Muktakaalu – Usha Aagamanam (ముక్తకాలు – ఉష ఆగమనం) Collection 9 of Volume I — Addendum 1 — Swecchaa Kavitvamu by Prof. Madiraju Ranga Rao. Year: 1970. Language: Telugu. Canonical HTML: https://madirajurangarao.com/poetry/volume-i/addendum-1/text/muktakaalu-usha-agamanam --- ముక్తకాలు ఉష ఆగమనం మాదిరాజు రంగారావు సాహితీ బంధు బృందం హనుమకొండ వరంగల్ ఉష ఆగమనం 69 స్వేచ్ఛా కవిత్వం ముక్తకాలు - ఉష ఆగమనం ఆచార్య మాదిరాజు రంగారావు SWECCHHA KAVITHVAM MUKTAKALU - USHA AGAMANAM by Prof. Madiraju Ranga Rao © Dr. M. Santhosh Kumar Rasadhuni Sahithi Parishath, Hyderabad - 28 ప్రథమ ముద్రణ: అక్టోబర్ 1970 సాధారణ విజయ దశమి పునర్ముద్రణ: జూన్ 2026 అనుపమ ప్రింటర్స్ శాంతినగర్, హైదరాబాద్ ఫోన్ : 040–23391364 ముక్తకాలు ఉష ఆగమనం పుటరచనా కాలం ముక్తకాలు 1 1962—70 ఉష ఆగమనం29/31 ‘62 సౌందర్య శిఖ 35 ‘61 రసాకృతి 45 ‘60 హిమజ్వాల 56 ‘62 ఛాయ 59 ‘57 ఆ వెనుకనే 62 ‘62 మొగిలు విరిసి... 64 ‘62 ముక్తకాలు 65 ‘70 ఒక మాట డాక్టర్ మాదిరాజు రంగారావు ఆధునిక వచన కవితా ప్రక్రియలో బహు కావ్యాల్ని ప్రచురించి ఆ సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన సుప్రసిద్ధ కవులు. ఆధునిక మానవ జీవితాన్ని మనో విశ్లేషణ ఆధారంగా వివిధ కోణాల నుండి దర్శించి మధురానుభూతుల్ని చిత్రించడం వీరి కవితా లక్షణం. ఇంచుమించు పదిహేను సంవత్సరాల నుండి ఈ కవితా ప్రక్రియలో వ్యాసంగం చేస్తూ ఈనాటి తరం కవులకు కుందుర్తి తరువాత ప్రేరణ కలిగించిన వారనడంలో సందేహం లేదు. ఇదివరకే వీరి ‘‘యుగసంకేతం’’ ప్రకటించి సాహిత్యాభిమానుల ఆదరాభిమానాల్ని పొందగలిగినాము. ఇప్పుడు మళ్లీ ‘‘ముక్తకాలు — ఉష ఆగమనం’’ ప్రకటించుటకు అనుమతించిన శ్రీ రంగారావుకు మా కృతజ్ఞతలు. హనుమకొండ సాహితీ బంధు బృందం ది. 10.10.1970 ముక్తకాలు క్షణక్షణం మార్పునొందు ఈ జగత్తు ఎవరి హేలకోగాని ఏ రోజున కారోజే ప్రశ్నాపత్రంవలె ప్రత్యక్షం కంటిముందు జవాబు కోసం మనిషి మారును మనీషిగా. ఏ పెదవులపై విరిసిన హాసక్రీడల సుమాలు సంధ్యవేళ వన్నెతో, మరునాటికి మన్నులో శ్మశానగతి నొందేవి క్రొత్తవాటి కిచ్చిస్థలం! నాశనస్థితి ననుసరించి నవ్యసృష్టి అనుక్షణం. దూరంగా ఆకాశం ఎక్కడనో భూదేవిని కౌగిలి పూనిన రీతి మనసు నల్లుకొను మమతలు మనిషిని వదలని గొలుసులు. మళ్ళీ సౌరభాలు ఝుంఝామారుతాలు స్రేయానిదానాలు, ప్రళయాదగ్రగతులు మనిషి ప్రకృతిలో రెండుగా ఒదిగి ఉన్న అమృత సరోమూర్తులు, అగ్నిగోళ వర్తులు. రోజులు పక్షాలు ఋతువులు వత్సరాలు పునఃపునరావృత్తమా కాలచక్రం కోపాలు ద్వేషాలు ఈర్ష్యలు కలహాలు అవే ఊహలు చేష్టలు, అదే మనస్తత్వం. మనసులోతులు వెదకు కన్నులు కొందరివి మనిషి రూపం చూచు కన్నులు కొందరివి కనులే ఉంటవి చూపు తప్ప కొందరికి గ్రుడ్డివారివలె కన్పడు వారికే చూపు జాస్తి. ముక్తకాలు ఉదయం నిశామృగాన్ని వేటాడుతూ రవి గగన వనంలో అవతరించాడో లేదో మేల్కొని నిదురించే పర్యంతం భూమిపై మనిషిని వెంటాడే మనిషి, నీడను నీడ. మహాకాల కాసారంలో వికసించిన కనక శతపత్రం సూర్యుడు — కాదు; అంధకార వలయంలో అనేకాబ్దాలుగా పరిభ్రమించే హృదయాగ్నిగోళం. కాలదేవత మనసులో విరిసిన మల్లెలు ఉబికిన సంతోష తరంగాలు చుక్కలు — కాదు; భాగ్యహీనుడు రాల్చిన బాష్పకణాలు హృదయం ఎగజిమ్మిన అగ్నిస్ఫులింగాలు. దుఃఖమయ జీవితంలో హ్లాదైకబింబం గగన తమోపథంలో పారాడే శిశు శశి; అవును పాషాణ హృదయం భేదించుకొని ఉద్గమించిన సౌందర్యకళా సృజన. భాగ్యహీనుని కంటినుండి జారిన బాష్పకణం చీకటిలో చివుకు బ్రతుకునెత్తి చేప దీపం బాష్పకణంలో నినదించే బాడబాగ్ని సంగీతం శిథిల మనఃకుటిలో నీడల అడుగుల చప్పుడు. చెట్లు కనే కలలు పూలు పండ్లు వాని ఊహలకు ప్రతి రూపాలు, నీడలు నదులు కనే కలలు పంటలు పైరులు వాని ఊహలకు ప్రతినిధులు తరంగాలు. ముక్తకాలు మనిషి కనే కలలు ఆశా మరీచికలు అతని ఆలోచనలకు ప్రతిబింబాలు అజంతా హిరోషిమా బూక్కులు స్పుట్నిక్కులు పైన దేవతలు, క్రింద రాక్షసులు. సూర్యుడు ఆరిపోడు, భగవద్బావన చావదు. తమస్సు ఉండదెపుడు, ఆశలేక బ్రతుకు లేదు. యుగాలు గతించినా ఆదియుగ మనస్తత్వం వస్తుంది పరంపరగా ఏదో ఒక రూపంలో. చావు జయింపబడదు,అందుచే అంత భయం. గతం చచ్చినా రాదు, అందుకే దురభిమానం. మెలకువయే వర్తమానం, అందుకే అంత ఇష్టం. భవిష్యత్తు భద్రమైంది, అందుకే ఎంతో ఆశ. గ్రీష్మం వచ్చింది నిప్పు రెక్కలు విప్పి బంగరు కుప్పవలె భాసించింది జగత్తు. రాత్రి వచ్చింది మసక కన్నులు విప్పి బూది కుప్పవలె మారిందదే లోకం. దీపశిఖచుట్టూ దూరంగా ముసరిన దారి తెలియని గ్రుడ్డి వెలుగులు దీపశిఖను స్పృశించలేవు సరికదా చీకట్లకు దారైనా చూపలేవు. కొందరికి చీకటిలో పయనించడంకన్న వెలుగులో నిదురించడ మభిమతం. కొందరికి చీకటిలో నిదురించడంకన్న వెలుగులో పయనించడమే ఇష్టం. ముక్తకాలు నావ ఇసుకలో కూరుకుపోయింది నావికుడు మానం వహించాడు ప్రయాణికులు కలత చెందేరు అలల ఉద్రేకం తగ్గనే లేదు. కనులముందు జారింది నీలి తెర వల్లకాడు అయింది జగత్తు. కనుల ముందు వెలసింది వెలుగు తెర వెండికొండ ఐంది జగత్తు. దాహంతో చావనున్నవారు మహానదిలో దింపబడ్డారు దాహం మాట దేవుడెరుగు తిరిగి కంటికి కన్పించలేదు. గుండె గాయంతో జ్వలించునపుడే తెలుస్తుంది జీవితమెంత విలువొ! పత్తి కాలుతూ ఉన్నంతేసేప చూపగలదు వెలుగు ప్రపంచానికి. ఖైదునుండి విముక్తులిద్దరు హంతకులు ఒకరినొకరు చూచుకొని సాగారు ముందుకు. ఒకరికళ్ళలో పరచుకొన్న నిర్మలాకాశం మరొకరి కళ్ళలో పరివర్తించు అగ్నిగోళాలు. మృత్యువు మరో రూపమే గతం అనుభవాత్మకం, వర్తమానం. ఆశాఽభాసం భవిష్యత్తు ఈ మూడిటి సంపుటి జీవితం. ముక్తకాలు మహామతికి కాలమొక జవాశ్వం. కొందరికి ఆకులు కదలు వృక్షం. మందమతికి నిశ్చలన పర్వతం. అనుభూతి వ్యక్తినిషం, మానసికం. నీలిమబ్బువలె క్రమ్మిన దుఃఖం వెనుక చంద్రబింబంవలె దాగిన ఆనందం. బ్రతుక్కి లేదొక నియతమైన ఆకృతి. కలసివేస్త పుష్పశయ్య, లేకపోతే శరతల్పం. గ్రుడ్డివాడు అద్దంలో చూచుకొని ముఖం ఆనందంలో లీనమై మురిసినట్లు కళ్ళు ఉన్నవాడు ఎదుటివాని ముఖంలో మనస్సు చూడాలని తహతహ ఎంతో. వెలుగు చీకటి ఎన్నటికీ కలవని మహా కాలనదీ తీరాలు. స్వర్గ నరకలోక సంకేతాలు మనసులోని ఆనంద విషాదాలు. కొన్ని చెట్లు పూలు ఎరుగవు కొన్ని పూలకు పరిమళం ఉండదు. కొందరికి హృదయముండదు, బుద్ధిఘనులు కొందరికి అనుభూతి పట్టదు, అదృష్టవంతులు. నిదురలో గడచింది రాత్రి సముద్రంలో ఓడవలె ఉదయం కనువిప్పగనే తీరభూమి— పర్వతాలు, లోయలు. ముక్తకాలు ఒక్కొక్క మనిషి జీవితం వ్యాఖ్యానింపదగిన ఒక్కొక్క సూత్రం చివరి అక్షరం చదివే వరకు అర్థం గ్రహించడం సులభంకాదు. ఉదయం మొగ్గయె అవతరించి— సాయం వాడినపూవు ఈ రోజు ! రాత్రి సముద్రంలో మునిగే నౌక చివరకెటు చూచినా అంతాశూన్యం ! చుక్కలు చీకటిలో బ్రతుకు గడిపేవనీ తరంగాలు చలించి తక్షణం నశించేవనీ విచారించడం మానవహృదయ స్వభావం వివేచించడం అతని బుద్ధి లక్షణం. వెన్నెలకు కులంలేదు, అనుభూతి ప్రశ్నలేదు. మనిషికున్నది మనస్సు, దానితోనే అన్ని ఉన్నవి. ఇవి లేనిది యాగులకే, అంతకన్న అలౌకికులకు లేదని నమ్మించడం లౌకికమూర్తులకే సాధ్యం. నీనా కళ్ళముందు పుట్టి పెరుగు శిశువు నీనా కళ్ళముందు పండుబారిన వృద్ధుడు ఒకరి ఆగమనం మరొకరినిష్క్రమణం. ఇరువురి చూపుల కలయిక ఎక్కడో ఒకచోట. సామాన్యుడి గుండెలో గూడుకట్టి బిగిసిన హిమశ్రేణులవలె బాధలు సామాన్యుని బ్రతుకులో ఎదురై మారిన మరుభూములవలె ఆశలు. ముక్తకాలు స్నేహం పరిమళించెడి ఎదలో పూవులో జ్వాలవలె ఆవేదన సంపెంగ రెక్క విప్పు చూపులో సంజవేళ రక్తిమవలె ఊహలు. చంద్రబింబం వెనుక జ్వలించే హృదయం చంద్రవదనం వెనుక తపించే హృదయం వీచే గాలి పొరలలో ఒదిగిన వెన్నెల తోచే అడుగుజాడలు వదలని కన్నులు. రాత్రి నిదురించిన సూర్యుని మనస్సులో ఉదయించిన స్వప్నవలయం చంద్రబింబం. తన శరీర సౌందర్యం అందులో చూచుకొని పరవశమా నిశాదేవి! అనంతాబ్దాలుగా నిదుర ఎరుగని కీర్తి సముద్రం, ఈ ప్రపంచం నిరంతర చలనంలోనే దానికానందం తన అస్తిత్వంపై తనకే అనంత విశ్వాసం. బ్రతుకు ఇంకా ఇంకా బ్రతకాలంటుంది నదిపై తేలివచ్చే అలలవలె ప్రియంగా దూరం నుండి మృత్యువు గాలివలె వచ్చేకొద్దీ ఉద్వేగమధిక మౌతుంది. బ్రతుకు గడుస్తుంది యంత్రంవలె కొందరికి మలగని దీపతోరణంవలె కొందరికి క్రమ్మిక వదలని నిదురవలె కొందరికి అవిచ్ఛిన్నయజ్ఞంవలె మరి కొందరికి. ముక్తకాలు కన్ను తెరచి మేసలోపల ప్రతిదినం మిత్రంవలె ఉదయం ఎదురుపడి శత్రువలె సాయం అతిక్రమించి వెళుతుంది మృత్యు రహస్యమూది మెల్లగా. ఏ గమ్యం చేరుటకై సాగుతూన్నవి నదులు? ఏ ఖండ మార్ద్రపరుప తరలుతూన్నవి మొగిళ్ళు? ఏ విధిననుసరించి భ్రమిస్తూన్నవి గోళాలు ? ఆ మహార్థధ్యేయంగా వెలుగుతూన్నవి బ్రతుకులు. బూదియె ఎగిరి రేణువులు రేణువులుగా మట్టిగా ఒకనాటికి మారే మానవుడు క్రీనీడల చెరసాలలో బంధితుడై ఖైదీవలె బ్రతికినంత కాలం మానవునికే ఎక్కువ శత్రువు. జీవితం ఎగసిపోయే కాంతి విహంగం. బహు దూరం వెళ్ళుతుంది, గతిస్తుంది. వెనుకకు తిరిగి రావడమంటూ ఉండదు. భవిష్యదాకాశంపైనే సదా ప్రయాణం. ప్రతి వస్తువు కళాన్వితం, ప్రతి వస్తువు పరిశీలనాయాగ్యం. ప్రతి భావం మనోఽను భవనిషం. ప్రతి మనిషి ఊహా జగత్తు భిన్నం. ఆనందమతిలో స్థాన మేర్పరచుకుంటుంది స్వర్గం. విషాదహృదిలో అవతరించి ఉంటుంది నరకం. మృత్యుభావనతో సాగుతుంది ప్రపంచం. మృత్యు పరిణామంతో అంతమవుతుంది జీవితం. ముక్తకాలు కష్టజీవి మేనిపైని స్వేద బిందువులు హరింప శీతలసమీర హస్తాలతో వచ్చింది ఉగాది, ఈనాటికైనా అతని బ్రతుకు చిగిర్చిందని యుగాలు గతించినా వీడని ప్రాణబంధువు. ఒకచోట ఒక మేరలో నిల్వదు ఊహాలోకం ఒకనాటి కొక దశలో అంతమవదు అజ్ఞానం. ఎప్పటికపుడు సమస్యలు తీరిపోనున్నట్లు అప్పటికపుడు భాసింపజేస్తుంది విజ్ఞానం. నిదురపట్టడంతో కాటికి కాళ్ళుచాచి రెక్కలు విరిగి కుప్పగా కూలిన కాలం మేల్కొనడంతో భూమి పైని పాదమెగసి రెక్కలు విచ్చి ఎగసిపోయే విహంగం. ఉషస్సు ఊపులో, తమస్సు కూర్పులో జనుషానందంలో, మృత్యువిషాదంలో మూల మనస్తత్వంలో కాలగతి రూపంలో లేదు మార్పు సృష్టి ఉన్నంతవరకు. ఒక గాలి విసరుకు వాలిపోయే చెట్లరీతి ఒక ప్రభుత్వానికి ఒదిగి ఉండు మనస్తత్వం ఒక స్థితిలో మండిపడి కాల్చు అగ్నివలె ఒక దర్పంతో ప్రభుత నెరపు అహంకృతి. ఆశాజీవి మనస్సులో ఊహావధిగా సుందర కాల్పనిక నిర్మాణ పరంపరలు వాస్తవ రూపంలో గాలితెర వేస్త చాలు గుర్తు తెలియక చెదరిపోయే ఇసుక మేడలు. ముక్తకాలు ఒకడు దూదికన్న మిక్కిలి తేలిక చూపుకు మతిలో పాముకన్న ఎక్కువ విషపు కోరలు, ఒకని చూపు సన్నజాజి పూలదండ అతని చేతం రాక్షసగణ క్రీడాస్థానం. ఒకనాటికి తుది అవని గ్రంథం ప్రపంచం చాలామంది చదవరు, కొందరు యత్నిస్తారు పూర్తిగా అర్థమైనవారెవరూ లేనే లేరు ఎవరేమన్నా ఎవరి ప్రపంచంమటుకు వారిది. రాగంలేని మనిషి లేడు భువిలో వర్ణంలేని వస్తువు కన్పించదు ఒకస్థితి రీతినిబట్టి కలుగుతుంది ఇతని కానందం, దాని కందం. ఆకాశ మతిక్రమించే దురాశతో తహతహతో పైకి పైకి ఎగిరే విహంగం రవితేజానికి భగ్గున మండి బొగ్గై ఏ మట్టిలో కలిసిపోయేదీ ఎరుగదు. సృష్టి ఎన్నటికీ ఏమై ఏమా అవదు ఏమా అవనున్నట్లనిపిస్తుం దెప్పటికపుడు జ్ఞానంతో పరాస్తమైపోయి అజ్ఞానం తిరిగి దానినుండి అవతరించినట్లు ప్రతిక్షణం, కాల సముద్రంలో నిలకడ ఎరుగని తరంగం ప్రవాహానికి మహాపథం భవిష్యత్తుకు వర్తమానం. ముక్తకాలు కాలం కనులుమూసి పబ్బం గడుపుకునే అమావాస్య హృదయంగల మనిషి కాలం నడకనంటి బ్రతుకు నడుపుకునే మెరపు వెలుగు మనస్సు కలాడొకడు. కాలం కనులు విప్పి జగతికి వెలుగునిచ్చే సూర్యుని వెలుగువంటి బ్రతుకొకరిది నాడు నేడు రేపు భేదంలేక చీకటివలె చంక్రమించే ‘తర్కంలేని ఎద్దులు’ కొందరు. కాలగర్భంలో కలసిపోయే మానవుడు కాల ముఖంలో వెలసిన వర్ణరేఖ బహువర్ణ విచిత్ర రేఖావలయం ప్రపంచం ప్రతిక్షణం మార్పులతో వర్తించు చిత్రరంగం. చపలత్వంలో స్థానమేర్పరచుకొన్న నరకం కాలం వదలిన ఆరని కన్నీటి నిప్పుకణం శాంత భావనలో అవతరించిన స్వర్గం కాలముఖంలో విరిసిన ఆనంద పద్మం. మానవుని సమార్ద్ర ప్రవృత్తి వివృతరూపాలు సంగీతం సాహిత్యం శిల్పం త్యాగం మానవుని కఠోర ప్రకృతి వివిధ ముఖాలు అధికారోన్మాదం, అహంకారం, యుద్ధమహాదాహం. వెలుగులో తమ వ్యక్తిత్వం స్ఫురింపజేసి చీకటిలో లీనమా, ఆకాశం భూమి సర్వం బ్రతుకులో దీపశిఖవంటి మనస్సునంటి ముందు వెనుకల సుఖదుఃఖపు వెలుగు నీడలు. ముక్తకాలు ముగిసిన కలవలె గతించింది రాత్రి కలలు కనడం మాని మేల్కొన్నాడు మనిషి ఒక వలయంనుండి ముక్తమైంది మనస్సు మరొక వలయంచే సంగ్రహితమైంది సృష్టి. విపదబ్ధి మునిగి ఒకని మనసు నవనీత సదృశం మసృణమా సుఖాబ్ధి తేలుచూ ఒకని మనసు అగ్ని సదృశం దాహకమా. చచ్చి బ్రతికి ఉండేవారికన్నా బ్రతకడానికి చచ్చేవారే ఎక్కువ. కొందరిని కాలం అమావాస్యవలె కొందరిని పూర్ణిమవలె వరిస్తుంది. కనురెప్పలు ముంచుకవచ్చే సవేగ నిద్రా కురంగం మిన్ను మన్ను ఏకంచేస సుదీర్ఘ నిశాతరంగం. బ్రతుకులోని చివరి ఘడియ గతస్మృతులకు కేంద్రం ఆ వేళ కదలే ఊహ విష బిందుయుత మధుకోశం. నిదురలో స్వప్నంవలె ప్రపంచం భూమిపై తిరిగే బొమ్మలు ప్రాణులు మనిషి మనసులో స్వర్గం, నరకం పైన ఉన్నవో లేవో మన కనవసరం. ముక్తకాలు ఆగకు నడువు ఆలోచనలతో ముందుకు ఎదురు పడనీ పరంపరగా పెనుచీకట్లు, విచ్చుకొని దారులవే ఇస్తాయి వెలుగుకు గమ్యం తెలీనపుడు ఉన్నచోటు చాలు. ఒక చోట నుండి కదల్లేరు కొందరు వారి శరీరం వారికే బరువు. వారి రాకడగాని పోకడగాని ఎవరిపై ఏ ప్రభావమూ నెరపదు ! ఎంత వయస్సు వచ్చిందో పైబడి అంతకాలం హరించి పోయింది మెరపువలె గతించింది నిన్నటి రోజు, విహగంవలె వచ్చి వ్రాలింది నేటి ఉదయం. ఏడుపు ఏడుపు ఎక్కడ చూచినా ఏడుపు ! పొందడానికి ఏడుపు పోగొట్టుకొని ఏడుపు! బ్రతకడానికి ఏడుపు చావడమై ఏడుపు ఏడుపుతో పుట్టుక, ఏదో ఏడుపుతో చావు ! నిప్పులు చెరగుతూ వచ్చే గ్రీష్మం మండించింది తానూ మంటగలిసింది. ఓడిపోయిన లోకం, గెలిచిన తాను చివరకందుకునే ఫలితం ఒకటే. ఉదయం వెలుగుతో సూర్యుడు రాత్రి చీకటిలో చంద్రుడు. వివృత సంవృత రూపాలలో సృష్టి వికాసం, పరివర్తనం. ముక్తకాలు ప్రతి వస్తువులోని అందాన్ని తెలిసికోవడం ప్రతి మనిషికీ సాధ్యంకాని మాట నిజం. ప్రతి మనిషినీ సంతృప్తి పరచడం ప్రతి వస్తు ప్రకృతికీ అతీత విషయం. ప్రతి క్షణం నశిస్తున్న జగత్తులో అనుక్షణం జరుగుతూంది సృజన. ఉదయం కరగిపోయే మంచువలె మనస్సులో సరిస్తూంటవి ఊహలు. ఒకప్రక్క అంతరిక్ష శోధనలో విజయం ఒకప్రక్క అంతర్బహి క్షోభలతో జీవితం. ఎప్పటికపుడు దాటవలసి ఉండే కాలం. క్రమ్మి భయపెట్టే నీడలు !విచ్చి ఆకర్షించే వెలుగులు ! మనిషికన్న మనిషి ఉన్నతంగా బ్రతుక దలచినపుడు నాటికి నేటికి ఏనాటికీ నశించదు సాహిత్యం. మనిషికన్న మనిషి అధికంగా బ్రతుకదలచినపుడు ఏనాటికైనా విజ్ఞానానిదే అధిక ప్రాబల్యం. రాత్రి వెలుగు చుక్కలవలె కనులలో దీపించే ఆశలు. పగలు, రాత్రి రోజు వెంట రోజు బ్రతుకు విసరు రాయి మాస్తరు. పగలు రాత్రి వచ్చిపోతూనే ఉన్నవి. యుద్ధాలు క్షామాలు వచ్చిపోతూనే ఉన్నవి. ఇంకా మేల్కొనని జన సందోహం గాయాల బాధ ఎరుగని కళేబరం ! ముక్తకాలు అగ్నినార్పుతూ తిరిగేవారు కొందరు అగ్ని రగుల్పుతూ తిరిగేవారు కొందరు ! సాగరం నిండా ముత్యాలే ఉంటాయా ? భూమి అంతా బంగరు గనులేనా? వీరుని రక్తసిక్త దేహంవలె జ్వలిస్తూంది సంధ్య. ఒక దీపం ఆరింది మరో దీపం వెలిగింది. జీవిత నాటక మెంత వరకు ? మృత్యువు తెర పడనంత వరకు. బ్రతుకు భేషజమెంత వరకు ? ఆశకు ఆఘాతం రానంత వరకు. స్వప్నం వచ్చింది బ్రతికి ఉన్నట్లు తెలిసింది తెలివి వచ్చింది చచ్చి ఉన్నట్లు బూజువైంది. ఈ లోకంలోకి రావడమంతా సమానంగానే బహు సామాన్యంగానూ ఈ లోకం వీడి పోవడమూ అంతే ఈ మధ్య పాత్రలోనే విశేషమంతా. నిన్నటి పరివర్తనం నేటి దృష్టిలో సంప్రదాయం ! రేపటి పరివర్తనం నేటి దృష్టిలో అభ్యుదయం. ముక్తకాలు ఉదయించిన చుక్కలు మదిలో ప్రసరించిన వెన్నెల హృదిలో అహంకార రూపం దాల్చి కనుల ముందు, అంధకారం ! మహా నది స్త్రీ, రసాకృతి పురుషుని కామం, ఆరని అనలం. ఒక పరిధిలో స్త్రీ స్వతంత్రురాలు ప్రవహించ లేదు, ఆధారం భూమి లేక. చలికి బిగిసిన జీవితం అంగారం కోరుతుంది. మరో ఉదయం కోసం బ్రతుకుతూ మనిషి హృదయ హాసంతో వెలిగించేను చీకటి రాత్రులు మృత్యువును జయించడమే చివరకు మిగిలేది. గతిస్తుంది మానవయుగ పరంపర మేధా విలసనలతో, హృదయ స్పందనతో, స్ఫూర్తినిస్తూ మానవ క్రమ వికాసం నిలుస్తుంది చరిత్రలో మెట్లు మెట్లుగా శిరస్సుపై వెలుగు చిమ్మే సూర్యుడు కనులముందు దారులు విచ్చిన ఆశలు పాదాల క్రింద తిరుగుతూన్న భూమి. మనస్సులో, దారి తెలియని నీడలు ! మానవుని ఊహ చివరి బిందువు, ఈశ్వరుడు. ఈశ్వరుని సృష్టి చివరి రూపం, మానవుడు. ఎవరికోసం నిర్మితమౌతూందో భవనం వారి చేతలలోనే అవుతూంది వినాశనం ! ముక్తకాలు గులాబీ హృదయం చుట్టూ కంటకాలు దూరం నుండి ఆనందింపజేస నెత్తావులు దానిని త్రుంచడం తెలియడం లోకజ్ఞత. దానిని వశపరచుకొనడం లౌకికం. ఇసుక రేణువులు లెక్కపెడుతూ కాలక్షేపం చేయకు జీవితమంతా ఎడారి విప్పిన ఎద రూపం చూడు. ప్రవాహ తరంగ పంక్తుల ఊహ చేయి. నీ మనస్సులో నీడలు లేనంత వరకు నా ముఖంలో వెలుగు కన్పిస్తుంది. సముద్రంలో సాగినట్లు ఓడ నడక వెలుగులో తెలుస్తుంది నీడజాడ! ముందుగా శిశిరం వేస్తరానీ దైన్యంతో దాని వెనుక వసంతం వచ్చే ఆశ ఉంటే చాలు. కనులుమూసే చీకటిరానీ పరవా లేదు. కనులు తెరచే వెలుగు నీలో ఉంటే చాలు. ఎప్పుడూ ఎక్కడా ముఖమెత్తి చేయిచాచి ఆకలి గొన్నవానివలె పయనించకు ! ఎప్పుడైనా ఎక్కడైనా ఎద విప్పి చేయి ఎత్తి తృప్తిపడిన వానివలె వర్తించు, చాలు. మబ్బు నశిస్తుంది వర్షం విరిసి కురిసి పూవు రాలుతుంది అందం, గంధం చిమ్మి, గాలి కదలుతుంది ప్రాణం స్పందింపజేస్తూ బ్రతికి నీవు ఇచ్చేది? తోటివారికి దుఃఖం ! ముక్తకాలు మనిషి ఒక పూవు, ప్రపంచం ఒక తోట ఈ పూవులెన్ని విధాలంటే చెప్పరానన్ని. రంగుపై మాజు ఉంది, పరిమళమూ కావాలి రెండూ కలిగిన మానవులంటే మరీ ఇష్టం. నా కనులలోని నీరు ఆవిరై పోయింది బయటికి రాకముందే వేదనకెపుడో అదృష్టం మేల్కొన్న గులాబీ వదనంపై ఉదయం మంచునీటి ముత్యాల వరుస. కదలెడి సరస్సువలె మనస్సు వదలని నీడలవలె ఊహలు ! ఒక దానివెంట వేరొకటి రాకడతో నా ముఖం చూచుకునే వీలే లేదు. నేను ఓడను ! అయితే భూమిపై ఎలా పయనిస్తాను ! నేను నీడను ! అయితే వెలుగులో తేలగలను. గ్రుడ్డి రేయి అద్దంలో ముఖం చూచుకున్నా నా రూపం మినహాయించి కన్పించాయి ఎవరెవరివో. రాలిన పూవు శీర్ణమై కలియడానికి మట్టిలో ఎంత కాలం పడుతుందో? అదే నిజంగా చావు సమయం ! ముక్తకాలు నరకం పాపిని శిక్షించింది. పాపం అడుగునే దాగి ఉంది. దేహ మందుబాటులోనిదాయె ఆత్మ అంతు చిక్కనిదాయె. లేదు విశ్రాంతి నీకు నాకు లేదు విశ్రాంతి ప్రపంచాని కంతకన్నా లేదు దేవుని కంతకన్నా లేదు. తండ్ర! నిన్ను కీర్తించడానికి నాకు సమయం లేదు ! నేను భయపడ్డ తుపాను అపుడే వచ్చే సూచన లేదు. ఇది కాసారమా? మృగ తృష్ణో తెలీదు. ఇది సర్పమా? రజ్జువో? అంతకన్నా ఇది రూపమా? ప్రతిరూపమా తెలీదు. ఇది అదా ? అది ఇదా ? రెండూ ఒకటేనా ? నిదుర వదలిందో లేదో ఎక్కడ చూచినా ముఖాలు ఒక దాని నొకటతిక్రమించే మంచు తెరలు, నిప్పు ముద్దలు. ప్రతి మనిషిలోని భావరూపం వేరు ప్రతి మనిషిలోని అనుభూతిగణం వేరు అందుకే ఆగదు అన్వేషణ జీవితంలో ఎప్పటికపుడు క్రొత్త రేకులు తొడుగుతూ. ముక్తకాలు శబ్దం పిలుస్తుంది ఎలుగెత్తి హృదయం డలువడింది విసుగెత్తి వస్తూ పోతూన్నారు మహా జనం ! తల చేతులూ కాళ్ళూ ఒకటే. గాలి విసరుతూంది సృజిస్తూ అగ్ని చిత్రాలు. జ్వాల విజృంభించింది పొగులిస్తూ రగిలిస్తూ పూల గుండెలు. అగ్ని పర్వతంపై గుడిసెవలె ప్రపంచం అగ్ని గురించిమాని, అగ్నిగా మార్చు ! పాట — రాత్రి కెదురుగా ఉదయం వలె నిరాశ కెదురుగా మానవత. మృత్యువు ప్రతి లిప్తలో ఉంది జీవమూ ప్రతి లిప్తలో ఉంది మృత్యువు నీడలో బ్రతుకు జీవం వెలుగులో బ్రతుకు. సూర్యుని మెలకువతో సంతోషం చంద్రుని వెలుగులలో ఆహ్లాదం, సరే చీకటిలో, సానుభూతితో స్పందించనీ, హృదయం కాస్త. ఎండ ఒక ఋతువులో వాన ఒక ఋతువులో గ్రీష్మం, వర్షం ఒకదాని వెంట మరొకటి ఒకటి వినా లేదు మరో దాని మనుగడ. ముక్తకాలు తిరిగి తిరిగి చివరకు అక్కడికి చేరాడు మొదటికి ఎవరి పైనా నమ్మకం లేదు అందుకే ఎవరూ నమ్మరు. వాన చినుకులు నవ్వుతూన్నవి అవని పై పడక ముందే ముత్యాలు. పైన పక్షీ క్రింద శిశువూ పరవశంతో పరుగు తీసారు . బంగారు రేకుపై పేరూ ఊరూ చెక్కి సముద్రంలో వదలి వేశాడొకడు శాశ్వతంగా ఉండిపోతుందని పాపం ! అవును, ఉందేమో! ఎవరికి తెలుసు ! భీటలు వేసిన కాలపు సందుల్లో ఇరుక్కొని పోయిన కోరికలు ! వర్షా సమయం లిప్తల కదలికలో వినిపించ ప్రయత్నిస్తాయి సంగీతం ! రేపటి ఉదయంపై ఎంతో ప్రేమ అయితే చీకటి నెదుర్కోవలసి ఉంది రేపు మేల్కొనడం కోసం ఈ రాత్రి విశ్రాంతి, అవసరం. మన మెక్కడ కలిసామా తెలీదు విడిపోయింది గుర్తుంది బాగా. ఆలోచిస్తే, ఆశ్చర్యం! మనిషీ, మాటా మట్టిలో గాలిలో కలిసేవేనా! ముక్తకాలు రేపు ఉంటే మంచిదే వివేకం కోల్పోక, ఈ రోజు ఉందే దీన్ని అధ్వాన్న పరచుకోకు. వేచి ఉన్న కొద్దీ ఓరి మెక్కువౌతుంది నాలో ప్రవహించిన కొద్దీ ఉరవడి తగ్గినట్లు ప్రవాహం. బ్రతుకులో తప్పనిసరి నిర్వేదం అప్పటి నిశ్వాసం భూగోళమంత భారం మనం కోరని మృత్యువు మనలోనే ఉంది చిత్రం. వెలుగు ముద్దు పెట్టుకుంటుంది ఆకునీ పూవునీ పండునీ చీకటి బుద్ధి చెబుతూనే ఉంది ఊహకు ఆశకు మనస్సుకు. ఇదొక మహా శ్మశానం. దేనికో ఒకదాని ఏడ్చేవారే, అంతా లేదు ఒక్క క్షణమైనా ఏదో ఒక చావు లేకుండా, ఎప్పుడూ. రోజు వచ్చిపోతూంది బ్రతుకులో రాత్రి తారాజల నేత్రాలతో ఉదయం హిమరుక పాతంతో మధ్యాహ్నం నిశ్వాస పరంపరతో. ముక్తకాలు ప్రతివాని మనసులో ఉంటుంది వేదన అది అతనికి కోవెలలో మ్రోగే సన్నాయి. ప్రతి వానికీ తన మనస్సు ధవళపద్మం. ప్రతి వానికీ తన వేదన మహాపర్వతం. భూమి గాఢ నిద్రలోనున్న వేళ ఆశలు హ్రస్వమైన సమయం ఎక్కడి నుండ నిశ్శబ్ద రోదనం? మంట గలిసే మానవతదేమా! ఏకాంతాన్ని భగ్నం చేస తలపులో వేయి ఊహలు. మెలకువను మాపివేస యత్నంలో వేయి స్వప్నాలు. నీ ముఖం కన్పించదు అద్దంలో చూచుకుంటే కనబడుతుంది చూపుకి లోతు తెలీని సరస్సు. నా ఎద కన్పించదు నాకు. అనుభూతిలో తలచుకుంటే గోచరిస్తుంది బుద్ధికి తీగెలు సరిచేసిన వయొలిన్. రాత్రి వ్రాలేను నాపై బరువుగా పగలు తప్పుకునేను ఒడుపుగా ఎడారిలోనూ ఎక్కడో పచ్చదనం ! విషాదంలోనూ ఎక్కడో మాధుర్యం ! ముక్తకాలు మృత్యుసీమ లనంతం ఊహ చివరలూ అనంతం తెలియదెక్కడ మొదలై ఎక్కడంత ముగుస్తాయా? కాలం మరపు గతం కాలం తెలివి వర్తమానం తెలివితో ప్రయాణికులు ఎవరికి వారు సర్దుకుపోతారు. ప్రతివాడూ అంతో ఇంతో మంచివాడే ప్రతివాడూ అంతో ఎంతో చెడ్డవాడే ప్రవాహం మమతను స్ఫురేస్త పర్వతం ధైర్యం కలిగించేది. బ్రతుకంటే ఏమీ లేదు ఒక దోసైడు నీరు పనికి వస్తుంది త్రాగడానికీ తర్పణం విడువడానికీ. నిదురించే శిశువువలె ఉగాది ఆకతాయి కావచ్చు రేపిది ఆ పైన ఏమవుతుందో పెరిగి ? వేయాలి సుమీ జాతక చక్రం ! రోజు పుట త్రిప్పుతోంది చావు ఎరుగని రాత్రి ఇంకా ముగియలే అధ్యాయం ఇది సమాప్తిలేని గ్రంథం. ముక్తకాలు యుద్ధ భయంలేని వాతావరణం ఎప్పుడు సిద్ధించింది చరిత్రలో ! వచ్చే తరాలు మనలోని మంచితో పాటు చెడుకీ వారసులే ! మృత్యువుకి మనపై ఎంత ప్రేమ ! ఎప్పుడూ వేచి ఉంటుంది పాపం ! మనకు దాని పై అంతో ఇంతో అభిమానమూ లేక పోలేదు. ఎవడూ ఇక్కడ చావుకు సిద్ధంగా లేడు. అయినా వస్తుంది చావు తానై సిద్ధంగా బెజ్జం ఉన్న నావ అయినపుడు నిలుస్తుంది సాగినంత కాలం; జీవితం. మన ప్రయాణంలో మైలురాయి వస్తుంది ఉగాది తడిపొడి గాలులతో కాలం ఊపిరి తీసుకుంటుంది తెరపిగా బ్రతుకు చేదు రుచి చూస్తుంది తీపిలో. యంత్రాలు మారణ యంత్రాల అభ్యుదయంతో రూపొందిన నాగరికత మానవ ప్రగతికి ప్రతి బింబం. తప్పించరాని చరిత్ర గతి రూపం. గాలికి నిశ్చలంగా ఉండేనా చెట్లు ? మ్రోడులు బండలు, గుట్టలు తప్ప ! సంగీతం విరమించి ఉండగలదా సముద్రం ? గుంటలు, పడియలు కాల్వలు తప్ప ! ముక్తకాలు ఏ ఒక్కరి బ్రతుకు నీడలేని వెలుగు దివ్వె కాదు. ఏ ఒక్కరి బ్రతుకు వెలుగులేని చీకటి ముద్ద కాదు. బ్రతికి ఉన్నంత కాలమూ తామొక శిలాశ్రేణి యేనా? చచ్చాక మరి దేనితో సమానం? మట్టితో, అదీ మార్పులో భాగమే ! ఆలయ గోపురాలకు, విగ్రహాలకు బంగారపు తొడుగులు, ఆభరణాలు. ప్రక్కనే విలువలేని బ్రతుకులు ఉడుపులంతకన్నాలేని శరీరాలు. దివ్వియ ఒడిలో పడుకున్న నాకు తెలీదెప్పుడు వస్తుందో ఉదయం. దివ్వియఎదలో వెలిగే నాకు తెలీదెప్పుడు వచ్చేది రాత్రి. వస్తువుకు కదలికకు మనస్సుకు ఆలోచనకు జగత్తుకు మానవునకు సమకురే సంబంధం, చరిత్ర. భయం మాయకు చిహ్నం. మాయలో మనిషి అజ్ఞాన శిఖరం. తెలీనితనం తప్పిస్తుంది దారి. ఏదారెక్కడ తెలీదు తేలీదు. ముక్తకాలు కాలం పరిణామకారి. కాలం పరివర్తన శీలి సృజన శక్తి, కాలం నాశన గతి, కాలం. శప్త కంఠాలతో వస్తూపోయే జనం ఎక్కడా చూపు మేరలేదు పచ్చదనం భగ్గున సంస్కృతి మండే మంటలలో తెలుపు విరిగి ఎరుపెక్కిందవనీకపోలం! కాదు నేను జలధి తరంగం అవును నేను కదలే కన్నీటి కెరటం కాదు నేను కదలనేని విగ్రహం అవును నేను రూపంలేని ఆకాశం. దుఃఖం సముద్రం వంటిదంటారు పల్లం నుండి చూస్తే కన్పించదు చెలియలికట్ట నధిరోహేస్తనే కన్పించి అనుభూతి నిస్తుంది! రాత్రి పగలు నిజంగా నా సేవకులు యజమానులవలె ప్రవర్తింప జూస్తాయి నిదురించిన వేళ ప్రత్యక్షంగా మేల్కొన్న వేళ పరోక్షంగానూ. చంద్రుడు వచ్చినా రాక పోయినా రాత్రి నిల్వదు, అనుభవం ఆగదు రేపు కన్పించేను, కన్పించక పోయేను ఎగురనీ జీవితం ఉషయై. ముక్తకాలు ఉష ఆగమనం ఉష ఆగమనం పరివర్తన సీమలలో పరిభ్రమిస్తూన్న నేను ఆ ముఖం కోసం చూస్తున్నా ఆ హృదయం కోసం వెదకుతున్నా. నా కనులలో వెలుగై వెలిగేదీ నా హృదయంలో ప్రాణమై ఉండేదీ. పక్షి జంతు మానవ రాక్షస దేవతలలో భూమి నీరు తేజస్సు గాలి ఆకాశంలో మబ్బు మొక్క పూవు పండు స్వప్నంలో సామ్యం గమనించేదీ, భేదం గుర్తించేదీ, అంశలెరిగి తాదాత్మ్యం పొందేదీ అనుభూతి కొలతలో అంతరార్థ మెరిగేదీ. పంట తిరిగిన ముఖక్షేత్రాల నవలోకిస్తూ మ్రోడువారిన వృక్షాలను పరామర్శిస్తూ, దుఃఖం దుర్మార్గం సంతోషం సన్మార్గం ఆశ ఐశ్వర్యం, క్షామం నిరాశ విజయం అపజయం, బ్రతుకు చావులో నను ప్రశ్నిస్తూ సమాధానం కోరేదీ నను ఊహింపజేస్తూ అనుభూతి నిచ్చేదీ. ఉష ఆగమనం ఎక్కడో వెదకుతున్నా ఇక్కడే ఉంది ! అరుణ కిరణ శ్రీ సరణి రూపం ధరించిన అమృత దీపం! ఈమె నెక్కడో చూచినట్లుగా ఉంది ఎంత కాలమా అయినట్లుగా ఉంది నా ముఖ దర్పణంలో పూర్వం ప్రతి బింబించిన చంద్రబింబం. నా మనః కాసారంలో పూర్వం విహరించిన రాజహంస. చలచ్చంచలోన్మీలిత జలదపంక్తి, గగనం ప్రతిఫలించిన గభీరజలధి! జ్ఞాపకం వస్తూన్నవి వరుసగా, ఈమె, ఆమె ఒకటేనన్న భ్రాంతిజనకంగా. మూర్తీభవత్ శిశిరంవలె వస్తూన్న ఈమె ఎవరో మొదట సరిగా తెలియ లేదు. అందుకున్న హృదయస్పందన వేగంతో, క్రొన్నెత్తురు నిండి, వాసంతశ్రీకమై వెలుగుతూంది, నవన్నవతాకృతి. అప్పటికి ఇప్పటికి ఎంతగా మారింది ? మానవ జీవితం; ప్రపంచ రూపం ! ఆశ్చర్యంలో దాగిన ప్రశ్న, సమాధానం వలె, ఊహలో ప్రతి ఫలిస్తూంది నే కోరిన రూపం. ఉష ఆగమనం కాలం తెచ్చిన మార్పు గుర్తించనీయలేదు మొదట. ఉదయం మంచు తెరవలె ఇపుడు వీడింది నిదురపొర. 2 నీవు చైతన్యసీమలో ఊహాశిఖవలె అడుగిడేప్పుడు నాలోని అభిమతి నీ కెదురై తోడ్కొని వస్తుంది కౌగిలి పూని. అరణి నుండి అగ్నివలె నీ నుండి మరో రూపం. నాలోని విశ్వాసం తెచ్చి ఆశకు ఇస్తూంది ప్రాణం ! సుడి గాలులు రేగుతున్నవి మతిలో సుడిగుండాలు భ్రమిస్తున్నవి నెత్తురులో. కాసారంలో నౌకవలె హృదయంలో చరిస్తున్నావు నీవు. నీ కళా సౌందర్యం కన్నుల మెరపులలోనే కాదు తరువాత తెలిసింది కన్నీటి చినుకులలోనూ ఉందని ! వెనుక అసంఖ్యాకంగా స్వప్న కథలతో వచ్చేదానివి ఇప్పుడంతకన్న ఎక్కువగా వాస్తవ స్థితులతో వస్తున్నావు. ఉష ఆగమనం వెలుగుతో ఎదురౌతున్న నీకు స్వాగతం పలుకుతున్నా రోదసినై ద్యావా పృథివీ దేవతలు ఆశీస్సులు ప్రసరిస్తున్నారు. నీ గురించి ఎన్ని కలలు కన్నాను నీ నిజరూపం మరచి పోయేటంతగా నీ గురించి ఎంతగా కలలు కన్నాను ఇక మేల్కొను స్థితికి రాలేననుకున్నా. అన్ని దిశలు తెరచుకున్నాయి నీవు వచ్చే దిశలోని వెలుగుతో. చీకటి చీరలు తొలగి మంచు రవికలు జారి గాలి పొరలు ఒదిగి ఒదిగి వెలుగు దారి ఏర్పడుతున్నది. భూమివలె నీవు కన్పించినపుడు సృష్టికి మూలశక్తి వనుకున్నా. ధ్వనిలో స్ఫూర్తి పొందినపుడు ప్రణవ రూపమనుకున్నా. గతంలో వ్రేళ్ళు దన్నుకొన్న పురా వృక్షానికెక్కడో పూచిన పూవుగా ఉన్న నీవు, స్వప్నంలో ఊపిరి నిలుపుకొని స్వర్ణఖచిత రూపంలో గగన విహరణం సలేప నీవు, వర్తమానంపై చూపులిడి ఉష ఆగమనం జీవిత చిత్రానికి జీవరేఖవై వచ్చేవు భూమిపై అడుగులు వేస్తూ. చైతన్యం విరిసిన ఆత్మ రోదసిలో భామతి ఉషస్సు అవతరిస్తూంది! సహమతి అగ్నిమూర్తి, సూర్యునివలె ప్రసరించి పరీవృతుడనై ఉన్నాను. సౌందర్య శిఖ వచ్చింది ఆమె కాంతిమతి నీడ ఎరుగని దీప శిఖ. అంధకార శిలా పంక్తులు చందన వృక్ష సమితిగా, జీవన శకలం స్వర్లోకంగా భావింపజేయు శక్తి రేఖ. ముఖంలో అలలుగా హాస పంక్తి కనులలో అమృత బిందువులు ఉదయం తీసుకొన్న మొదటి నిశ్వాసంలోని ఆశా పతాకల ఉత్సాహ దీప్తితో వచ్చింది ఆమె కాంతిమతి. నీడ ఎరుగని దీపశిఖ. వర్షాగమన వేళ శీతల సుకుమార వాయువువలె ఉష ఆగమనం లిప్తల మెట్లపై సంగీతలహరియె వస్తూన్న ఆమె పాదాల ముందు బారులుగా విచ్చినవి వెలుగులు. దృగ్వీధి గుర్తులుగా ప్రబ్బికొన్నవి నీలిమబ్బులు. హృదయంలో పల్లవించి పెదవి పై కుట్మలించి వాక్కులో సుమించు దివ్యమైన అనుభూతితో, కాంతిమయం చేసి వాయువలయం, లిప్తలు పరిమళితంచేయు వెలుగు దివ్వె. ఝుంఝానిల తీవ్రత్వం నైశిత్యం ఎరుగని మొదటి వాసంత క్షణం. పరిమళ వదనంపై రోచిర్వాసంతో విచ్చిన హిమ స్వప్న పద్మం. సర్వధ్వనులూ తనలో విలీనం చేసుకొన్న అఖండ శాంతి రూపం. మూర్తీభవత్ అమృతలహరి. నా అంతఃకరణంలో ఆమె కదలిక కాల చక్ర లయాత్మక గమనం. ఆశా పరివేషితమె అఖండ శాంతి ఆమెతో వచ్చింది నాలోకి, మూర్తి కట్టి. రవి కిరణం భూమిపై అడుగిడే ముందు పల్చని గాలి తెర పై, ఊహా చిత్ర పరంపర సృష్టించుకొనే ఆకాశ శతపత్రం వలె ఆమె. ఉష ఆగమనం గగన తలంపై చంద్రబింబ మవతరించగనే స్వాదు తర సంగీత ధునీ విలోలమై, తనలో తా పరవళ్ళు త్రొక్కు రోచిరుదార సముద్రంవలె నేను. ii దివి నుండి అవిచ్ఛిన్నంగా కురియు దివ్యామృత కాంతి ధార ! భూమిపై తరగలొత్తుకొని వ్యాప్తమౌ పరిమళఝురి! దిక్కులేని దిక్కువలె, చీకటి రాయివలె పడి ఉన్న నన్ను ఉజ్వలితుని చేయు ఉదయ తేజోలతికలు, నీ కళ్ళు. గ్రీష్మవేళ వాయు మండలం చందన వాఃపూరమైనట్లు, నా భావ జగతి నీ అవతరణ మొట్టమొదటి వసంతోదయం. చంద్ర రేఖా బింబితమై పై కెగయు కెరటాలవలె, దిగ్వసనం ధరించిన సముల్లసత్ వక్షోజాలతో స్మిత సుమరుక్ దీపంతో శరన్మేఘ శిల్పాకృతి, నవనీత పాత పదగతితో, వీణానాద ఝురీ తరంగంవలె ఉష ఆగమనం మెయి వంపుల హోయలతో ఎదురుగా వచ్చు సౌందర్యశిఖ! ఆవిష్కృత నాద రూపమై కదలి వచ్చు నిన్ను చూచి అలలు తలలు వంచినవి గాలులు స్తంభించినవి. లే మంచుపొర సోకిన గులాబి రేకు పెదవులపైని, ఇంద్ర చాప వర్ణాలను; విశ్రాంతి నెరుగని గాలి సముద్రంపై కెరటాలను వలె సమీకరించి, మేళవించి సౌందర్యం ప్రోది చేస్తూ; సుప్త కళికలవలె అవిదితంగా గడచు లిప్తలెన్ని అర్పించా నీకు సమర్చనంగా. రవి దీపం అస్తమించగనే నాకు కన్పించినది నీవు. ఊహ బిందురూపం, చంద్రబింబం ! దీపం ఉన్నపుడు, ఆరినపుడూ చూచా. ఆ నవ్వు, తరంగవల్లి, హిమ స్వప్నం. ప్రాణవంతమైన నాదలహరివలె చకచ్చకిత కాంతి వలయంవలె ఉష ఆగమనం విచ్చిన కనక శతపత్రంవలె నీ రూపం అవతరించినంతనే నిద్రిస్తున్న లిప్తలు మేల్కొని సుస్వర సంగీతకులైనవి. మందీభవదీహలు కదలి జ్వాలా రుచిరములై నవి. గాలికి అంచెలు అంచెలుగా తేలివస్తూ నీటి ఒరపిడికి అణగి, వడికి ఉబికి లేచి ఎగసిపోవు కెరటంవలె, నిశా నేత్రాల నుండి దూకు దృక్చంద్రికతో వచ్చి నాలో లీనమై ? కాలం విప్పిన తీవ్రమైన కనుచూపు నుండి తెలివిగా తప్పించుకొని, నను మరపులో బంధించి ఏ నీడ, రహస్యం బైట పెడుతుందోనని శంకతో, చేతిలో ఒదగకుండా జంకుతో, చూపులో నిలువ కుండా సాగిపోవు చలన్మతి! చంచల వర్షాంబుద రమ్యతనూ ! గాలి వంటి ఆలోచనతో పటంవలె తిరుగుతూ నీ కోసం వేచివేచి, ఎన్ని అబ్దాలు మంచు కొండలవలె నిలచి పోయినవి. ఉష ఆగమనం ఎన్ని వసంతాలు ముగ్ధ ముగ్ధంగా తొంగితొంగి చూచి పోయేవి? దుఃఖ హంసతికలై మండుతూన్నవి? లిప్తను ఘనీభవించి ఆగిపోయినవి. నీవు మాత్రం — ఎక్కడో ఆగిన మొగిలు జంట మాదిరి వంగిన కనుబొమలతో, ఆకాశంవలె వహించిన మాన ముద్ర సేసమిరా వీడవు. వెలుగు వత్తులు వేసుకొని వేయి కనుల నుండి జలజల మంచు బొట్లు రాలుస్తూ నిశ్శబ్దంగా కరగి పోతున్నది కాలం. iii నిద్రా సరస్సులో వికసించిన స్వప్న కల్వారంవలె నీవు. జాగ్రదావస్థా తీరంలో చంద్రునివలె భ్రమిస్తూ నేను. కొండలు చీల్చుకొని వస్తుంది నది. మబ్బులు దూసికొని వస్తుంది మెరపు. విత్తు పెకల్చుకొని వస్తుంది మొక్క. మనస్సు విచ్చికొని నీవు రావు. సముద్రమవతల నీవు, ఇవతల నేను. నీటిపై తేలు చంద్ర నౌకలో రానా? ఉష ఆగమనం ఈ దిశనుండి ఆ దిశకు వ్యాపించిన శశి రశ్ములు పట్టుకు రాకూడదా ? సుందర దివ్యానుభూతి మోన్నత ప్రమాణం, స్వర్గం. స్వర్గ వికాసం, నీ రూపం లయమెరుగని సంగీతం, క్రమ్మిన మంచు పొరలు చీల్చుకొని కదలివచ్చు ఉదయ కిరణంవలె స్మృతి వలయంలో భ్రమించే నీవు. సముద్రంలో తరంగం వలె మబ్బులో మెరపు వలె, కన్పించి కనువిందుగా అంతలో మాయమౌ నీ రూపం. కనులలో బింబించి హృదయంలో సాక్షాత్కరిస్తుంది; గభీర నిశ్శబ్దంలో జనించి ఉచ్చ్వాస నిశ్వాసపుటంతరంలో ఒడ్డున విరిసిపోయే కడలి తరగలవలె అడుగుల చప్పుడుతో. ఆకాశంలోకి నిలువునా నిలచి చూచే వృక్షాల వలె సముద్రంలోకి అడుగులు వేసి కదలిపోయే నదులవలె; నిను పరివేషించిన ఉష ఆగమనం స్వర్లోక గవేషణలో విభిన్న ఛలాకృతులు దాల్చి తిరుగుతూంటివి ఊహలు, వాంఛలు. ప్రభాత వేళ రోదసి ధరించిన వెలుగు ముసుగువలె నున్నది. మనస్సులో ముగ్ధముగ్ధంగా పొడిచిన నీ భావగత సంతోష తరంగం. సంధ్యా రాగంతో ఆర్ద్రమైన పూల మబ్బు కదలేప్పుడు, నీవే వస్తున్నావని మ్రోగుతుంది. నిశ్శబ్దం నిండిన హృదయం. గ్రీష్మం కను స్వప్న సముద్రం నుండి సాగిన మేఘ మాలిక ! భూదేవత పెదవులపై నవ్వు మొలక లెత్తించు వర్షధార! అబద్ధపు వంపులొరసి ప్రవహించు నిత్యసత్య జలవాహిని వలె, బ్రతుకులోని లోయలు నిండి పూల నదివలె విరియు వెలుగువు! ప్రేమ పూర్ణ కాంతిశ్రీ! ఆసీమాంతం చెంగలించు రసధుని! వర్తమాన శిశిరం వెనుక వేచి ఉన్న వసంత రేఖవు! కాల వృక్షం పూచిన పూవులో దాగి ఉన్న ఫల రూపానివి! ఉష ఆగమనం iv సృష్టిగత నవోహలో ఒదిగి ఒదిగి సుప్తాకృతి, వ్యక్తిగత పరిధిలో స్వప్నాకృతి పరిణమించే మనోగోళ పరిధిలోని జ్యౌత్స్నీ స్నిగ్ధతనూ! యుగ యుగాల నుండి సౌందర్యతృష్ణ తీరక స్త్రీ రూపంలో మలగిన ఉదయ కిరణం. నేత్ర వీధి కుసుమించిన కాంతి వల్లిక ! ఊహ జగతి నిండిన పరిమళఝురి! నిశ్శబ్దంగా కాలం వేస్తున్న అడుగుల చప్పుడులో లిప్తానేక మంజీర ధ్వనులు. ధ్వనిలో హసించు నవోహలో అనురణించే సౌందర్య కళానుభూతివి. ఏదో ఒక వర్ణంలో వాక్కులో రూపంలో నీ విచారణ ప్రవహింపజేసి బ్రతుకులో కల్పన గావించని ఊహమతి లేడు. సన్నని మంచు పొరలు కప్పిన సూర్యుని తేజశ్చక్ర పరిధిలో, ఒక ఉషస్సు, ఒక ఋతువు, ఒక ఉగాది మనోజ్ఞ తరుణంవలె అవతరించే నీవు. యుగాలుగా ఆత్మనంటికొని యుండు సుందర ఛాయా రూపానివి! ఉష ఆగమనం జివ్వున వెలుగు కెరటంవలె వచ్చు నీకు సంగీత మాధురి సంతరించే వాయువును. పగలు రాత్రి పేరిట ఎన్ని దీపాలారినవి? కాలగమనం కన్పించనీయదు నీ ముఖబింబం ! నీవు అందవు అపుడపుడూ, అయినా పరుగిడు తూంటవి చంద్రునివెంట మేఘాలవలె ఆలోచనలు. నేను కన్పించను అపుడపుడూ అయినా వెదకుతూంటవి, దిక్కుల వెంట గాలులవలె నీ ఊహలు. జలధి మధ్య ద్వీపం వలె నీ వియోగ పరీవృతుడనై, నీడ మధ్య దీపం వలె నీ వియోగ సమావృతుడనై, పై కెగసి పోవాలని ఆకాశం వైపు చూస్తూన్న క్షణం, మనస్సులో జ్వలించే వేదనతో పెదవులపై బింబించే సంధ్యతో రోదసి దూకిన ఉషస్సు వలె నా ఎదపై వ్రాలుతుంది నీ రూపం. సమాకర్షించి నన్ను బధిరుని, అంధుని చేస ఈ వాయు సంగీతం సౌవర్ణ కళా శిల్పం! పద పదంలో ప్రత్యణువున మాధుర్యం సౌందర్యం, ఉష ఆగమనం నదించు రసాకృతి. స్పందించు వసంతమూర్తి. కనుచూపులలో విరిసి నక్షత్రకాంతులు పెదవి వంపులలో ఒదిగి సంధ్యాలహరులు, చిరునవ్వులలో హసించి వన్నెల వత్తులు చక్షు రమ్యాకృతి మలగిన ప్రకృతి రేఖ. శంపాలతలు సుమించు కన్నులతో ఆశాశిఖలు వెలిగించు చూపులతో వేదనా జ్వాలలెగయు పూలనది ! అమృతకాంతి ప్రసరించు సౌందర్యశిఖ ! రసాకృతి గుండె లోతుల నుండి త్రవ్వుకొని వచ్చు సౌందర్య రసాపగాఽవిష్కారము నీ యాకృతి. చైతన్య శక్తి మూర్తీభవించిన కళా శిల్పం, నా స్మృతి నాక్రమించుకొన్న నీ భావన. నిశ్శబ్ద నిద్రావస్థ నుండి మేల్కొని నైల్య స్థితిదాటే సమయం, నా మనోరోదసిని ప్రాభాతమయం చేస మోదార జ్యోతిస్సాహితి. ఉష ఆగమనం వాడిన కనుచూపులు పెనవైచుకొని ఏ పురాజనూ రహస్యాలనో స్మరింపజేసను, శరన్నీల గగన రేఖలు బింబించుకొన్న సరశ్శోభా తరంగములుబికి వచ్చు నీ కన్నులు. అశ్రుకణ సమూహం రాతి రూపు చెందినట్లు గ్రీష్మమరుద్వితతి పెనవైచుకొన్న అగ్నివలె ఆర్తరవము మ్రోగి మ్రోగి నిల్చిన మ్రోడువలె భూమిపై ఒక మూల నిశ్చలంగా పడి ఉన్న నేను– అనిర్ణీత ప్రపంచ పరిధి మానవతా మృదు జన్మ ఎత్తి ఎదో ప్రవృత్తి మిడుకుచున్న నాకెన్ని జన్మలకో కలిసి, బ్రతుకు లోతులు స్పృశించి వెలుగులు త్రవ్వి తలకెత్తే నీవు ఒక వసంత వాయువు వలె సాగిరావొ ! శిశిర మూర్తిని నేను. ఆకాశంవలె అందీ అందని నీ స్పర్శానంద భావనలో మైనరాల పరవళ్ళు త్రొక్కు అమృత భరోత్సాహంతో దీప్తమైన ఆత్మ ముఖమెత్తి దీర్ఘమైన ఊహల రెక్కలు చాచి, నీ నీడనైనా అందుకొనగా అ! ఎంత కాలం యత్నించా, ప్రతి దినమొక నిశాధూమ పిహితానన మండలమె హసింపగా. ఉష ఆగమనం ఎంత కాలం నుండో హిమశిలంవలె బిగిసి, ఎంత లోతుననో అట్టడుగున దిగబడి ఉన్న, నన్నొక్కమారు వెలుగు గడ్డకెత్తుకొని పోయి, రసధునివలె ప్రవహింపజేస ఉదయమూర్తి! నా మనశ్చక్షువు నీ రూపమెంత దగ్గర అంటే ? వెలుగుకు నీడకు మధ్య ఎంత దూరమో అంత ! అవిచ్ఛిన్న కాల గమన స్వరూప వ్యాఖ్యాన మతులు, రవికీ శశికీ గల సంబంధం మనకు గల బాంధవ్యం. సంధ్యా సమయం ఆసన్నమయ్యే వరకు నిత్యం, లజ్జారుణ హసన్ముఖ దీపమై వెలుగు రెక్కలతో ఎగిరి వచ్చి కనులు మూసి నాలో లీనమైన నీ రూపం మరలినట్లే తెలియదు. మలిసంజవోలె వ్రాలిపోవు నా కను రెప్పలలో తొలి సంజలందు నింగివోలె దూకు నీ ఆకృతి. () ఉదయాకాశం వలె ఉష ఆగమనం విప్పారిన నా కనురెప్పలలో ప్రతి బింబిస్తుంది! దృగ్ రేఖాతీతమైన నీ భావన. అద్దం ముందు నిలువగనే బింబించిన నా ముఖానికెదురుగా వికసన్మృదూజ్వల పద్మం కాల ముద్రలు స్ఫురించని ముఖం ! నిశ్వాస పవన రేఖలతో ఎదురుగా వచ్చి విశ్వాసంతో, చాంద్రీహాస గగనంవలె నీవు, చుట్టూ నిరంతరం శ్రుతి పోస్తూ కదలే నాదవాయు పరిషత్తులు. ప్రాణ దఘ్నంగా ముంపుగా విరిసిన చాంద్రీ రేఖలతో సాగే పరిమళ వాయువులు చీల్చుకొని వచ్చి నాలో లీనమా తుషారదీధితి! అపుడపుడూ నా ఎద ఒర నుండి దూసిన మాటల కత్తి పోట్లకు గాయపడిన హృదయం నింపుకొని పూలు గుత్తులుగా కదలివచ్చు నవనీతాకృతీ ! బహు పూర్వజనూ రహస్యాలను స్మరింపజేయు స్మృతి కేంద్రం. ఉష ఆగమనం జీవనాడులు తంత్రులవలె స్పందింపజేయు గాంధర్వం రూపొందిన కళామూర్తి! రమ్యబుద్ధి, వెన్నెలల మృదూహలతో, గగన మండలం, వాయుపథం, భూవలయం సత్త్వభావ రమణీయ సీమలుగా మార్చే ఆత్మ భావనాంబుధి శశి. అద్దంలో చూస్తే కన్పించి ముఖంలో ముఖంపెట్టి అద్దం తొలగేస్త ఊహవలయ మాక్రమించి జాగ్రత్ సుషుప్తి స్వప్నంలో సదా ఆత్మ నంటియుండు ఆనంద రసాకృతి. ఈ సంకీర్ణ ప్రపంచంలో మసలుతూ ఏ వర్ణపు దుస్తులూ, ఏ రాగస్పర్శ ఎరుగని నా నగ్న మనఃప్రకృతిలో సూక్ష్మాతిసూక్ష్మంగా మలగిన సుందర శివ రూపం, నీ ఆకృతి. ii కాంతి పూలు ప్రసరింపుము కనుల నుండి మెరపురేకలు చెంగలించు మబ్బులవలె, మనసువిప్పి మాట్లాడుము అమృత భాష. ఉదధి పొంగ వినిపింతును కాంతి గీతం. సప్తవర్ణ కిరణ రూపంలో కదలి రమ్ము వెలుగుంగరములవలె సాగిపోవగా ఊహలు సన్నని వెన్నెల వత్తివలె ప్రకాశించు నా పైకి పాడు గాలిలా, కారు మబ్బులా రాకు. ఉష ఆగమనం గగనుని సిగపై వ్రేలెడు వాడని చాంద్రీ దామంవలె ప్రతి నిశీథి బింబింపుము నిభృత కళా మనోసరసి. మెరపు తీగె సోనవోలె వెలుగుచు రా నా మదిలో నీలి మొగిలు గుడి వోలె ఈ శరీరమును మలచెద. కదలిపోవు నీటిపై రాతి వంతెనగా మలచివైతు ఈ బ్రతుకును కదలిరమ్ము కాల రథము పైన. ఎగసివచ్చి రివ్వున దూసైడు కాలపు కరకు కత్తి వాదరచే, రెక్కలు నరుకబడిన గిరివలె దిక్కులు చూస్తూ ఉండలేను. కోతపెట్టు శిశిరకాల నిశిత వాయువులకు తాళ లేక వణకుతూ వృక్షంవలె దేహం ముడుచుక ఉండలేను. ప్రసరింపుము కాంతి రేఖ నాపై హృదయం విప్పారగ మురువుగ చైతన్య కళామూర్తి స్ఫూర్తివి నీ వే దేవతవో నే నెరుగను. ఉష ఆగమనం పొరలు పొరలుగా మలగిన చీకటి గుడిలా రూపొందిన ఎదలో వేయి వెలుగు రెక్కలు విప్పి తిరుగు వెలుగు దొరవనే తెలుసు. వెలుగు వాక ప్రసరింపుము విప్పిన తెలి కనుల నుండి, మంచు తుంపురులు రాల్చు తొలి సంజలందు నింగి వోలె. కాంతి పూలు విరజిమ్ముచు కనుల నుండి కదలి రమ్ము ! గుండె గొంతుకనువిప్పి వినిపింతును కాంతి గీతం ధ్వనిమయ రసధునీ తరంగం. iii జ్వలదూహ శిఖలతో నిను ఆహ్వానిస్తా. పవమాన పంక్తివలె రివ్వున ఎగసిరా. కలసిపోయి ఇరువుర మొకటిగా నిలచి పోదాం ప్రకాశమాన ద్యావా పృథివి వలె. మన కంటిముందు బూడిదకుప్ప సర్వసృష్టి గగన పదవి వ్రేలాడే మబ్బుగుంపు స్వర్గావళి అణువున కతీతంగా సర్వాంతర్లీనంగా స్ఫురించుదాం శైవతనూ సుషమా రూపం. నీ కనురెప్ప వ్రాలితే ఆరిపోవు సూర్యుడు చీకటిలో పరిభ్రమించు దారితప్పి చంద్రుడు ఉష ఆగమనం కనురెప్ప తెరవడంతో తిరిగి అంతా మొదలు, భూమిపై ఆకాశంపై వినూత్న ప్రభా ముద్రలు. ఊహలో తిరిగే భూమిని విభజించి కాలానికొక క్రమ పరిణామం కల్పించి, నీ కంటి చూపులో కదలిపోవు సూర్యుడు. అతని ననుసరించి గమనం సాగించు నేను ఆకాశంవలె వదలిపోను దిజ్మూర్తిని నిన్ను. సర్వ శరీరం విప్పారిన నేత్ర గోళమై నీ దర్శన స్పర్శ కోసం ప్రతీక్షావ్యగ్రమై, సన్నని నీలి మొయిలు నీడల బరువులు ఓర్వజాలని అలసమృదుల పక్ష్మాలతో గాలి తాకిడికి ఊగిసలాడి ఉరలు ఫేన తరంగ పంక్తుల వలె నిదుర బ్రతుకులో నిను గూర్చి కలలు ! శిథిల స్వప్న ఫలకంపై నీ రూపం చెదరిన చీకటి నుండి వచ్చే ఉదయం. ప్రభవింప జేస్తుంది మతిలో మందారం అనుభూతి శిఖరం చేరుస్తూ నీ జ్ఞాపకం. నిశ్శబ్ద రాత్రం దీపశిఖ వలె వెలుగుతూంది ఎదలో నీ రూపం. స్వప్నంలో గీతమె పలుకుతావు గీతంలో స్వప్నమె వెలుగుతావు. ఆదర్శ వాస్తవికతల మధ్య ఉన్న రేఖ చెదరింది నీ రాకతో ఉష ఆగమనం అసత్యం సత్యం మధ్య ఉన్న పొర తొలగింది నీ రాకతో. నీ రెప్పలు వ్రాలి ఉంటాయి నాపై సరస్సుపై ఆకాశపు వంపులవలె నీవు తెరచినపుడు కనురెప్పలు కన్పించరు రవిచంద్రులు నా కంటికి. నిద్రా గృహం నుండి నీవు వస్తావు మెలకువ రూపంలో రోజూ నీవెంత దూరంగా ఉంటే అంత విలువౌతుంది పరిమళం ! దేవతాత్మ పరిధి వరకు నడచి మనం విడివిడిగా ఆవల ఇరువుర మొకటిగా సంవిలీన మాదాం. iv ఉదయం – రోదసిలో దూకిన సూర్యుని మొదటి కిరణంవలె నా ఎదపై వ్రాలినపుడు నీవు వేరొక రాత్రి వచ్చి పోవాలని మనస్సులో ధ్వనిస్తుంది ఊహ. ముగ్ధ ముగ్ధంగా నిశ్శబ్దపు నడకవలె తుమ్మెద ఝుంకారంవలె జలపాతం రువలె బహుగతి భేదంతో బహు విధ రీతులలో. ఉష ఆగమనం సాయం– సూర్యుని చివరి కిరణంవలె దూరం దూరంగా సూక్ష్మాతిసూక్ష్మంగా విడిపోయిన నీ వెవరవని అడిగితే, ఏమని చెప్పను ఈ చీకటి నీడలకు ఉదయం వరకు వేచి ఉండే అదృష్టముంటేగా— ఆనంద విషాదం సమంగా అనుభవించే చంద్రుడు కన్పించగనే నిలచిపోయేది నీవే స్మృతిలో. నీలాకాశ తమస్సముద్రం దాటి ఎలా రావాలనా? నిశ్చల దృశాశ్రేణి నిర్మితమైన వెలుగు వంతెనపై రా. బడబానల గర్భితమైన మహాసముద్రంవలె విద్యుత్కాంతి నిహితమైన నీల పయాదంవలె ఊహాస్ఫూర్తి శోభ పొందిన శబ్దరూపంవలె ప్రణవ తరంగం భరించు విశ్వాంతరాళంవలె మనోవాయు వీధి కదలాడు సురభిళమూర్తీ! ఈ జన్మలో నిను పొందిన నేను నీకొక రూపమిచ్చి నను నేనొక పరిధిలో శాశ్వతంగా బంధించుకోజాలను. అమృత వర్షధారా పరిష్వంగం కోసం నిబిడౌత్సుక్యంతో ఎదురుచూచే ఉష ఆగమనం గ్రీష్మానల తప్త వాయు గోళంవలె నిత్య జాగ్రద్ వ్యగ్రమై ఉన్నది నా జీవ స్థితి. దేహం అగ్నిలో జ్వలించి భస్మ సాత్కృతమై, ప్రాణం గాలిలో లయించి గగన గతి సాగిపోనీ. ఆకాశం విప్పిన వెలుగు చీకటి రెక్కల క్రింద దీపశిఖవలె నున్న నన్ను చుట్టుముట్టిన ఈ తలపుల నీడలెలా వదలును ? లౌకిక కర్మగతు లతిక్రమించి ఆసన్నామక జ్యోతీ రూపంలో విలీనమైతే తప్ప ! అదిగో ! తెరచుకుంది. ఆకాశ స్వర్ణ కవాటం శిశిర నాశన హిరణ్య నేత్రం ! ఉష ఆగమనం హిమజ్వాల ఈ ఉషస్సాహిత్య వీధుల రెక్క విప్పిన మొగిలు నీడలు. ఈ నిశా నిద్రాంబరమ్మున సాశ్రు శిఖల విషాద స్వరములు. ఈ ప్రశాంత మహాకాశ మొక్కసారిగ మృత్యుతాండవ రవము విన్పించు నేమిది? ఆ హిమాలయ కందరాసీమ మ్రోగెడి కృతఘ్నతా భర శతఘ్నిచయ యత్నములు. ఈ గడ్డపై వీచు శీతల వాయువులు సదా సుమనోభిరామములు, రివ్వున దూసి చను పదను కత్తులవోలె ఎదకు భాసించునవి యేమి? ఆ హిమ భూమి కదలు సైనిక నేత్రములు వదలు సర్పదృశాగ్నికీలా చయమ్ములో ! పురాణ వీధీ చరన్మనోజ్ఞ దేవతా సమూహ సమూహ దీపించు నివసనము. హత్యా బుద్ధి నిట చరించెడి జీవులెవ్వరు? సూర్య తేజము మ్రింగనెంచెడు మబ్బు మూకలు ! శతపత్ర ముగ్ధ వదనము పైని నెత్తురు గంట్లవలె, అంతలో హిమ శీతల స్వచ్ఛ భూమిపై ఉష ఆగమనం అగ్ని కణములవోలె, భాసించి మూకలు మూకలుగ వచ్చిపడు కాల ముద్రా మూర్తులెవ్వరు? శాంత తేజోలీన రేఖాదేవి హిమాచ్చ సుషమా ఫాలతలమున, అగ్ని కీలలు రక్త ఝురులు సృజింప నెంచెడి చీకటి ముద్ద యెవ్వడు? ప్రతి భారతీయుడు విడిచిన ఒక్కొక ఉష్ణ నిశ్వాసమ్ము, తమా రాత్రివలె భయదమై దీర్ఘమై, హిమ భూమి చుట్టినది. ఒక్కొక్క హృదయమ్ము రవిబింబ సదృశ తేజస్ఫూర్తి, చీకటి శవము కాల్చగా పండు నిప్పులను చెరగినది. ఉదయాస్తమయ దివారాత్రములు ఋతువులు కామనల కాస్థానములు, క్షణములు; తృటిలో మరచి స్వరము, దీప్తమతియె, గగనమెత్తున ఫణసహస్రము విప్పి, నా జాతి నిలచినది కాలభుజగము రీతి. నిప్పుగప్పిన నివురు గాలికి లేచెను. ఎవనిచూచిన ఒక్కొక అగ్నిగోళము. ఎవని హృదయము నెంచిన దుఃఖభరితము. బాడబాగ్ని వహించు మహాసముద్రము. ఉష ఆగమనం స్వేచ్ఛా సమాజ రక్షా వ్యగ్రమై నా దేశమే చైతన్య సంభృతమై మేల్కొని జ్వాలవలె శతకోటి ముఖీయై తేజోఽసహ్యమయ్యెను శత్రుకోటికి. కొండవలె నిలచి కదలికలేక కలలతూగెడు జాతి కాదిది. చెలియలికట్ట ఎరుగని వార్నిధి. నిత్యభాస్వర దేవతా మతి. మహాదాహము గొన్న కాలము రక్తఝురులను కోరుచున్నది. కాలమును కబళింపనీయము. ఖడ్గ వ్యూహము విభేదింతుము. ఎదపై నిప్పుల కుంపటి దింపిన ఆ కృతఘ్నులను తుద ముట్టింపగ త్వరగా, హిమ జ్వాలలను ఆర్పగ, జ్యోతిర్ధూమ జలసంభృత నవ ఝుంఝా పుంకృతితో ఉరుములతో మెరపులతో రణవ్యూహ నవమతితో కదలండి ‘నీఫా’ ప్రాంతము తరలండి ‘లడక’ భాగము. ఉష ఆగమనం ఛాయ ఎవరొహొ ! నిదురించినదిట ! నీలాంబుదమాలా స్నిగ్ధతనూ పల్యంకిక! ముహుర్ముహురాగత వీచీ చయ సంచాలిత పుష్పంధయ పక్షాలక! త్యక్తాశా కాంతి చేల! దుఃఖ ప్రావరణావృత! సరభసగమన పవమాన విధుతమై గగనాంస సంస్రస్తమై పొరలాడు నవనీరదాంశుకము వోలె, భువి జారిపడిన యామినీ కర్ణమున వ్రేలాడు పూర్ణిమాచంద్ర తాటంక ఖచిత నీల మణివలె, భూదేవి పృథుల నితంబమున అంకిత నఖాంకుర పంక్తి వలె ఆ పవ్వళించిన దేవరు? అరుణ మయూఖములకు వాడి శార్వరీ జలద కైశికభరము వీడి శీర్ణమై ఇట బడిన మనోజ్ఞ మందార పుష్పగుచ్చమొ? ఇట నిదురించిన దేవరీ మసృణ తమాలవల్లరీ మతల్లికా సుషమాంగన! నిస్తరంగ యామునధుని! ఉష ఆగమనం సాంద్ర జలకణ మౌక్తిక చయ ఘనాఘన చైత్య మండపమందు మార్మ్రోగు ధ్వని తరంగములకు బెదరి ఇట బడిన దుఃఖాగ్ని సందగ్ధ మోహనమూర్తి శంపా కళా లాసికయొ ! నవారుణాదిత్య మూర్తి గాత్ర పరిష్వంగమున పరితప్తయై తనూకాంతి వీడి, వాడి సంయంత్రిత భుజము వీడి తోరమై యిట బడిన ఛాయా కాంతయొ ! సౌరమార్గ పరిచ్యుతయు వాయు హత జ్వాలయునై మృత్యుశయ్య పరచుక ఇట శాశ్వతముగ సుషుప్తి గన్న తారా దీపశిఖా సుందరియొ! ఏ వృక్ష వర్షీయుని దుఃఖ సంవృత మలీమస వర్ణ జీవిత చిత్రమొకొ ! ఈ దీర్ఘ ఛాయా రేఖ ! జీవదాన విచికీర్షా హృదయుడు సదయుడు, ద్రుతతర గమన శీలి జలధర వర నిశ్వసిత ధూమపరిమ్లాన దేహివై భువి దిగజారి, ప్రియు నెడబాసిన త్రపాతరళయౌ శంపావల్లికవా? ఉష ఆగమనం స్వీయ ముగ్ధ లావణ్య రూపమీ జన్మలో పొంద లేవుగా– మమతా భావమూర్తియా జన్మ సీమ దివి కేగలేవుగా– ఎవరవీవు? రహస్తీరముల నృత్య మాడి మిసిమింతురాలవై శ్రాంతి కోసరము మెయి వాల్చితివా ? కాంతి మండలపుటంచులపై దిగజారుచు నిరాలంబయె నిరాశతో తమకము నొందుచు తనుకు తొగ చీకటి కన్నెవొ? ఏ కోరిక సుడుల ముడుల విడిపోవ ఏకతమ తిరుగాడి. కడు డస్సి ఇటబడి దుఃఖ నిమ్నగ మున్గితివి? ఎవర వీవు? ఏకాంతముగా కఠినశిల పల్యంకముపై ధూళిరేణుకా రూషితవై మలిన వస్త్రమును దాలిచి శీతవాత పరిపీడితవై వన్నెమాసి ఈ మన్నులోన వివర్ణమైన ప్రన్నని దేహము నల్పిష్ఠ తమస్తరంగిణివలె కుంచించుక, ఎందుల కెవరికై ఆచరింతు మానవ్రతము ! ఉష ఆగమనం దుఃఖ శలాకాగ్ర విదారిత హృదయంతో దృఙ్మనోజ్ఞతరకాంతులు దిక్తటముల విసరుచు, ఏ సాగరతీరము వెదకుచు, ఏ నాకపథము నాశించుచు ఏ సుందర స్వాప్నిక సౌర పదవి కూహా సోపానాళి వినిర్మింతువు. జఘన మండల విసర్పిత నీల వసన సంశోభిత ! మలినీకృత దేహాంచల! విరజీకృత నీలాలక! త్యక్తాశా కాంతిచేల! ముక్తచ్ఛాయా సుందరి ! మసృణ నీల నీరద సుషమా వల్గత్ కాంతి తనూ ! ఆ వెనుకనే సముద్రపు కెరటాల్లో ఘర్షిస్తూ నౌక వలె తుఫాను గాలులలో వణకుతూ వృక్షం వలె ఉన్న నన్ను చూచావు. ఉష ఆగమనం వేడి నిట్టూర్పులు విడుస్తూ గ్రీష్మంలో అవని వలె వడగాడ్పులకు కదలుతూ చేతులెత్తిన వృక్షం వలె ఉన్న నన్ను చూచావు. నిశ్శబ్దపు గుండెపై అడుగులేస్తూ నేను నడచి నపుడు నడుస్తూ నా మెలకువ నిదుర మధ్య మనశ్చిత్రం వలె ఉన్న నిన్ను చూచాను. సూత్రానికి వ్యాఖ్యానం వలె ఆవరించిన ఆకాశాన జలదంలో మెరపు వలె నాలో జలదరించు నిన్ను నేను చూచాను. రాలే ఆకులు పూలు పండ్లు కాల గతిని జ్ఞప్తి చేస్తున్నాయి లిప్తను క్రమిస్తుంది లిప్త శక్తిని హరిస్తూంది శక్తి. నా వెనుకనే వెలుతూన్న మృత్యు దీపం బింబిస్తూ అద్దంవలె ముందు నీవు ఇంతకు ఎవర వీవు? ఉష ఆగమనం మొగిలు విరిసి కురిసే వేళ మొగిలు విరిసి కురిసే వేళ, మెరపు మొలక నవ్వులతో పూవు రెక్కల ఆలోచనలతో వర్షాధ్వని ఝురీ గమనంతో నీవు అవతరిస్తావు. మొగిలు విరిసి కురిసే వేళ, నాపై ఒదిగి పోయి పరిమళ వీచిక వలె, ఊహలో పరచుకొని ఉదయ గగనం వలె, హృదయంలో వెలుగుతూ ప్రాణ దీపం వలె, నీవు నిలుస్తావు. మొగిలు విరిసి కురిసే వేళ, ఊహ పత్రాల చాటు నుండి శబ్ద విహంగమై వచ్చి, నీలాకాశపు వంపులలో నుండి సంధ్య మేఘ శకలమై తరలి సౌందర్య జ్వాలలచే మండించు శతపత్రమె విచ్చి నీవు కన్పిస్తావు. పూర్వ స్మృతుల సౌరభంతో అవనియె భవిష్యత్ కల్పనా చిత్రంతో ఆకాశమై వర్తమాన రూపంలో మధుధారాధునియె నీవు మెదలుతావు. మొగిలు విరిసి కురిసే వేళ. ఉష ఆగమనం ముక్తకాలు i తెలుసు నాకు ఒకటేనని మల్లె పూవూ, చంద్ర వంకా కాలం విరిసిన నవ్వు మొలకలు ఒకటి క్రింద మరొకటి పైన. భూమి ఎదపై పరిమళంతో మల్లె పూవు గగన మతిలో ప్రసన్నంగా చంద్రవంక. గాలిలో ఒకటి ఊగుతూ చీకటిలో ఒకటి తూగుతూ సుఖ దుఃఖ సమయాల్లో మనిషికి సమన్వితి సూచించేవీ. ii మబ్బులు ఎగిరే ఊహలు భయపడవు చీకటికీ వెలుగుకు నిలబడవు ఎదురైనా కొండలు ఎదలో అమృతం వర్షించేవీ. ఉష ఆగమనం భీటలు వారిన మనిషి గుండెలో ప్రవహించే ఆర్ద్ర పంక్తులు ఆకురాలిన బ్రతుకు చెట్లలో చైతన్యం పొంగించే జీవకళలు. ఎండలో వెలిగే వనం కోరేది, మబ్బు గుంపులు వేదనతో మండే మనస్సు కోరేది ఊహల రక్తిమ. iii ప్రసరించి నిశాదృక్కులు ధూమ శిఖలై లేచినవి. అందులో ఒకటి నిలచింది నేలపై వ్రాలి నీడయై. కాలం కమరి పోయింది నల్లగా వేషం తీసిన నటునివలె ఉంది క్షణాలు సంచరించే విమానాలు మనోముకురంపై రాత్రి బింబాలు. మలగుతూన్న ప్రతి క్షణం వెనుక నిలచి ఉంది అంధకారం. వెలుగుతూన్న ప్రతి క్షణం వెనుక వేచి ఉంది అంధకారం. ఉష ఆగమనం iv గాలులు స్పృశిస్తూ కదలుతూన్నవి అంతరాలను, అంతరాళాలనూ నీడలవలె తొట్రిలుతూన్నవి మనస్సు కందనివి, అనుభవాలు. వెలుగులు ప్రసరిస్తూన్నవి స్పృశిస్తూ అంతరాలను, అంతరాళాలనూ ఈదుతూన్నవి హంసలవలె అనుభూతులు, ముంచినవి మనస్సును. సమాధులు, శ్మశానాల కంఠం నుండి పైకలి రాలేక అణగింది శబ్దఘోష ముఖంలో సగం సగంలో రివ్వున ఆగలేక బయటపడింది ఊహ నృత్యం. v దిగ్దర్పణంలో ప్రతి ఫలిస్తూంది. నడుస్తూన్న నా రూపం. నా నుండి ఉద్గమించిన రూపాలు నడుస్తూన్నవి దిక్కులలో. ఉష ఆగమనం నలువైపుల రూపాలతో వింతలు మొలకెత్తినవి దిక్కులు అన్నీ నడిచేను, ఎక్కడికి నాలోకి నా నుండి దిక్కుల్లోకి, అటనుండి నాలోకి. క్షణం నుండి వెడలి చిత్రం అంతా క్రమ్మింది విచిత్రం సంధ్యా దర్పణంలో బింబించి సూర్యుణ్ణీ, చంద్రుణ్ణీ గెంటింది. ఉష ఆగమనం