చు. శాంతికై పూల చెండ్లు విసరినట్టు చెప్పొచ్చు. నేలపై ఎపుడైనా సాగవచ్చు కీలలు! మంచికని రణ వ్యాపారం దించవచ్చు. ఈ వాలిన శాంతి ఎగసి పోకుండా శాంతి ప్రియులేం చేస్తారో చూడాలి. ఎంత ఎత్తు కట్టేరో? గోడలు! ఎంత ఎత్తు పెంచేరో? మనస్సు! II . 2. కిటికీ నుండి వెలుగులో కిటికీ నుండి దూకిన వెలుగు వేలెత్తి చూపుతూంది ఇంటిపై పడిన బాంబుల్నీ అగ్నుల్నీ ముంగిట్లో ఏర్పడిన రక్తచిత్రాల్నీ కిటికీ నుండి వాలిన వెలుగు జ్ఞాపకం చేస్తోంది విరిగీ బెణికీ కాలీ కదలని చేతులనూ కాళ్ళనూ ఇది మానవ వికృతి కృతిని చూపించే ఆల్బం రెండు మూడు దశాబ్దాలు చావు బ్రతుకుల సంధ్యలో రెక్కలు కట్టేసిన పక్షి వలె నున్న ఈ దిశలో, ఇప్పుడు శాంతికి ఆయువు లభించింది; స్వేచ్ఛకు గమనం సిద్ధించింది. బ్రతుకులో మారణాన్ని మరపించే స్పందనతో ఈ సమయం మానవత ఎగిరి ముందుకొచ్చింది గుండెలో భయ శబ్దం ఎగసిపోయి తుపాకీ గుండ్లను మరపించింది కళ్ళ ముందు నిలిచిన విజయ రూపం ఇన్నేళ్ళ బాధను మరపించింది అద్దం ముందు నిల్చుంటే గదిలో ఒక ప్రక్కన కనిపిస్తోంది పదిలంగా తీసి పెట్టినట్లున్న హృదయం వలె వయొలిన్. గుండెల్లో రణ గతితో ధమనుల్లో విప్లవ ధునితో అగ్ని పర్వతం వలె ప్రేలి ప్రేలి విసిగిన కాలం శాంతించింది మతిలో కపోత శ్రేణితో నాడుల్లో సంగీత స్వరంతో విజయం పొందిన జీవితం ఇపుడు వెలసిన హిమశిఖరం! కిటికీ నుండి జారిన వెలుగు, ఆనంద హృదయమై మనిషి మనిషిలో వివిధ వర్ణ రాగాన్ని సృజిస్తూంది ఇంత కాలం బిగిసిన పిడికిలి సడలింది గుప్పిట్లో దాగిన రహస్యం జగద్వితమైంది ఎదలో నిలిచిన స్మృతి చిహ్నం ఇంటి ముంగిట్లో ఆకు రాలి వృక్షం వియత్నాం సమాజం! వృక్షాన్ని వెలుగు స్పృశిస్తోంది. వృక్షంలో ప్రాణశక్తిని సరిస్తోంది అనల పత్రా లెగసి పోయాయి, రక్తచిత్రాలు మాసిపోయాయి సమయం ప్రవహిస్తోంది విశ్వ బంధు గీతం స్వనిస్తోంది ముందున్న అద్దంలో కిటికీ నుండి కన్పించే గగన ఖండం వియత్నాం భుజాలపై నిల్చిన చరిత్ర ముఖం వలె ఉంది. ఇక్కడ రాత్రులెంత సుదీర్ఘమైనవో II . 3. సుదీర్ఘమైన రాత్రి దాటి మనుషుల బ్రతుకు లంత హ్రస్వమైనాయి పోరాటాని కంకితమై ఆయువు సగంపైగా చెల్లిపోయింది భయంతో మేను ముడుచు కొన్నంత వరకూ పొగతో కళ్ళు మూసినంత వరకూ అలజడికి లక్ష్యం లేనంతవరకూ రాత్రికి పరాజయం లేదు- నిటారుగా మేను నిల్చి కళ్ళు వెలుగు చిమ్ముతూ విప్లవ లక్ష్యంతో ఉదయ జయం కలుగుతుంది గమ్యంతో పరిపూర్ణమై అడుగడుగూ కదులుతుంది. శక్తితో విలోలమై కణకణమూ బ్రతుకుతుంది. రాత్రులంత దీర్ఘమైనా ఓపిక తగ్గలేదు, శక్తి తరగలేదు. జీవ కళతో కాలం ప్రగతి పథం వరించింది రాత్రి మేల్కొన్న దీపాలు మేల్కొన్నట్లే ఉన్నాయి ఏ పగలూ జ్ఞాపకం లేదు, పోరాటంలో అన్నీ ఒకటే. రాత్రి చీకట్లో తేలుతూ పడవల వలె పగలు నీడల్లో కదలుతూ నీలి మబ్బుల వలె కదలిన వీర దళం నేలకూ నింగికే పరిచితం కాలం నిన్న గ్రీష్మాతపమైంది, నేడు వర్షమేఘమౌతూంది. II . 4. మేఘమై ప్రవాహమై రాత్రిని చీల్చే ఆరుణ గోళమై వచ్చిన పోరాటం నేడు వియత్నాంను కాంతి తోరణంగా మార్చేను నిన్న మంటల్ని వణకింపజేస్తూ వీచిన గాలులు ఇపుడు పంటల్ని హసింపజేస్తూ వచ్చేను శాంతి ఐతే వచ్చింది ప్రజ కళ్ళలో మెరుపును ప్రతిఫలిస్తూ గుండెలో పచ్చదనం నింపుతూ, ఊహలో మానవత వెలిగిస్తూ పోరాటం శాంతి రెండు ఈ స్థితిలో లక్ష్యసిద్ధికి శిఖరాలు నలుపు ననుసరించి ఎరుపు వస్తే, ఎరుపు తరువాత తెలుపు వస్తుంది సంఘర్షణ పరివర్తన సమన్వయం పురోగమనం చరిత్ర గతిలో భాగం సామాజిక శ్రేయం గమ్యం. సైగాన్ శిఖరం తలపై, పొలిమేరల చేతుల్లో అందుకున్న పోరాటం ఆగదు, ఆగలేదు. రావలసిన శాంతి అవసరమై రానే వచ్చింది. ఇది జనపదాల్లో నగరాల్లో తెలిసిన రహస్యం. కాలంలో ఏ భాగం అక్కరలేనిదవుతుంది? మనస్సులో ఏ రూపం చూపునుండి దాగుతుంది? మ్రోగింది క్షణం వియత్నాం హృదిలో మేఘమై కదలింది సమయం చరిత్రలో వీర ప్రవాహమై. ఈ గాలిలో ప్రేలి ప్రేలి మారణాయుధాలు పొగచూరిన వాలకంతో దరిద్రీకృత రూపాలతో కొమ్మలు వేచి ఉన్నాయి అశాంతి వాలకంతో II. 5. ఆశాకేతనం పూల కోసం పండ్లకోసం ఇన్నేళ్ళు మొగం వాచిన చెట్లు స్నేహ మతితో స్వాగతానికి చేతులు చాచినట్లున్నాయి. ఎండిన కొమ్మలన్నీ చిగిర్చాయి, మండిన బ్రతుకంతా పచ్చనైంది రాతి చేతుల పిడికిలి సడలింది, ఉదయం దిగి ఎదపై వాలింది గుండెలో కూర్చున్న భయం లేచి ప్రవాసం వెళ్ళింది మంటలతో క్రమ్మిన దుఃఖం ఎగసి దిక్కుల్లో కలిసింది వెలిగే సంతోష కళతో తరలే తరంగ ద్రుతితో రాగం గంగయై బూది దిబ్బలపై ప్రవహిస్తూంది సుదీర్ఘ యుద్ధం సృజించిన రణ మహామతిలో శాంతి నవాంకురం వెలసింది, కాంతి బింబం కన్పించింది. అడవుల్లో ఎక్కడెక్కడో దాగిన నీడలన్నీ వెలుగులై పొద్దు పొడిచిన ముఖాలతో శాంతి పూచిన కళ్ళతో మనుషులై తమ దేశానికి కొత్త అలంకారాలవుతున్నారు. ఇది వియత్నాం, ఇపుడు అభ్యుదయ పథ గతిలో వీరాంగణం! స్వేచ్ఛతో రెపరెపలాడే సమాజ కేతనం!