Addamlo Needalu (అద్దంలో నీడలు) Collection 4 of Volume I — Addendum 1 — Swecchaa Kavitvamu by Prof. Madiraju Ranga Rao. Year: 1960. Language: Telugu. Canonical HTML: https://madirajurangarao.com/poetry/volume-i/addendum-1/text/addamlo-needalu --- 4 ప్రవాహంలా ఒకమారు వేగాతివేగంగా చీకటిలా మందంగానో, లేక వేరొకమారు వెలుతురులా తేలికగానో కదలీ కదలక ఆశా ప్రసారిత నీల మేఘ భుజంగంలా కంటి చూపునుండి మెల్లగా జారిపోవు కాలం విడిచే నిట్టూర్పులలో తూగుతూ అవ్యాహతంగా సాగిపోవు ప్రపంచంలో ఎక్కడా — ఎన్నడూ – చూడని – అద్దంలో బింబించే నాముఖంలో చూచా ఒడ్డుకు ఒదుగక మెలికలు మెలికలుగా తిరిగిపోయే నీటి అలల విరుపులు ఒక తీవ్ర ఝుంఝుకు చెల్లా చెదరై కూలనున్న నీలిమొగిళ్ళ మెట్ల మలుపులు సగం మూసుకున్న తూరుపు కనురెప్పలు వదలలేని మాయ మత్తు మమకారపు నీడలు మొదట అద్దంలో నా ముఖ బింబంలో చూచా ఈనాటి వరకు కళ్లుమూసి ఎరుగని సూర్యుని మనసులో తిరిగే, చీకటి బంతిని ‘గోల్ ‘ చేయాలనే ఊహతో వెన్నెల దుస్తులు ధరించి తిరిగే— మనిషి ముఖం తరువాత అద్దంలో చూచా కొన్నాళ్ళు ఆకాశం డొక్కలో పర్వతంలా నిదురపోయి; చీకటిచెట్ల గుంపువలె కలవరించి మేల్కొని కలల బరువుతో; ఉదయం ఊపిరి పీల్చడం మొదలిడిన సమయంలో; మరోప్రపంచం పిలుపుతో చిరకాలంగా నేనెరుగని నేస్తం రూపం అద్దంలో బింబించే నా ముఖంలో చూచా 5 చీకటి గుడిపై వెలిగే తారల శిల్ప సౌందర్యం విలోకించే కన్నులలో ఉదయ రేఖలు తులకించునపుడు చైతన్య స్ఫుర్జితమైనప్పుడు హృదయం వెలుగు తలుపులు మూతవడిన చీకటి కోట గోడలు దూకివచ్చి ఎవడో సూర్యుడు చంపేస్తాడనే అజ్ఞాత భయం తొలగిపోయినవేళ ముడుతలు పడిన శరీరంతో నడువలేని పండుముసలి, సముద్రుని తరుణ హృదయంలో ఊగిసలాడి తమంతట మలగిపోవు కామనలకు స్వరూపాలు పరిణమించినపుడు గ్రీష్మాదిత్య జ్వాలలకు తపించి నీలాంబుద మాలా జలధారాసార మనోజ్ఞ నవంనవతా బంధురమౌ, భూదేవత విడిచే సురభిళ నిశ్వాస పవన వీచికలవలె, ఊహలు బుద్ధిని అల్లుకొన్నప్పుడు, మనసు మల్లెమొగ్గలు వికసించినపుడు వినిపిస్తుంది – కాంతి గీతం. సూర్యతేజో కిరణలవ మెరుగని, జివ్వున నేత్రు నాడులు లాగు, చలిగాలికి బిగిసిన మంచులా మారి చలనశక్తి ఉడిగిన నదివలెనో ముసరుకున్న పేదరికం దాడులకు ఆగలేక, పొంగులతో పరుగులెత్తు నేత్రువాకలు ఒక్కమారు ఆగిపోవ; ప్రేతాకృతుల వలె నిదురపోవు చీకటి మనుషుల గుండెలలో అనవరతం వినిపిస్తుంది – ప్రత్యణువును స్ఫులింగంగా ప్రతి మనస్సును విద్యున్మాలగా రామణీయక రసజగత్తుగా మార్చివేయు కాంతి గీతం. 6 ఉదయంనుండి సాయంసమయం వరకు మండిపోవు అగ్నిజ్వాలా తోరణాలతో నిండిపోయి దట్టంగా చీకటి పొరలు క్రమ్మిపోయిన రాత్రివేళకు మసిబొగ్గై ఆరిపోయి చల్లబడిన భస్మవేదికలా మారిపోయినదో లేదో ఆకాశ శ్మశానం అక్కడక్కడా ఇంకా గాలికి చెదరిపోయిన నివురు గప్పిన నిప్పురవ్వలు చుక్కలు మరో శవదహనానికి మళ్ళీ తూర్పు దిక్కునే సత్వర సన్నాహం జరుగుతుందని వినికిడి. సృష్టి జరిగిన నాటినుండి మొదలుకొని ప్రతి రోజూ ఇలా ఎంతకాలం సాగుతుందో ? పునర్జన్మ వున్నదోలేదో తెలియదు గాని ప్రతి ఉదయం మరోజన్మ ఎత్తినట్లు వుంటుంది. మృత్యువు అందంగా ఆనందంగా వుంటుందని మొదటే తెలిస్తే మానవుడు ఈనాటికి ఇంత ఎత్తుగా విషమంగా పెరిగి వుండేవాడా? ఈ గీతం వినిపించే అవకాశం వుండేదా ? భూమికి మేఘగమన రహస్యం తెలియజేస వృక్షాంగనలను రివ్వున కౌగిలించుకొని కబుర్లు చెప్ప మండే అగ్నికి ఆనందం ఉద్రేకం కలిగించే కపాల రంధ్రాలను పూరించి సంరావము చేస్తూవచ్చే శ్మశాన సమాగత వార్తావాహులు గాలులు సృష్టిని మేల్కొల్పే ప్రత్యుషఃకాల సాంగీతికులు మస్తిష్కంలో, సైంటిస్టు శోధించినా కన్పించని, వేదాంతికి ఆద్యంతం అందని, ఆలోచనలు. మృత్యువు ఊహతో వేదాంతం మొదలు మృత్యువు భయంతో జీవితం ఆఖరు పరితః కాంతి విసృమర దీప శిఖ వేదాంతం విడదీయరాని జీవితం. 7 ఉన్మీలన కారణ మృదుల జీవశక్తి స్ఫూర్తి ఎరుగని రంగు కాగితపు పూలు. బ్రతుకులో శైలీస్థితికన్న సౌకుమార్యం నైశిత్యం తెలియని మనుషులు – తిరిగే దిష్టిబొమ్మలు నీడలా కదలాడుతూ పవళ్లు రాత్రి చీకటిలో కలిసిపోతే కాల స్వరూపం తెలుసుకునే అవసరం మనస్సుతో పనిమాత్రం ఏముంటుంది. పవన వీచికవలె, వెలుగు రేకవలె కదలాడుతూ విప్పారిన హృదయంతో మంచు ముసుగు కాస్త తొలగించి చీకటి పొరలు దాటిరా ! కలుస్తా దీప శిఖ చుట్టూ ముసిరిన దారి తెలియని గ్రుడ్డి వెలుగులు దీప శిఖను స్పృశించలేవు సరే చీకట్లకు దారైనా చూపలేవు సూర్యుణ్ణి ప్రతి ఉదయం ఎంతోదూరం నుండి ఆనందిస్తూ సాయంకాలానికైనా ఒకనాడు పట్టుకొని సంతోషించాలని రంగురంగుల ఊహలతో గడపడం చిన్న పిల్లల మనస్తత్వం కదూ ! 8 అడుగు తీసి వేసే లోపల కాలం దివ్యులకూ తమకూగల సామీప్యం దూర దూరమౌతూ, మారిపోతే పోనీ రాక్షసులుగ హంతకులుగ మానవులు మనసుకూ మనిషికీ తెగిపోయి సంబంధం అందరికీ ఆలోచించడం చేతకాదని తనే అందరి బదులూ ఆలోచనచేసి ఎదుటివాడి మాటవినే అలవాటు తప్పిన పూర్వపు దేవుడి రాజ్యం మళ్ళీ రానీ! అగ్ని గుండమై పోతేనేం? లోకం! చెట్లు ఊగడం మాని గాలిలో కదలిపోవడం ఆరంభించనీ! దొంగచాటు వ్యాపారం సహజమై భయం గుణస్థాన మాక్రమించుకోనీ ! జంతువులు కాదు మృగాలు గెలిచి మానవులపై అధికారం సాగించనీ మన నీడలె మనపై తిరగబడి శత్రుత్వం సహజగుణమైపోయి శ్మశానంగా మారిపోనీ ప్రపంచం ఎక్కడైతేనేం గడవడానికి కాలం ! సూర్యుడు మండి మండి మసిబొగ్గై వాయువు బరువెక్కి చలనమాగి మంచు రాతి పరుపుగా మారి జలం తలలూపే చెట్ల గుంపుగా మారి జనం లో వెలుగెరుగని మూతవడిన కళ్ళతో వీధుల్లో శిలాస్థూపాల్లా నడుస్తూ అడవుల్లో వేణువుల్లా రొదచేస్తూ శిరస్సుపైని విద్యుద్గోళం వెలుతురులో బ్రతుకున కలవాటుపడి, నిద్రలో మృత్యువుతో సంధిపత్రం వ్రాసుకోనీ ! ప్రాణులం అందులో మానవులం కాకపోమూ! బ్రతికిన కాలం జీవితమనిపించుకోదూ! ఊపిరి ఎక్కడిదక్కడే ఆగిపోదుకదా! అడుగు తీసి వేసే లోపల కాలం — 9 కాలాన్ని హత్యచేసి కాలం దాని స్థానం, ఆక్రమించి తిరిగి హతమౌతుంటుంది మరుక్షణం మెరపులా మెరుస్తూ తుదిక్షణం ఆశలా లాగుతుంది—ఎక్కడికో భూమ్యాకాశాలు కలిసే చోటికి. తెలిమంచు వెల్గు తొలిసంజల రక్తంతో తడిసిన ఈ హంతకుని చేతిలోని పిస్టల్–సూర్యుడు గడ్డకట్టి నల్లవడిన నేత్రు —రాత్రి తన శిరస్సుపైని దీపాలు ఎప్పుడు వెలిగినదీ , ఆరినదీ ఎరుగని చీకటి కంబాలకు కాల స్వరూపాభిజ్ఞతతో పని ? జీర్ణ శిల్ప మందిరంలో నిద్రించి మ్రోగే ఘంటానాదానికి మేల్కొనే దేవుణ్ణి సైతం–ఊగించే మృత్యువు ఎరుగని కాలం ప్రశ్నలు చైతన్యంలో – జీవంలా ఆవేశంలో— అగ్నిలా మనస్సులో—ఆలోచనలా ఆగక సాగిపోవు శక్తి రేఖలు కాలం విడిచే పరిమళ వసంతాలు నైల్యమేఘ నిశ్వాసాలు, నిట్టూర్పులు జ్వాలారుణ గ్రీష్మాతప తీవ్రతలు నిరాశా శైశిర పవన వీచికలు మానవుని మనోప్రపంచ రహస్యాలకు తన ముద్ర వైచి బహిర్గతపరుస్తుంది మస్తిష్కంలోని టెలివిజన్ యంత్రంలో కాలంయొక్క భిన్నభిన్న రూపాలను చూడవచ్చు విద్యుత్కాంతి రేఖా ప్రసరణలా కాలగమనం సాగుతున్నంతవరకు మెట్లు మెట్లుగా మలగిపోవు చరిత్రకు వుండదు అంతిమ దశ కాలగమనం ఆగిపోనంతవరకు సంస్కృతీ శిల్పంగా మారిపోవు మానవుడు చుంబించగలడు ఆకాశం మానవతకు సిద్ధించదు సంపూర్ణత్వం 10 దేవతల్లా జన్మించి, రాక్షసులవలె జీవించి–ప్రాణం విడిచే రోజు అంతిమ క్షణం మాత్రం మానవులు ఎత్తైన చీకటి సెమ్మెపై నిల్చిన ఎవడూ ఆడి ఆనందించడానికి వీల్లేని వింత రంగుల గాజు బంతులు అరపులతో వెరపు గొలుపుతూ పిశాచాల్లా! ఎక్కడా భూమికందని ఆకాశంలో, ఊహలతో తిరుగుతూ కాల ఝుంఝా నైశిత్యానికి రేణువులు రేణువులుగా శీర్ణమై గాలిలో ఎగిరి అంతలో మాయమౌ ఇసుక బొమ్మలు శతాబ్దాలుగా శిలాయుగంనుండి గుహల్లో దాగి, వనాల్లో వసించి పూజిస్తూ అగ్నిని, లొంగిపోయి ప్రకృతికి బహుసహస్ర ముఖాలుగా ఛిన్నమైన మన మనస్సును ఆక్రమించిన భయం క్రమ్మిన అనుమానపు పొరలు–జారి మస్తిష్కంలోని మంత్ర తంత్ర శాల విద్యుదూహా దోహల విజ్ఞాన యంత్ర శాలగా మారిన క్షణం– గతంలోకి భయంలోకి గుహలోకి వెళిపోయి, పూర్వ రాజ్యం స్థాపిస్తే కారాగారం విడిచే హంతకుడెవడు ? శిలల పరపు, కదలని నీటి తలం కాంతి సముద్రపు పొంగు కొలిచే; వెలుగు కంటి ముందు, నీడ బొమ్మల చిరు కదలిక గుర్తు పట్టిన సమయం చలన శక్తి ఎరిగిన, కాలం లయతో, తరుణ మనస్సులు పాడే, సంగీతం వినిపించే సుప్త చైతన్యం 11 కాంతి పూలు ప్రసరింపుము కనులనుండి మెరపు రేకలు చెంగలించు మబ్బులవలె కనులతో మాట్లాడుము అమృత భాష గుండె విప్పి వినిపింతును కాంతి గీతం తమోహస్తాల క్రింద నలగి పోవు చుక్కల వెలుగు నీడలలో బ్రతుకు గడపి విసిగి పోయి; స్వేచ్ఛా వాయువుకై దివ్యకాంతి రేఖలకై పరితపించి ఆగి ఆగి స్పందించెడి గుండెలతో చైతన్య మహాశక్తుల జృంభణతో తమపై దించబడిన తమోహస్తాలను కదిలించివేయ, అనుక్షణం యత్నించే మానవుల, విప్పుకోలుపడిన కనుచూపులలో వెలుగుంగరములవలె సాగిపోవగా ఊహలు గుండె విప్పి వినిపింతును కాంతి గీతం సప్తవర్ణ కిరణ రూపాలలో కదలి రమ్ము సన్నని వెన్నెల వెలుగు వత్తి వలెనున్న నా పైకి, కోపంతో – అయినా చెబుతున్నా వేడి వేడి నిట్టూర్పుల, విసరులతో పాడు గాలిలా, కారు మబ్బులా రాకు త్రిశూలంలా లేక శార్ఙ్గంలానో రాకు నేను తనూస్పర్శాజ్ఞానం సుంతలేని సంధ్యాకాంతి పుంజ వివృత మనోమూర్తిని చీకటి రెక్కలతో రివ్వున ఎగసి రాకు విరిసి వాలిన పూల మబ్బు తెరల చాటున దాగి తొంగి తొంగి చూచు శార్వరీ దర్శన వేళా సంఫుల్ల చంద్రకాంతిబింబంలా అగుపింపుము వెలుగు వాక ప్రవహింపుము విప్పిన తెలి కనుల నుండి మంచు తుంపురులను రాల్చు తొలి సంజలందు నింగి వోలె కాంతి పూలు విరజిమ్ముచు కనులనుండి ; కదలిరమ్ము నా గుండె గొంతుకను విప్పి వినిపింతును; కాంతి గీతం ధ్వని మయ జీవనదీ తరంగ లాస్య సౌకుమార్య నవగీతం 12 కళ్ళులేకపోయినా మనకంటే దూరం చూడగలదు ఎత్తైన గాలిగోపురం పడగ విప్పి తోక పై నిల్చి ఆనందిస్తుంది చెవులులేని పాము, సంగీతం గాలికైనా చిరుకదలిక ఎరుగని చాచబడిన రెక్కలతో వెళుతుంది త్వరగా పైగా ఆకాశాన బహుదూరం యోగశక్తి ఎరుగని విమానం వ్యష్టిరూపాల సమిష్టి స్వరూపం నైకశక్తుల సమాహారైక సూత్రం సంస్కృతీ విచిత్ర జీవ సంపుటి యుగపరిణామ చిహ్నం మానవుడు పవమానుని శరీరంనుండి రాలు సుమ పరాగం; మృత్యుధూళి ఆకాశ కృష్ణ తారాగ్రంనుండి జారు వెలుగు ముత్యాలు; నీలమణులు శివుని శిరః ప్రదేశాన వెలిగే శీతలీకృత ప్రపాచంద్రఖండం తెరచిన ఫాలనేత్రంనుండి జారిన జ్యోతిర్లతలకు పూచిన నిప్పుపూలు సంగ్రహింప జూచే నీలగగన దేవతా సంప్రసారిత దీర్ఘదిశా హస్తాలలో ఎడతెగకుండా పొరలు పొరలుగా సాగు; భూభామినీ జఘనంపై జీరాడే చీరకుచ్చెళులు సముద్ర తరంగాల కదలికలో దాగిన పురాసృష్టి రహస్యం బడబానలం దాగిన సముద్ర హృదయ సమార్ద్ర భావామృత మధురేఖలు విరుగని పృథివీ పరిమళ వీచికలు పాంచభౌతికాంశాలు కలిసిపోయిన వెలుగు చీకటి విడదీయరాని ముద్దలు సముద్రాన్ని ఆకాశాన్ని లొంగదీసినా ఇంకా నేలను మరచిపోలేని మనుషులు దేవుళ్ళూ దయ్యాలూ వదలినా నిద్రనుండి మేల్కొంటే తప్ప మన నివాసభూములు వదలని మస్తిష్కంలో వ్రేలాడే పీడకలలు 13 ఆకాశంపై వెలసిన ఇంద్రధనుస్సు కనిపిస్తుంది చాలమంది కంటికి మనస్సులో విరిసిన ఇంద్రధనుస్సు చూడగలడా ? అనుకున్న ప్రతిమనిషి సాయంవేళ నిద్రాగత సూర్యుని మస్తిష్కంలో; సముదిత స్వప్నవలయం చంద్రబింబంలో, స్వీయదేహ శిల్పం అవలోకించే హసనమూర్తి నిశాదేవి వెన్నెల వెల్గుకు కందిపోవు స్త్రీరూపం చైతన్య సృష్టియొక్క సమాకర్షణా శీలం ఊహించే జాత్యంధుని మనస్సులో విరిసిన మృదూహ దోహల ఇంద్రధనుస్సు స్పష్టంగా సంపూర్ణంగా ఒకసారి మరొకసారి అస్పష్టంగా, వేరొకసారి సంకీర్ణ వర్ణాలతో, అసంబద్ధ క్రమంతో అగుపించే ఇంద్రధనుస్సు మన కెంతగా దగ్గరి బంధువో కాస్త గమనించండి బహువర్ణ సామరస్యం అంతటా లభిస్తుందా ? ఇది సశేష జీవితాన్ని సమగ్రంగా వ్యాఖ్యానించే చిత్రమంటే సరిపోతుంది గ్రుడ్డివాడు అద్దంలో చూచికొని కళ్ళను ఆనందంలో లీనమై మురిసిపోయినట్లు కళ్ళువున్నవాడు ఎదుటివాడి ముఖంలో తన కళ్ళను చూడ్డానికి తహతహలాడుతాడు ప్రాభాత వేళ విస్తరించిన సూర్యుని కరాల కౌగిలినుండి మెల్లగా జారిపోతూ సహస్ర ఫణాలు విప్పిన; శత సహస్ర నటద్భుజంగాలవలె, విజృంభణతో తూగే తరంగాలతో కదిలే, సముద్రుని మనస్సులో సప్తవర్ణ శీర్ణ మానోహర ఇంద్రధనుస్సు అస్తమించే వేళ, ఉల్లోల కల్లోల హృదయ వేదనతో; ప్రగాఢ పరిచితమైన ప్రేయోసృష్టినుండి దృష్టు మరల్చుకొనే సూర్యుని చివరి చూపులలో మిళితమైన వేదాంత భావనా ఛాయాప్రకామ రేఖలో సప్త వర్ణ భేదమంతరించిన కాంతిరేఖ సౌందర్యం ఎరుగదు సప్తతంత్రీవీణ మాధుర్యం ఎరుగదు సప్తవర్ణ కాంతిఖండం సప్తవర్ణ సౌందర్యం విలీనైక కాంతిరేఖ సప్త స్వర మాధురీ సంలీననాదబ్రహ్మము ఈ రెండింటి సమాహారము, ఆత్మగత రసావిష్కార వైశేషక కాంతిగీతం– ఉనికికి ఆలంబమైన ఆకాశం కోరిక పై సప్తవర్ణ ఇంద్రధనుస్సు అవతరించనట్లు మానవుని ఇష్టం పై జీవితం నియతపూర్వ వర్ణవైఖరిలో మలుపులు తిరుగదసలు జీవితం యంత్రంవంటిదెన్నటికీ కాదుసుమా ! అయితే హృదయం, మస్తిష్కంతో పనిలేని నాగరికతాదృష్టి రహిత శిలాయుగానికి పూర్వంలోనే మానవుడు వుండేవాడుకదూ ! పరిణామం ప్రగతి కాంక్షించేవాడే కాదు లలితకళా సౌందర్యం, విజ్ఞానం ప్రభవించేదా? ఒక పరమాణువుపై ఆధారపడిన విశ్వసంస్కృతీ భవిష్యత్తు ధనవంతుని ముఖంలో దీప్తి తెచ్చుకునే మానవ నాగరికతా ప్రకాశము ఎత్తైన ఫ్యాక్టరీ గొట్టం నుండి ; యంత్రం గాలిలో వదిలే నీలి గుంపులు శబ్దశక్తి ఎరుగని అక్షరాల కూర్పు ఊహలేని ఆకాశంలా చూడడం అర్థం చేసుకోలేని గాలిలా చదవడం కాకుండా; విద్యుదూహ చేయగల మనస్సులోనే, సప్తవర్ణ ఇంద్రధనుస్సు ఉదయం అది ప్రశాంత విప్లవానికి నూత్నమార్గదర్శకం 14 అనాదినుండి మొన్నటివరకు నేనొక దేవతను; అంటే చెబుతా మీ మనస్సులో కలిగే భయానికి రూపాన్ని నిన్నటి నుండి ఇవాల్టిదాకా పుట్టుమచ్చ అందం మరచిపోయిన కవుల కావ్యాల్లో; ఇన్ని ఏండ్లుగా రాత్రులకు రాత్రులు ఆకాశాన వెలిగే ప్రేయసీ ముఖబింబాన్ని కవిప్రియులకు కొనసాగిస్తూ దౌత్యం వాళ్ళ పద్యాలు విని పదిహేను రోజులు మాత్రం హాయిగా నిద్రపోతూ చీకట్లో వెలుగు పూలు విరిసిన నీలాకాశ వృక్షం క్రింద, ఒంటరిగా జీవితం గడుపుతూ ఆలాగే వున్నా కొంచెం మార్పుతో ఇంతవరకూ నడచే గుహలా; చీకటి నిద్రలా ఎప్పుడూ వెన్నంటి వుంటుంది గతం చాలమంది కోరతారు అందులో నివాసం వాళ్లునడచే పిరమిడ్లు ; దేవాలయాలు మ్రోగే చర్చిగంటలు ; నిద్రలో పీడకలలు సరే ఆ సంగతి అలా ఉంచుదాం రేపు అంటే ఇరవై ఐదో శతాబ్దంలో నేను– మేఘం మనస్సులో, సముద్ర గర్భంలో అరణిలో, అగ్నిని దర్శించి – దేవతగా భావించిన కాలం నుండి జ్ఞానం విజ్ఞానం సంస్కారం రూపంలో మానవతపై జరిగే మనోగత మేధాగతమైన మానవుని జిజ్ఞాసా పరిశోధనల చరమదశ నా శిరస్సుపై కాలూనడంతో సరి హద్దుల అతిక్రమణ జరగడానికి ప్రక్కన పరాయివాడు వుంటేగా నాకు ముఖంపై కత్తి గాట్లు పెట్టడానికి ఎగిరినా అందని ఎత్తులోవున్నానింతవరకు ప్రతి మనిషి కాంతిగోళంగా మారి ప్రతి మస్తిష్కం టెలివిజన్ యంత్రమై గాలి కెరటంలా తేలిపోతూ గాలి బంతిలా ఎగిరే శరీరంతో మీరంతా నా స్థానం ఆక్రమించి పూర్వం నన్ను గురించి మీలోకంలో వ్యాప్తమైన అతీతమైన కల్పనలు వింతలు–విశేషాలకు బదులు; రేపు కదలిక ఎరుగని నాపై సాగించి పరిశోధనలు; ఆయుర్దాయం తేల్చి కొండజాతి మంచు మనిషినని నిశ్చయించి పత్రికల్లో ప్రకటన చేస్తారనుకుంటా అప్పుడు నా రక్షణకై చుట్టూ అమర్చబడిన యంత్రాలు; నియమింపబడిన సోల్జర్లు తిరిగే విమానాలు, పేలే బాంబుల ధ్వనులు—ధ్వనులు ప్రతిధ్వనులు మాటలు—మాటల కత్తిపోట్లు ఆటలు – ఆటల పోట్లాటలు గాయాలు గాయాలకు చికిత్స రాజకీయ డాక్టర్ల మార్పులు – మృత్యువు తెలియని భాషలో వాగే ఓదార్పులు, అపుడు మీరూ నేనూ ఒకటే నన్నమాట. హద్దులు వుంటేనేగా దేశాలయొక్క ఉనికి హక్కులు కావలిసివస్తేగా ఆలోచనల్లో భిన్నత్వం మనస్సులో పొరలుంటేనేగా ఏర్పడేది జాతులు రాత్రి ఉన్నంతవరకు సూర్యుడిలో కలవను నమ్మనంతగా మారుతుంది నా పూర్వరూపం కాంతి గోళాల్లా తిరుగుతూంటారు మీరు ఎవడికివాడే స్వయం వ్యక్తి సంపూర్ణంగా టెలివిజన్ మస్తిష్కంతో మనుషులు ఓటు హక్కు మరుస్తారుజనం నోటిమాటలతో’ నడుస్తుంది రాజకీయం నన్ను గురించి ఆలోచిస్తే సంకుచితత్వం మరచిపోతే అప్పుడు విశాల విశ్వదృక్పథం కాలం ముద్రలు చెల్లిపోయిన చెల్లని హక్కుల పత్రం రిన్యూ అవుతుందా ? కాంతి చక్రం పరిధిలో వెల్గుతప్ప సాగివచ్చినంత మేర తిరిగి చీకటేగా ! 15 గగనుని సిగపై వ్రేలాడే వాడని చంద్రిదామం లా ప్రతి నిశీథి బింబింపుము నిభృత కళామనో సరసి మెరుపు తీగ సోనవలె వెలుగుచురా, నామదిలో నీలిమొగిలు గుడివోలె ఈ శరీరమును మలచెద కదలిపోవు నీటిపైని రాతివంతెనగా, మలచి వైతు ఈ బ్రతుకును కదలిరమ్ము, రథము పైన. ఎగసి వచ్చి రివ్వున దూసే కాలపు కరకు కత్తులకు రెక్కలు నరకబడిన పర్వతంలా భూమిపై దిక్కులు చూస్తూ నిల్వలేను కోతవెట్టు, శిశిరకాల నిశిత వాయూర్ములకు, తాళజాలక వణకుతూ ఒరగిపోని వృక్షంలా ముడుచుక దిక్కులుచూస్తూ వుండలేను ప్రసరింపుము కాంతిరేఖ నాపై పూల ఎదలు విప్పారగ మురువుగ చైతన్య కళామూర్తి స్ఫూర్తివి నీవే దేవతవో నేనెరుగను. పొరలు పొరలుగా మలగిన చీకటి గుడిలా రూపొందిన ఎదలో, వేయి రెక్కలను విప్పి తిరుగు, వెలుగు వత్తివనే తెలుసు. 16 చుట్ట చుట్టుకున్న పాముపరుపుపై రాత్రి హాయిగా నిద్రపోయి సగం నిద్రమత్తులో ఉదయంలేచి నడవడం ఆరంభించిన నా వెంటబడి పరుగిడుతూ వచ్చి మెల్లగా శరీరం ప్రాకి నా మెడలో మెలికలు తిరిగి చుట్టుకుంది. నా కళ్ళనుండి జారిపడిన నీలినీడలు కదలకుండా కాళ్ళను పెనవైచుకున్నవి గాలిలో రెపరెపలాడే పమిట కొంగులా గమనం సాగని స్థితిలో వున్నవి ఊహలు కనురెప్పలు వ్రాలే అవకాశం లేకుండా ఆలోచనా దీప్తి పరాగంతో నిండి నేత్ర గోళం దట్టంగా మంచు పొరల క్రమ్మికవలె నైకభావం మరపించిన ప్రపంచంలో ద్యావాపృథివీ స్వరూపమే కన్పించడంలేదు. ఎప్పుడూ ఎవరో ఒకరు నాలో గాలికి ఆరని, నీటికి తడిసిపోని దీప శిఖలా మేల్కొని వుండి అనాది నుండి ఏదో ఒక క్రమంలేని చిత్రమైన వేషంతో; చీకట్లోనన్ను అమితంగా భయపెడుతూ ప్రేమిస్తూ – మనోగోళంలో తిరిగే తీవ్ర శక్తికి ఆకారం కలదు కాని పదార్థం కాదు ఎన్నోయుగాల నుండి నశించలేదు. ఈ నాటికీ కోల్పోలేదు లావణ్యరేఖ లోకానికి అందం ఆనందం ద్వేషం విధిగా కల్గిస్తూ స్వీయ రూపశక్తితో తాను లేనిది జీవితంలేదని తెలుసు తానై శరీరాంచల సన్నికర్ష కోరదు ఇంతకు అర్ధ జాగ్రదవస్థా సమాత్త బుద్ధికి స్ఫురించినది మెడలో వ్రేలాడే ‘నెక్‌టై’ 17 నీలాకాశ విశాల హృదయం సీమాంతముల నెరుగు మేఘం భూదేవతా ప్రగాఢ హృదయం లోతు చూచు జలధారాధుని దిగంగనా మృదుల కపోలయుగళి మీటి సాగివచ్చు పవమానము మూతవడిన తమోదేవీ నేత్ర సహస్రము విప్పిన మెరపుచూపులు ఊహల రెక్కలతో సర్వాశలు సంచరణము చేసి, జీవన వమధు కణాలు సమీకరించు నటన్మనో మధు బంభరము చేతికి అందక, తనూలగ్న సర్వజీవాణువులకు, అవిదిత సుఖానుభూతి కలుగజేయు సంచలన కలన వాయూర్ములు బుద్ధికి అందని, సహృదయ స్పందనమునకు లొంగిపోవు ప్రేయో పరిపూర్ణ మానవతా మహాకాశంలో వెలిగే ఇంద్రధనుస్సు శిల్పాకృతి తెలియని, మార్పు సహించని మనిషిని శతాబ్దాలుగా వదలక – ప్రతి రక్తపు బిందువులో జితించి ప్రబలిపోవు జంతుతత్వం ఇనుప గొలుసుల్లా ఇన్నాళ్లు మేధను చుట్టిన ఆలోచనలను త్రెంచి; కదలలేని మనిషిని బంతిలా సుదూరం విసరివైచి మనోజ్ఞాన సహిత విజ్ఞానం చూపిస్తుంది జ్యోతిశ్చక్ర ఫలితం మనస్తత్వమెరుగని విజ్ఞానం చూపుతుంది కాలచక్ర పతనరేఖ 18 కాలం సాగినకొద్దీ తిరిగి తిరిగి కిరీటమైతే ఎగురగొట్టివేసినా చంద్రుణ్ణి గద్దెనుండి దింపగలడా ఏనాటికైనా సూర్యుడు ? అస్తమించిన తరువాత రేపటి ఉదయం వరకైనా పోనీ లోకం వెన్నెల వెలుగు వత్తినే కోరకూడదూ ! చీకటినే కౌగిలించుకుని వుండాలా ! చలిగాలికి బిగుసుక పోతూంటే శరీరం మంచుముద్దలా మారుతూ, ఎక్కడో దూరాన ఎవరో వెలిగించుకున్న మంటలు చూచి భయపడి; నవ్వుతూ ఆకాశంవైపు చూచి, సంజ్ఞచేసి సూర్యుణ్ణి వ్రేలెత్తి చూపిస్తే సరా! మౌనంకన్న కదలిక ఎరుగని శిలాప్రతిమలా, నిర్వికల్ప సమాధి స్థిత పరమవేదాంతులై నట్లు కాలరేఖ దాటనంతవరకు దేవతలు తన స్థితి తనకే తెలియని తుఫానులో సంగీతం వినిపిస్తున్నామనుకునే అడవులు, చెవులు తెరచి వినే ఆకాశం, నృత్యం చేయడం ఆరంభించిన మనుషులు; వీళ్ళలో ఆ క్షణం కలియని వాళ్ళు చీకటిముద్దలు మరోక్షణం రబ్బరు బంతులు కావచ్చు ఏక్షణమో ఏ దిక్కునకైనా విసరబడవచ్చు 19 అల్లిబిల్లిగా చీకట్లు అల్లుకున్న అర్ధరాత్రము నా కన్నులలో విరిసిన చిరుగాలికి కదలు కలలు ఎన్నాళ్ళనుండో ఎదలోదాగి ఒక్కమారు మింటి కెగసిన అగ్నిశిఖా సంజ్వలితమై మానవతా మహోరూపము, బూది దిబ్బ అయినట్లు అచ్చటచట మొలిచి, ఎండిన గడ్డి మొక్కల చురకత్తులచే, నడిచే మనుషుల పాదాలు తెగి పోయినట్లు గ్రీష్మర్తువు ఆవరించిన లోకం ఎండిన మ్రోడులవలె నేత్రు ఉమిసే నిప్పుపూలతో మురిసి పోవునట్లు సామాన్యుని హృదయంలో సదా చంక్రమణం చేయు జీవిత చక్రాశార పంక్తి విరిగి ముక్కలైనట్లు అరచేతిలోని అదృష్టం సముద్రంలోకి దూకినట్లు మెదడులోని ఆలోచనలు గాలిలో లీనమైపోయినట్లు బుద్ధికి, చాచిన చేతికి అందని విచ్చిన ఎదకంటికి ఆనని రోదసిలా దూరదూరంగా భవిష్యత్తు నిల్చిపోయినట్లు విషమ పథంలో నడిచే తమ బ్రతుకుల నీడ్వలేని సమభావం లేని పురా సమాజ పరివంచిత, కర్మణ్యుల గుండెల్లో మ్రోగే మృత్యు పాదశింజినీ సంరావము విని–సగంలోనె ఆగిపోయిన అలల్లా కరాలెత్తివచ్చు కలలు. 20 పుంజీభూత తుహినకాంతి రేఖవలె నేను ఎప్పుడు ఎక్కడ విశ్రమిస్తానో అప్పుడు అక్కడ వికసించిన వెన్నెల రాత్రివేళ ప్రగాఢనిద్రా సమాధిలో నేను ఉన్నప్పుడు ఎవడో రాక్షసుడు చల్లగాలి పీల్చడానికి బైటికి వస్తాడు వాణ్ణిచూచి భయపడి లోకం తన ఆలోచనల గాలులు విసరి విజ్ఞానేంధనాలు జ్వలింపజేసి వాణ్ణి భస్మంచేయాలని యత్నిస్తే వాడు ధూమరేఖలా ఎగసివచ్చి కనులలోకి తొంగితొంగి చూస్తాడు మనోజీవ లక్షణాభిజ్ఞతలేని రాతియుగంనుండి – మనోజీవ సంస్కార సాహిత్యంలేని స్ఫుట్నిక్‌యుగం వరకు – తన నీడచూచి తానే భయబడి తనపై తనకే నమ్మకం చచ్చిపోయి ఆ రాక్షస ప్రవృత్తికి లొంగిపోయి మూర్చాసమస్థితిలో నున్నప్పుడు ప్రాభాతారుణ జీవరేఖవలె నిదురనుండి మేల్కొని నేను – ఎప్పుడు ఎంతవరకు పయనిస్తానో అప్పుడు అంతవరకు దివాభోగము 21 శూన్యం సమగ్ర మాయారూపం రాక్షసుల ముఖాలకు జీవకళ వాళ్ళ ఊహలకు ఆకారం ఇచ్చే చీకటి లేనిది; వెలుగనేది వుండేదా ? మండే కాగడాలా కొన్నాళ్ళు మతం లోకాన్ని వెలిగించినమాట నిజం సూర్యోదయం ఎపుడో జరిగిపోయి శిలల వృక్షాల జంతువుల మృగాల నిజస్వరూప స్వభావాలు తెలిసిపోయి మానవుని విద్యుదూహాశక్తికి అతని ఐచ్చికరూపాలుగా మారిపోయి కాగడాల ప్రసక్తి ఆరిపోయిన సమయం రెండుకళ్ళు మూసుకున్నవాళ్ళు మంచివాళ్ళు, దేవుని బంధువులు రెండుకళ్ళు తెరచి, విడిపోయిన చీకటి సంకెళ్ళ సంగతి, ఖైదీలకు చెబుతూ రహస్యంలేకుండా, సంతోషంగా కాంతిగీతం వినేవాళ్ళు— స్వతంత్రులు దేవుడికన్న అతని బంధువులకు శత్రువులు వాళ్ళు కళ్ళు తెరుస్తేచాలు ఎదుర్కొనే ప్రశ్నలు ఊహిస్తే మతి తిరిగిపోయే అగ్నిగోళాలు ఋతు పరివర్తన తెలిపే కాలసూచికలు * * * * * * * * నీలికళ్ళు తెరిచిన చీకటిగుహలో జ్యోతీ రూపాల్లా వెలిగే శిల్పవిన్యాసంలో ఆలోచనలనంతంగా సాగే మస్తిష్కంలో సౌందర్యం సౌహిత్యం ఎరిగిన మనస్సులో పగిలిన కారుమబ్బు గుండెల్లో జీవిత గ్రంథం పుటల్లో దాగిన అక్షరాల్లో తెలిసిన రహస్యంలో సందేహం తీరిన ఆలోచనవలె — కాంతిరేఖ ముఖ్యంగా సిలువవేయబడిన వేళ మందరాలు పూచిన క్రీస్తుముఖంలో —కాంతిరేఖ నీడలా వెన్నంటి తనలో శాశ్వతంగా ఐక్యం చేసుకోజాలని మృత్యుముఖంలో — నైల్య రేఖ అందమైన పూర్ణచంద్రుని ముఖంపై కాలం విసరిన కత్తిదెబ్బ తీక్ష్ణమైన సూర్యుని మనస్సుపై కంటికి కన్పించని గాయం స్వచ్చమైన శరదాకాశంలో కదలాడే నీలిమబ్బు తునక సామాన్యుని జీవితంలో తీరని సాధారణ కోరికవలె — నైల్య రేఖ బుద్ధుని ముఖంలో ప్రసన్నకళా శిల్పం తనలో లీనీకరించుకున్న కాంతిచక్రం అతని పాదాలక్రింద మెట్లు మెట్లుగా మలగి ఒదిగిపోయిన చీకటిముద్దలు 22 చుక్కలు వెలుగు మొక్కలు కన్పిస్తవి చీకటిలో బ్రతికే మనిషికి ! తరంగాలు క్షణభంగుర విహంగాలు కదిలిస్తవి జడతత్వంగల మనసును చుక్కలు చీకటిలో తమతమ బ్రతుకులు గడుపుతున్నాయనీ తరంగాలు అనుక్షణం చలించి నశించిపోతున్నాయనీ విచారించడం మానవ స్వభావం ఆలోచించడం మనోజీవి లక్షణం అద్దంలో తన ప్రతిబింబం గుర్తించలేని, నీడ బొమ్మను రెక్కలంటగట్టి ఎగురవేసి నింగినెగురు పక్షివితతి కాల్చి ఆకాశాన్ని విశాలపరచి భూమిని పైకెత్తాలనడం శాంతిని ప్రచారంచేయాలని లోకంలో ప్రయత్నించడం మనిషికి క్రొత్తగా కాంతిని పరిచయం చేయడంవంటిది * * * * * * * * నాకన్నులలో దాగిన, అసంఖ్యాక నక్షత్రాలు చీకటి గుడి వదలి వెలుగులోకి రావాలని నా ముఖసీమలో దాగిన విద్యుదూహచిత్రాలు ఆరిపోయి మాసిపోవాలని నేనెందుకుకోరతాను ! పెరిగిన చీకటి లతలకు పూస్తేనేగా వెలుగుపూలు నల్లని మొగిళ్ళ గుండెలలో విరిస్తేనేగా మెరపురేకలు చలిగాలికి బిగిసిపోయి; తెల్లని నల్లని మబ్బుముక్కలు అతికిన, ధూళిధూసరిత ప్రావారం కప్పుకొని,— బిక్క మొగంతో, బీదతనంతో కూర్చున్న చంద్రుణ్ణిచూస్తే – విచారం తలపునకేరాని అనూహ్యానందగీతీ నిస్వనంతో — ఊగిసలాడిస్తూ హృదయాలను మనుషుల్ని గిలిగింతలు పెడతవేమి ? శైశవ ప్రాయుల, ఉన్మాదుల అలౌకిక విషయ భావుకుల స్నిగ్ధమైన మనసులు గాయపడి బాధపడుతవేమో? 23 భవిష్యద్ రేఖాగమనం మార్చే ప్రజా హస్తాలలో చిక్కిన తమ జాతక ఫలాల కోసం ‘క్యూ’ మార్కు ముఖాలు చాచి రాత్రివేళ భూమికంటక తిరిగే భూతాల మలిన దేహచ్ఛాయల్లా మూకలు మూకలుగా ప్రతిచోటా విహరిస్తున్నవి శ్వేతేతర పక్షులు కాంతి హస్తాలక్రింద మసలు శాంతి హృదయ వాటికలో అంటు చీకటి చెట్లు నాటి నిప్పుపూలు పూయించాలని నింగినిండా చీకటిలా వ్రాలి భ్రమగొల్పే తెల్లని రెక్కలు చాచి మిన్ను అన్నుబట్టి పోయేట్లు నినాదారభటీ శబ్దాలతో మాంచి పసందైన మాటలతో రేపటికి వేసే బాటలకన్నా ముందు మాపటికి ఆడే ఆటలో రక్తికట్టాలని అహరహం వీలైనంత శక్తి సమీకరిస్తూ ఏకంగా ధాత్రినిండా వాలిపోయి సాంతం రాత్రిమయం చేయాలని ఉద్రేకంతో రివ్వురివ్వున వేగంతో ఉరికి ఉరికి వస్తున్నవి ! పక్షులు ! పన్నిన కాంతిఖడ్గ జాలంలో అన్నీ హాయిగా విశ్రాంతి తీసుకుంటవి ! విహరించే శ్వేతేతర పక్షులన్నీ కనుపించే స్వేచ్ఛేతర కక్షలోవి. MELKONNA AKASAM by Madiraju Ranga Rao 3-4-685 Narayanaguda, Hyderabad